నెపోలియన్‌ బయోపిక్‌లో డైరెక్టర్ రిడ్లీ స్కాట్ చెప్పే కథ ఏమిటి?

    • రచయిత, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్
    • హోదా, బీబీసీ కల్చర్

గ్లాడియేటర్, బ్లేడ్ రన్నర్, ద మార్షన్ లాంటి చిత్రాలు తీసిన ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు రిడ్లీ స్కాట్, తన కొత్త సినిమా నెపోలియన్ విడుదలకు కొన్ని నెలల ముందు చేసిన వ్యాఖ్యలు చర్చనీయమవుతున్నాయి.

నెపోలియన్‌గా జోయాక్విన్ ఫొనిక్స్ నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి స్కాట్ మాట్లాడుతూ, నెపోలియన్‌ను హిట్లర్, స్టాలిన్‌తో పోల్చడం వివాదానికి దారితీసింది.

నవంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల స్కాట్ కొన్ని వరుస షాట్లు విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచారం ఆయన దీంతో ప్రారంభించినట్లయింది.

ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టీ చారిత్రక గాథను స్కాట్ తెరకెక్కిస్తున్నారు. జొయాక్విన్ ఫొనిక్స్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రంలో నెపోలియన్‌కు తన మొదటి భార్య జోసెఫిన్‌తో ఉన్న చంచలమైన సంబంధాలపై ఫోకస్ చేశారు. జోసెఫైన్ పాత్రను వెనెసా కిర్బీ పోషిస్తున్నారు.

ఈ బయోపిక్ విడుదలకు ఇంకా కొన్ని నెలలు ఉన్న తరుణంలో ఫిల్మ్ మ్యాగజీన్ ‘ఎంపైర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిడ్లీ స్కాట్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

‘‘నెపోలియన్‌ను నేను అలెగ్జాండర్, అడాల్ఫ్ హిట్లర్, స్టాలిన్‌లతో పోల్చుతాను. ఆయన విజయాల వెనుక ఎంతో బ్యాడ్ కూడా ఉంది’’ అన్నారు రిడ్లీ స్కాట్.

నెపోలియన్ పాలన ఎలా ఉండేది?

‘‘బ్రిటన్ కఠిన వైఖరిని ఫ్రాన్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తిప్పికొట్టింది. హిట్లర్, స్టాలిన్‌ నిర్మించిందేమీ లేదు. విధ్వంసం మాత్రమే సృష్టించారు’’ అని నెపోలియన్ ఫౌండేషన్ అకడమిక్ డైరెక్టర్ పియర్ బ్రాండా ‘ది టెలిగ్రాఫ్’తో అన్నారు.

నెపోలియన్ నిర్మించినవి ఇప్పటికీ ఉన్నాయని ఫౌండేషన్‌కు చెందిన థియర్రీ లెంట్జ్ చెప్పారు.

‘‘నెపోలియన్ ఫ్రాన్స్‌ను కానీ, యూరప్‌ను కానీ నాశనం చేయలేదు. ఆయన లెగసీ ఆ తరువాత కూడా కొనసాగింది’’ అని థియర్రీ చెప్పారు.

మరి రిడ్లీ స్కాట్ తాను చెప్పే విషయాలపై నిలబడగలరా? అవి నిజమేనా?

ఫ్రెంచ్ విప్లవం తరువాత ఫ్రాన్స్‌లో రాజకీయ అస్థిరత ఉన్న సమయంలో 1799లో అప్పటికి మిలంటరీ కమాండర్‌గా ఉన్న నెపోలియన్ అధికారం చేజిక్కించుకున్నారు.

నెపోలియన్ ఫ్రాన్స్‌ను విప్లవ కాలానికి ముందున్న స్థితి నుంచి మరింత గుణాత్మక స్థితికి తేగలిగారని ఆయన్ను ఆరాధించేవారు చెప్తారు.

పాలనను కేంద్రీకృతం చేయడంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థను మార్చడం, విద్యావ్యవస్థను సమూలంగా మార్చడం వంటివి చేశారని చెప్తారు.

నెపోలియన్ కోడ్ తీసుకొచ్చి ఫ్రాన్స్ న్యాయవ్యవస్థను మార్చారు. ఈ కోడ్‌లో ఇతర కొన్ని దేశాలకు మోడల్‌గా పనిచేసిందని చెప్తారు.

