ఐపీఎల్ కొత్త నిబంధనలేంటి? ధోని పారితోషికం తగ్గనుందా?

    • రచయిత, కే బోథ్రాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2025లో జరగబోయే ఐపీఎల్ టీ20 సిరీస్ 18వ సీజన్ కోసం కొత్త నిబంధనలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది.

ఈ నిబంధనల్లో ఎంతమంది ఆటగాళ్లను ఒక జట్టు రిటైన్ చేసుకోవచ్చు, క్రికెటర్ల పారితోషికాలు, ఎంపిక తర్వాత వేలంలో పాల్గొనకపోతే ఆటగాళ్లపై తీసుకునే చర్యలు, ఆటగాళ్లకు ఇచ్చే బోనస్‌లు, టీమ్‌ రిజర్వుల పెంపు, రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లకు అవకాశం.. వంటి వాటిల్లో పలు మార్పులను ప్రవేశపెట్టింది.

అయితే, ఐపీఎల్‌లో కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో సీఎస్‌కే ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని పారితోషికం తగ్గనుందా? వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ధోని ఆడతాడా? లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కొత్త నిబంధనలు ఏంటి?

2025-27 ఐపీఎల్ సీజన్ల కోసం నిబంధనలను నిర్ణయించేందుకు ఐపీఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం బెంగళూరులో జరిగింది.

జట్ల యజమానులతో ఐపీఎల్ ఎగ్జిక్యూటివ్‌లు సంప్రదింపులు జరిపారు. ఈ చర్చల అనంతరం బీసీసీఐ సెక్రటరీ జై షా అధికారికంగా ఈ కొత్త నిబంధనలను ప్రకటించారు.

  • ఐపీఎల్‌లోని పది జట్లన్నీ తమ స్క్వాడ్ లిస్ట్‌లో ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఆర్‌టీఎం లేదా రిటెన్షన్ నిబంధన ద్వారా దీన్ని అమలు చేస్తున్నారు.
  • ఈ రిటెన్షన్ జాబితాలో గరిష్ఠంగా ఐదుగురు అంతర్జాతీయ ఆటగాళ్లు (దేశీయ, విదేశీ ఆటగాళ్లు) ఉండొచ్చు. గరిష్ఠంగా ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉండొచ్చు.
  • టీమ్‌ల రిజర్వు మొత్తాన్ని ఐపీఎల్-2025 వేలం సందర్భంగా పెంచారు. 2024 సీజన్‌లో టీమ్‌ బిడ్, ప్రోత్సాహకాలు రూ.110 కోట్లుగా ఉండేవి. కానీ, రాబోయే సీజన్‌లలో బిడ్, ప్రోత్సాహకాలు, పారితోషికాలు కలిపి 2025 సీజన్‌కు రూ.146 కోట్లుగా, 2026 సీజన్‌కు రూ.151 కోట్లుగా, 2027 సీజన్‌కు రూ.157 కోట్లుగా నిర్ణయించారు.
  • ఐపీఎల్ చరిత్రలో తొలిసారి మ్యాచ్ ఫీజును ప్రకటించారు. ఇంపాక్ట్ ప్లేయర్లతో పాటు సీజన్‌లో ఆడే ఆటగాళ్లందరికీ ప్రతి మ్యాచ్‌కు రూ.7.50 లక్షల చొప్పున చెల్లిస్తారు. ఈ మొత్తం కాంట్రాక్ట్ అమౌంట్‌కు అదనం.
  • ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు విదేశీ ఆటగాళ్లు తమకు తాము రిజిస్టర్ చేసుకోవాలి.
  • ఐపీఎల్ వేలంలో రిజిస్టర్ చేసుకున్న ఆటగాడిని ఏదైనా టీమ్ కొన్న తర్వాత.. అందుబాటులో ఉండటం లేదని సీజన్ ప్రారంభానికి ముందు ఆ ప్లేయర్ ప్రకటిస్తే, వచ్చే రెండు ఐపీఎల్ సీజన్లలో అతడు పాల్గొనకుండా బ్యాన్ విధించనున్నారు.
  • ఎవరైనా క్యాప్డ్ ప్లేయర్ గత ఐదేళ్లలో భారత్ తరఫున టెస్ట్, వన్డే, టీ20లలో ఆడకపోతే లేదా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేకపోతే అతన్ని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణిస్తారు. ఈ నిబంధన కేవలం భారత ఆటగాళ్లకు మాత్రమే.
  • 2027 ఐపీఎల్ సీజన్ వరకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వర్తిస్తుంది.

