You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘ప్రతి మసీదులో శివలింగాన్ని చూడొద్దు’ అన్న ఆరెస్సెస్ చీఫ్ వ్యాఖ్యలపై ఎవరు ఎలా స్పందించారు?
- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
''రామమందిరం హిందువుల మనోభావాలకు సంబంధించినది. వారి నమ్మకానికి గుర్తు అది. అయితే రామాలయం నిర్మాణం తర్వాత కొందరు ఎలా ఆలోచిస్తున్నారంటే కొత్త ప్రాంతాల్లో అలాంటి సమస్యలను లేవెనెత్తడం ద్వారా హిందువులకు నాయకులుగా మారాలనుకుంటున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు''
ఈ మాటలన్నది ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్. దేశంలో ఆలయాలు, మసీదుల గురించి కొత్త కొత్త వివాదాలు మొదలవుతున్న సమయంలో మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఓ పక్క ప్రార్థనాస్థలాల చట్టంపై చర్చ జరుగుతోంది. దేశంలో సంభాల్, మథుర, అజ్మీర్, కాశీ వంటి చోట్ల ఉన్న మసీదులు పురాతన కాలంలో హిందూ ఆలయాలేనని కొందరు ఆరోపిస్తున్నారు.
ఇలాంటి చర్చలపై మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తంచేశారు. వారం రోజుల క్రితం పుణెలో హిందూ సేవా మహోత్సవ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ మందిర్-మసీదు అధ్యాయాన్ని ఇక ముగించాలని మరోసారి వ్యాఖ్యానించారు.
''ప్రతిరోజూ కొత్త ఎపిసోడ్లు బయటికి తేవడం సరైనది కాదు. అలాంటివి కొనసాగించలేం'' అని ఆయనన్నారు.
మోహన్ భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాజకీయవర్గాల్లో దుమారం చెలరేగడమే కాకుండా, చాలా మంది సాధువులు ఆయనకు వ్యతిరేకంగా గళమెత్తారు.
మోహన్ భగవత్ ప్రసంగం ఉద్దశమేంటి? తమ వైఖరి మార్చుకోవాల్సిందిగా ఆయన సంఘ్ క్యాడర్‌కు సూచిస్తున్నారా..?
మోహన్ భగవత్‌పై సాధువుల ఆగ్రహం
మోహన్ భగవత్ ప్రకటనపై స్వామి రామభద్రాచార్య అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ''ఇది మోహన్ భగవత్ వ్యక్తిగత అభిప్రాయం. ఇది అందరి తరఫున చేసిన ప్రకటన కాదు. ఆయన ఓ సంస్థ అధినేత అయ్యుండొచ్చు. కానీ ఆయన హిందుత్వానికి అధినేత కాదు'' అని అన్నారు.
జ్మోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద కూడా మోహన్ భగవత్ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
''ఇంతటితో ముగించాలని వారు చెబుతున్నారు. మీరెప్పుడు కావాలనుకుంటే అప్పుడు యాక్సెలరేటర్ నొక్కొచ్చు. మీరెప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్‌లు వేయొచ్చు. ఇది మన అనుకూల పరిస్థితులను బట్టి ఉంటుంది. అయితే న్యాయం, మన అనుకూలతల ప్రకారం ఉండదు.'' అని అవిముక్తేశ్వరానంద అన్నారు.
బాబా రాందేవ్ కూడా దీనిపై స్పందించారు. ''ఆక్రమణదారులు వచ్చి మన ఆలయాలను, ఆధ్యాత్మిక ప్రాంతాలను, మనకు గర్వకారణమైన సనాతన చిహ్నాలను ధ్వంసం చేసి, దేశానికి నష్టం కలిగించారన్నది నిజం'' అని బాబా రాందేవ్ పీటీఐతో మాట్లాడుతూ అన్నారు.
దిల్లీ ఆశీర్వాదం
దేశంలో ముస్లింలను కలుపుకుపోవాలని, మసీదుల్లో ఆలయాల కోసం వెతకొద్దని సంఘ్ అధ్యక్షుడు సలహాఇవ్వడం ఇదే మొదటిసారి కాదు.
