‘‘గుండెల్లో నొప్పి, చనిపోతాననే ఆందోళన’’.. కానీ డాక్టర్లు ఏ అనారోగ్యమూ లేదనేవారు

ఫొటో సోర్స్, Hollie Sharman
- రచయిత, ఎమిలీ హోల్ట్
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
హోలీ షార్మన్ తాను చనిపోతానని బలంగా నమ్మేవారు. ఛాతీలో భరించలేనంత నొప్పి వస్తోందంటూ వారానికి నాలుగైదుసార్లు ఆసుపత్రికి వెళ్లేవారు.
''ఒకసారి ఆస్పత్రి అత్యవసర చికిత్సా విభాగంలో ఏకంగా 13 గంటలు గడిపా'' అని 25 ఏళ్ల షార్మన్ చెప్పారు.
కానీ, ఎన్నోసార్లు వైద్య పరీక్షలు చేసినా ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించలేకపోయారు.
తన ఆరోగ్యం గురించి చిన్నప్పటి నుంచే ఆందోళన చెందేదాన్నని షార్మన్ చెప్పారు. ఏదో ఒక కారణం చెప్పి స్కూల్ నుంచి ఇంటికి వెళ్లి మంచంపై పడుకోవడానికి ప్రయత్నించే దాన్నని గుర్తుచేసుకున్నారు.
తన 22వ పుట్టినరోజున రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు కూడా ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ''నా జీవితంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన పానిక్ అటాక్ వచ్చింది. దీంతో టాయ్లెట్లోనే ఉండిపోయా. నా పుట్టినరోజును ఆస్వాదించలేకపోయా.'' అన్నారామె.


ఫొటో సోర్స్, Dr Kirren Schnack
గంటల తరబడి నెట్లో వెదుకులాట
పుట్టినరోజు నాటి చేదు ఘటన తర్వాత కొన్నేళ్లపాటు తన ఆరోగ్యం విషయంలో షార్మన్ తీవ్రఆందోళనతో గడిపారు. గంటల తరబడి ఇంటర్నెట్లో వ్యాధి లక్షణాల కోసం వెదికేవారు. తీవ్ర భయాందోళనలకు గురయ్యేవారు. ఒంటరిగా ఉన్నట్లు భావించేవారు.
''నాకు ఏ సమస్య ఉందో తెలుసుకోవడానికి నిరంతరం గూగుల్‌లో వెతికేదాన్ని. చాట్‌జీపీటీని ఉపయోగించేదాన్ని. నా ఆరోగ్య సమస్య గురించి సమాచారం అందించే ప్రతి మార్గాన్నీ ప్రయత్నించేదాన్ని'' అని షార్మన్ చెప్పారు.
''ఆసుపత్రిలో చాలా సమయం గడిపేదాన్ని. వైద్యులు అన్ని పరీక్షలు చేసి నాకేమీ కాలేదని చెప్పేవారు. ఇంటికి తిరిగి వచ్చేదాన్ని. కానీ, ఆ తర్వాత కాళ్లలో బలహీనంగా అనిపించేది. దాని గురించి గూగుల్‌లో వెతికితే గుండె వైఫల్యానికి అది ఒక లక్షణమని కనిపించేది. దీంతో మళ్లీ ఆసుపత్రికి వెళ్లేదాన్ని. ఇలా నిరంతరం ఇదే జరుగుతుండేది'' అని ఆమె వివరించారు..
పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్నప్పుడు అందరికీ పూర్తిగా దూరమయ్యానని ఆమె చెప్పారు.
కుటుంబ సభ్యులతో పదేపదే అవే విషయాలు మాట్లాడాల్సి వస్తుందనే ఉద్దేశంతో వారి మెసేజ్‌లకు కూడా సమాధానం ఇచ్చేదాన్ని కాదు.
ఆరోగ్యం గురించి తనకున్న ఆందోళన వ్యక్తిగత సంబంధంపై తీవ్ర ప్రభావం చూపిందని షార్మన్ చెప్పారు.
''నా భాగస్వామి ఏం చెప్పినా నాకు సంతృప్తిగా అనిపించని పరిస్థితి వచ్చింది.
''నా మనసులో ఏం జరుగుతోందో అతడికి అర్థం కావడం లేదని బాధపడేదాన్ని. నేను నిజంగానే చనిపోతున్నానని భావిస్తున్నప్పుడు అంతా బాగానే ఉందని ఎవరైనా ఎలా చెప్పగలరు?'' అని ఆమె ప్రశ్నించారు.
''నిజానికి ఎలాంటి తీవ్రమైన అనారోగ్యం లేకపోయినా, తమకు ఏదో తీవ్రమైన వ్యాధి ఉందని లేదా రాబోతోందని నిరంతరం ఆందోళన చెందడాన్ని హెల్త్ యాంగ్జైటీ అంటారు'' అని క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ కిరెన్ ష్నాక్ వివరించారు.

