You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇందిరా గాంధీని ఓడించిన 46 ఏళ్ల నాటి ఆ ప్రయోగం, ఇప్పుడు మోదీని ఓడించగలదా?
- రచయిత, మయూరేష్ కొన్నూరు
- హోదా, బీబీసీ మరాఠీ ప్రతినిధి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనకు వ్యతిరేకంగా దేశంలోని 28 ప్రతిపక్ష పార్టీలు ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ (ఇండియా) పేరుతో ఏకమయ్యాయి. అయితే ఈ ప్రతిపక్షాల కూటమి బీజేపీని ఎదుర్కోగలదా?
రాజకీయ వైఖరి, సిద్ధాంతాలలో భిన్నాభిప్రాయాలున్న పార్టీల కూటమి బీజేపీ జాతీయవాద రాజకీయాలకు వ్యతిరేకంగా చివరి వరకూ కలిసి నిలబడగలదా?
ఇండియా కూటమి ఒక వినూత్న, ముఖ్యమైన రాజకీయ ప్రయోగంగా భావిస్తున్నప్పటికీ భారత్‌లో అలాంటి ప్రయోగం ఇదే మొదటిది కాదు. గతంలో జరిగిన ఇలాంటి ప్రయోగం అనూహ్యమైన ఫలితాలను తెచ్చిపెట్టింది.
1977లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా జనతా పక్ష పేరుతో ఇలాంటి ప్రయోగమే జరిగింది.
ఇప్పుడు నరేంద్ర మోదీ తరహాలోనే అప్పట్లో ఇందిరా గాంధీ ఏకఛత్రాధిపత్యం వహించారు. ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ తిరుగులేని నేతగా ఆధిపత్యం చెలాయించారు. ఆ ఆధిపత్యమే చివరికి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటనకు దారితీసింది.
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛ కోసం అంత పెద్ద స్థాయిలో ఆందోళన ఎప్పుడూ జరగలేదు. దీంతో గతంలో ఎప్పుడూ లేని రాజకీయ పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్షాల కొత్త ప్రయోగం, ఎమర్జెన్సీ ప్రభావం నుంచి బయటపడేందుకు ఇందిరా గాంధీ కొత్త పరిష్కార మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది.
అలాంటి రాజకీయ అవసరం నుంచి 'జనతా ప్రయోగం' పుట్టుకొచ్చింది. విజయం కూడా సాధించింది. ఈ ప్రయోగం స్వాతంత్ర్యం వచ్చిన 30 ఏళ్ల తర్వాత దేశానికి మొదటి కాంగ్రెసేతర ప్రధానిని అందించింది.
1977 జనతా పక్ష ప్రయోగం తరహాలో ఇప్పుడు కూడా కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమి ప్రయోగం మరోసారి తెరపైకి వచ్చింది.
ఇండియా తరహాలో గతంలో జరిగిన జనతా పక్ష కూటమి తొలి సమావేశం పట్నాలో జరిగింది. ఈ సమావేశంలోనే కూటమిలో కీలకపాత్ర పోషించిన జయప్రకాష్ నారాయణ్ దేశ నవనిర్మాణ నినాదమిచ్చారు.
అయితే, ఇండియాలో భాగస్వామ్య పార్టీల గత చరిత్ర, ఒకరిపై మరొకరు పోటీ చేసుకున్న తీరు, రాజకీయ వైరుధ్యాలను ప్రస్తావిస్తూ అది కూడా జనతా ప్రభుత్వం తరహాలోనే ఉంటుందని బీజేపీ ఎద్దేవా చేస్తోంది.
అప్పట్లో జనసంఘ్, సోషలిస్టులు, కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన వారు, ఇతర రాజకీయ ప్రత్యర్థులంతా ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఏకమయ్యారు. అందరి లక్ష్యం ఒక్కటే కావడంతో వారి భావజాలం అందుకు అడ్డుకాలేదు. ఇప్పుడు ఇండియా కూటమి కూడా అదే దారిలో పయనిస్తోంది.
అయితే, చరిత్ర పునరావృతం అవుతుందని కచ్చితంగా చెప్పలేం. కానీ, గతంలో జరిగిన ప్రయోగాన్నే ఇప్పుడు కూడా అనుసరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
అప్పటి ప్రయోగం ప్రస్తుత ప్రతిపక్షాల కూటమికి కారణమైంది. ఇది దేశ రాజకీయాల్లో చెప్పుకోదగ్గ పరిణామమే అయినప్పటికీ, 1977లో జనతా పక్ష కూటమికి కారణమేంటన్న విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ప్రతిపక్షాల కూటమికి కారణం ఎమర్జెన్సీ.
