You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు జిల్లాలు.. పోలవరం నియోజకవర్గం లేకుండా ఆ పేరుతో జిల్లా ఏర్పాటు, ప్రభుత్వం ఏమంటోంది?
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న 26 జిల్లాలు కాకుండా.. కొత్తగా మరో మూడు జిల్లాలు రానున్నాయి.
అలాగే ప్రస్తుతం 77 రెవెన్యూ డివిజన్లు ఉండగా, కొత్తగా మరో 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పుడు 679 మండలాలు ఉండగా, కొత్తగా మరో మండలం ఏర్పడనుంది.
ఈ మేరకు జిల్లాల పునర్విభజనపై మంత్రుల కమిటీ సిఫార్సుకు మంగళవారం (నవంబర్ 25) సీఎం చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు.
ఈ ప్రతిపాదనలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదం పొందిన అనంతరం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 29 జిల్లాలు, 82 రెవెన్యూ డివిజన్లు, 680 మండలాలతో నూతన స్వరూపాన్ని సంతరించుకోనుంది.
మూడు కొత్త జిల్లాలు...
- మార్కాపురం
- మదనపల్లి
- పోలవరం
కొత్తగా ఏర్పడే ఐదు రెవెన్యూ డివిజన్లు..
- అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి
- ప్రకాశం జిల్లాలో అద్దంకి
- కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు
- నంద్యాల జిల్లాలో బనగానపల్లె
- శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర
కొత్తగా ఏర్పాటయ్యే మండలం
- పెద్దహరివనం
కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరివనం మండలాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదన
మూడు జిల్లాల భౌగోళిక స్వరూపం ఇలా
మదనపల్లి: కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో మదనపల్లి, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గాలు.. మదనపల్లి, పీలేరు రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. మొత్తం 11.05 లక్షల జనాభాతో 27వ కొత్త జిల్లాగా ఏర్పడనుంది.
మార్కాపురం : కొత్తగా ఏర్పాటయ్యే మార్కాపురం జిల్లాలో యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు.. మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. మొత్తం 11.42 లక్షల జనాభాతో ఈ జిల్లా ఏర్పాటు కానుంది.
పోలవరం: ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను కొత్తగా ఏర్పాటు చేయాలని ఉపసంఘం ప్రతిపాదించింది. కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో 3.49 లక్షల జనాభా ఉంది.
రెవెన్యూ డివిజన్లలో ప్రతిపాదిత మార్పుచేర్పుల్లో కొన్ని..
- శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్‌లోని నందిగాం మండలాన్ని టెక్కలి డివిజన్‌లో కలపాలని ప్రతిపాదన
- పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం పేరును వాసవీ పెనుగొండ మండలంగా మార్పు
- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని ప్రతిపాదన
- బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలని ప్రతిపాదన
- ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాన్ని కూడా ప్రకాశం జిల్లాలో విలీనం చేయాలని సూచన
ప్రస్తుతమున్న 17 జిల్లాల్లో మార్పులు
మంత్రుల కమిటీ సిఫార్సులతో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లతో ప్రస్తుతం ఉన్న 17 జిల్లాల్లో మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి.
మిగతా 9 జిల్లాలు విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో ఎటువంటి మార్పులు జరగలేదు.
కొత్తగా జిల్లాల పునర్విభజన ఎందుకంటే..
2014లో తెలంగాణ నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ.. 2022లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు 2022 జనవరి 26న 26 జిల్లాలతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 26 వరకు ప్రజాభిప్రాయం తీసుకుంది.
ఆ తర్వాత ఉగాది నాడు కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది.
అప్పట్లో రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలను ఒక్కో జిల్లాగా మారుస్తూ.. ఆ 25 జిల్లాలతో పాటు కొత్తగా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాను ఏర్పాటు చేశారు.
అయితే, అప్పట్లో జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదంటూ నాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పించింది.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల పునర్విభజన చేస్తామని అప్పట్లో ప్రకటించింది.
2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల పునర్విభజనపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది.
తాజాగా ఆ సబ్ కమిటీ ప్రతిపాదనలకే చంద్రబాబు ఈనెల 25న ఆమోదం తెలిపారు.
పోలవరం నియోజకవర్గం లేకుండా పోలవరం జిల్లా
మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించిన పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గం లేకపోవడం కొంత చర్చనీయమైంది.
రంపచోడవరం డివిజన్‌లోని 7 మండలాలు (రంపచోడవరం, దేవీపట్నం, వై.రామవరం, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి).. చింతూరు డివిజన్‌లోని 4 మండలాలు (యటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం)తో పోలవరం జిల్లాను ప్రతిపాదింది.
అయితే, ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా పోలవరం జిల్లాలో కలుపుతారన్న వాదనలకు భిన్నంగా ప్రతిపాదనలు రావడంతో చర్చకు తెరలేచింది.
అలాగే, అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి రాజంపేటకు.. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రాన్ని భీమవరం నుంచి నరసాపురానికి, కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరంను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చాలన్న వాదనలు వినిపించినా మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనల్లో వాటి ప్రస్తావన ఎక్కడా లేదు.
'పోలవరంపై ఆలోచన తప్ప.. ఇక వేరే మార్పులేమీ ఉండవు'
ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న పోలవరం అసెంబ్లీ సెగ్మెంట్‌ను కొత్తగా ప్రతిపాదించిన పోలవరం జిల్లాలో పెట్టాలన్న ఒక్క దానిపైనే మరోసారి ఆలోచన చేస్తామని క్యాబినెట్ సబ్ కమిటీలోని సభ్యుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ బీబీసీకి తెలిపారు.
''వాస్తవానికి ఆ ఆలోచన వచ్చింది. ఏలూరు జిల్లాలో నుంచి పోలవరం తీసివేస్తే.. ఆ జిల్లా మరీ చిన్నదై పోతుంది. పరిపాలనా సౌలభ్యం, ముంపు ప్రాంతాల రక్షణ.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే పోలవరం నియోజకవర్గాన్ని యథాతథంగా ఉంచాలని భావించాం. అయితే, ప్రజల నుంచి వచ్చే వాదనలు పరిశీలించి మరోసారి ఆ ఒక్క దానిపైనే ఆలోచన చేస్తాం'' అని మనోహర్ అన్నారు.
ఇక మిగిలిన ప్రతిపాదనల్లో దాదాపుగా ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు.
కొత్తగా జిల్లాల పునర్విభజన, రెవెన్యూ డివిజన్‌లో మార్పులపై ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని, ప్రజల అభిప్రాయాల మేరకే తాము స్పందిస్తామని వైసీపీకి చెందిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు ఒకరు బీబీసీతో అన్నారు.
కాగా పోలవరానికి సంబంధించి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బాలరాజు స్పందించారు.
"పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గం లేకపోవడం ఏమిటి? ఇలాంటి చోద్యం ఎక్కడైనా ఉంటుందా..? ఇది అమాయక గిరిజనులను మోసం చేయడమే. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఇక్కడ తిరుగుతూ పోలవరం రంపచోడవరం కలిపి ఓ జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు కానీ, ఇప్పుడు ఇలా చేయడం ఇక్కడ గిరిజనులకు అన్యాయం చేయడమే. పోలవరం నియోజకవర్గాన్ని పోలవరం జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నాం" అని వైసీపీ నేత, పోలవరం మాజీ ఎమ్మెల్యే బాలరాజు అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)