పొట్టేల్ సినిమా రివ్యూ: కూతురి చదువు కోసం తండ్రి చేసిన పోరాటం మెప్పించిందా?

    • రచయిత, శృంగవరపు రచన
    • హోదా, బీబీసీ కోసం

మంచి కంటెంట్‌తో వస్తున్న చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాంటి కంటెంట్‌తో కొత్త నటుడు యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా, అజయ్ కీలక పాత్రలో వచ్చిన సినిమాయే ‘పొట్టేల్’.

మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా? వారి అంచనాలను అందుకుందా?

కథ ఏంటి?

1980ల కాలంనాటి తెలంగాణ పరిస్థితుల ఆధారంగా ఓ గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని తీసిన సినిమా ఇది. పటేల్ వ్యవస్థ అధికారంలో ప్రజలు బానిసత్వంలో ఎన్ని బాధలు పడ్డారో చెప్పే ప్రయత్నమే ఈ సినిమా నేపథ్యం.

విదర్భ ప్రాంతంలో ఉన్న ఓ గ్రామంలో ఓ పటేల్ ఎవరిని చదువుకోనివ్వకుండా ఎలా చేశాడు? తన కూతురి చదువు కోసం పటేలును పెద్ద గంగాధరి ఎలా ఎదిరించాడు? ఆ ఊరి బాలమ్మ జాతరకు అర్పించాల్సిన పొట్టేల్‌కి, గంగాధరికి మధ్య సంబంధం ఏమిటి? అన్నదే కథ.

నటన ఎలా ఉంది?

పెద్ద గంగాధరి పాత్రలో యువ చంద్ర కృష్ణ బాగా నటించారు. కొత్త నటుడు అయినప్పటికీ పాత్రకు న్యాయం చేశారు.

తన పాత్ర పరిధి మేరకు అనన్య నాగళ్ల బాగానే నటించారు. ఆ పాత్రను ఇంకాస్త డెవలప్ చేసి ఉంటే బాగుండేదనిపించింది.

తనస్వీ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రియాంక శర్మ, ఛత్రపతి శేఖర్ కీలక పాత్రల్లో నటించారు.

పటేల్ పాత్రలో అజయ్ చాలా బాగా నటించారు. దేవత పూనినప్పుడు కొంత స్త్రీగా కూడా ఆయన నటన బాగుంది. నోయల్ ఎమోషనల్ పాత్రలో మెప్పించారు.

సినిమా ఎలా ఉంది?

ఇలాంటి కథలతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులోనూ ఇది కొంత చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కూడా. కూతురి చదువు కోసం తండ్రి చేసే పోరాటం కథలో ముఖ్య అంశం.

అలాగే, మూఢ నమ్మకాలతో ఉండే ప్రజల్లో మార్పు వచ్చేలా చేయడం ఇంకో అంశం. దీనికి గ్రామీణ ఆచారాలు, గ్రామ దేవత, జాతర, కరువు, రోగాలు వంటి అనేక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఇంత మంచి కథను సినిమాగా మలచడంలో డైరక్షన్ పరంగా కొన్ని లోపాలు కనిపించాయి.

ఓపెనింగ్ నుంచి ఓ అరగంట ఫర్వాలేదనిపించినా, ఆ తర్వాత నుంచి ఊహించిన స్థాయిలో సాగదు సినిమా. చాలా చోట్ల లాజిక్ మిస్ అయ్యింది. ఈ సినిమా నరేటివ్ స్టైల్‌లో ఉంది. అంటే, ఈ కథ అంతా ప్రేక్షకులకు పెద్ద గంగాధరి (యువ చంద్ర కృష్ణ) చెబుతూ ఉంటాడు. ఆ చెప్పే క్రమంలో కొంత గందరగోళం ఉంది.

1980ల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేశారు. ఆ సమయంలో ప్రభుత్వ కార్యకలాపాలు చురుగ్గానే ఉన్నాయి. ఈ సినిమాలో ఆ ప్రభుత్వ పాత్ర నామమాత్రంగానే ఉంది. అసలు, ఈ నేపథ్యం బలంగా ఉంటే సినిమా ఇంకాస్తా బాగుండేది.

ఇక పోతే పటేలు అధికారం, ప్రజల బాధలు, వాళ్లు దాన్ని ఎదిరించడం వంటివి చాలా పెద్ద అంశాలు. వీటిని ఎంతో ఎమోషనల్‌గా కనెక్ట్ చేయవచ్చు. అయితే, ఆ ఎమోషనల్ డెప్త్ ఈ సినిమాలో లోపించింది.

టైటిల్‌లో చెప్పినట్టే ‘పొట్టేల్’ చుట్టూ తిరిగే సినిమా అయినా, అది కూడా సెకాండాఫ్ నుండి తేలిపోయింది. అలాగే, కూతురి చదువు కోసం తండ్రి చేసే ప్రయత్నాలు కొన్ని కన్విన్సింగ్ గానూ, లాజికల్ గానూ లేవు.

హీరో-హీరోయిన్ లవ్ స్టోరీ కూడా చాలా రొటీన్‌గా ఉంది. మొదటి అరగంట దాటిన తర్వాత ప్రేక్షకులను గొప్పగా ఆకట్టుకునే అంశాలు లేవు.

కులం-అంటరానితనం చుట్టూ కూడా నడిచే సినిమా ఇది. అసలు ఇన్ని అంశాలు సినిమాలో ఉన్నా, ఏదో డ్రామాలా నడుస్తుంది తప్ప, నాటి వాస్తవ పరిస్థితులను చిత్రించిన సినిమాగా అనిపించదు.

కథను స్క్రీన్‌ప్లే గా మార్చే విషయంలో చాలా గందరగోళం ఉన్న సినిమా ఇది. ఎన్నో సబ్ ఫ్లాట్స్ , కనెక్టింగ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. కానీ వాటిని ప్రేక్షకులకు అర్థమయ్యేలా సింపుల్‌గా మాత్రం చెప్పలేకపోయారు. అలాగే సెకాండాఫ్ నుంచి ప్రజలు ఎదిరించడం, పటేలును ఓడించడం చాలా డ్రమాటిక్‌గా ఉంది తప్ప సహజంగా లేదు.

మొత్తం మీద మంచి కథకు కన్విన్సింగ్‌గా చెప్పే స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల సినిమా నిరాశపరిచింది.

సాంకేతిక అంశాలు:

సినిమాటోగ్రఫీ అంత బాగలేదు. పాటలు ఒకట్రెండు పర్లేదనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సింది. కొన్నిచోట్ల చెవులు హోరెత్తిపోయాయి. ఎడిటింగ్ ఓ మోస్తరుగా ఉంది.

ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్ :

1)కథ

2)యువ చంద్ర కృష్ణ, అజయ్ నటన

మైనస్ పాయింట్స్ :

1) అనేక చోట్ల లాజికల్‌గా కన్విన్స్ చేయలేకపోయడం

2) కథ చెప్పడంలో గందరగోళం

3) పాత్రల చిత్రణ

4) సినిమాటోగ్రఫీ, మ్యూజిక్

మంచి కథతో, ప్రమోషన్స్‌తో అదరగొట్టిన ‘పొట్టేల్’ గందరగోళమైన స్క్రీన్ ప్లే, ఎమోషన్‌‌కు కనెక్ట్ అయ్యేలా కథ చెప్పలేకపోవడంతో నిరాశపరిచింది.

(గమనిక: ఈ రివ్యూలోని అభిప్రాయాలు సమీక్షకురాలి వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)