స్పెయిన్‌: సునామీలా ముంచెత్తిన వరదలు - బీభత్స దృశ్యాలు 11 ఫోటోలలో....

స్పెయిన్ గత కొన్ని దశాబ్ధాలుగా ఎన్నడూ లేని స్థాయిలో వరద విపత్తును ఎదుర్కొంటోంది. తూర్పు ప్రావిన్స్‌లోని వాలెన్సియా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసి వరదలు పోటెత్తడంతో కనీసం 95 మంది మరణించారు, డజన్ల సంఖ్యలో గల్లంతయ్యారు.

వాతావరణం అనుకూలించకపోవడంతో కొన్ని రెస్క్యూ ఆపరేషన్లకు అంతరాయం ఏర్పడింది.

1973 తర్వాత వచ్చిన అత్యంత ఘోరమైన వరదలుగా వీటిని చెబుతున్నారు. అప్పట్లో వచ్చిన వరదలకు 150 మంది మరణించినట్లు అంచనా.

మళ్లీ ఆ తరువాత ఆ స్థాయిలో దేశంలో వరదలు రావడం ఇదే తొలిసారి.

జాతీయ వాతావరణ సంస్థ ఏమెట్ ప్రకారం, వాలెన్సియా సమీపంలో తీవ్రంగా ప్రభావితమైన పట్టణం చివాలో కేవలం 8 గంటల వ్యవధిలో ఒక ఏడాదిలో కురిసే వర్షపాతం నమోదైంది.

కొన్ని ప్రాంతాలలో రైల్వేలైన్లతో సహా అనేక రవాణా సదుపాయాలు దెబ్బతిన్నాయి. రాజధాని మాడ్రిడ్ నుంచి వాలెన్సియా వెళ్లే రైలు మార్గం దెబ్బతిన్నదని స్పెయిన్ రవాణా మంత్రి ప్రకటించారు.

రాబోయే నాలుగు రోజుల వరకు ఈ పట్టణాల మధ్య రైలు సర్వీసులు నిలిచిపోతాయని మంత్రి వెల్లడించారు.

వరదలు, కార్చిచ్చులవంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలెన్సియా ఎమర్జెన్సీ యూనిట్‌ వాలెన్సియా‌ను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇళ్లలోకి బురద నీరు భారీ ఎత్తున చేరడంతో స్థానికులు వాటిని బకెట్లతో ఎత్తి బయటకు పడవేశారు. ఇళ్లు, వీధులన్నీ ఎటు చూసినా బురదమయంగా కనిపించాయి.

వరద విపత్తును హెచ్చరించడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని కొందరు ఆరోపించారు. ఈ కారణంగానే చాలామంది ప్రజలు ఇబ్బందుల పాలయ్యారని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లలేకపోయారనీ వారు అన్నారు.

రెస్క్యూ ఆపరేషన్‌ కోసం 1,000 పైగా సైనికులను రంగంలోకి దించారు. అయితే వరదలతో నిండిన రోడ్లు, ధ్వంసమైన కమ్యూనికేషన్ వ్యవస్థ, విద్యుత్ లైన్ల కారణంగా సైనికులు బాధిత ప్రాంతాలకు చేరుకోలేకపోతున్నారు.

మంగళవారం కుండపోత వర్షం కారణంగా వచ్చిన ఆకస్మిక వరదల్లో వంతెనలు, భవనాలను కొట్టుకుపోయాయి. ప్రజలు పైకప్పులపైకి, చెట్ల పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు.

వరదకు ముందు , తర్వాత పరిస్థితులను కళ్లకు కట్టే చిత్రాలవి. 2023 జూన్ నాటి ఫోటోకు, వరదల తర్వాత అక్టోబర్ 30, 2024న కనిపించిన దృశ్యాలివి.

పలు ప్రాంతాలో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లడం కష్టంగా మారింది. కొన్ని దశాబ్ధాలుగా తాము ఇంతటి విపత్తును చూడలేని స్థానికులు అన్నారు.

వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో చెట్లు కూకటి వేళ్లతో సహా కొట్టుకుపోయాయి. భూమిలోని రాళ్లు కూడా వరదలలో కొట్టుకు వచ్చి వాలెన్సియా పట్టణంలో పలు రోడ్లపై పరుచుకున్నాయి. ఓ కారులో ఇరుక్కున్న రాళ్లను ఈ ఫోటోలో చూడవచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)