You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఓటమి తర్వాత తొలిసారి స్పందించిన కమలా హారిస్.. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్ చేతిలో ఓటమి తరువాత డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ తొలిసారి స్పందించారు.
వాషింగ్టన్ డీసీలోని హోవర్డ్ యూనివర్సిటీలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఓటమిని అంగీకరిస్తున్నానని చెప్పిన ఆమె ఈ పోరాటానికి ఆజ్యం పోసిన ప్రచారాన్ని మాత్రం అంగీకరించబోనన్నారు.
అమెరికా ఉజ్వల భవిష్యత్ కోసం పోరాడటం ఆపొద్దని హారిస్ ప్రజలను ఈ సందర్భంగా కోరారు.
ప్రజలు నిరాశకు గురికావొద్దని చెప్పిన ఆమె.. అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు అధికారాల బదిలీలో పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.
‘‘మనం కష్టకాలంలోకి అడుగు పెడుతున్నట్లుందని చాలామంది అనుకుంటున్నారని నాకు తెలుసు. కానీ, అలా ఏమీ కాదు’’ అన్నారు హారిస్.
‘ఇది మనం కోరుకున్న ఫలితం కాదు. మనం పోరాటం కొనసాగిస్తున్నంత కాలం అమెరికా వాగ్దానాల వెలుగు నిత్యం ప్రకాశవంతంగానే ఉంటుంది’ అన్నారామె.
‘మనం బాధ పడాల్సిన సమయం కాదు ఇది. చొక్కా చేతులు మడిచి పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఇది’ అంటూ తన మద్దతుదారుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.
ఆమె పదవిలో కొనసాగుతారా?
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన కమలా హారిస్ అధికార బదిలీ ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతారు.
డోనల్డ్ ట్రంప్, జేడీ వాన్స్‌కు జనవరి 20న అధికారాన్ని అప్పగించే వరకూ ప్రెసిడెంట్ జో బైడెన్‌తో పాటు కమలా హారిస్ తన మిగిలిన పదవీకాలం ఉపాధ్యక్షురాలిగా ఉంటారు.
అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం అనంతరం బైడెన్, హారిస్ ఇద్దరికీ అమెరికా ప్రభుత్వంలో రాజకీయంగా ఎలాంటి పదవీ ఉండదు.
యూకే రాజకీయాల తరహాలో ప్రతిపక్ష నేతకు సమానమైన హోదా ఏమీ లభించదు. ఆమె తన పదవి నుంచి తప్పుకుంటారు.
ట్రంప్ టీం ఏర్పాటుకు సన్నాహాలు
డోనల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌కు తిరిగి రావడానికి ముందే తన టీంను సిద్ధం చేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు.
కొద్దివారాల్లోనే ట్రంప్ తన కేబినెట్‌లో ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయంపై దృష్టి సారిస్తారని వైట్‌హౌస్ అధికార మార్పిడి వ్యవహారాలకు నాయకత్వం వహిస్తున్న బృందం తెలిపింది.
తన కేబినెట్‌లో భాగస్వాములను ఎంచుకునేందుకు వీలుగా ట్రంప్‌కు ఆయా రంగాల్లో నిపుణులను సూచిస్తామని బృందానికి నాయకత్వం వహిస్తున్న లిండా మెక్‌మహాన్, హోవార్డ్ లుట్నిక్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
''అమెరికన్లకు భారం కాని జీవితాన్ని, సురక్షితమైన జీవితాన్ని అందించేందుకు అవసరమైన అన్ని విధానాలను అమలు చేసే సిబ్బంది''ని ఆయన ఎంపిక చేసుకుంటారని వారు చెప్పారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వైట్‌హౌస్‌కు తిరిగి రావడం ఇక లాంఛనమే అయినప్పటికీ, సుదీర్ఘంగా సాగే అధికారిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఆయన ఓవల్ ఆఫీస్‌కు రావడానికి సుమారు రెండు నెలల సమయం పడుతుంది.
ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేందుకు జనవరి 20 వరకు ఆగాల్సి ఉంటుంది. అప్పటి వరకూ జో బైడెన్ అధికారంలో ఉంటారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)