బంగ్లాదేశ్ యుద్ధం నుంచి ఎమర్జెన్సీ వరకు..
ఇందిరా గాంధీకి వృద్ధాప్యం వచ్చిందంటూ 'గుంగి గుడియా' అని పిలిచినా, ఆ తర్వాత కొన్నేళ్లలోనే ఆమె తీసుకున్న నిర్ణయాత్మక చర్యల కారణంగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఆమెను దుర్గామాతతో పోల్చడం చరిత్రలో నిలిచిపోయాయి.
లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ఇందిరా గాంధీ 1964 నుంచి 1975 వరకూ తిరుగులేని ఆధిపత్యం కొనసాగించారు. ఆ ఆధిపత్యం కారణంగా ఏర్పడిన రాజకీయ పరిస్థితులతో జనతా పక్ష పుట్టుక అనివార్యమైంది.
రష్యాలోని తాష్కెంట్‌లో లాల్‌బహదూర్ శాస్త్రి ఆకస్మిక మరణం తర్వాత ఇందిరా గాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. అప్పటికే కాంగ్రెస్‌లో బలమైన నేతలు ఉండడంతో అధికారంపై పట్టు సాధించేందుకు కొంత సమయం పట్టింది.
ఆ తర్వాత కాంగ్రెస్‌లో విభేదాలు ముదిరి పార్టీ కాంగ్రెస్(ఓ), కాంగ్రెస్ (ఆర్) అనే రెండు వర్గాలుగా చీలిపోయింది. ఆ తర్వాత క్రమంగా ఇందిర పార్టీపై పట్టు సాధించారు.
ఆ సమయంలో భారత్ పేదరికం, ఆహార కొరత, ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. మరోవైపు అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కూడా తీవ్రతరమైంది. ఈ విషయాల్లో ఆమె సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. రాత్రికి రాత్రే బ్యాంకులను జాతీయం చేశారు.
అప్పట్లో ఆహార ధాన్యాల కోసం అమెరికా, ఇతర దేశాలపై భారత్ ఆధారపడేది. ఇందిర హయాంలో మొదలైన హరిత విప్లవం (గ్రీన్ రివల్యూషన్) ప్రభావం ఆ తర్వాత కొన్నేళ్లలోనే కనిపించింది. 1967 ఎన్నికల తర్వాత, 1971 ఎన్నికల్లోనూ దేశ ఆర్థిక సమస్యలపైనే దృష్టి సారించి గరీబీ హఠావో నినాదంతో ముందుకెళ్లారు. మళ్లీ అధికారంలోకి వచ్చారు.
1971లో అస్సాం బెంగాల్ సరిహద్దులో తూర్పు పాకిస్తాన్ సమస్య రాజుకోవడం మొదలైంది. అక్కడి నిర్వాసితుల సమస్య అంతర్జాతీయ సమస్యగా మారింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రిచర్డ్ నిక్సన్, హెన్రీ కిస్సింజర్‌ల పాకిస్తాన్ అనుకూల విదేశీ విధానం ఇందిరా గాంధీపై ఒత్తిడిని పెంచింది.
కానీ, 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌ను ఓడించి అమెరికాను దెబ్బ కొట్టారు. ఆ యుద్ధం బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది. దీంతో దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగానూ ఇందిర పేరు మార్మోగిపోయింది.
అయితే మరోవైపు దేశీయ ఆర్థిక, సామాజిక సమస్యలు తలెత్తాయి. దీంతో దేశమంతటా అసహనం పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో దేశ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలకు ఇందిరా గాంధీనే కేంద్రబిందువుగా ఉన్నారు.
కుట్రగా భావించిన ఇందిరా
కాంగ్రెస్ నేత ఒకరు 'ఇందిరా ఈజ్ ఇండియా' అనడం అప్పటి దేశ పరిస్థితికి నిరద్శనంగా నిలుస్తుంది. ఈ పరిస్థితితో ఇందిరా గాంధీపై విమర్శలు పెరిగాయి. అదే సమయంలో ఆమె కుమారుడు సంజయ్ గాంధీ ప్రభావం కూడా పెరగడం మొదలైంది.
