రివ్యూ: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ సినిమా ఎలా ఉంది, ఆయన ఖాతాలో మరో హిట్ పడిందా?

ఫొటో సోర్స్, dqsalmaan/insta
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
దుల్కర్ సల్మాన్‌కి తెలుగులో మంచి ఫాలోయింగ్ వుంది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ తర్వాత క్రేజ్ ఏర్పడింది. ఆయన హీరోగా మలయాళం నుంచి తెలుగులోకి డబ్ అయిన ఐ యామ్ గేమ్ థియేటర్లోకి వచ్చింది.
కథ ఏంటంటే డ్యాన్జాన్ (దుల్కర్) ఒక గ్యాంబ్లర్. ఆటలో అదృష్టం కంటే ఆల్గారిథం ముఖ్యమని తెలివిగా ఆలోచిస్తూ కాసినోలో డబ్బు పోగొడుతుంటాడు.
ఒక రౌడీ దగ్గర కోట్ల రూపాయల అప్పు చేస్తాడు. డ్యాన్ తండ్రి పెద్ద కోటీశ్వరుడు. కొడుకుతో ఒక కంపెనీ నడిపిస్తుంటాడు.
ఒక రోజు తన అప్పు తీర్చమంటూ ఆ రౌడీ అందరి ముందు డ్యాన్ని దారుణంగా కొడతాడు. హీరోని తండ్రి చీదరించుకుంటాడు.
తల్లి మెర్సీ (జయసుధ) జాలిపడి తన సేవింగ్స్ 60 లక్షలు డ్యాన్‌కు ఇస్తుంది.


ఫొటో సోర్స్, dqsalmaan/insta
కొత్త ప్రపంచం
తల్లి ఇచ్చిన డబ్బు తీసుకెళ్లి క్రికెట్ బెట్టింగ్‌లో పెడతాడు. మొత్తం పోతుంది. ఆ ఫస్ట్రేషన్లో నిర్వాహకులను బెదిరించి డబ్బు తీసుకుని పారిపోయే క్రమంలో పెద్ద ఆక్సిడెంట్ జరిగి కుడి చేయి కోల్పోతాడు.
స్పృహలోకి వచ్చేసరికి ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగి వేరే చేతిని అతికించి వుంటారు. అక్కడ నుంచి చిత్రవిచిత్ర సంఘటనలు జరుగుతాయి. ఆ చెయ్యి ఎవరిది? క్రికెట్ ఆటకు,ఈ కథకు వున్న సంబంధం ఏమిటనేది మిగతా కథ.
ఈ సినిమా చాలా స్టయిలిష్‌గా స్టార్టవుతుంది. హీరో జూదం, క్రికెట్ బెట్టింగ్ రొటీన్‌గా కాకుండా కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. అసలు కథలోకి వెళ్లడానికి చాలా టైమ్ పడుతుంది. ఫస్టాఫ్ వరకూ బిగువుగా వున్న కథ, సెకండాఫ్‌లో ఆ చెయ్యి ఎవరిదో తెలిసిన తర్వాత రొటీన్ అయిపోతుంది. కథ ప్రిడిక్టబుల్ కావడంతో చివరి గంట మరీ రొటీన్ అనిపిస్తుంది.
ఇలాంటి కథలు మనకి కొత్తకాదు. 1990లో గీతాకృష్ణ డైరెక్షన్లో కోకిల వచ్చింది. నరేశ్, శోభన నటించారు. హీరోకి కళ్ల ఆపరేషన్ తర్వాత చిత్రవిచిత్రాలు జరుగుతాయి. శివంభజే (2024) ఇలాంటి కథే. ప్రతీకారం తీర్చుకునే ఆత్మల కథలు కోకొల్లలు. నిన్నమొన్నటి కొరియన్ కనకరాజు కూడా అదే. అయితే జూదానికి, క్రికెట్ ఆటకు లింక్ చేయడం కొత్త పాయింట్.

ఫొటో సోర్స్, dqsalmaan/insta
స్టైలిష్ టేకింగ్
సినిమా నిడివి మరీ ఎక్కువ. 2 గంటల 54 నిముషాలు సాగదీయడం అనవసరం. ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలన్నీ 3 గంటలు తీసి ప్రేక్షకులకు ఎందుకు పరీక్ష పెడుతున్నారో అర్థంకాదు. పాటలన్నీ తీసేసి, ట్రిమ్ చేసి 2 గంటల 15 నిముషాలకు కుదించి వుంటే వేరే లెవెల్లో వుండేది.
జూదగాడిగా, ఆ తర్వాత తన శరీరంలో ఏం జరుగుతోందో తెలియని గందరగోళ క్యారెక్టర్లో దుల్కర్ అద్భుతంగా నటించాడు.
అయితే సెకండాఫ్‌లో హీరో చాలా సేపు కనిపించకుండా వేరే హీరో కథ స్టార్ట్ కావడం విచిత్రం. బహుశా మళయాళంలో ఆంటోనీ వర్గీస్ పెద్ద హీరో కావచ్చు.
హీరోయిన్గా కయాదులోహర్కి పెద్ద స్కోప్ లేదు. ఫిజియోథెరపిస్ట్‌గా, హీరోకి సాయం చేయడానికి మాత్రమే ఉంటుంది. ఇంకో ముఖ్య పాత్రలో సంయుక్త విశ్వనాథన్ వున్నారు. ప్రముఖ దర్శకుడు మిస్కిన్ విలన్‌గా చేశాడు. అయితే అది చాలా సినిమాల్లో చూసిన రొటీన్ క్యారెక్టరే.
ఫస్టాప్‌లో కనిపించిన జయసుధ, సెకండాఫ్‌లో కనపడదు. జేక్స్ బిజోయ్ బీజీఎం , జిమ్షీ ఖలీద్ ఫొటోగ్రఫీ బావున్నాయి.
పాత కథలో కొత్త పాయింట్ కనిపెట్టిన దర్శకుడు నహాస్ హిదయత్ సాగదీత స్క్రీన్ ప్లేతో దెబ్బతిన్నాడు. స్టైలిష్ టేకింగ్‌లో పెట్టిన శ్రద్ధ కథను నడపడంలో చూపలేదు.

ఫొటో సోర్స్, dqsalmaan/insta
డబ్బింగ్లో చాలా శ్రద్ధ చూపారు. కథ అంతా హైదరాబాద్‌లో జరుగుతున్నట్టే తెలుగు కోసం కొన్ని సీన్స్ తీసుకున్నారు. కొందరు తెలుగు నటులు కూడా (ప్రభాకర్, శ్రీనివాసరెడ్డి) కనిపిస్తారు. చివర్లో యోగిబాబు కూడా తళుక్కున మెరుస్తాడు. కాస్త వినోదం, క్రికెట్ బెట్టింగ్ కొత్త ప్రపంచం కావాలనుకుంటే ఒకసారి ప్రయత్నించొచ్చు.
ప్లస్ పాయింట్స్:
1.దుల్కర్ నటన
2.ఫస్టాఫ్
3.స్లయిలిష్ మేకింగ్
మైనస్ పాయింట్స్:
1.సెకండాఫ్ సుదీర్ఘ ప్లాష్ బ్యాక్
2. ప్రిడిక్టబుల్ క్లైమాక్స్
3.నిడివి
ఫైనల్‌గా స్పీడ్ తక్కువ -- స్పిరిట్ ఎక్కువ.
(అభిపాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























