You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పద్మనాభ యుద్ధం: ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికుల తూటాలకు రెండో విజయరామ గజపతిరాజు ఎలా బలయ్యారు?
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
1794 జులై 9..
విజయనగరం జమీందారీ పరిధిలో ఉన్న భీమిలి సమీపంలోని పద్మనాభం అనే చిన్న గ్రామానికి విజయనగరం జమీందారు రెండో విజయరామగజపతిరాజు వచ్చి.. అక్కడి పద్మనాభస్వామి గుడి ప్రాంగణంలో తన సైన్యంతో మాట్లాడుతూ...
"మనసాక్షితో ఈ యుద్ధంలో నిలబడగలిగినవాళ్లు మాత్రమే నా వెంట రండి. మిగతావాళ్లు వెళ్లిపోండి" అన్నారు. దాంతో ఆయనకు తోడుగా దాదాపు 390 మంది సైన్యం, కొందరు సామంతరాజులు, కొండరాజులు మాత్రమే నిలబడ్డారు.
1794 జులై 10
పద్మనాభం గ్రామంలో ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ తుపాకుల శబ్దాలతో తెల్లారింది.
ఆ యుద్ధంలో కేవలం రెండు గంటల్లోనే బ్రిటిష్ సైన్యం గెలుపొందింది.
ఇది చరిత్రలో 'పద్మనాభ యుద్ధం'గా నిలిచిపోయింది.
ఇది దేశంలోనే బ్రిటిష్ వారిపై జరిగిన తొలి దాడిగా ఆంధ్రా విశ్వవిద్యాలయం హిస్టరీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ చెప్పారు.
ఈ యుద్ధానికి సంబంధించిన పూర్తి చరిత్రను అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాలలో హిస్టరీ లెక్చరర్‌గా పనిచేసిన తల్లాప్రగడ సత్యనారాయణమూర్తి రాసిన 'పద్మనాభ యుద్ధ చరిత్ర' పుస్తకంలో పొందుపరిచారు. దీనిని తెలుగు అకాడమీ ముద్రించింది.
ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాబల్య విస్తరణకు..
ఈస్ట్ ఇండియా కంపెనీ తన స్రామాజ్యాన్ని విస్తరించే పనిలో భాగంగా, అప్పటి కళింగాంధ్రపై బ్రిటిష్ వారి దృష్టి పడింది. అక్కడ పాగా వేయాలంటే బలంగా ఉన్న కొండరాజులు (గిరిజన ప్రాంత రాజులు), జమీందార్లను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించారు. అయితే కొండ ప్రాంతాల్లో రాజులు బలంగా ఉండటం, వారితో మాట్లాడేందుకు భాష సమస్యగా మారడం, అక్కడ కఠినమైన భౌగోళిక పరిస్థితులు, తరచూ వచ్చే వ్యాధుల నేపథ్యంలో కొండ రాజుల కంటే ముందు జమీందార్లను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూశారు. అలా విజయనగరం జమీందారీపై దృష్టి పెట్టారు.
1760లో విజయనగరం పాలకుడు ఆనంద గజపతిరాజు మరణించారు. ఆయన తర్వాత రెండో విజయరామరాజు జమీందారు అయ్యారు. అయితే, ఆయన అప్పటికి బాలుడు కావడంతో, పెద్ద అయి పాలనాపగ్గాలు చేపట్టేవరకూ కొందరు దివానులే పాలనావ్యవహారాలు చూసేవారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ మైదాన ప్రాంతాల్లోని జమీందార్లను తమదారిలోకి తెచ్చుకునేందుకు అప్పటికే చెల్లిస్తున్న పన్నులపై 'పేస్కాస్' విధించాలని నిర్ణయించింది. పేస్కాస్ అంటే అధిక పన్నులు అని అర్థం.
ఈస్ట్ ఇండియా కంపెనీ విజయనగరం రాజులపై వసూలు చేసిన అదనపు పన్నులను పేస్కాస్ అని చరిత్రలో రికార్డుచేశారని చరిత్రకారులు బి.మహదేవ శాస్త్రి చెప్పారు.
ఉత్తరాంధ్రలో కలెక్టరు వ్యవస్థకు బీజం...