''చరిత్రను మనం మార్చలేం. ఇప్పటి హిందువులు కానీ, ముస్లింలు కానీ అది చేయలేదు. ఆ సమయంలో అది జరిగింది. ప్రతి మసీదులో శివలింగాన్ని ఎందుకు చూడాలి...? మనం ఇప్పుడు ఎలాంటి ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు'' అని 2022లో నాగ్‌పూర్‌లో మోహన్ భగవత్ అన్నారు.
లోక్‌సభ ఫలితాలపై విశ్లేషణ జరుపుతూ మోహన్ భగవత్ ఈ ఏడాది ఓ ప్రకటన చేశారు. బీజేపీ వైఖరిని ఉద్దేశించే అప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని భావించారు.
''అహంకారంతో కాకుండా మర్యాదస్తుని తరహాలో పనిచేసిన వ్యక్తిని మాత్రమే సేవకుడనే నిజమైన అర్ధంలో చూడాలి. అది గర్వకారణంగా ఉంటుంది. అహంకారం ప్రదర్శించకూడదు'' అని అప్పుడు మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ ప్రకటనను మరో కోణంలో చూస్తున్నారు. ఈ సారి మోహన్ భగవత్ కొత్త మాట ఒకటి మాట్లాడారని దశాబ్దాలుగా సంఘ్ వ్యవహారాలను దగ్గరినుంచి గమనిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ శరద్ గుప్తా అంటున్నారు. ఆలయ వివాదాల ద్వారా కొందరు నేతలుగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారన్న భగవత్ వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు.
నరేంద్ర మోదీని పరోక్షంగా విమర్శించినా సహించని బీజేపీ నేతల సమక్షంలోనే మోహన్ భగవత్ ఈ మాటలంటున్నారని శరద్ గుప్తా చెప్పారు.
''చరిత్రకారులు, మత నాయకులు, మోహన్ భగవత్ మాటలతో విభేదిస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు సంఘ్‌ను వదిలిపెట్టివెళ్లాలని మోహన్ భగవత్‌ను డిమాండ్ చేస్తున్నారు. దిల్లీ ఆశీర్వాదం లేకుండా ఇదంతా జరగదు'' అని సీనియర్ జర్నలిస్ట్ అశోక్ వాంఖడే కూడా అన్నారు.
''నరేంద్రమోదీ కనుక ఇదే మాట చెబితే, అప్పుడు కూడా ఇలాంటి విమర్శలే ఉండేవా..? మోహన్ భగవత్‌కు వ్యతిరేకంగా దిల్లీ స్థాయిలో ఓ కూటమి పనిచేస్తుందనేది స్పష్టం. కేంద్ర ప్రభుత్వానికి, మోహన్ భగవత్‌కు మధ్య ఇది ప్రత్యక్ష పోరాటం'' అని ఆయన చెప్పారు.
బీజేపీ, సంఘ్ మధ్య విభేదాలు?
''దేశంలో ఇప్పుడు జరుగుతున్నదాన్ని మోహన్ భగవత్ ఇష్టపడడం లేదని ఆయన మాటలు తెలియజేస్తున్నాయి'' అని సీనియర్ జర్నలిస్ట్, ఆరెస్సెస్‌పై ఓ పుస్తకం రాసిన విజయ్ త్రివేది చెప్పారు.
‘‘ మోదీతో తనకు ఎలాంటి వైరం లేదని మోహన్ భగవత్ అంటున్నారు. ఆయన ప్రకటనపై అనుమానం వ్యక్తంచేయడమంటే ఆయన్ను అగౌరవపరచడమే. ఆయన ఇలాంటి మాటలనడం ఇదే తొలిసారి కాదు. హిందువులు, ముస్లింలు కలిసి ముందుకు సాగాల్సిన అవసరముందన్న విషయాన్ని ఆయన ఎంతకాలంగానో చెబుతున్నారు'' అని విజయ్ త్రివేది విశ్లేషించారు.
