You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తత: యుద్ధభయం ఉన్నా ఇజ్రాయెల్ వెళ్లడానికి ఈ యూపీ యువకులు ఎందుకు సిద్ధమవుతున్నారు?
- రచయిత, ప్రవీణ్ కుమార్
- హోదా, బీబీసీ కోసం
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో ఘర్షణపూర్వక వాతావరణం పెరుగుతున్న నేపథ్యంలో భారత్ శుక్రవారం సాయంత్రం ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది.
‘‘ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు భారత పౌరులు ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు ప్రయాణించకూడదు’’ అని భారత విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది.
ప్రభుత్వం ఈ ప్రకటన తర్వాత, ఉద్యోగం కోసం ఇజ్రాయెల్ వెళ్లాలనుకున్న యువకుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఎందుకంటే, ప్రస్తుత పరిస్థితుల్లో, అక్కడికి వెళ్లాలనుకునే వారి ప్రయాణాలకు అనుమతులు ఉండవు.
ఏప్రిల్ 15న ఇజ్రాయెల్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కొందరికి శనివారం వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది.
‘‘ఇజ్రాయెల్‌కు వెళ్లే ప్రయాణాలను ప్రస్తుతం నిలిపివేస్తున్నాం, తదుపరి సమాచారం అందేంత వరకు వేచిచూడాల్సిందిగా కోరుతున్నాం’’ అన్నది ఆ మెసేజ్ సారాంశం.
‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’ మాదిరి పరిస్థితి
టిక్కెట్లకు, వీసాకు వారు చెల్లించిన డబ్బులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఈ మెసేజ్‌లో చెప్పారు.
కానీ, ఈ మెసేజ్ చూసిన తర్వాత యువకుల్లో, వారి కుటుంబాల్లో పరిస్థితి అనిశ్చితంగా మారింది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి మాదిరి తయారైంది.
ఇజ్రాయెల్ వెళ్లాలనుకుంటున్న ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాకు చెందిన కొందరు యువకులతో బీబీసీ మాట్లాడింది.
బారాబంకీ పట్టణానికి 20 కి.మీల దూరంలో ఉన్న జగ్‌దీష్ పూర్ గ్రామానికి చెందిన 20 మందికి పైగా యువకులు ఇజ్రాయెల్‌కు వెళ్లేందుకు ఎంపికయ్యారు.
వారిలో ఒకరే అజిత్ సింగ్. ఆయన్ను కలిసేందుకు మేం జగ్‌దీష్ పూర్ వెళ్లినప్పుడు, ఓ ఇంటి నిర్మాణంలో ఆయన కార్మికుడిగా పనిచేస్తున్నారు.
గత 15 ఏళ్లుగా తమ గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో అజిత్ మేస్త్రీగా పనిచేస్తున్నారు. ఈ పనితోనే తన ఇంటి అవసరాలు తీర్చుకుంటున్నారు.
‘‘ఇలాంటి పని ప్రతి రోజూ దొరకకపోవచ్చు. దొరికే పనిని బట్టి, నెలకు రూ.10 వేల వరకు సంపాదిస్తాం. మా ఇంట్లో ఖర్చులకు కూడా ఇవి సరిపోవడం లేదు’’ అని పదవ తరగతి పాసైన అజిత్ చెప్పారు.
ఇజ్రాయెల్ వెళ్లాలనుకుంటున్న అజిత్, గత ఏడాది వరకు ఆ దేశం పేరునే వినలేదు. అక్టోబర్‌లో ఇజ్రాయెల్, హమాస్ మధ్యలో యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి ఆయన ఈ పేరును విన్నారు.
‘‘కుటుంబ అవసరాల నిమిత్తం, జీవితాన్ని ప్రమాదంలో పెట్టి ఇజ్రాయెల్ వెళ్లాలనుకుంటున్నాం. ఏ దేశానికి వెళ్తున్నానో అనే ఆందోళన నాలో లేదు. ఒకవేళ అక్కడ ప్రమాదం ఉన్నా పట్టించుకోను’’ అని అన్నారు.
కుటుంబం కోసం అవసరమైన డబ్బులు సంపాదించడమే తనకు ముఖ్యమని చెప్పారు.
