You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మోహన్ సింగ్ ఒబెరాయ్ : 50 రూపాయల జీతగాడు ప్రపంచవ్యాప్తంగా 35 లగ్జరీ హోటళ్ళకు అధిపతి ఎలా అయ్యాడు?
బ్రిటీషు ఇండియాలో వేసవి రాజధానిగా ఉన్న సిమ్లాలో మోహన్ సింగ్ ఒబెరాయ్ పది అడుగుల పొడవు, అంతే వెడల్పు ఉన్న ఓ గదిలో ఉండేవారు. అప్పుడు ఆయన ఓ హోటల్లో పనిచేస్తున్నారు.
ఆ హోటల్ పేరు ‘సిసిలీ’. కొండ మీద ఉంటుంది. అక్కడ ఆయన బొగ్గుల లెక్కలు చూసేవారు. ఉండేందుకు కొండ దిగువన ఉండే ఈ గదిని ఇచ్చారు. రోజుకు రెండుసార్లు ఈ కొండ ఎక్కిదిగాల్సి వచ్చేది. ఉదయం కొండపైకి చేరి పని చూసుకున్నాకా మధ్యాహ్నం అన్నం తినడానికి కిందికి వచ్చేవారు.
అప్పట్లో ఆయన జీతం 50 రూపాయలు. ఇంతకు రెండింతల మొత్తాన్ని 1922లో ఆయన జీలం ( ప్రస్తుతం పాకిస్తాన్ పంజాబ్‌లోని చక్వాలీలో ఉంది)లోని భావన్ పట్టణం మీదుగా వెళుతున్నప్పుడు ఆయన తల్లి ఇచ్చారు.
మోహన్ సింగ్‌కు ఆరునెలల వయసున్నప్పుడు తండ్రి అతార్ సింగ్ మరణించారు. అప్పట్లో ఆయన కాంట్రాక్టర్‌గా పనిచేస్తుండేవారు.
‘‘ఆ సమయంలో మోహన్ సింగ్ తల్లి వయసు కేవలం 16 ఏళ్ళు. చుట్టుపక్కల వేధింపులు భరించలేక ఓ రోజు రాత్రి చంటిబిడ్డగా ఉన్న మోహన్‌సింగ్‌ను భుజానవేసుకుని కాలినడకన 12 కిలోమీటర్లు నడిచి మహేరి చేరుకున్నారు’’ అని మోహన్ సింగ్ జీవిత చరిత్ర పుస్తకంలో జర్నలిస్ట్, రచయిత బాచి కర్కారియా రాశారు.
మహేరిలో ప్రాథమిక విద్యభ్యాసం పూర్తయ్యాక, రావల్పిండిలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు మోహన్ సింగ్. తరువాత లాహోర్‌లో చదువుకున్నా, ఆర్థిక ఇబ్బందుల వలన ఆయన పై చదువులు కొనసాగించలేకపోయారు.
తన చదువుకు ఎటువంటి ఉద్యోగం రాదని అర్థం చేసుకున్నాక మోహన్ సింగ్ స్నేహితుడి సలహా మేరకు అతనితో కలిసి అమృతసర్‌లో టైపింగ్, షార్ట్‌హ్యాండ్ నేర్చుకున్నారు.
లాహోర్‌లోని షూ ఫ్యాక్టరీలో మోహన్ సింగ్‌కు ఆయన బంధువొకాయన ఉద్యోగం ఇచ్చినా, ఆర్థిక వనరుల కొరతతో ఆ ఫ్యాక్టరీ కొంతకాలానికి మూతపడింది. దీంతో మోహన్ సింగ్ తన ఊరు తిరిగి వెళ్ళాల్సి వచ్చింది.
ప్లేగు మహమ్మారి
భావన్ కు వీరు తిరిగొచ్చే సమయానికి ప్లేగు మమమ్మారి ముమ్మరంగా ఉంది. సర్గోదకు తిరిగి వెళదామని ఆయన తల్లి సలహా ఇచ్చారు. కానీ అదే సమయంలో ఆయన స్థానిక వార్తాపత్రికలో ప్రభుత్వ కార్యాలయంలో జూనియర్ క్లర్క్ కావాలనే ఓ ప్రకటన చూశారు. దీంతో తల్లి వద్ద 25 రూపాయలు తీసుకుని అక్కడికి 400 కిలోమీటర్ల దూరంలోని సిమ్లాకు ఉద్యోగం కోసం పరీక్ష రాసేందుకు వెళ్ళారు.