''మంచి వ్యక్తిగా కనిపించడం కోసం ఆయన ఈ ప్రకటనలు చేయడం లేదు. సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వారందరినీ ఉద్దేశించి ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నారు'' అని త్రివేది విశ్లేషించారు.
2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ, సంఘ్ మధ్య విభేదాలు బయటపడ్డాయి.
తొలిరోజుల్లో జరిగిన ఎన్నికల ప్రచారం తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ''బీజేపీకి ఇకపై సంఘ్ అవసరం లేదు'' అని వ్యాఖ్యానించారు.
జేపీ నడ్డా ఈ ప్రకటన చేసిన తర్వాత మోహన్ భగవత్ దూకుడు పెంచారని అశోక్ వాంఖడే అభిప్రాయపడ్డారు.
''ఆరెస్సెస్ ఎప్పుడూ ఆధిపత్యం ప్రదర్శించింది. అటల్ బిహారీ ప్రభుత్వంలోనూ ఇదే జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఇందిరాగాంధీ కాంగ్రెస్‌లా మారింది. అధికారం, సంస్థ రెండూ ఒకే వ్యక్తి చేతుల్లో ఉన్నాయి. ఇది ఆరెస్సెస్‌కు సమస్యగా మారింది. పరిస్థితులు తమ చేయి దాటిపోతాయని వారు భయపడుతున్నారు'' అని వాంఖడే విశ్లేషించారు.
సంఘ్‌చాలక్ ప్రసంగానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందని వాంఖడే అంటున్నారు. అనేక రకాల చర్చలు, వ్యూహం తర్వాతే వారు మాట్లాడతారని విశ్లేషించారు.
మోహన్ భగవత్ మాటల ప్రభావమెంత?
సంఘ్‌లో మోహన్ భగవత్‌కు కాకుండా నరేంద్రమోదీకి మద్దతిచ్చే వాళ్లు చాలా మంది ఉన్నారని సీనియర్ జర్నలిస్ట్ శరద్ గుప్తా అభిప్రాయపడ్డారు.
సంఘ్‌పై మోహన్ భగవత్ పట్టు కోల్పోయారని అన్నారు. సంఘ్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మోహన్ భగవత్ సామర్థ్యం ఎంత అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని విశ్లేషించారు.
''పాంచజన్య ఆరెస్సెస్ పత్రిక. హిందూయిజం గుర్తులు ఎక్కడెక్కడ మరుగునపడి ఉన్నాయో, ఏయే హిందూ ఆలయాలను ధ్వంసం చేశారో వాటన్నింటినీ తిరిగి వెనక్కి తీసుకోవాల్సిన అవసరముందని పాంచజన్య తాజా ఎడిటోరియల్ సూచించింది. సంఘ్ పత్రిక, ఆ సంస్థ అధ్యక్షునికి వ్యతిరేకంగా ఉందా...దీనిని ఏమనాలి?' అని శరద్ గుప్తా ప్రశ్నించారు.
ఆరెస్సెస్ చీఫ్ చేసే అలాంటి ప్రకటనలు క్షేత్రస్థాయిలో ఏమైనా ప్రభావం చూపిస్తాయా.. అన్నది ఇక్కడ తలెత్తే ప్రశ్న. ఆరెస్సెస్ అనుబంధసంస్థలు మోహన్ భగవత్ మాటలు వింటున్నాయా?
సంఘ్ అధ్యక్షుని మాట అందరూ అంగీకరించి తీరాల్సిన ఫత్వా కాదని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ త్రివేది అభిప్రాయపడ్డారు.
''దేశంలో ఆరెస్సెస్ వలంటీర్లు దాదాపు కోటిమంది ఉంటారు. హిందువుల సంఖ్య 80 కోట్లు. ప్రతి హిందువుకు ఆరెస్సెస్‌తో అనుబంధం ఉంటుందని మనం అనుకుంటాం. కానీ నిజానికి కాదు. అందుకే మోహన్ భగవత్ మాటల ప్రభావం క్షేత్రస్థాయిలో కనిపించాల్సిన అవసరం లేదు'' అని త్రివేది విశ్లేషించారు.