యాజమాన్యాల అసంతృప్తి ఎందుకు?

క్రిక్‌ఇన్ఫో వెబ్‌సైట్ కథనం ప్రకారం.. ఆటగాళ్లను క్యాప్డ్ ప్లేయర్లుగా, అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా పరిగణించే నిబంధనపై పలు జట్ల యజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

రిటైర్మెంట్ తీసుకున్న ఐదేళ్ల తర్వాత సీనియర్ ఆటగాళ్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా పరిగణించడం అవమానకరమని సన్‌రైజర్స్ టీమ్ మేనేజ్‌మెంట్ పేర్కొంది.

అంతేకాక, ఐపీఎల్ సిరీస్‌లలో క్యాప్డ్‌ ప్లేయర్లుగా ఎక్కువ పారితోషికం పొందిన సీనియర్ ప్లేయర్‌, అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా తక్కువ పారితోషికం ఎలా పొందుతారని పలువురు ఎగ్జిక్యూటివ్‌లు ప్రశ్నిస్తున్నారు. కానీ, ఈ నిబంధనను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ 2008లోనే తీసుకొచ్చింది. 2021లో ఎత్తివేసి, మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ప్రవేశపెట్టింది.

అన్‌క్యాప్డ్ రూల్ కింద, గత ఐదేళ్లలో ఏ అంతర్జాతీయ పోటీల్లో కనిపించకుండా, భారత టీమ్‌కు ఎంపిక కాకుండా, సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేని ఆటగాళ్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా పరిగణించవచ్చు.

ధోని పారితోషికం తగ్గనుందా?

ఐపీఎల్ 2022 వేలంలో సీఎస్‌కే రూ.12 కోట్లకు ఎంఎస్ ధోనిని తన జట్టులో ఉంచుకుంది. 2020లోనే ధోని భారత జట్టు నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు.

ఆ తర్వాత కేవలం ఐపీఎల్ సిరీస్‌లు మాత్రమే ఆడుతున్నాడు. గత ఐదేళ్లుగా భారత జట్టులో భాగం కానందున, సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేనందున ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా జట్టులో ఆడించడంపై సీఎస్‌కే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఒకవేళ సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ధోనిని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఎంపిక చేస్తే, ఆయన గరిష్ఠ పారితోషికం రూ.4 కోట్లకు పడిపోనుంది. అంటే ప్రస్తుతం ఉన్న రూ.12 కోట్ల పారితోషికం నుంచి ఏకంగా రూ.8 కోట్లు తగ్గిపోతుంది.

‘‘రిటెన్షన్ రూల్స్‌లో మార్పులను చూసి ఐపీఎల్‌లో నా భవిష్యత్‌ను నిర్ణయించుకుంటా’’ అని ధోని అంతకుముందు చెప్పారు.

ప్రస్తుతం కొత్త నిబంధనలు వచ్చాయి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ధోని ఆడతాడా? లేదా? అన్నది త్వరలోనే తెలియనుంది.

గత ఐదేళ్లుగా భారత జట్టులో, సెంట్రల్‌ కాంట్రాక్టులో లేని చాలామంది భారత ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొనే అవకాశం ఉంది.

రిటెన్షన్ నిబంధనల్లో కొత్త మార్పు

ప్లేయర్ రిటెన్షన్ సిస్టమ్‌లో కూడా కొత్త మార్పును ప్రవేశపెట్టారు. ఆరుగురు ప్లేయర్లను ఉంచుకోవచ్చు. ఇందులో గరిష్ఠంగా ఐదుగురు క్యాప్డ్‌ ప్లేయర్లను, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లను తీసుకోవచ్చు.

రిటైన్ చేసుకునే తొలి ముగ్గురు ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)