ఈ పరీక్ష తప్పాకా, నిరాశతో ఆయన సిసిలీ హోటల్ ముందు నుంచి వెళుతుంటే హఠాత్తుగా హోటల్ లోపలికి వెళ్ళి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనిపించే ఆలోచన వచ్చింది.
‘‘ఈ హై క్లాస్ హోటల్ అసోసియేటేడ్ హోటల్స్ ఆఫ్ ఇండియాకు చెందినది. దీని మేనేజర్ డీడబ్ల్యు గ్రూవ్ అనే ఇంగ్లీషు వ్యక్తి. ఆయన ఉదార స్వభావంకలవాడు అన్న పేరుంది. నెలకు 40 రూపాయల జీతంపైన ఆయన నన్ను బిల్లింగ్ క్లర్క్‌గా తీసుకున్నారు’’
‘‘త్వరలోనే నా జీతం 50రూపాయలకు పెరిగింది. అప్పుడు నా భార్య కూడా సిమ్లా వచ్చారు. మేమిద్దరం ఓ పాత ఇంట్లో ఉండేవాళ్లం. స్వయంగా గోడలకు సున్నం వేసుకున్నాం. అప్పుడు మా చేతులు పొక్కిపోయాయి. అయినా సరే...మా నెత్తిన ఓ కప్పు ఉన్నందుకు సంతోషించాం’’
మోహన్ సింగ్ ఒబెరాయ్ ఈ విషయాలన్నీ 1982లో పరిశోధకురాలు గీతా పిరమల్‌తో పంచుకున్నారు.
‘‘సిసిలీ యాజమాన్యం మారిన తరువాత ఎర్నెస్ట్ క్లార్క్ మేనేజర్ అయ్యారు. నాకు స్టెనోగ్రఫీ తెలుసు. దీంతో క్లార్క్ నాకు క్యాషియర్, స్టెనోగ్రాఫర్‌గా అవకాశమిచ్చారు’’
‘‘ఒకరోజు పండిట్ మోతీలాల్ నెహ్రూ సిసిలీ హోటల్లో బసచేశారు. ఆయన స్వరాజ్ పార్టీ నాయకుడు. పండిట్‌జీ ఒక ముఖ్యమైన రిపోర్టును చాలా జాగ్రత్తగా త్వరగా పూర్తి చేయాలని భావించారు. దీంతో నేను ఆరోజు రాత్రంతా అక్కడే ఉండి ఉదయానికల్లా రిపోర్టు ఇచ్చాను. ఆయన నాకు కృతజ్ఞతలు చెబుతూ 100 రూపాయల నోటు తీసిచ్చారు’’
‘‘ఆ బహుమతికి నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. నేను వెంటనే ఆ గది దాటి వచ్చేశాను. వందరూపాయలు...బహుశా ధనవంతులు అలా విసిరేయచ్చేమో. కానీ నాకు అది చాలా ఎక్కువ. డబ్బుకు చాలా కొనుగోలు శక్తి ఉంది. నేను నా భార్యకు ఓ వాచీ కొన్నాను. మా అబ్బాయికి బట్టలు, నాకోసం రెయిన్ కోటు కొనుక్కున్నాను’’
సిమ్లాలో కార్ల్‌టన్ హోటల్
అసోసియేటేడ్ హోటల్స్‌తో క్లార్క్ కాంట్రాక్ట్ పూర్తయ్యాక, ఆయన దిల్లీ క్లబ్ కోసం కేటరింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు.
క్లార్క్ ఇచ్చిన ఉద్యోగాన్ని మోహన్ సింగ్ కూడా అంగీకరించారు. ఇప్పుడు మోహన్ సింగ్ జీతం నెలకు వందరూపాయలు.
దిల్లీ క్లబ్‌తో కాంట్రాక్ట్ కేవలం ఏడాదే. దీంతో త్వరలోనే క్లార్క్ కొత్త వ్యాపారం కోసం వెదకడం మొదలుపెట్టారు.