అజిత్ సింగ్‌కు భార్య ఫులా దేవి ఆయన మాట్లాడుతున్న సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు.
‘‘ఆయన వెళ్లడం నాకిష్టం లేదు. అక్కడికి వెళ్లొద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఒప్పుకోవడం లేదు. కుటుంబం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నేను కూడా అంగీకరించాలి’’ అని చెప్పారు.
అజిత్ మాత్రమే కాదు, ఆయన సోదరుడు ధన్‌రాజ్ కూడా పని కోసం ఇజ్రాయెల్ వెళ్తున్నారు.
తాము ఇజ్రాయెల్ వెళ్లేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై ధన్‌రాజ్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘‘అప్లై చేసిన తర్వాత, అక్కడికి వెళ్లేందుకు ఎలాంటి డబ్బులు వసూలు చేయబోమని చెప్పారు. కానీ, ఆ తర్వాత టిక్కెట్, వీసా కోసం రూ.66,800 డిపాజిట్ చేయాల్సి వచ్చింది’’ అని తెలిపారు.
యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తన కొడుకులను ఇజ్రాయెల్ పంపించడం వారి తండ్రి శరదా సింగ్‌కు ఇష్టం లేదు. కానీ, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
‘‘ఇక్కడ ప్రతి రోజూ పని దొరకకపోవచ్చు. రెండు రోజులు పని దొరికితే, పది రోజులు ఖాళీగా కూర్చోవాలి. కనీసం అక్కడ ప్రతి రోజూ పని దొరుకుతుంది. దానికి తగ్గ డబ్బులు వస్తాయి’’ అని తెలిపారు.
ఎందుకు ఇజ్రాయెల్‌కు ఇంతమంది కార్మికులు అవసరం?
గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత్, చైనా నుంచి ఇజ్రాయెల్‌కు 70 వేల మంది కార్మికుల అవసరం పడిందని ఇజ్రాయెల్ అధికారులను ఉటంకిస్తూ ఒక నివేదిక తెలిపింది. అక్కడ నిర్మాణ రంగంలో పనిచేసేందుకు కార్మికుల కొరత తీవ్రంగా ఉంది.
యుద్ధం తర్వాత అక్కడ పనిచేస్తున్న 80 వేల మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ నిషేధించింది. ఈ రంగాన్ని పునరుద్ధరించేందుకు ఇజ్రాయెల్‌కు ప్రస్తుతం పెద్ద సంఖ్యలో కార్మికులు కావాల్సి ఉంది.
భారత్ , ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం కింద, స్క్రీనింగ్ తర్వాత ప్లాస్టిక్ వర్క్, సెరామిక్ టైలింగ్, బిల్డింగ్ ఫ్రేమ్‌వర్క్, ఐరన్ వెల్డింగ్ వంటి వాటిల్లో నిపుణులైన కార్మికులను ఇజ్రాయెల్ పంపించాల్సి ఉంది.
ఇజ్రాయెల్‌కు చెందిన బృందం ఈ యువత నైపుణ్యాలను పరీక్షించారు. ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్, హరియాణాల్లో వీరికి పరీక్షలు నిర్వహించారు.
సుమారు 10 వేల మంది ఇజ్రాయెల్‌కు పయనం
స్క్రీనింగ్ కోసం 14 వేల మంది యువకులు హాజరయ్యారని, వారిలో 9145 మంది ఎంపికైనట్లు లఖ్‌నవూలోని అలీగంజ్ ఐటీఐ ప్రిన్సిపల్ రాజ్‌కుమార్ యాదవ్ చెప్పారు.
ఎంపికైన కార్మికులకు ఉద్యోగం కోసం అపాయింట్‌మెంట్ లెటర్లు కూడా ఇచ్చారు. తొలి దశలో ఇజ్రాయెల్‌కు వెళ్లేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 2176 మంది కార్మికులను ఎంపిక చేశారు.