‘‘జమీందారీలు తమ సైన్యాన్ని తగ్గించుకోవాలని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదేశాలు జారీ చేసింది. దీన్ని విజయనగరం రాజు రెండో విజయరామగజపతిరాజు వ్యతిరేకించారు. దీంతో ఆయన చెల్లించవలసిన పన్నులు పెంచడమే గాక, మరోవైపు సైనిక బలాన్ని తగ్గించమని బ్రిటిష్ వారు హెచ్చరించారు.
అంతేకాదు, గతంలో బకాయిపడిన దాదాపు రూ.6,75,000 పేస్కాస్ వెంటనే చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు.
కొత్తగా పెంచిన పన్నులు చెల్లించనని, తాను ఎటువంటి పేస్కాస్ బకాయిలేనని బ్రిటిషర్లకు పత్రాలతో సహా రెండో విజయరామరాజు రుజువు చేశారు. ఇది సహించలేని బ్రిటిష్ వారు కర్నల్ ప్రెండర్గస్ట్ నాయకత్వంలో 1793 ఆగస్టు 3న విజయనగరం జమీందారీని ఆక్రమించారు.
తదుపరి విజయనగర జమీందారీ ప్రాంతాల పాలనను కొందరు అధికారులకు అప్పగించాలని 1793 అక్టోబరు 30న విశాఖపట్టణం పాలన చూస్తున్న బ్రిటిష్ చీఫ్‌కు ఆదేశాలు అందాయి’’ అని ఏయూ హిస్టరీ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ బీబీసీతో చెప్పారు.
ఆ ప్రకారం భూమిశిస్తు, తదితర పన్నుల వసూలు చేసేందుకు సంస్థాన ప్రాంతాన్ని మూడు భాగాలుగా విభజించారు. వాటి బాధ్యతను ముగ్గురు అధికారులకు అప్పగించారు. వీరినే 'కలెక్టర్లు' అని పిలిచేవారని కొల్లూరి సూర్యనారాయణ వివరించారు.
అధిక పన్నులు వేసి ఆధిపత్యం
'పద్మనాభ యుద్ధ చరిత్ర' పుస్తకంలో వివరాల ప్రకారం... 1793 ఆగస్టు 9 నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్కల ప్రకారం రెండో విజయరామగజపతిరాజు రూ.6,73,353 పేస్కాస్ చెల్లించాల్సి ఉంది. 1794 ఫిబ్రవరి 16వ తేదీ నాటికి కలెక్టర్లు రూ.6,60,000 వసూలు చేయగలిగారు. దీనితో కంపెనీ బాకీ ఇంచుమించు తీరినట్లే. దీంతో, సంస్థానాన్ని తిరిగి తనకు స్వాధీనం చేస్తారని విజయరామగజపతి రాజు ఆశించారు. కాని కంపెనీ అలా చేయలేదు. అధిక పన్నులు విధిస్తూ, వాటిని కూడా మూడేళ్లు ముందుగానే చెల్లించాలని ఆదేశించింది.
దీంతో విజయరామగజపతి రాజు...మార్చి 28వ తేదీన విశాఖపట్టణం చీఫ్‌కు లేఖ రాశారు. కంపెనీ వారు మహారాజుకి చెల్లించవలసిన రేవు, వాణిజ్య, రవాణా సుంకాల మొత్తం పోగా మిగిలిన బకాయిని తాము చెల్లిస్తామని, అదేవిధంగా 1794-95 సంవత్సరానికి గానూ చెల్లించవలసిన రూ.9 లక్షల పేస్కాలను 4 దఫాలలో చెల్లిస్తామని కంపెనీ వారికి హామీ ఇచ్చారు.
దీనికి ఈస్ట్ ఇండియా కంపెనీ నిరాకరించింది. 1794, ఏప్రిల్ 25న సాధ్యమైనంత త్వరగా దక్షిణాదికి తరలిపోవడానికి ఒక తేదీ నిర్ణయించుకోవాలని బ్రిటిష్ వారు విజయరామగజపతిరాజుకి లేఖ రాశారు. దీనికి ప్రతిస్పందనగా, ఆయన మే 1వ తేదీన తనకు నెలకు రూ.30 వేల భరణం, అలాగే కంపెనీ తనకు ధన సహాయం చేస్తే...సిబ్బంది జీతభత్యాలు చెల్లించి తాను మద్రాసుకు తరలిపోతానని ఆ లేఖలో పేర్కొన్నారు.
తాము సహాయం చేయలేమని, వెంటనే విజయరామగజపతిరాజు మచిలీపట్నం లేదా మద్రాసు తరలివెళ్లిపోవాలని కంపెనీ ఆదేశించింది. అయితే దీన్ని ఆయన పట్టించుకోలేదు.