సిమ్లాలో కార్ల్‌టన్ హోటల్ మూతపడింది. క్లార్క్ దానిని లీజుకు తీసుకోవాలనుకున్నారు. కానీ గ్యారెంటర్ అవసరమైంది.
‘‘నేను నా బంధువులలో, స్నేహితులలో బాగా డబ్బున్నవారిని కలిశాను. దీంతో కార్ల్‌టన్ క్లార్క్ హోటల్‌గా మారింది. ఐదేళ్ళ తరువాత క్లార్క్ రిటైర్ అవ్వాలనుకుని హోటల్‌ను అమ్మేద్దామనుకున్నారు. ఇప్పటిదాకా కొనసాగిన సంప్రదాయాలు, పద్ధతులు ఎవరైతే కొనసాగిస్తారో వారికి అమ్మాలనుకుంటున్నట్టు చెప్పేవారు. తరువాత దానిని నాకు ఆఫర్ చేశారు’’ అని పిరమిల్ కు మోహన్ వివరించారు.
‘‘నేను నా ఆస్తిని, నా భార్య బంగారాన్ని తాకట్టు పెట్టి, కావాల్సిన మొత్తాన్ని తెచ్చాను. క్లార్క్ హోటల్ యాజమానిని అయ్యాను. ఈ వ్యవహారంలో ఎప్పడూ నా వెన్నంటే ఉండే నా అంకుల్ కూడా ఉన్నారు’’
1934, ఆగస్టు 14నాటికల్లా మోహన్ సింగ్ దిల్లీ, సిమ్లాలోని క్లార్క్ హోటల్స్‌కు అధిపతి అయ్యారు.
మోహన్ సింగ్, ఆయన భార్య హోటల్ కోసం మాంసం, కూరగాయలు స్వయంగా కొనితెచ్చేవారు. దీనివల్ల బిల్లు 50 శాతం తగ్గేది.
క్రమంగా ఈ హోటల్స్ డార్జిలింగ్, చండీగఢ్, కశ్మీర్‌కు విస్తరించాయి.
‘‘నేను నా సొంత హోటల్ కట్టాలని ఆలోచించడం మొదలుపెట్టాను. మొదటి ప్రయత్నంలో ఒడిషాలోని గోపాలపురలో సముద్రపు ఒడ్డున చిన్నహోటల్ కట్టాను’’
తన జీవితంలో ప్రతిమలుపు ఏదో ఒక మహమ్మారితో ముడి పడి ఉండటం కాకతాళీయమని మోహన్ సింగ్ చెప్పారు.
కోల్‌కతాలో కలరా
1933లో కోల్‌కతాలో కలరా మహమ్మారి వ్యాపించింది.
వందమంది విదేశీ గెస్టులు చనిపోవడంతో ఆర్మేనియా రియల్ ఎస్టేట్ దిగ్గజం స్టీఫెన్ అర్థన్స్ గ్రాండ్ హోటల్ మూతపడింది. కోల్‌కతాకు వెళ్ళేందుకు ప్రజలు భయపడుతుండేవారు.
కానీ మోహన్ సింగ్ అత్యంత నమ్మకంతోనూ, నిశ్చయంతోనూ ఈహోటల్ ను లాభదాయమైనదిగా మార్చారు.
1939లో రెండో ప్రపంచయుద్ధం కారణంగా కోల్‌కతా సైనికులతో నిండిపోయింది. బస చేయడానికి తగిన స్థలం కోసం బ్రిటీషు సైన్యం వెదుకుతోంది.
‘‘నేను వెంటనే 1500 మంది బ్రిటీషు సైనికులకు తలకు 10 రూపాయల చొప్పున బస, భోజనం ఏర్పాటుచేశాను. గ్రూవ్స్ ను నెలకు 1500 రూపాయల జీతం పైన మేనేజర్‌గా నియమించుకున్నాను. ఆయన సిసిలీ హోటల్లో నాకు మొదటిసారిగా ఉద్యోగం ఇచ్చినప్పుడు 50రూపాయల జీతం ఇచ్చారు’’.
