మిస్టరీ బాల్స్: బీచ్‌లలో ప్రత్యక్షమైన తారు బంతులు, టచ్ కూడా చేయొద్దన్న అధికారులు

    • రచయిత, పాట్రిక్ జాక్సన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో బీచ్‌లను తిరిగి స్విమ్మర్ల కోసం ఓపెన్ చేశారు. అంతకు ముందు ఇక్కడి తీరాలలో తారుతో తయారు చేసిన బంతుల వంటివి కనిపించడం ఆందోళన కలిగించింది. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చనే ఆందోళనల మధ్య బీచ్‌లను కొన్నాళ్లు మూసివేశారు.

ఈ బంతులు సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగించే రసాయనాలు, ఇళ్లను శుభ్రం చేసే ఉత్పత్తులతో తయారైనవని పరీక్షల్లో తేలినట్లు అధికారులు తెలిపారు. అయితే అవి ఇక్కడకు ఎలా వచ్చాయో అంతు చిక్కడం లేదన్నారు.

సిడ్నీలోని 8 ప్రముఖ బీచ్‌లలో ఒకటైన బోండి బీచ్‌తో పాటు మిగతావాటిని మూసివేశారు. నల్లటి పదార్ధాలు విషపూరితమైనవి కావడంతో వాటిని ఏరివేసేందుకు విస్తృతమైన చర్యలు చేపట్టారు.

“ఈ కాలుష్యకారక పదార్ధాలు ఎక్కడ నుంచి వచ్చాయి, దీనికి కారకులు ఎవరు అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది” అని న్యూసౌత్‌వేల్స్ పర్యావరణ మంత్రి పెన్నీ షార్ప్ చెప్పారు.

ఈ బంతులు మనుషులకు తీవ్రమైన హాని చేసేవేమీకావని మారిటైమ్ అధికారులు తెలిపారు. అయితే వాటిని ముట్టుకోవడం, చేతుల్లోకి తీసుకోవడం లాంటి పనులు చేయరాదని సూచించారు.

“పర్యావరణ పరిరక్షణ అధికారుల సలహా ప్రకారం ఈ బాల్స్‌ను ఫ్యాటీ యాసిడ్స్, సౌందర్య సాధనాల్లో వాడే రసాయనాలు, క్లీనింగ్ కోసం ఉపయోగించే పదార్ధాలు, చమురుతో చేసినట్లు మేము గుర్తించాం” అని న్యూ సౌత్ వేల్స్ మారిటైమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్క్ హచింగ్స్ చెప్పారు.

ఈ నల్లటి బంతులు కొన్ని ఫుట్‌బాల్, క్రికెట్ బాల్ సైజులో ఉన్నాయి. ఈ బంతులను లేబరేటరీలకు పంపించామని, ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయని ది న్యూసౌత్ వేల్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ తెలిపింది. బాల్స్ ఎక్కడ నుంచి వచ్చాయనే దానిపైనా దర్యాప్తు జరుగుతున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

“ఇది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఎక్కడ నుంచి వచ్చాయో తెలియడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది” అని పర్యావరణ పరిరక్షణ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టీఫెన్ బీమన్ తెలిపారు.

‘‘తారు బంతులు నేలపై ఉన్నప్పుడు ప్రమాదకరమైనవి కావు. అయితే వాటిని ముట్టుకోకూడదు. చేతుల్లోకి తీసుకోకూడదు” అని హచింగ్స్ చెప్పినట్లు ఆస్ట్రేలియన్ వార్తా సంస్థ ఏబీసీ తెలిపింది.

“మీకు ఆ బంతులు కనిపిస్తే, దగ్గర్లో ఉన్న అధికారులకు తెలియజెయ్యండి. మీరు లేదా మీ కుటుంబ సభ్యులెవరైనా పొరపాటున వాటిని తాకితే వెంటనే సబ్బు లేదా బేబీ ఆయిల్‌తో చేతుల్ని కడుక్కోండి” అని హచింగ్స్ సూచించారు.

బీచ్‌లలో ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత మంగళవారం నుంచి ఇప్పటి వరకు 2వేలకు పైగా నల్లటి బంతులను తొలగించినట్లు అధికారులు తెలిపారు.

“వీటికి సంబంధించినవి ఇంకా ఏమైనా ఉన్నాయా అని బీచ్‌లలో వెతికాం. అలాంటివేమీ కనిపించలేదు” అని హచింగ్స్ చెప్పారు.

“సముద్ర జలాల్లో వ్యర్థాలు, చమురు కలిసినప్పుడు తారు బంతులు తయారవుతాయి. కార్గో నౌకల ద్వారా చమురు లీకవడం, లేదా ఆయా నౌకల నుంచి వచ్చే చమురు వ్యర్థాల వల్ల ఇలాంటివి తయారు కావడం సహజం” అని పర్యావరణవేత్త రికీ హెన్రీ తెలిపారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)