ఈ నేపథ్యంలో సీనియర్ నేత, గాంధేయవాది జయప్రకాష్ నారాయణ్ సారథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది.
మహాత్మా గాంధీకి ఇష్టుడు, జవహర్‌లాల్ నెహ్రూ స్నేహితుడు, ఇందిరా గాంధీని చిన్నప్పటి నుంచి చూస్తున్న జయప్రకాష్ నారాయణ్ అప్పటికి రాజకీయాల్లో చురుగ్గా లేరు. కానీ, యువత కోసం ఆయన మళ్లీ రంగంలోకి దిగారు.
నవనిర్మాణ ఆందోళనలకు సిద్ధం కావాలని బిహార్ యువతకు ఆయన పిలుపునిచ్చారు. అది క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించింది. అలా వచ్చిన విద్యార్థుల ఆందోళన ఫలితంగా గుజరాత్‌లో చిమన్‌భాయ్ పటేల్ ప్రభుత్వం కూలిపోవాల్సి వచ్చింది.
విద్యార్థులు, రైతుల ఆందోళనలతో రాజకీయ పరిస్థితులు కూడా మరింత దిగజారాయి. ఇందిర ప్రభుత్వంపై జయప్రకాష్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత సంపూర్ణ ఉద్యమానికి ఆయన పిలుపునిచ్చారు. దీన్ని తనపై జరుగుతున్న కుట్రగా, దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశంగా ఇందిర భావించారు. అయితే, ఆ ఉద్యమం రోజురోజుకూ బలపడింది.
అందులో భాగంగా, 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ అవకతవకలు చేసి రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి గెలుపొందారని సమాజ్‌వాదీ పార్టీ నేత రాజ్‌నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 1975 జూన్ 12న ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చింది.
ఆమెపై అనర్హత వేటుతో పాటు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. దీంతో ఈ అనైతిక ప్రభుత్వ ఆదేశాలను పాటించొద్దని తన సమావేశాల్లో పోలీసులకు, సైన్యానికి జయప్రకాష్ నారాయణ్ విజ్ఞప్తి చేశారు.
ఈ పరిణామాలతో తీవ్ర అసహనానికి గురైన ఇందిరా గాంధీ 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఎప్పుడూ నియంతృత్వం కొనసాగలేదు. కానీ, ప్రజాస్వామ్యంలో వ్యక్తికి ఇచ్చిన హక్కులు హరించుకుపోయాయి. ప్రత్యర్థులను జైళ్లకు పంపించారు.
అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో జనతా పార్టీ ప్రయోగంగా అభివర్ణించే ప్రతిపక్షాల కూటమి ద్వారా తొలి రాజకీయ ప్రయోగం జరిగింది. భారత రాజకీయాల్లో ఇలా జరగడం అదే తొలిసారి.
ఇందిరా గాంధీ ఓటమి
దేశంలో జరిగిన మొదటి ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీదే అధికారం. అన్ని రాష్ట్రాల్లోనూ బలంగా ఉన్న ఏకైక జాతీయ పార్టీ కూడా అదే. పలు రాష్ట్రాల్లో హిందూ మహాసభ, జన సంఘ్, వామపక్షాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ అంత బలంగా లేవు.
అప్పటి వరకూ కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా బలమైన పార్టీ గానీ, ప్రతిపక్ష కూటమి కానీ నిలబడలేదు. ఇప్పుడు ఆ పార్టీలు ఏకమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రత్యర్థులు ఒక్కటి కావడంతో పాటు జయప్రకాష్ నారాయణ్ ఉద్యమం కూడా ఉధృతమైంది. 1974లో జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ కలయికతో జనతా మోర్చా ఏర్పాటైంది. అదే జనతా పార్టీకి మూలం.
భారతీయ జన సంఘ్, సమాజ్‌వాదీ పార్టీ, భారతీయ లోక్‌దళ్ వంటి ఇతర పార్టీలు కూడా అందులో భాగమయ్యాయి. అప్పటి నుంచి రాజకీయ పరిస్థితులు ఎలా మారాయో అర్థం చేసుకోవచ్చు.
1975లో జనతా మోర్చా సంయుక్తం తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసింది. గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఈ ఎన్నికల్లో విజయం కూడా సాధించింది. కానీ, ఆ మరుసటి రోజే అలహాబాద్ కోర్టు ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. ఆ తర్వాత జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటన వచ్చింది.
