అమెరికాలో మంచు బీభత్సం, అధ్యక్ష ఎన్నిక తుది ఫలితాల ప్రకటన ఉంటుందా?

అమెరికాను మంచు తుపాను కమ్మేసింది. 30 రాష్ట్రాల్లో 6 కోట్ల మందికిపైగా అమెరికన్లపై మంచు ప్రభావం చూపిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది.

దశాబ్దంలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏడు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. చాలా విమానాలు రద్దయ్యాయి. రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి.

రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు మొత్తం ఇలా మంచుతో నిండిపోయింది.

మంచు తుపాన్‌ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లు మూసివేశారు. కెంటకీ, వర్జీనియా, పశ్చిమ వర్జీనియా, అర్కన్సాస్, న్యూజెర్సీలోని కొన్ని ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. న్యూయార్క్‌లోని సిరక్యూజ్‌లో కనిపించిన ఓ దృశ్యం.

కన్సాస్‌లోని షావ్నీలో మంచు విపరీతంగా కురుస్తోంది. గాలులు కూడా తోడవ్వడంతో ఏమీ కనిపించడం లేదు. కన్సాస్‌తోపాటు మిస్సోరిలో మంచు తుపాన్‌లు వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మంచు కారణంగా కొన్ని ప్రాంతాలలో వీధులు నిర్మానుష్యంగా కనిపించాయి.

కన్సాస్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో రోడ్లు మంచుమయంగా మారాయి. దీనిమీద ప్రయాణించడం కష్టంగా మారింది. దాదాపు అడుగు ఎత్తున మంచుతో నిండిపోయిన రోడ్లు కూడా ఉన్నాయి. రోడ్లన్నీ ఇలా మంచుతో నిండి కనిపిస్తున్నాయి.

విమాన ప్రయాణాలకు మంచు తీవ్ర అంతరాయంగా మారింది. లూయిస్ విల్లేలోని ముహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టులో ఓ పార్సిల్ విమానం ఇలా పార్కింగ్ చేసి కనిపించింది. వాస్తవానికి ఈ విమానం ప్రయాణించాల్సి ఉండగా, విపరీతంగా మంచు కురుస్తుండటంతో ఎగిరేందుకు దీనికి అనుమతి లభించలేదు.

రోడ్ల మీద పేరుకుపోయిన మంచును తొలగించేందుకు అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నారు. పౌరులు కూడా తమ ఇళ్ల ముందు మంచును తొలగిస్తూ కనిపించారు.

రోడ్ల మీద మంచు తొలగించనిదే ప్రయాణాలు సాగే పరిస్థితి కనిపించడం లేదు. అనేక చోట్ల మంచు కారణంగా విజిబిలిటీ లేకపోవడం, వాహనాలు జారిపోవడంతో ప్రమాదాలు జరిగాయి.

కొన్ని ప్రాంతాల్లో 2 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. మిడ్‌వెస్ట్, ఈస్ట్ కోస్ట్‌లోని అనేక ప్రాంతాలలో ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. వర్జీనియాలో కూడా తీవ్రమైన మంచు పేరుకు పోవడంతో అక్కడ కూడా అత్యవసర పరిస్థితి విధించారు.

వీకెండ్‌లో మంచు కురవడంతో కొన్ని కుటుంబాలకు ఇది ఆటవిడుపుగా మారింది. ఇంటి పెరట్లో, పార్కుల్లో పేరుకు పోయిన మంచులో పిల్లలు, పెద్దలు ఆడుకుంటూ సరదాగా గడిపారు.

సంప్రదాయం ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది ఫలితాలను జనవరి 6న ప్రకటించాల్సి ఉంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంట నుంచి అమెరికా కాంగ్రెస్ ఎన్నికల కౌంటింగ్‌ను మొదలు పెట్టాలి.

తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో కౌంటింగ్ సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, అమెరికాలోని ఎలక్టోరల్ కౌంట్ రీఫామ్ యాక్ట్ ప్రకారం బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా కౌంటింగ్ కొనసాగించాల్సి ఉంటుందని కాటో ఇన్‌స్టిట్యూట్‌లోని సెంటర్ ఫర్ కాన్‌స్టిట్యూషనల్ డైరక్టర్ థామస్ బెర్రీ వెల్లడించారు.

బ్రిటన్, జర్మనీలలో కూడా విపరీతంగా మంచు కురుస్తోంది. దీనివల్ల అనేక విమానాలు రద్దయ్యాయి. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

తమ రన్‌వేలను తాత్కాలికంగా మూసివేసినట్లు మాంచెస్టర్ ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రకటించారు.

రాబోయే కొద్దిరోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని యూకే ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)