ఈ హోటల్‌ను నడపడం ఆయన కెరీర్‌లో ఎంతో ముఖ్యమైనది గా మారింది.
1941లో భారత హోటళ్ళ పరిశ్రమకు అందించిన సేవలకు గానూ మోహన్ సింగ్‌ను రాయ్ బహదూర్ బిరుదుతో సత్కరించారు.
1943లో మోహన్ సింగ్ అసోసియేటేడ్ హోటల్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో వాటాలు కొనుగోలు చేసి, రావాల్పిండి, పెషావర్, లాహోర్, ముర్రే, దిల్లీ నగరాల్లోని పెద్ద హోటళ్ళ గ్రూపును సొంతం చేసుకున్నారు.
దేశవిభజన జరిగాకా 1961వరకు రావల్పిండిలోని ఫ్లాష్ మాన్స్ లాహోర్‌లో ఫ్లిట్జ్, పెషావర్‌లో డెన్స్, ముర్రేలో సిసిలీ హోటళ్ళు ఈ కంపెనీ అధీనంలోనే ఉండేవి.
తరువాత కాలంలో అసోసియేటేడ్ హోటల్స్ ఆఫ్ పాకిస్తాన్‌లో అవి విలీనం అయ్యాయి. కానీ వీటిలో మెజారిటీ వాటాలు ఒబెరాయ్ కుటుంబసభ్యుల చేతిలోనే ఉన్నాయి. 1965లో ఇండియా, పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఈ హోటళ్లన్నింటినీ శత్రువుల ఆస్తులుగా పరిగణించి స్వాధీనం చేసుకున్నారు.
జనరల్ జియా ఉల్ హక్ మరణం
యుద్ధ సమయంలో స్వాధీనం చేసుకున్న ఆస్తులన్నింటినీ తిరిగి ఇస్తామని పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ జియా ఉల్ హక్ మోహన్ సింగ్‌కు మాట ఇచ్చారు.
కానీ మోహన్ సింగ్ ఆయనను కలవకముందే విమాన ప్రమాదంలో జియా ఉల్ హక్ చనిపోయారని జర్నలిస్ట్ పాల్ లూయిస్ చెప్పారు.
‘’20వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా భారతీయ హోటళ్ళ పరిశ్రమను మోహన్ సింగ్ ఒబెరాయ్ తీర్చిదిద్దారు. ఆయనను ఇండియా కానర్డ్ హిల్టన్ అని పిలిచేవారు. శిథిలమైన, చౌకైన ఆస్తులను కొనుగోలుచేసి, వాటిని ఆధునీకరించడమెలాగో ఆయనకు బాగా తెలుసు’’ అని లూయీస్ రాశారు.
ఆయన శిథిలమైన, చారిత్రాత్మక కట్టడాలను విలావసవంతమైన హోటళ్ళుగా మార్చారు. వీటిల్లో కోల్‌కతాలోని ది ఒబెరాయ్ గ్రాండ్, కైరోలోని చరిత్రాత్మక మీనా హౌస్, ఆస్ట్రేలియాలోని ది విండ్సర్ ఉన్నాయి.
20వ శతాబ్దపు మొదట్లో సిమ్లాలో ది ఒబెరాయ్ సిసిలీ భవనాన్ని నిర్మించారు. దీనిని 1997 ఏప్రిల్‌లో విస్తృతమైన డిజైన్లతోనూ అలంకరణలతోనూ తిరిగి తెరిచారు.
ఇండియా, శ్రీలంక, నేపాల్, ఈజిప్ట్, ఆస్ట్రేలియా, హంగేరిలో 35 విలాసవంతమైన హోటళ్ళతో ఒబెరాయ్ గ్రూపు, ఇండియాలో టాటాగ్రూపు తరువాత ద్వితీయస్థానంలో నిలిచింది.
1966లో ఒబెరాయ్ స్కూల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌ను ఏర్పాటుచేయడం మరో మైలురాయి.
ఈ స్కూల్ ‘ ది ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్’గా ప్రసిద్ధి పొందింది. ఆతిథ్య రంగంలో ఉన్నతమైన శిక్షణను ఇక్కడ అందిస్తారు.