ఆరెస్సెస్, బీజేపీ కలిసి ఓ సైన్యాన్ని తయారుచేశాయని, వారి ఆలోచనలు మార్చడం అంత తేలికకాదని శరద్ గుప్తా విశ్లేషించారు.
''హిందుత్వ అనే గుర్రంపై ఎక్కడం, పరుగుతీయడం తేలిక. కానీ దాన్నుంచి దిగడం చాలా కష్టం. ఆరెస్సెస్, బీజేపీ కలిసి మొత్తం దేశాన్ని హిందుత్వ వేవ్‌లోకి నెట్టివేశాయి. ఇప్పుడు వారు దాన్నుంచి బయటపడడం కష్టం. ఎవరన్నా బయటపడడానికి ప్రయత్నిస్తే విమర్శలు, ట్రోలింగ్ వంటివి ఎదుర్కొంటున్నారు. మోహన్ భగవత్ కూడా దీనికి మినహాయింపు కాదు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ ఆరోపణలేంటి?
ఆరెస్సెస్ ప్రమాదకర పనితీరును మోహన్ భగవత్ ప్రకటన తెలియజేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. మోహన్ భగవత్ మాటలకు, చేతలకు మధ్య చాలా తేడా ఉందని విమర్శించారు.
''స్వాతంత్ర్యం వచ్చినప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆరెస్సెస్ పనితీరు చాలా ప్రమాదకరంగా ఉంది. వాళ్లు చెప్పేదానికి విరుద్ధమైన పనులు చేస్తున్నారు'' అని జైరామ్ రమేశ్ ఎక్స్‌లో రాశారు.
''మందిర్-మసీద్ అంశాన్ని లేవనెత్తి రాజకీయాలు చేయడం తప్పని మోహన్ భగవత్ భావిస్తే, అలాంటి నాయకులను సంఘ్ ఎందుకు పోషిస్తోందో ఆయన చెప్పాలి. మోహన్ భగవత్ ఆదేశాలను ఆరెస్సెస్, బీజేపీ పాటించడం లేదా'' అని జైరామ్ రమేశ్ ప్రశ్నించారు.
''తన మాటల విషయంలో నిజంగా భగవత్‌కు చిత్తశుద్ధి ఉంటే...సామాజిక సామరస్యానికి ప్రమాదకరంగా ప్రవర్తించే నాయకులకు భవిష్యత్తులో సంఘ్ ఎప్పుడూ మద్దతుగా ఉండబోదని బహిరంగంగా ప్రకటించాలి'' అని జైరామ్ రమేశ్ డిమాండ్ చేశారు.
''కానీ వాళ్లీమాటలు చెప్పరు. ఎందుకంటే మందిర్-మసీద్ వివాదం సంఘ్ ఆదేశం ప్రకారమే జరుగుతోంది. చాలా కేసుల్లో విభజనవాదాన్ని ప్రేరేపించేవాళ్లకి, అల్లర్లకు కారణమైనవారికి ఆరెస్సెస్‌తో సంబంధాలుంటాయి. వారంతా బజరంగ్‌దళ్, విశ్వహిందూ పరిషత్, లేదా బీజేపీకి చెందినవారు అయ్యుంటారు. లాయర్‌ను ఏర్పాటుచేయడం నుంచి, కేసు నమోదు దాకా వారికి సంఘ్ పూర్తిగా సహకరిస్తుంది'' అని జైరామ్ రమేశ్ విమర్శించారు.
''సమాజాన్ని పక్కదారి పట్టించడమే మోహన్ భగవత్ ప్రకటన ఏకైక ఉద్దేశం. అలాంటి ప్రకటనలు ఆరెస్సెస్ పాపాలను తుడిచిపెడతాయని, తన ఇమేజ్ పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు. కానీ ఆయన అసలు రూపమేంటో దేశప్రజలకు తెలుసు.'' అని జైరామ్ రమేశ్ ఎక్స్‌లో చేసిన పోస్టులో ఆరోపించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)