You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నేచర్ ఫోటోగ్రఫీ: 2025లో మేటి చిత్రాలు, ఆ జీవుల సొగసు చూడతరమా ..
- రచయిత, ఇసాబెల్లె గెరెట్‌సెన్, మార్తా హెన్రిక్స్, కేథరిన్ లాథమ్, జోసెలిన్ టింపర్లి
ప్రకృతి సౌందర్యాన్ని, నేచర్ వరల్డ్‌లోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ కొన్ని ఫోటోలు 2025 సంవత్సరంలో అత్యంత ఆకర్షణీయమైన చిత్రాలుగా నిలిచాయి.
ఇవి మహాసముద్రాల అగాధాల నుంచి ఎడారులు, పర్వతాలు, అమెజాన్ అరణ్యాల మారుమూల వరకూ మనల్ని తీసుకెళ్తాయి.
విన్యాసాలు చేసే గొరిల్లాలు, సముద్ర సింహాలు, దరహాసం చేసే ఎలుగుబంట్లను మనం వీటిలో చూస్తాం.
మారిటైమ్ లయన్...
నమీబియాలోని స్కెలెటన్ కోస్ట్‌లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే, ఒడ్డున ఉన్న రాళ్ల మీద కూర్చున్న ఒక ఆడ సింహం సముద్రంవైపు తీక్షణంగా చూస్తోంది.
తాము వేటాడే ప్రాంతాలను వదిలి, ఆహారం కోసం అట్లాంటిక్ మహాసముద్రం వైపు వచ్చిన ఎడారి సింహాల గుంపులో ఈ ఆడ సింహం కూడా ఒకటి.
గ్రీట్ వాన్ మాల్డెరెన్ దీన్ని చిత్రీకరించారు.
ఘోస్ట్ టౌన్ హైనా...
నమీబియాలోని శిథిలావస్థకు చెందిన ఒక డైమండ్ మైనింగ్ టౌన్‌లో సంచరిస్తున్న గోధుమ రంగు హైనా ఇది.
ఈ అద్భుతమైన దృశ్యాన్ని కెమెరాలో బంధించడానికి నేచర్ ఫోటోగ్రాఫర్ విమ్ వాన్ డెన్ హీవర్‌కు 10 ఏళ్ల సమయం పట్టింది.
అమెజాన్ 'గ్రేట్ థీవ్స్'...
అరుదుగా కనిపించే అమెజాన్ పింక్ డాల్ఫిన్ ఇది. స్థానిక తెగలు దీన్ని చూసి భయపడటమే కాదు, దైవంగా భావిస్తారు.
స్థానికంగా పోర్చుగీస్ భాషలో 'బోటో' అని పిలిచే వీటిని అమెజాన్ గ్రేట్ థీవ్స్ ( అమెజాన్ గజ దొంగలు) అని కూడా అంటారు. ఈ ఫోటోను హుస్సేన్ అగాఖాన్ చిత్రీకరించారు.
ధ్రువపు ఎలుగు బంట్లు
కెనడాలోని నునావత్‌లో ఫైర్‌వీడ్ పూలమొక్కల మధ్య రెండు చిన్న ధ్రువపు ఎలుగుబంట్లు ఆడుకుంటున్న అద్భుతమైన దృశ్యం ఇది.
సాధారణంగా ఆర్కిటిక్ సముద్రపు మంచుగడ్డల మధ్య తెల్లగా మెరిసిపోతూ కనిపించే ఇవి ఇలా రంగులమయమైన ప్రాంతంలోకి వచ్చినప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ రోయి గాలిట్జ్ తన కెమెరాలో బంధించారు.
మౌంటైన్‌టాప్ క్యాట్...
భారతదేశంలోని అరుణాచల్‌ప్రదేశ్ పర్వత ప్రాంతాల్లో 'పల్లాస్ క్యాట్' నివసిస్తుందనడానికి మొదటి ఫోటోగ్రాఫిక్ ఆధారం ఇది.
ఈ ఫోటోను సముద్రమట్టానికి దాదాపు 5వేల మీటర్ల ఎత్తులో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా తీసింది.
మారుమూల మాగో చూ లోయ పరిసరాల్లో 130కి పైగా కెమెరా ట్రాప్‌లతో నిర్వహించిన సర్వేలో ఇది రికార్డు అయింది.
వాట్ ఏ క్యాచ్...
లిటిల్ ఎగ్రెట్ జాతికి చెందిన ఒక కొంగ నోటి దాకా వచ్చిన ఆహారాన్ని, లేడీఫిష్ అమాంతంగా లాగేసుకుంది.
ఆగ్నేయ చైనాలోని తన ఇంటికి సమీపంలోనున్న యుండాంగ్ సరస్సులో జరిగిన ఈ వేట దృశ్యాన్ని కిన్‌రాంగ్ యాంగ్ తన కెమెరాలో బంధించారు.
ఈ ఫోటో ప్రతిష్టాత్మకమైన 'వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్' పోటీలో విజేతగా నిలిచింది.
హై-కికింగ్ గొరిల్లా...
రువాండాలో పొగమంచుతో నిండిన విరుంగా పర్వతాల్లోని ఒక ఖాళీ ప్రదేశంలో గిరగిరా తిరుగుతూ, గాలిలో కాళ్లను తిప్పుతూ తన అక్రోబాటిక్ నైపుణ్యాలను ప్రదర్శిస్తోన్న చిన్న మగ గొరిల్లా ఫోటో ఇది.
2025 కామెడీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అవార్డ్స్‌లో విజేతగా నిలిచింది.
అండర్‌వాటర్ 'అరోరా'...
జపాన్‌లోని సత్సుమా-ఇవోజిమా ద్వీపం తీరంలో ఈదుకుంటూ వెళ్తున్న తాబేలు ఇది.
అద్భుతమైన మేఘాన్ని తలపించే అండర్ వాటర్ అరోరా గుండా వెళ్తున్న ఈ తాబేలు చిత్రాన్ని హితోమి సుచియా తీశారు.
2025 ఓషనోగ్రాఫిక్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీలో ఫైనలిస్ట్‌గా నిలిచింది.
ఓషన్ ఇంజినీర్...
తనను వేటాడే జీవుల కంటపడకుండా దాక్కోవడానికి సముద్రపు అడుగునున్న ఇసుకను వెదజల్లుతుంటాయి స్ట్రింగ్ రే అనే జాతి చేపలు.
ఈ చేపలు ఏటా కొన్ని వేల టన్నుల ఇసుకను కదిలిస్తూ సముద్రపు అడుగుభాగంలోకి పోషకాలను చేరవేస్తాయి.
మెక్సికో తీరంలో ఇసాబెలా కోల్ తీసిన ఈ ఫోటో 2025 ఓషనోగ్రాఫిక్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పోటీలో ఫైన్ ఆర్ట్ విభాగంలో బహుమతి గెలుచుకుంది.
గోబుల్‌గట్స్...
ఆడ చేప గుడ్లును విడుదల చేసిన తర్వాత, అవి పొదిగేవరకూ రక్షణ కోసం మగ చేప తన నోటిలో ఉంచుకుంటుంది.
పేటర్నల్ మౌత్ బ్రూడింగ్ అని పిలిచే ఈ ప్రక్రియను నిర్వహిస్తున్న ఈస్టర్న్ గోబుల్‌గట్స్ అనే తండ్రి చేప చిత్రమిది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్‌లో డేనియల్ స్లై దీన్ని తీశారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)