ఏఐతో చేసే మోసాలను తెలుసుకోవడం ఎలా, ఏమేం గమనించాలి?

మహిళా కొనుగోలుదారులు
ఫొటో క్యాప్షన్, ఏఐ సామర్థ్యాలు పెరగడంతో మోసాలను గుర్తించేందుకు గతంలో ఉపయోగించిన కొన్ని పద్ధతులు ఇప్పుడు అంతగా ఉపయోగపడకపోవచ్చు.
    • రచయిత, కెవిన్ పీచే
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

నేరగాళ్లు కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించి విస్తృతంగా, సమర్థవంతంగా మోసాలు చేస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్‌లో వస్తువులు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారో జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

కొంతమంది మోసగాళ్లు నకిలీ వ్యాపార సంస్థల పేరుతో వెబ్‌సైట్లు రూపొందిస్తున్నారు. బ్రిటన్‌లో తయారైన నాణ్యమైన వస్తువులను విక్రయించే కుటుంబ వ్యాపార సంస్థలుగా వాటిని చూపుతున్నారు.

ఆ వెబ్‌సైట్లలో బ్రిటన్‌లోని ప్రధాన వ్యాపార వీధులు, అక్కడ బ్రిటన్‌ జాతీయ పతాకాలు కనిపించే చిత్రాలు కూడా ఉండవచ్చు.

అలాంటి వెబ్‌సైట్లలో వస్తువులు ఆర్డర్‌ చేస్తే అవి అసలు రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా, చైనా వంటి దేశాల్లో భారీగా తయారయ్యే చౌక ఉత్పత్తులు కావచ్చని వ్యాపార ప్రమాణాల పర్యవేక్షణ అధికారులు చెబుతున్నారు.

ఏఐతో రూపొందించిన చిత్రాలతో పాటు, ఇతరుల గొంతులను అనుకరించే సాంకేతికత, డీప్‌ఫేక్‌ వీడియోలను కూడా ప్రజలను మోసం చేసి డబ్బు కాజేయడానికి నేరగాళ్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని బ్రిటన్‌కు చెందిన నేషనల్‌ ట్రేడింగ్‌ స్టాండర్డ్స్‌ సంస్థ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏమేం గమనించాలి?

నేరస్తులు ఉపయోగిస్తున్న వివిధ సాధనాలు, పద్ధతులను ఎత్తిచూపుతూ.. ఈ సంస్థ తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోసాల కోసం ఒక వాచ్‌లిస్ట్‌ను రూపొందించింది.

మోసగాళ్లు ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తున్నారు?

  • నకిలీ వెబ్‌సైట్లు: ఇప్పటికే ఉన్న వెబ్‌సైట్లను పోలిన వాటిని రూపొందించడం లేదా కొత్త వెబ్‌సైట్లను సృష్టించడం. తక్కువ ఖర్చుతో, చాలా తక్కువ సమయంలోనే ఆకర్షణీయంగా, ప్రొఫెషనల్‌గా కనిపించేలా వెబ్‌సైట్లను తయారు చేస్తున్నారు.
  • ప్రేమ పేరుతో మోసాలు: బాధితుల వ్యక్తిగత వివరాలను గుర్తుంచుకోవడానికి, వారితో వారాలు లేదా నెలల తరబడి సంభాషణలు కొనసాగించడానికి ఏఐను ఉపయోగిస్తున్నారు.
  • డీప్‌ఫేక్‌ వీడియోలు, నకిలీ గొంతులు: ఏఐతో రూపొందించిన డీప్‌ఫేక్‌ వీడియోలు, ఇతరుల గొంతులను అనుకరించే ఆడియోలను ఉపయోగించి కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రుల్లా నటిస్తున్నారు. అత్యవసర పరిస్థితి వచ్చిందని చెప్పి డబ్బులు అడుగుతున్నారు.
  • వ్యక్తిగత వివరాలతో మోసపూరిత సందేశాలు: అక్షరదోషాలు, తప్పులు లేకుండా, ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా పంపినట్లు కనిపించే మోసపూరిత ఈమెయిళ్లు, టెక్స్ట్‌ మెసేజ్‌లు, సామాజిక మాధ్యమ పోస్టులను ఏఐతో భారీ సంఖ్యలో రూపొందిస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఫొటో క్యాప్షన్, ఆన్‌లైన్‌ దుకాణం ఇచ్చిన చిరునామా నిజమైనదో కాదో తనిఖీ చేయాలి

ఎలా కాపాడుకోవాలి?

ఏఐ సామర్థ్యాలు పెరగడంతో మోసాలను గుర్తించేందుకు గతంలో ఉపయోగించిన కొన్ని పద్ధతులు ఇప్పుడు అంతగా ఉపయోగపడకపోవచ్చు.

స్పెల్లింగ్ లేదా గ్రామర్ పరంగా ఉండే తప్పులతోనే ఈ మోసాలను గుర్తించలేమని నేషనల్ ట్రేడింగ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఈ మోసాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు ఈ సంస్థ కొన్ని మార్గాలు సూచించింది.

  • వ్యక్తిగతంగా కలవని ఎవరికీ కూడా డబ్బులు, గిఫ్ట్ కార్డులు పంపవద్దు. వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని పంచుకోవద్దు.
  • ఆన్‌లైన్‌ దుకాణం ఇచ్చిన చిరునామా నిజమైనదో కాదో తనిఖీ చేయండి. ఆర్థిక సలహాలు ఇచ్చే సంస్థకు అధికారిక అనుమతి ఉందో లేదో తెలుసుకునేందుకు బ్రిటన్‌ ఫైనాన్షియల్‌ కండక్ట్‌ అథారిటీకి చెందిన 'ఫర్మ్‌ చెకర్‌'ను ఉపయోగించండి. ఉద్యోగ ప్రకటన నిజమైనదో కాదో తెలుసుకోవాలంటే సంబంధిత సంస్థను నేరుగా సంప్రదించండి..
  • గొంతు విన్నంత మాత్రాన నమ్మవద్దు: ఒక వ్యక్తి గొంతు విన్నా, వీడియో కాల్‌లో చూసినా ఆ వ్యక్తి నిజమైనవారేనని భావించవద్దు.
  • సాధారణంగా డబ్బులు చెల్లించే ముందు, వ్యక్తిగత సమాచారం పంచుకునే ముందు లేదా జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.
  • ముఖ్యంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఎవరైనా ఒత్తిడి చేస్తుంటే మరింత అప్రమత్తంగా ఉండాలి.ఎందుకంటే మీరు ఆలోచించుకునే సమయం ఇవ్వకూడదని మోసగాళ్లు కోరుకుంటారు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)