'పద్మనాభం' ఎందుకు వెళ్లారంటే...
వివాదం ముదురుతుండడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ చీఫ్‌తో చర్చించేందుకు విజయరామగజపతిరాజు విశాఖపట్నం బయలుదేరారు. కానీ విజయనగర సంస్థాన సిబ్బంది ఆయన సంస్థాన ప్రాంతాన్ని వదలివెళ్లడానికి అంగీకరించలేదు.
కంపెనీ నిర్ణయంలో ఏదైనా మార్పు వస్తుందని. అలా కానిపక్షంలో సైనిక చర్యకు పాల్పడితే అందులో ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడాలని విజయరామగజపతిరాజు నిర్ణయించుకున్నారు. అలా ఆయన 1794, మే 10న పద్మనాభం ప్రయాణమయ్యారు.
పద్మనాభం భీమునిపట్టణాని(భీమిలి)కి 10 మైళ్ల దూరంలోనున్న చిన్న గ్రామం. అక్కడున్న కొండపై పద్మనాభస్వామి ఆలయం ఉంది. ఈ ప్రభావంతోనే ఆ గ్రామానికి పద్మనాభం అనే పేరు వచ్చింది. కళింగాంధ్రలో సింహాచలం, పద్మనాభస్వామి ఆలయం వంటివి విజయనగరం జమీందార్ల పోషణలోనే ఉండేవి.
ఒకవేళ, తనకు మరణం ఆసన్నమైతే పద్మనాభస్వామి సమక్షంలోనే అది జరగాలని విజయరామరాజు భావించారు. అలాగే సమపంలోనే అత్తవారి గ్రామమైన అన్నంరాజుపేట ఉండటంతో పాటు సమీప గ్రామాల్లో విజయనగరం రాజు బంధువర్గం, అనుచరులు ఉండటంతో తమకు అవసరమైన సరకులు, ఆయుధాల సరఫరాకు ఆటంకం ఉండదనుకున్నారు. అంతేకాదు, కంపెనీ వారు తనను మచిలీపట్నం లేదా మద్రాస్ వెళ్లాలని పట్టుబట్టకపోతే పద్మనాభంలోనే చిన్నకోట నిర్మించుకొని, అక్కడే తన శేషజీవితం గడపాలని విజయరామరాజు అనుకున్నారు.
పద్మనాభంలోనే సైన్యం మోహరింపు...
విజయరామ గజపతిరాజు పద్మనాభంలోనే ఉండటంతో విజయనగరం, శృంగవరపుకోట, మన్యం, విశాఖపట్టణం, అనకాపల్లి, కశింకోట నుంచి సైన్యం అక్కడికే చేరుకుంది. వారంతా కలిపి 4000 మంది ఉంటారని అని అంచనా.
మరోవైపు చీఫ్‌ను కలిసేందుకు వెళ్లని విజయరామగజపతిరాజుపై ఆగ్రహించిన బ్రిటిష్ వారు కూడా పద్మనాభానికి సైన్యాలను తరలించాలని జూన్ 24న నిర్ణయించారు. జులై 5వ తేదీన విశాఖపట్టణం చీఫ్ విజయరామగజపతిరాజుకి రాసిన లేఖలో... మద్రాస్ గవర్నరు ఉత్తర్వులను అమలుజరిపే నిమిత్తం కర్నల్ ప్రెండర్గస్ట్ పద్మనాభానికి వస్తున్నారని తెలియజేశారు.
కర్నల్ ప్రెండర్గస్ట్ నాయకత్వాన ఐదు పటాలాలు భీమిలిలో మకాం వేశాయి. మద్రాస్ నుంచి శతఘ్నులు, తుపాకులు, మందుగుండు సామగ్రి బ్రిటిష్ సైన్యానికి సరఫరా అయ్యాయి.
జులై 8న పద్మనాభానికి చేరిన ప్రెండర్గస్ట్... విజయరామరాజును వెంటనే మద్రాసు లేదా మచిలీపట్నం వెళ్లాలని, లేదంటే ఆయనతో పాటు సిబ్బందిపై దాడి చేయవలసి వస్తుందని హెచ్చరించారు.