ఫొటో సోర్స్, Hollie Sharman
హెల్త్ యాంగ్జైటీ లక్షణాలు ఏమిటి?
హెల్త్ యాంగ్జైటీ ప్రధాన లక్షణాల్లో తమ ఆరోగ్యాన్ని పదేపదే తనిఖీ చేసుకోవడం ఒకటి. శరీరాన్ని తరచూ పరిశీలించుకోవడం, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు కొలుచుకోవడం, ఇంటర్నెట్’లో వ్యాధుల లక్షణాల గురించి వెతకడం వంటివి చేస్తుంటారు.
తాము ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నామని నిర్ధరించుకోవడానికి ఇంటర్నెట్ను, స్నేహితులను లేదా కుటుంబ సభ్యులను పదేపదే అడగడం మరో లక్షణమని డాక్టర్ ష్నాక్ బీబీసీ కార్యక్రమం కాంప్లెక్స్ విత్ కిమ్బెర్లే విల్సన్‌లో చెప్పారు.
మరికొందరు తమకు తీవ్రమైన వ్యాధి ఉందేమోననే భయంతో శరీరాన్ని పరిశీలించుకోవడం లేదా వైద్యుల దగ్గరకు వెళ్లడం మానేస్తారు. కొంతమంది తమకు నిజంగానే ఏదో వ్యాధి ఉన్నట్లుగా ప్రవర్తించడం మొదలుపెడతారని ఆమె వివరించారు.
''మీరు నెమ్మదిగా కదలడం మొదలుపెట్టవచ్చు. వ్యాయామం చేయడం మానేయవచ్చు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిలా మీ శరీరాన్ని, మనసును చూసుకోవడం మొదలుపెడతారు'' అని చెప్పారు.
చివరకు షార్మన్కు హెల్త్ యాంగ్జైటీతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) ఉన్నట్లు నిర్ధరణ అయింది.
ఈ సమస్య నుంచి బయటపడేందుకు తన కుటుంబ సభ్యులు, భాగస్వామి ఎంతో సహకరించారని ఆమె చెప్పారు. ఆందోళనను నియంత్రించుకోవడానికి కొన్ని పద్ధతులను అనుసరించడం ద్వారా తన పరిస్థితి మెరుగుపడిందని వివరించారు.
''నాకు కనిపించే లక్షణాలను రాసుకునేదాన్ని. ఉదాహరణకు 'ఛాతీలో భరించలేనంత నొప్పి' అని రాసేదాన్ని. ఆ రోజు చివర్లో నేను బాగానే ఉన్నానని కూడా రాసుకునేదాన్ని.
''మళ్లీ అలాంటి నొప్పి వచ్చినప్పుడు గతంలో రాసుకున్న విషయాలను చదివేదాన్ని. అప్పుడు కూడా నేను చనిపోతానని అనుకున్నాను. కానీ అలా జరగలేదు కదా అని నాకు నేనే గుర్తుచేసుకునేదాన్ని'' అని చెప్పారు.
ఇప్పుడు ఆరోగ్యం గురించి ఆందోళన తన జీవితాన్ని నియంత్రించడం లేదని షార్మన్ తెలిపారు.
''ఆందోళనగా ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ పనులు చేసుకోవాలి. భయంతో జీవితాన్ని ఆపేయకూడదు. ఎందుకంటే నేను చాలా ఏళ్లపాటు అలాగే చేశాను'' అని చెప్పారు.
నియంత్రణ ఎలా?
కొత్తగా ఏదైనా లక్షణం కనిపించినా, ఆందోళన కలిగించేలా ఉన్నా లేదా తగ్గకుండా కొనసాగుతున్నా ఎన్హెచ్ఎస్ వెబ్సైట్లో దాని గురించి తెలుసుకోవడం ఆరోగ్యం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించడమేనని డాక్టర్ ష్నాక్ చెప్పారు.
ఏదైనా లక్షణం రెండు వారాలైనా తగ్గకపోతే జనరల్ ప్రాక్టీషనర్ (జీపీ) అపాయింట్మెంట్ తీసుకోవాలని ఆమె సూచించారు.
ఆరోగ్యం గురించి ఆందోళనను నియంత్రించుకోవడానికి డాక్టర్ ష్నాక్ కొన్ని సూచనలు చేశారు.
ఎక్కువగా ఊహించుకోకండి
శరీరంలో కనిపించే లక్షణాలకు ఇతర కారణాలు కూడా ఉండవచ్చని ఆలోచించాలి. ఉదాహరణకు వెన్ను బిగుసుకుపోవడం తీవ్రమైన వ్యాధి వల్ల కాకుండా కూర్చునే భంగిమ సరిగా లేకపోవడం వల్ల కూడా జరగవచ్చు.
పదేపదే భరోసా కోరుకోవద్దు
ఆరోగ్య లక్షణాల గురించి స్నేహితులను లేదా కుటుంబ సభ్యులను ఎంత తరచుగా అడగాలి, ఎంత సమయం కేటాయించాలి అనే విషయంలో కొన్ని పరిమితులు పెట్టుకుని వాటిని పాటించాలి.
శారీరక ఉద్రిక్తత తగ్గించుకోవాలి
జంపింగ్ జాక్స్ వంటి కొద్దిసేపు చేసే శారీరక కదలికలు అడ్రినలిన్, కార్టిసాల్ ప్రభావాన్ని తగ్గించుకోవడంలో సహాయపడవచ్చు.
తక్షణస్థితిపై మనసు లగ్నం చేయాలి
ఐస్ ముక్కను చేతిలో పట్టుకోవడం, పుల్లగా లేదా కారంగా ఉన్న పదార్థాన్ని రుచి చూడటం వంటి బలమైన ఇంద్రియ అనుభూతుల ద్వారా మనసును ప్రస్తుత క్షణంపై కేంద్రీకరించవచ్చు.
ఓ నిట్టూర్పూ మంచిదే
ముక్కు ద్వారా దీర్ఘంగా గాలి పీల్చుకోవాలి. ఆ తర్వాత మరోసారి కొద్దిగా గాలి పీల్చుకుని, నోటి ద్వారా నిట్టూర్పు విడిచినట్లు నెమ్మదిగా గాలిని బయటకు వదలాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