జయప్రకాష్ నారాయణ్‌తో సహా కీలక ప్రతిపక్ష నేతలందరినీ జైళ్లలో పెట్టారు. అటవ్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అడ్వాణీ, చంద్రశేఖర్ వంటి నేతలందరినీ అరెస్టు చేశారు.
1977 జనవరిలో ఇందిరా గాంధీ ఎన్నికల ప్రకటన చేశారు. ఎమర్జెన్సీతో ప్రతిపక్ష నేతలందరూ జైళ్లలోనే ఎక్కువ కాలం గడపడంతో విపక్షాల కూటమి విచ్ఛిన్నమై ఉంటుందని ఆమె భావించారు.
కానీ, అందుకు విరుద్ధంగా జరిగింది. ఎన్నికల ప్రకటన వచ్చిన ఐదు రోజుల్లో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి జనతా పక్షను ఏర్పాటు చేశాయి. జయప్రకాష్ నారాయణ్ ఇందులో కీలకంగా వ్యవహరించారు.
అయితే, '' ప్రతిపక్షాలు వేగంగా కూటమిగా ఏర్పడినప్పటికీ ప్రధాన మంత్రిని ఎలా నిర్ణయిస్తారనే సంశయం నెలకొంది. ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీతో పాటు నిఘా వర్గాల్లోనూ ఇదే అనుమానం నెలకొంది'' అని సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ నీరజా చౌదరి రాసిన తన పుస్తకంలో రాశారు.
''ప్రతిపక్షాలు అంత తక్కువ సమయంలో ఏకతాటిపైకి వస్తాయని ఇందిరా గాంధీతో పాటు నిఘా వర్గాలు కూడా అంచనా వేయలేకపోయాయి. ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత కేవలం ఐదురోజుల్లోనే ఇలా జరుగుతుందని ఊహించలేదు. కానీ, ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసియి ఒకే పార్టీగా అవతరించింది.
నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ (ఓ), భారతీయ లోక్ దళ్, భారతీయ జన సంఘ్, సమాజ్‌వాదీ పార్టీ, చంద్రశేఖర్ నేతృత్వంలోని యంగ్ టర్క్స్ 1977 జనవరి 23న దిల్లీలోని మొరార్జీ దేశాయ్ నివాసంలో సమావేశమై కొత్త పార్టీని ప్రకటించాయి. అక్కడ సమావేశమైన వారిలో చాలా మంది నేతలు గత 19 నెలలుగా జైల్లో కలిసే ఉన్నారు. అప్పుడే వారి మధ్య మైత్రి సంబంధాలు కుదిరినట్లు ఇందిరా గాంధీ అంచనా వేయలేకపోయారు'' అని ఆమె రాశారు.
జయప్రకాష్ నారాయణ్ పర్యవేక్షణలో అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి జనతా పక్ష ఏర్పాటైంది. చరణ్ సింగ్ సారథ్యంలోని భారతీయ లోక్‌దళ్, వాజ్‌పేయి, అడ్వాణీ నేతృత్వంలోని జనసంఘ్, సమాజ్‌వాదీ పార్టీ, స్వతంత్ర పార్టీ, భారతీయ క్రాంతి దళ్ వంటి ప్రతిపక్ష పార్టీలు తమ సిద్ధాంతాలు వేరైనప్పటికీ, గతంలో ఒకరిపై మరొకరు పోటీ చేసుకున్నప్పటికీ ఇందిరా గాంధీకి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఒక్కటయ్యాయి.
జనతా పార్టీకి చంద్రశేఖర్ తొలి జాతీయ అధ్యక్షుడయ్యారు. రామకృష్ణ హెగ్డే కార్యదర్శిగా వ్యవహరించారు.
కొద్దిరోజుల తర్వాత ఇందిరా గాంధీ నుంచి విడిపోయి కాంగ్రెస్ ఫర్ డెమొక్రసీ పేరుతో సొంతకుంపటి పెట్టుకున్న బాబూ జగ్జీవన్ రాం కూడా ప్రతిపక్షంతో జతకలిశారు.
కాంగ్రెసేతర ప్రధానిగా మొరార్జీ దేశాయ్
జయప్రకాష్ నారాయణ్ స్వయంగా ఎన్నికల బరిలోకి దిగకపోయినా కూటమి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. ఆ తర్వాత రెండు నెలల పాటు దీనిపైనే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.