మహిళలకు ఉద్యోగాలు
మహిళలకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించడమే కాకుండా, అత్యున్నత ప్రమాణాలు పాటించడం కూడా కీలకంగా మారింది.
1959లో మొట్టమొదట ఫ్లైట్ కేటరింగ్ కార్యకలాపాలను మొదలుపెట్టింది ఒబెరాయ్ గ్రూపే.
1962లో రాజ్యసభ ఎన్నికలలో మోహన్ సింగ్ పోటీ చేసి విజయం సాధించారు.
1967లో లోక్‌సభకు పోటీ చేసి 46వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.
2001లో ఆయన దేశంలోనే మూడో అత్యున్నత పౌరపురస్కారం ‘పద్మభూషణ్’ తో భారత ప్రభుత్వం సత్కరించింది.
‘డేర్ టు డ్రీమ్ : ఏ లైఫ్ ఆఫ్ రాయ్ బహదూర్ మోహన్ సింగ్ ఒబెరాయ్’ పేరుతో బాచి కర్కారియా ఆయన జీవిత చరిత్రను రాశారు.
మోహన్ సింగ్ ఒబెరాయ్ ఎంబీఏలాంటి ప్రొఫెషనల్ కోర్సులు ఏవీ చదవకుండానే వ్యాపారంలో తన దైన ముద్ర వేశారు.
1934లో సిమ్లాలోని 50 గదుల క్లార్క్ హోటల్లో వంటగది నుంచి అతిథుల ఉండే ఫ్లోర్‌కు లిఫ్ట్ ఏర్పాటు చేశారు.
‘‘వంటగదిలో తిరిగేటప్పుడు మిగిలిపోయిన బటర్‌ను బయటపడేయడం గమనించారు. దీనిబదులుగా బటర్‌తో రుచికరమైన పేస్ట్రీలు చేయవచ్చని భావించారు.’’
దశాబ్దాల తరువాత, తన కుమారుడు పృథ్వీరాజ్ దీర్ఘకాల అనారోగ్యం బారినపడటంతో దాదాపు 90 ఏళ్ళ వయసులో ఆయన తిరిగి పనిచేయడానికి వచ్చారు.
డబ్బు, పని మధ్య సంబంధం
మోహన్ సింగ్ ఒబెరాయ్ తన ఫామ్ హౌస్‌లో రాజ్‌పుత్ శైలిలో సమాధి నిర్మించుకున్నారు. కానీ 1984లో ఆయన కుమారుడు తిలక్ రాజ్, నాలుగేళ్ళ తరువాత ఆయన భార్య చనిపోయారు అని బాచి కర్కారియా రాశారు.
‘‘మోహన్ సింగ్ తాను పుట్టిన సంవత్సరాన్ని 1898 నుంచి 1900కు మార్చుకున్నారు. ఆయన తనను తాను 19వ శతాబ్దపు మనిషిగా భావించుకోవడానికి ఇష్టపడేవారు కాదు.’’ అని కర్కారియా రాశారు.
రాయ్ బహుదూర్ మోహన్ సింగ్ ఒబెరాయ్ చనిపోయేనాటికి ఆయన వయసు 104 సంవత్సరాలు.
ఆయన సిద్ధాంతం ఒక్కటే. ‘‘నువ్వు డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తే నువ్వు సరైన పని చేయలేవు. నువ్వు సరైన పనిచేస్తే డబ్బు దానంతట అదే వస్తుంది’’
ఇవి కూడా చదవండి
- 'నా ఆరోగ్యం ఏమవుతుందో' అని ఆందోళన చెందేవారే త్వరగా చనిపోతున్నారా?
- సైన్యం కస్టడీలో ముగ్గురు పౌరుల మృతి తర్వాత కశ్మీర్లో ఏం జరుగుతోంది?
- ‘సన్‌బర్న్’ ఫెస్టివల్లో ఏం చేస్తారు? దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమేంటి?
- చెన్నై: మగవాళ్లతో మాట్లాడుతోందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ట్రాన్స్‌సెక్సువల్ బాయ్‌ఫ్రెండ్, అసలేం జరిగింది?
- ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టు తీర్పును ఈ న్యాయ కోవిదులు ఎందుకు తప్పుబడుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)