Kashmir's Bakarwal tribe: సంప్రదాయ జీవనశైలిని కాపాడుకునేందుకు గిరిజన తెగ బకర్వాల్ ప్రజల అవస్థలు

మారుతున్న వాతావరణ పరిస్థితులు, అటవీ భూభాగం వల్ల భారత పాలిత కశ్మీర్‌లో సంచార జాతికి చెందిన గిరిజన తెగలు తమ సంప్రదాయ జీవనశైలిని కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు.

"మా జీవితం గురించి అందంగా వర్ణించాలని చూస్తారు. కానీ, మా జీవితం కష్టాలను తట్టుకుంటూ సాగించే ప్రయాణం" అని బకర్వాల్ తెగకు చెందిన పశువుల కాపరి లియాఖత్ ఖాన్ అన్నారు.

జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఉన్న 34లక్షల మంది శక్తివంతమైన సంచార జాతుల్లో బకర్వాల్ తెగకు చెందిన వారు ఒకరు. వీరు ప్రధానంగా గొర్రెల కాపర్లు.

శ్రీ నగర్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్డవోదూర్ అడవుల్లో వీరు శిబిరాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తారు.

బక్క పలచగా ఉన్న 30 ఏళ్ల నజీరా తన పసి బిడ్డను ఊయలలో ఊపుతూ కనిపించారు. ఈమె కుటుంబం మూడు రోజుల క్రితమే ఆల్పైన్ హైట్స్‌లో శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంది.

"మేము శీతాకాలం వలసకు వెళ్లే సమయం దగ్గర పడింది" అని నజీరా చెప్పారు.

కొన్నేళ్లుగా బకర్వాల్ తెగకు చెందిన ప్రజలు జమ్మూ కశ్మీర్ లోని అటవీ ప్రాంతాల మధ్య సంచరిస్తూ ఉన్నారు. ఈ ఆదివాసీలు ఏప్రిల్ నుంచి వేసవిలో ఆరు నెలలు కశ్మీర్‌లో ఉండి శీతాకాలం వచ్చే సమయానికి జమ్మూ వెళతారు.

"మాకంటూ ఒక సొంతూరు లేదు. ఇది కేవలం మేము వేసవిలో బస చేసే ఇల్లు" అని జుల్ఫీ అంటారు.

మాకొక శాశ్వత గృహం లేదని ఈ తెగ సభ్యులు అంటారు. వీళ్ళు పశువులను పెంచుకుంటూ అడవుల్లో సంచరిస్తూ ఉంటారు.

కేంద్ర ప్రభుత్వం 2001లో బకర్వాల్ గిరిజన తెగలను అధికారికంగా షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించింది. సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన తెగలను భారతీయ రాజ్యాంగం షెడ్యూల్డ్ తెగలుగా గుర్తిస్తుంది.

వన్య మృగాలు చేసే దాడుల వల్ల తమ సంప్రదాయ జీవనశైలిని కాపాడుకోవడం కష్టంగా మారుతోందని బకర్వాల్ తెగలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి ఆదాయం పశు సంపద పైనే ఆధారపడుతుంది.

ఇటీవలి కాలంలో పశువుల అమ్మకాలు కూడా బాగా తగ్గిపోయాయి.

"గతంలో ఒక రోజంతా కష్టపడి గొర్రె లేదా మేకను అమ్మితే డబ్బులు బాగా వచ్చేవి. కానీ, ఇప్పుడలా లేదు" అని వికలాంగుడైన 50 ఏళ్ల మొహమ్మద్ జుబైర్ అన్నారు.

మరో వైపు మారుతున్న వాతావరణ పరిస్థితులతో కూడా ఈ తెగ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

"హిమాలయాల్లో ఎత్తైన శిఖరాల్లో ఉన్న మైదానాలను చేరుకోవడం చాలా కష్టంగా ఉంటుంది" అని లియా ఖత్ ఖాన్ చెప్పారు.

జూన్ నెలలో జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ లోయలో కురిసిన అకాల మంచు, తీవ్రమైన చలి పరిస్థితుల వల్ల వందలాది మంది గిరిజన కుటుంబాలకు ఆహారం, పశువులకు మేత అందక రోడ్ల పైనే ఇబ్బందులు పడ్డారు.

ఈ తెగ ఎదుర్కొంటున్న మరొక పెద్ద సమస్య ...అటవీ భూముల్లో సంచరించేందుకు అనుమతులు లభించటం లేదు.

కొన్ని దశాబ్దాలుగా అడవుల్లో సంచరిస్తున్న ఈ తెగ ప్రజలు చట్ట వ్యతిరేకంగా అడవులను ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ, అటవీ భూములను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం కొన్ని వందల కుటుంబాలకు గత ఏడాది నోటీసులు పంపింది. ఈ తెగ వాళ్ళు నివసించే తాత్కాలిక టెంట్ లు, మట్టి ఇళ్లను కూడా అధికారులు తొలగించారు.

ఇలా జరిగిన కొన్ని నెలల తర్వాత కశ్మీర్ లో గిరిజన తెగల హక్కులను పరిరక్షించి వారి హక్కులకు సంబంధించిన సర్టిఫికేట్‌లు ఇస్తామని జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు.

ఈ తెగ ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితుల వల్ల ప్రస్తుత తరం చదువు పై దృష్టి పెట్టి సులభమైన జీవితం గడపాలని చూస్తున్నారు.

అటవీ ప్రాంతాల్లో సంచరించే తెగల పిల్లల కోసం ప్రభుత్వం కూడా కమ్యూనిటీ పాఠశాలలను ప్రారంభించింది.

ఈ తెగ పై ఎన్ని రకాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వారు మాత్రం వారి సంప్రదాయ జీవన శైలికి కట్టుబడి ఉంటారని చాలా మంది చెబుతారు.

"మేము దేనినీ వదిలిపెట్టడం లేదు" అని జుల్ఫీ అన్నారు. "మా జీవితాలు అనిశ్చితితో ఉంటాయని తెలిసినప్పటికీ కూడా మా సంప్రదాయాలకు మాత్రం మేము కట్టుబడి ఉంటున్నాం" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)