ఎమర్జెన్సీ సమయంలో ప్రజల కష్టాలు, ప్రజాస్వామ్యాన్ని పక్కనబెట్టి నియంతృత్వ విధానాలు అవలంబించడం, సంజయ్ గాంధీ వైఖరి, బలవంతపు కుటుంబ నియంత్రణ వంటి వివాదాస్పద కార్యక్రమాలు ఇందిరకు వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించాయి. ప్రతిపక్షాలన్నీ 'జనతా పక్ష' కింద ఏకమయ్యాయి.
మార్చిలో ఎన్నికలు జరిగాయి. ప్రతిపక్షాలన్నీ జనతా పక్ష కింద ఏకమైనప్పటికీ ఎన్నికల్లో మాత్రం భారతీయ లోక్ దళ్ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఒకవైపు ఇందిరా గాంధీ ఆమె కుమారుడు సంజయ్ గాంధీ. మరోవైపు జనతా పార్టీ, ఇతర నేతలు.
భారత రాజకీయాలపై పట్టు, ప్రజల హృదయాలపై ఆమె వేసిన ముద్ర కారణంగా ఇందిరా గాంధీకి ఓడిపోతారని చాలా మంది ఊహించలేదు.
కానీ 1977 ఫలితాలు అందరినీ తల్లకిందులు చేశాయి. ఇందిరా కాంగ్రెస్ ఓడిపోయింది. దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చిన తొలి రాజకీయ ప్రయోగం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది.
దేశవ్యాప్తంగా జనతా పార్టీ 295 సీట్లు గెలుచుకుంది. అంతకుముందు ఎన్నికల్లో 350 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ (ఆర్) 154 స్థానాలతో సరిపెట్టుకుంది.
రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసిన ఇందిర, అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె కుమారుడు సంజయ్ గాంధీ ఓడిపోయారు. ఇందిరా గాంధీపై రాజ్ నారాయణ్ విజయం సాధించారు. ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ దాదాపు కనుమరుగైంది. కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లలో ఎక్కువ భాగం దక్షిణాది నుంచే వచ్చాయి.
ఈ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. విపక్ష కూటమికి 41.32 శాతం ఓట్లు వచ్చాయి. మొరార్జీ దేశాయ్, చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్‌పేయి, జార్జ్ ఫెర్నాండెజ్ ఈ ఎన్నికల్లో గెలుపొందారు.
ఓడిపోయిన వెంటనే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఎత్తివేసి పదవికి రాజీనామా చేశారు.
అప్పటికి రెండు నెలల క్రితమే జనతా పార్టీ ఏర్పడింది. దీంతో ప్రధాని అభ్యర్థిని ముందుగా నిర్ణయించడం సాధ్యం కాలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అందులో ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పించడం పెద్ద సవాల్‌గా మారింది.
కాబోయే ప్రధాన మంత్రి ఎవరు? అనే విషయంలో ముగ్గురి పేర్లు ప్రధానంగా పరిశీలనకు వచ్చాయి. వారిలో ఒకరు మొరార్జీ దేశాయ్. సుదీర్ఘ అనుభవం ఉన్న మొరార్జీ దేశాయ్‌ని ప్రధాని కావాలని గతంలో కాంగ్రెస్ పార్టీలోనూ చర్చ నడిచింది. రెండో వ్యక్తి చరణ్ సింగ్. రైతు నేతగా ఉత్తర భారతంలో ఆయనకు మంచి పేరుంది.
మూడో వ్యక్తి జగ్జీవన్ రాం. మూడు దశాబ్దాలుగా క్యాబినెట్‌లో మంత్రిగా ఉండడంతో పాటు దళిత వర్గానికి చెందిన నేత. అయితే, ఎమర్జెన్సీ సమయంలో ఆయన కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారు.
చివరికి మొరార్జీ దేశాయ్ వైపే జయప్రకాష్ నారాయణ్ మొగ్గు చూపారు. దీంతో ఆయన తొలి కాంగ్రెసేతర ప్రధాన మంత్రి అయ్యారు. చరణ్ సింగ్ కేంద్ర హోం మంత్రిగా, జగ్జీవన్ రాం రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి విదేశాంగ శాఖ మంత్రి అయ్యారు.
