You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్పెయిన్: 50 ఏళ్ల తరువాత మరోసారి భీకర వరదలు, 200 మందికి పైగా మృతి
- రచయిత, బెథనీ బెల్, ఫ్రాన్సిస్ మావో
- హోదా, బీబీసీ ప్రతినిధులు
స్పెయిన్‌లో సంభవించిన భయంకరమైన వరదల్లో 200 మందికి పైగా మరణించారు. గల్లంతైన వారిని కాపాడే పనిలో సహాయక బృందాలు నిమగ్నమయ్యాయి.
దేశవ్యాప్తంగా ఇంకా భారీగా వర్షాలు పడుతుండటంతో గురువారం డ్రోన్ల సాయంతో 1200 మందికిపైగా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
“వీలైనంత ఎక్కువ మందిని ప్రాణాలతో కాపాడటమే మా తక్షణ కర్తవ్యం” అని ముంపు ప్రాంతాలను సందర్శించిన ప్రధాని పెడ్రో సాంచెజ్ అన్నారు.
మంగళవారం రాత్రి వచ్చిన వరదల కారణంగా చాలా ప్రాంతాలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో, బురద, శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెతికితీసే పనిలో స్థానికులు, సిబ్బంది నిమగ్నమయ్యారు.
వాలెన్సియాలో 205 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు.
వాలెన్సియాలోని పైపోర్టా పట్టణంలో నది పొంగి పొర్లడంతో కనీసం 40 మంది మృతి చెంది ఉంటారని అంచనా.
“ఇంకా చాలామందే చనిపోయి ఉంటారు” అని బురదలో కూరుకుపోయిన తన మందుల షాపును చూస్తూ ఫార్మసిస్ట్ మిగెల్ గెరిల్లా అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు.
“ఇదంతా ఓ పీడకల” అని ఆయన అన్నారు.
వరదల కారణంగా కార్లు రోడ్లపైకి కొట్టుకువచ్చి ఒకదానిమీద ఒకటి నిలబడ్డాయి. మృతదేహాలను అంత్యక్రియల వాహనాల్లో తీసుకెళ్తుండటం కనిపించింది.
వర్షాలు భారీగా కురవడంతో రోడ్లు, వీధులు అన్నీ నదులుగా మారినట్లు వాహనదారులు చెబుతున్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి కొంతమంది చెట్లు, వంతెనలు ఎక్కారు.
ఇప్పటివరకు వరదల్లో ఎంత మంది గల్లంతయ్యారన్న లెక్కలను అధికారులు స్పష్టం చేయట్లేదు. కానీ, గురువారం ఒక్కరోజే 60 మరణాలు నమోదుకావడంతో గల్లంతైన వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు.
బుధవారం ఒక్కరోజే 90కిపైగా మరణాలు నమోదయ్యాయి.
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలకు వాలెన్సియా, అండలూసియాలోని కాస్టిల్లా-లా మంచా, దక్షిణాన ఉండే మలగా ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి.
వాలెన్సియా సమీపంలోని చివా పట్టణంలో కేవలం 8 గంటల్లోనే ఒక సంవత్సరంలో కురవాల్సిన వర్షపాతం నమోదైందని స్పానిష్ వాతావరణ సంస్థ అమేట్ తెలిపింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో వందలాది మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. బురదను తొలగించి వీధులు, ఇళ్లను శుభ్రపరిచే పనులు కొనసాగుతున్నాయి.
వాలెన్సియాలోని అనేక ప్రాంతాల్లో రోడ్డు, రైలు రవాణా సదుపాయాలు దెబ్బతినడంతో స్పెయిన్‌లోని ఇతర ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
ఈ వరదల్లో చనిపోయిన వారికి స్పెయిన్ మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. ఇందులో భాగంగా గురువారం నాడు ప్రభుత్వ కార్యాలయాలపై జెండా అవనతం చేశారు.
అయితే, అభివృద్ధి చెందిన ఐరోపా దేశంగా పేరున్న స్పెయిన్, ముందస్తు ప్రమాద హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని ప్రజలు విమర్శిస్తున్నారు.
విపత్తు నిర్వహణ సంస్థ చాలా ఆలస్యంగా ప్రమాద హెచ్చరికలు జారీ చేసిందా?అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి.
జాతీయ విపత్తుల సమయంలో సేవల కోసం ఏర్పాటు చేసిన పౌర రక్షణ సంస్థ, స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల 15 నిమిషాల వరకు కూడా హెచ్చరికలు జారీ చేయలేదు. అప్పటికే వాలెన్సియాలోని అనేక ప్రాంతాలు బురదలో కూరుకుపోయాయి.
అధికారులు మాత్రం ఈ స్థాయిలో కుండపోత వర్షాలు, వరదలను మునుపెన్నడూ చూడలేదని చెబుతున్నారు.
వరదలకు అనేక కారణాలు ఉండొచ్చు. కుండపోత వర్షాలకు భూతాపం పెరిగిపోవడం కూడా ఒక కారణమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఈ భారీ వర్షాలకు ప్రధాన కారణం ‘గోటా ఫ్రియా’ అని వాతావారణ పరిశోధకులు భావిస్తున్నారు. శరదృతువు, శీతాకాలం సమయాల్లో మధ్యధరా సముద్రం మీదుగా వెచ్చని నీటిపై చల్లటి గాలి ప్రయాణించినప్పుడు స్పెయిన్‌లో హఠాత్తుగా భారీ వర్షాలు కురిసే వాతావరణ పరిణామాన్ని గోటా ఫ్రియా అంటారు.
అయితే, భూతాపం పెరిగిపోవడం వల్లే అధిక వర్షపాతం నమోదవుతుందని శాస్త్రవేత్తలు బీబీసీకి తెలిపారు.
“వాతావరణ మార్పుల వల్లే ఈ తరహా కుండపోత వర్షాలు ఎక్కువయ్యాయని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు” అని ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన డా. ఫ్రిడెరిక్ ఒట్టో అన్నారు. ఈ తరహా సంఘటనల్లో ఉష్ణోగ్రత పెరుగుదల పాత్రను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందానికి ఈయన నాయకత్వం వహిస్తున్నారు.
1973 తర్వాత వచ్చిన అత్యంత ఘోరమైన వరదలుగా వీటిని చెబుతున్నారు. అప్పట్లో వచ్చిన వరదలకు 150 మంది మరణించినట్లు అంచనా. మళ్లీ ఆ తరువాత ఆ స్థాయిలో దేశంలో వరదలు రావడం ఇదే తొలిసారి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)