ఉత్తర ప్రదేశ్‌కు ముందు, హరియాణా రాష్ట్రం నుంచి 530 మంది కార్మికులు గత వారం ఇజ్రాయెల్ వెళ్లారు. ఇజ్రాయెల్ చేరుకున్న ఇద్దరు యువకులతో బీబీసీ మాట్లాడింది. ‘‘మేం క్షేమంగా ఉన్నాం, పని చేసుకుంటున్నాం. ఇక్కడ భయపడాల్సిందేమీ లేదు’’ అని వారు చెప్పారు.
హరియాణాలోని సోనిపట్ జిల్లాకు చెందిన సర్వీణ మోర్ అనే యువకుడితో బీబీసీ జూమ్‌లో మాట్లాడింది.
‘‘ఇక్కడంతా బాగానే ఉంది. నాకు పని దొరికింది. తినడానికి కంపెనీ డబ్బులు ఇస్తుంది. హోటల్ మాదిరి రూమ్ కూడా ఇచ్చింది. సురక్షితమైన శిక్షణను ఇచ్చింది. ఏదైనా సమస్య వస్తే, బంకర్ లోపలకి వెళ్లాలని సూచనలు ఉన్నాయి’’ అని ఆ యువకుడు తెలిపారు.
అంతా బాగుందని యువకులు చెబుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ వెళ్లిన యువకుల కుటుంబాలు మాత్రం ప్రస్తుతం తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఆందోళన చెందుతున్నాయి.
బారాబంకీ జిల్లా నుంచి 238 మంది యువకులు ఎంపికయ్యారు. వారిలో తొలి దశలో 187 మంది ఇజ్రాయెల్ వెళ్లాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం వీరంతా ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు వేచిచూడాల్సిందే.
జగ్‌దీష్ పూర్‌కు చెందిన మరో యువకుడు రంజీత్‌ను బీబీసీ కలిసింది. ఆయన ఐరన్ వెల్డింగ్ పనికి ఇజ్రాయెల్ వెళ్లేందుకు ఎంపికయ్యారు.
డబ్బులు మంచిగా వస్తాయనే ఆశతోనే..
రంజీత్ ఇజ్రాయెల్ వెళ్లేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఏప్రిల్ 15న ఆయన విమానం ఎక్కాల్సి ఉంది. కావాల్సిన అన్ని డాక్యుమెంట్లను పూర్తి చేసుకున్నారు.
తనకు ప్రతి నెలా వచ్చే రూ.1,37,250 జీతం గురించి చెప్పగానే రంజీత్ కళ్లు మెరిసిపోయాయి.
‘‘అక్కడికి వెళ్లేందుకు నా మనసులో ఎలాంటి భయం లేదు. భాష విషయంలో మాత్రం కాస్త భయం ఉంది. కానీ, అక్కడ హిందీ మాట్లాడే వారు ఉంటారని సెలక్షన్ సమయంలో చెప్పారు. అక్కడ సంపాదించే డబ్బులు గురించి తెలుసుకున్నాక నాకు బాగా అనిపించింది. మా కుటుంబ సభ్యుల జీవితాలను ఈ డబ్బులు మెరుగుపరుస్తాయి’’అని తెలిపారు.
రంజీత్ మాదిరిగానే, జగ్‌దీష్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ కూడా ఐరన్ వెల్డింగ్ పనుల కోసం అక్కడికి వెళ్లేందుకు ఎంపికయ్యారు.
అయితే, టిక్కెట్, ఇతర అవసరమైన డాక్యుమెంట్ల కోసం విజయ్ కుమార్ రూ.66,800 చెల్లించారు. ప్రస్తుతం వీరు ఇప్పుడు అక్కడకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.
‘టిక్కెట్ కోసం డబ్బులు నేను చెల్లించాను’
టిక్కెట్ కోసం డబ్బులు ఏర్పాటు చేసుకోవడాన్ని విజయ్ వివరించారు.
‘‘అంతకుముందు మాకు డబ్బులు కావాలని చెప్పలేదు. కానీ, టిక్కెట్‌కు డబ్బులు అవసరం అవుతాయని నాకు తెలిసినప్పుడు, కాస్త ఇబ్బంది పడ్డాను. ఎలాగోలా భూమిని తనఖా పెట్టి డబ్బులు ఏర్పాటు చేసుకున్నా. అక్కడ నాకు మంచి డబ్బులు వస్తాయని చెప్పారు. ఆ డబ్బులతో మా ఇంటి పరిస్థితులు కాస్త మెరుగుపడతాయి. తనఖా పెట్టిన భూమిని ఆ డబ్బులు పెట్టి విడిపించుకోవచ్చు’’ అని విజయ్ చెప్పారు.