అయితే, నెపోలియన్ యూరప్ అంతటా యుద్ధాలు చేసి రక్తపాతం సాగించారు. వరుస యుద్ధాలతో ఐబీరియా ద్వీపకల్పం నుంచి మాస్కో వరకు సామ్రాజ్యం విస్తరించారు.

1812 నాటికి యూరప్‌లో నెపోలియన్ ప్రత్యక్ష పాలనలో కానీ, ఆయన అనుకూలుర పాలనలో కానీ, తన కీలుబొమ్మల పాలనలో కానీ లేని ప్రాంతాలు బ్రిటన్, పోర్చుగల్, స్వీడన్, ఒట్టోమన్ సామ్రాజ్యం మాత్రమే.

చివరకు నెపోలియన్ 1815లో వాటర్లూ యుద్ధంలో బ్రిటన్ నేతృత్వంలోని కూటమి చేతిలో ఓటమి పాలయ్యారు.

నెపోలియన్, ఆయన చేసిన యుద్ధాలు బ్రిటిష్ ప్రజలు అప్పట్లో, ఆ తరువాత కూడా చాలా పెద్దవిగా చూశారు.

కార్టూనిస్ట్‌లైతే నెపోలియన్‌పై ఎన్ని కార్టూన్లు వేశారో లెక్కే ఉండదు. 1813లో ప్రచురితమైన జేన్ ఆస్టిన్ నవల ‘ప్రైడ్ అండ్ ప్రిజుడీస్’ కూడా నెపోలియన్ నేపథ్యంలోనే వచ్చింది.

నెపోలియన్ శవ పేటికలో కొంత భాగం చార్లట్ బ్రాంటె దగ్గర ఉంది. ఆమెకు దాన్ని బ్రసెల్స్‌లోని ఆమె ట్యూటర్ ఇచ్చారు.

అనేక ఇతర పుస్తకాలలోనూ నెపోలియన్ ప్రస్తావన ఉంటుంది.

ఆర్థర్ కోనన్ డోయల్ సృష్టించిన డిటెక్టివ్ పాత్ర షెర్లాక్ హోమ్స్‌ తన విలన్ అయిన ప్రొఫెసర్ మోరియార్టీను ‘నెపోలియన్ ఆఫ్ క్రైమ్’గా వర్ణిస్తాడు.

అంతేకాదు. 1945లో ప్రచురితమైన జార్జ్ ఆర్వెల్ ‘యానిమల్ ఫామ్’లో నియంతగా మారిన పందిని నెపోలియన్ అని అంటారు.

అయితే, నెపోలియన్‌ను నియంత అనడం, ఇతర పేరుమోసిన నియంతలతో పోల్చడం సరైనదేనా?

నెపోలియన్ జీవిత చరిత్ర రాసిన ఆస్ట్రేలియాలోని న్యూక్యాజిల్ యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్ ఫిలిప్ డ్వేర్ అభిప్రాయం భిన్నంగా ఉంది.

‘‘నెపోలియన్ కూడా నియంతే కానీ స్టాలిన్, హిట్లర్‌లతో ఆయన్ను పోల్చలేం. వారిద్దరూ నిరంకుశాధికారం కోసం సొంత ప్రజలనే అణచివేశారు. ఫలితంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు’’ అన్నారు.

‘నెపోలియన్ హయాంలో కాన్సంట్రేషన్ క్యాంపులు లేవు’

ప్రజలు ఏమనుకుంటున్నారో నిత్యం కన్నేసి ఉంచే రహస్య వేగులతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ ఉండడంతో నెపోలియన్ సామ్రాజ్యాన్ని ‘పోలీస్ రాజ్యం’ అని కొందరి అభిప్రాయం అని ఫిలిప్ అన్నారు.

‘‘కానీ, నెపోలియన్ పాలనను కూలదోయడానికి కొద్ది మంది దొరలు మాత్రమే ప్రయత్నించారు. నెపోలియన్‌ను వ్యతిరేకించినందుకు కొద్ది మంది జర్నలిస్టులకు నెపోలియన్ మరణ శిక్ష విధించారు. నెపోలియన్‌ను నేను ఎవరితోనైనా పోల్చాలనుకుంటే చరిత్రలో మరింత వెనక్కు వెళ్లి పద్నాలుగో లూయిస్ చక్రవర్తితో పోల్చుతాను. ఆయన కూడా అనవసర యుద్ధాలతో వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు’’ అన్నారు ఫిలిప్.