దానికి జవాబుగా విజయరామరాజు, "నేను కంపెనీ వారి ఆర్థిక సహాయాన్ని అర్థిస్తున్నాను. వారు నాకు వ్యతిరేకంగా సైన్యాలను పంపి నా ప్రాణాలను, గౌరవాన్ని హరిస్తామంటే నేనేం చేయగలను? నా ప్రాణాలను, నా కుటుంబీకుల ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను" అని రాశాడు. ఇదే ఆయన కంపెనీ అధికారులకు రాసిన ఆఖరి లేఖ. అయితే కంపెనీ నుంచి సానుకూల స్పందన రాలేదు.
'పద్మనాభ యుద్ధం' ఎలా జరిగిందంటే...
యుద్ధం అనివార్యమని అర్థమైన తర్వాత విజయరామరాజు తన భార్య సీతయ్యమ్మను, కుమారుడు నారాయణబాబును కాకర్లపూడి బాపిరాజును తోడిచ్చి కాశీపురం పంపారు.
విజయనగరం సైన్యాలు బోని, చిప్పాడ గ్రామాల మధ్య మోహరించాయి. కంపెనీ సైన్యాలు తమ శతఘ్నులను కాల్పులకు అనువుగా ఉండే బోని గ్రామం మెట్టపై ఉంచాయి. విజయరామగజపతి రాజుకు కంపెనీ ఇచ్చిన సమయం జూలై 9వ తేదీ రాత్రితో ముగిసింది.
విజయరామరాజు తన సైన్యంతో కొండపైనున్న అనంత పద్మనాభస్వామి ఆలయ ప్రాంగణంలోనే చర్చలు జరిపి, యుద్ధానికి సిద్ధమయ్యారు.
1794, జులై 10న తెల్లవారుజామున కంపెనీ సైన్యాలు విజయనగరం సైన్యాలపై దాడి చేశాయి. విజయనగరం సైన్యాలు గాఢ నిద్రలో, ఏమరపాటులో ఉంటాయని కర్నల్ ప్రెండర్గస్ట్ తెల్లవారుజామునే దాడి ప్రారంభించారు.
అదే సమయంలో విజయనగరం సైనిక నాయకులలో ఒకరైన దావూద్ విజయరామగజపతి రాజు ఎక్కడున్నారో తెలియజేయడానికి గాలిలో తుపాకి పేల్చి యుద్ధభూమి నుంచి పరారయ్యారు.
దీంతో రాజు, ఆయన సైన్యం లక్ష్యంగా కంపెనీ సైన్యం కాల్పులు ప్రారంభించింది. తుటాలకు విజయరామగజపతిరాజు, సైనికులు బలి అయ్యారు. ఆ యుద్ధంలో 13 మంది బ్రిటిష్ సైనికులు కూడా మరణించారు.
''ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఒక స్వదేశీ సంస్థానాధిపతి జరిపిన బహిరంగ యుద్ధం ఇది ఒక్కటే. కనుక, ఈ యుద్ధంలో అసువులు అర్పించిన పూసపాటి రెండో విజయరామ గజపతిరాజుకి, ఆయన అనుచరులకు, సైనికులకు భారత స్వాతంత్ర్య పోరాటంలో సముచిత స్థానం లభించింది" అని పద్మనాభ యుద్ధ చరిత్ర పుస్తకంలో పేర్కొన్నారు.
యుద్ధం తర్వాత ఏమైంది...
విజయరామరాజు కుమారుడు నారాయణబాబుకు కొండ దొరలు రక్షణ కల్పించారు. మక్కువ అనే ప్రాంతంలో అతనికి ఆశ్రయం కల్పించారు. 1796లో నారాయణబాబు బ్రిటిష్ వారితో రూ.5 లక్షల పెస్కాలను చెల్లించేందుకు అంగీకరించి రాజీ చేసుకున్నారు.
ఏ పేస్కాల కోసం పద్మనాభ యుద్ధం జరిగిందో, వాటినే యుద్ధం అనంతరం కూడా బ్రిటిష్ వారు కొనసాగించి తమ అధిపత్యాన్ని చాటగలిగారని రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ బీబీసీతో అన్నారు.
విజయరామగజపతి రాజు స్మారకస్థూపాన్ని పద్మనాభం గ్రామంలో నిర్మించారు.
ఇది చరిత్రకారులు విస్మరించిన ఒక యుద్ధమని, భారతదేశంలో బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా జరిగిన తొలి దాడి ఇదేనని కొల్లూరు సూర్యనారాయణ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)