You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విరిగిపడిన కొండ చరియల కింద 60 గంటలపాటు మూడేళ్ల చిన్నారి.. చివరకు ఎలా రక్షించారంటే
కొండ చరియల శిథిలా కింద 60 గంటలపాటు చిక్కుకుపోయిన ఓ మూడేళ్ల చిన్నారిని సహాయక సిబ్బంది ప్రాణాలతో రక్షించగలిగారు.
ఈ ఘటన దక్షిణ ఫిలిప్పీన్స్‌లో జరిగింది.
విరిగిపడిన కొండ చరియల కింద చిక్కుకున్నవారిలో రెండు రోజుల తరువాత ప్రాణాలతో ఎవరినీ గుర్తిస్తామనుకోలేదని.. కానీ, ఈ చిన్నారిని ప్రాణాలతో రక్షించగలగడం ‘అద్భుతం’ అని సహాయచర్యలలో పాల్గొన్ని సిబ్బంది చెప్పారు
ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ప్రాంతంలోని దవావో డి ఓరో ప్రావిన్స్‌లోని బంగారు గనుల తవ్వకాలు జరిగే మసారా గ్రామ సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి.
ఈ ఘటనలో 28మంది చనిపోయారని, 77మంది కనిపించకుండా పోయారని అధికార వర్గాలు చెప్పాయి.
శిథిలాల నుంచి రక్షించిన చిన్నారిని దుప్పటిలో చుట్టి, ఆక్సిజన్ అందిస్తూ సమీపంలోని మావాబ్ పట్టణ ఆస్పత్రిలోకి సహాయక బృందాలు తీసుకువెళుతున్న ఫోటోలు, వీడియోలు ఫిలిప్పీన్స్ రెడ్ క్రాస్ ఫేస్ బుక్ పేజీలో ఉన్నాయి.
దవావో డి ఓరో ప్రావిన్స్ విపత్తు ఏజెన్సీ అధికారి ఎడ్వర్డ్ మకాపిలి ‘ఇదొక అద్భుతం’ అని చెప్పారు.
కనిపించకుండా పోయిన మిగతావారు చనిపోయి ఉంటారని సహాయక బృందాలు భావిస్తున్నాయని తెలిపారు.
‘‘ఇది సహాయక సిబ్బందికి ఆశను కలిగిస్తోంది. ఈ చిన్నారి బతికి బయటపడిన తరువాత ఇంకెవరినైనా ప్రాణాలతో గుర్తిస్తామన్న ఆశ వారిలో కలిగింది’’ అని ఆయన ఏఎఫ్‌పీ కి తెలిపారు.
‘‘నాలుగు రోజుల తరువాత కూడా ఇంకా చాలా మందిని రక్షించగలమనే ఆశతో ఉన్నాం’’ అని దవావో డి ఓర్ విపత్తుశాఖ ముఖ్య అధికారి రాండీ లాయ్ విలేకరుల సమావేశంలో చెప్పారు.
‘‘కానీ వారు కచ్చితంగా బతికి ఉంటారనే అవకాశాలు మాత్రం లేవు’’ అని కూడా ఆయన హెచ్చరించారు.
కొండచరియలు మంగళవారం రాత్రి విరిగిపడ్డాయి. అవి బంగారు గనుల వద్ద కార్మికులను తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉన్న మూడు బస్సులు, మరో వాహనంపైనా, అనేక ఇళ్ళపైనా పడ్డాయి.
ఫిలిప్పీన్స్ పర్వత భూభాగంలో విస్తరించడం, అక్రమ మైనింగ్, భారీ వర్షపాతం, అటవీ నిర్మూలన కారణంగా తరచూ కొండ చరియలు విరిగిపడుతుంటాయి.
మిండనావోలో వారాల తరబడి కురిసిన వర్షాలకు వరదలు సంభవించడం, కొండ చరియలు విరిగిపడటంతో వేలాదిమంది ప్రజలను అత్యవసర స్థావరాలకు చేర్చారు.
అయితే శనివారంనాడు 5.9 తీవ్రతతో భూమి కంపించడంతో సహాయక బృందాలు తమ కార్యకలాపాలకు విరామం ఇవ్వాల్సి వచ్చింది.
అయితే భూకంపం కారణంగా ఎవరూ మరణించలేదు, గాయపడలేదని అక్కడి మీడియా తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- రాజ్యసభ ఎంపీలను ఎలా ఎన్నుకుంటారో తెలుసా?
- కొత్త మహాసముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
- వెన్నునొప్పి తగ్గడానికి పనికొచ్చే చికిత్సలేమిటి? ఫలితమివ్వని పద్ధతులేమిటి? నడుముకు బెల్ట్ వాడడం వల్ల ప్రయోజనం లేదా
- చేపలు తినేవారి మెదడు పెద్దగా ఉంటుందా... చెరువు, సముద్రం చేపల్లో ఏవి మంచివి?
- ముఖంపై ముడతలను, మచ్చలను కొల్లాజెన్ సప్లిమెంట్లతో తగ్గించుకోవచ్చా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.