‘‘అయితే నెపోలియన్ యుద్దాలు చేయడం వరకు వాస్తవం. అవి అవసరమా? అనవసరమా అనేది వేరే చర్చ. అంతేకాదు, ఆ యుద్దాలలో ఎంతమంది ప్రాణాలు పోయాయన్నదీ నాకు తెలియదు’’ అంటారు ఫిలిప్.

ఫ్రెంచ్ జర్నలిస్ట్, టెలిగ్రాఫ్ కాలమిస్ట్ అయిన అన్నె ఎలిసాబెత్ మౌటెట్ దీనిపై స్పందిస్తూ హిట్లర్, స్టాలిన్‌లతో నెపోలియన్‌ను పోల్చడం సరికాదన్నారు.

‘‘ఆయన హయాంలో కాన్సంట్రేషన్ క్యాంపులు లేవు’’ అని ఎలిసాబెత్ ‘బీబీసీ’తో అన్నారు.

‘‘నెపోలియన్ మైనారిటీలను ఒంటరులుగా చేసి ఊచకోత కోయలేదు. ప్రజల్లోకి చొరబడే పోలీసులుండేవారు కానీ ప్రజలు తమకు నచ్చినట్లు బతికారు, తమ అభిప్రాయాలు చెప్పగలిగారు’ అన్నారు ఎలిసాబెత్.

ఫ్రెంచ్ ప్రజలు నెపోలినయన్‌ను సంస్కర్తగా చూస్తారని ఎలిసాబెత్ అన్నారు.

‘‘నెపోలియన్ ఆలోచనలు అద్భుతంగా ఉండేవి. ఇప్పటికీ మనుగడలో ఉన్న అనేక చట్టాలు, సంస్థలను తీసుకొచ్చింది ఆయనే. చాలా మంది ప్రజలు భూస్వామ్య చట్టాల కింద బతికే కంటే ఫ్రెంచ్ పాలనలో జీవించాలనుకున్నారు’’ అన్నారు ఎలిసాబెత్.

లివర్‌పూల్ యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్ చార్లెస్ ఎస్డైల్ అభిప్రాయం వేరేలా ఉంది.

‘‘నెపోలియన్‌ను యుద్ధప్రభువుగా చూస్తాను నేను. వ్యక్తిగతంగా నిర్దిష్టమైన ఆకాంక్షలున్న, నిర్దయగా ఉండే వ్యక్తి నెపోలియన్’’ అన్నారు ఆయన.

నెపోలియన్ ప్రచార తంత్రం చాలా శక్తిమంతమైనదని అంటారాయన. అయితే, నెపోలియన్‌ను హిట్లర్, స్టాలిన్‌లతో పోల్చడానికి చార్లెస్ కూడా అంగీకరించలేదు.

‘‘నెపోలియన్‌లో చాలా లోపాలున్నాయి. కానీ, నాజీ పాలనకు మూలాధారమైన జాతి విద్వేషం ఆయన సామ్రాజ్యంలో లేదు’’ అన్నారు చార్లెస్.

‘‘నెపోలియన్ మారణహోమానికి పాల్పడలేదు. ఆయన కాలంలో జైళ్లలో మగ్గిన రాజకీయ ఖైదీల సంఖ్య కూడా ఎక్కువేం కాదు. కాబట్టి నెపోలియన్‌ను హిట్లర్, స్టాలిన్‌లను పోల్చలేం’’ అన్నారు.

రిడ్లీ స్కాట్‌కు తన సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో బాగా తెలుసు.

బ్లేడ్ రన్నర్, గ్లాడియేటర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రిడ్లీ స్కాట్‌కు నెపోలియన్‌ను హిట్లర్, స్టాలిన్‌లతో పోల్చడం ప్రచారాన్ని తెచ్చి పెడుతుందనేది తెలుసని విమర్శకులు అంటున్నారు. అందుకే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారని వారు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)