కుప్పకూలిన జనతా ప్రభుత్వం
జనతా పార్టీ ప్రయోగం పొత్తుల శకానికి నాంది పలికినప్పటికీ, అది భారత రాజకీయాల్లో ఎక్కువ కాలం నిలవలేదు. రెండు సంవత్సరాల్లోనే జనతా ప్రభుత్వంలో లుకలుకలు ప్రారంభమయ్యాయి.
వాస్తవానికి, జనతా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజాస్వామ్యాన్ని అణచివేసేలా వ్యక్తి లేదా పార్టీలకు ఎమర్జెన్సీని విధించే అవకాశం లేకుండా రాజ్యాంగ సవరణలు చేశారు. అలాగే, ఎమర్జెన్సీ కాలంలో జరిగిన అన్యాయాలు, అధికార దుర్వినియోగంపై విచారణ జరిపేందుకు 'షా కమిషన్'ని నియమించారు. భారత విదేశాంగ విధానంపై కూడా చర్చ జరిగింది.
అయితే, కూటమి నేతల్లో రాజకీయ వైరుధ్యాలు, అధికారంపై ఆశ, ప్రధాన మంత్రి పదవిపై కావాలనే కోరిక రోజురోజుకీ పెరిగిపోయింది. మొరార్జీ దేశాయ్‌కి కూడా విమర్శలు తప్పలేదు. విభేదాలు పెరిగిపోయాయి.
చివరకు చరణ్ సింగ్‌కు చెందిన భారతీయ లోక్ దళ్ తన మద్దతు ఉపసంహరించుకుంది. దానితో పాటే మరికొందరు కూడా బయటికి వచ్చారు. చివరికి, 1979 జులై 19న మొరార్జీ దేశాయ్ తన పదవికి రాజీనామా చేశారు.
1980లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ తిరిగి పుంజుకున్నారు. మూడేళ్ల కిందట 295 ఎంపీ సీట్లు గెలుచుకున్న జనతా పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 31 స్థానాలకే పరిమితమైంది.
ఆ తర్వాత జనతా పార్టీ ప్రయోగంలో భాగస్వామ్యమైన పార్టీలు ఎవరికి వారు విడిపోయారు. జనతా పార్టీ చీలిపోయింది. 1980లో అటల్ బిహారీ వాజ్‌పేయి, జన్ సంఘ్‌కి చెందిన ఎల్‌కే అడ్వాణీ భారతీయ జనతా పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి క్రమంగా ఎదుగుతూ వచ్చిన బీజేపీ నేడు కేంద్రంలో అధికారంలో ఉంది.
రాష్ట్రీయ లోక్ దళ్ హరియాణ, ఉత్తరప్రదేశ్‌లలో మనుగడలో ఉంది. చాలా కాలం పాటు ఐక్యంగానే ఉన్న జనతాదళ్ ఆ తర్వాత రెండుగా చీలిపోయింది. మండల్ కమిషన్ తర్వాత రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీలు వరుసగా బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో బలం పెంచుకున్నాయి.
తమ సిద్ధాంతాలు వేరైనప్పటికీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 1977 నాటి జనతా పార్టీ తరహాలోనే కూటమిగా ఏర్పడినట్లు 'ఇండియా' అలయెన్స్ కూడా చెబుతోంది. అయితే, గత ప్రయోగం నుంచి వాళ్లు ఏం నేర్చుకుంటారు? ఇందిరకు వ్యతిరేకంగా విజయవంతమైన కూటమి ఆ వెంటనే విఫలమైంది. ఆ చరిత్ర నుంచి భారత్ ఏం నేర్చుకుంటుంది?
ఇవి కూడా చదవండి
- చంద్రబాబుపై నమోదు చేసిన సెక్షన్లు ఏంటి, వాటికి ఎలాంటి శిక్షలుంటాయి?
- G 20 - నాగరాజు నాయుడు: జాయింట్ డిక్లరేషన్ కోసం దేశాలను ఏకతాటిపైకి తెచ్చిన తెలుగు అధికారి
- ఆంధ్రప్రదేశ్: ఏసీబీ కోర్టుకు చంద్రబాబు, ఎఫ్ఐఆర్లో పేరు చేర్చిన సీఐడీ
- మొరాకో భూకంపం: ‘నా కుటుంబంలో 10 మంది చనిపోయారు’
- మొరాకో: రాజరికాన్ని రద్దుచేయాలంటూ ఒకప్పుడు ప్రజలు తిరగబడిన దేశం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)