విజయ్ ఇజ్రాయెల్‌కు సంబంధించిన సమాచారాన్ని యూట్యూబ్, ఇంటర్నెట్ నుంచి సేకరించారు. కానీ, ప్రస్తుతం ప్రభుత్వ ప్రకటనతో, వారి ఆందోళనలు మరింత పెరిగాయి.
‘‘అక్కడికి వెళ్లి, పని చేసి మా డబ్బులు సంపాదించేంత వరకు, మాకు ఆందోళనలు ఉంటాయి. అక్కడి వెళ్లే ఈ ప్రక్రియ ప్రారంభమై, 2024 జనవరి నుంచి మూడు నెలలు గడిచాయి. ఇంకెన్ని రోజులు వేచిచూడాలో నాకు తెలియడం లేదు’’ అని విజయ్ అన్నారు.
దేశంలో నిరుద్యోగ సమస్య
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం పాలనలో ఉంది. వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్నికలకు సిద్ధమవుతోంది.
2014 ఎన్నికల ప్రచారంలో, ప్రతి ఏడాది రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది. కానీ, భారత్‌లో ఉద్యోగ రంగంలో పరిస్థితులు అంత మెరుగ్గా లేవు.
భారత్‌లో నిరుద్యోగం తగ్గుతున్నప్పటికీ, ఈ రేటు ఇంకా ఎక్కువగానే ఉంది. అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ నివేదిక ప్రకారం, 2019 నుంచి రెగ్యులర్‌గా వేతనం పొందే ఉద్యోగాలు తగ్గుతున్నట్లు తెలిసింది.
దీనికి గల కారణం ఆర్థిక సంక్షోభం, కరోనా. ఈ మహమ్మారి తర్వాత, 15 శాతానికి పైగా గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా మారారు. ఇది మాత్రమే కాక, 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న గ్రాడ్యుయేట్లలో మొత్తం 42 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు.
ఏ కార్మికుడిని కూడా బలవంతంగా అక్కడకు పంపించడం లేదని బారాబంకీ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మయాంక్ సింగ్ తెలిపారు. యువకులందరూ తమ సొంతంగానే అక్కడకు వెళ్తున్నట్లు చెప్పారు. వారు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాయ చేస్తున్నట్లు చెప్పారు.
అక్కడికి వెళ్లే కార్మికులకు నెలకు రూ.1,37,250 వరకు జీతం పొందనున్నారు. ఒకవేళ ఓవర్ టైమ్ పని చేస్తే, అంతకంటే ఎక్కువ జీతమే పొందనున్నారని చెప్పారు.
ఇజ్రాయెల్‌లో వారికి ఉండేందుకు వారిని నియమించుకున్న కంపెనీ ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. కానీ, తినడం కోసం మాత్రమే వారే ఖర్చులు భరించాలి.
నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కింద ఈ కార్మికులకు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు లభిస్తాయి. ప్రతి కార్మికునికి రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా అందుబాటులో ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- విజయవాడ: 'మేమంతా బూడిద తిని, బూడిద తాగి టెన్షన్‌తో బతుకుతున్నాం'
- భారత్ ఉల్లిగడ్డలతో దౌత్యం నెరుపుతోందా?
- వారణాసిలో మోదీ మీద పోటీ చేస్తున్న అజయ్ రాయ్ ఎవరు... ఆర్ఎస్ఎస్-బీజేపీ చరిత్ర ఉన్న ఈ నాయకుడినే కాంగ్రెస్ ఎందుకు ఎంపిక చేసింది?
- గణిత ప్రపంచాన్ని మలుపు తిప్పిన సున్నాను భారతీయులు ఎలా కనిపెట్టారు?
- కరోనా బోరియాలిస్: ఈ ఖగోళ వ్యవస్థలో జరగబోయే పెను విస్ఫోటం మనకు ఎప్పుడు, ఎలా కనిపిస్తుంది?
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)