పంక్ రాక్: మెడ చుట్టూ మీటరు పొడవైన పదునైన ముళ్లు.. ఈ డైనోసార్ శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరుస్తోంది

    • రచయిత, పల్లబ్ ఘోష్
    • హోదా, సైన్స్ కరస్పాండెంట్, బీబీసీ న్యూస్

మెడ చుట్టూ మీటరు పొడవున బయటకు పొడుచుకొచ్చిన పదునైన ముళ్లు ఉన్న డైనోసార్‌ రకాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

స్పైకోమెల్లస్ అఫెర్ అని పిలిచే ఈ జాతి డైనోసార్‌లు 16.5 కోట్ల సంవత్సరాల క్రితం జీవించాయి.

యాంకైలోసార్స్ అని పిలిచే ఇలాంటి డైనోసార్ల సమూహానికి ఇది మరింత ప్రాచీన ఉదాహరణ.

ఈ డైనోసార్‌ను శాస్త్రవేత్తలు మొరాకోలో గుర్తించారు. దీని శరీర వైశాల్యం, ముళ్లతో ఉండడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

వీటికి సంబంధించిన పరిశోధనకు నేతృత్వం వహించిన బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రిచర్డ్ బట్లర్ బీబీసీతో మాట్లాడారు.

ముళ్లు ఉన్న ఈ డైనోసార్ ఆ కాలంలో 'పంక్ రాకర్' అని రిచర్డ్ చెప్పారు.

'పంక్ రాక్' అనేది 1970 దశకంలో తొలుత మొదలైన సంగీత శైలి. ఈ పంక్ రాక్ సభ్యులు, అనుచరులు ముళ్ల మాదిరిగా జుట్టు, ఆభరణాలతో కనిపిస్తారు.

''ఇప్పటివరకూ కనుగొన్న అసాధారణమైన డైనోసార్లలో ఇదొకటి'' అని రిచర్డ్ వెల్లడించారు.

దీని మెడ భాగంలోనున్న పొడవైన ముళ్లు నేరుగా ఎముకకు కలిసిపోవడం ఆశ్చర్యంగా ఉందని నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రొఫెసర్ సుసానా మొయిడ్‌మెంట్ చెప్పారు. ప్రొఫెసర్ రిచర్డ్ బట్లర్ ప్రాజెక్టుకు ఆమె కో-లీడ్‌గా వ్యవహరిస్తున్నారు.

''జీవిస్తున్న లేదా అంతరించిపోయిన మరే ఇతర జంతువులోనూ మనం ఇలాంటి నిర్మాణం చూడలేం'' అని సుసానా చెప్పారు.

''ఈ జంతువు మెడ చుట్టూ బోనీ కాలర్, ముళ్లు, వెనుకభాగం వరకు ఉబ్బెత్తున రాళ్లతో కప్పినట్లు శరీరం, తోక చివర ఒక రకమైన ఆయుధంలా పదునైన ముళ్లు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా అసాధారణమైన డైనోసార్'' అని ఆమె వివరించారు.

ఈ ఆవిష్కరణ చాలా అసాధారణమైంది. దీనివల్ల యాంకైలోసార్స్ ఎలా ఉద్భవించాయనేదానిపై సిద్ధాంతాలను పునరాలోచించాల్సి వస్తుందా అని ప్రొఫెసర్లు పరిశీలిస్తున్నారు.

భూమిపై డైనోసార్స్ జీవించిన చివరి దశ 'క్రెటేషియస్' (సుమారు 14.5 కోట్ల నుంచి 16.6 కోట్ల సంవత్సరాల క్రితం) కాలంలో ఈ జంతువులు మనుగడ సాగించాయి.

'జురాసిక్' కన్నా మునుపటి కాలంలో...

'క్రెటేషియస్' కాలం చివర్లో టి-రెక్స్ వంటి మాంసాహారులు ఉద్భవించాయి. అందుకే యాంకైలోసార్స్ తమ వెనుక భాగంలో తోక చివర చిన్న పలక మాదిరి ఆయుధంతో ప్రారంభమయ్యాయి. ఆ పెద్ద జంతువుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి అవి తర్వాత చాలా మారాయి'' అని ప్రొఫెసర్ రిచర్డ్ బట్లర్ చెప్పారు.

''అతి పురాతనమైన యాంకైలోసార్ ఎలా ఉంటుందని భావిస్తున్నారని మీరు నన్ను అడిగితే, అది చాలా సరళమైన కవచంతో ఉండేదని చెప్పేవాడిని'' అని బీబీసీతో ఆయన అన్నారు.

''ముళ్ల పందికి శరీరంపై ముళ్లుంటాయి. ఇప్పటివరకు మరే ఇతర జంతువుకూ లేని అత్యంత విచిత్రమైన కవచం దీనికే చూశాం. కానీ యాంకైలోసార్లలో కనిపించే కవచం చాలా విస్తృతమైంది'' అని ప్రొఫెసర్ రిచర్డ్ బట్లర్ చెప్పారు.

ఆ జంతువు శరీర నిష్పత్తులను నిర్ధరించడానికి తగినంత అస్థిపంజరం పరిశోధకులకు లభించలేదు. కానీ అది దాదాపు నాలుగు మీటర్ల పొడవు, ఒక మీటరు ఎత్తు, సుమారుగా రెండు టన్నుల బరువు ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.

మనకు తెలిసిన 'జురాసిక్' కన్నా మునుపటి డైనోసార్ కాలంలో యాంకైలోసార్‌లు విస్తృతమైన కవచంతో ప్రారంభమయ్యాయనడానికి ఆ ఆవిష్కరణ అవకాశం కల్పిస్తోందని, అది కొన్ని పదుల లక్షల సంవత్సరాల కాలంలో మరింత సరళంగా, బహుశా మరింత క్రియాత్మకంగా మారడానికి దారితీసిందని ప్రొఫెసర్ మెయిడ్‌మెంట్ భావిస్తున్నారు.

ఈ డైనోసార్ శిలాజాలను తొలుత మొరాకోలోని బౌలెమనే పట్టణానికి చెందిన రైతు ఒకరు కనుగొన్నారు. అది ఆఫ్రికా ఖండంలో కనుగొన్న మొదటి యాంకైలోసార్.

తాను మొదటిసారి ఆ శిలాజాలను చూసిన క్షణాన్ని ప్రొఫెసర్ రిచర్డ్ బట్లర్ గుర్తుచేసుకున్నారు.

''అది వెన్నులో జలదరింపు కలిగించే క్షణం, బహుశా నా కెరీర్‌లో అత్యంత ఉత్తేజకరమైంది. ఈ జంతువు మనం ఊహించిన దానికన్నా చాలా వింతగా ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా ఉందని వెంటనే మాకు అర్థమైంది'' అని చెప్పారు.

ఈ పరిశోధనలో పాల్గొన్న మొరాకో బృందానికి నాయకత్వం వహించిన సిది మహమ్మద్ బెన్ అబ్దుల్లా యూనివర్సిటీ ప్రొఫెసర్ డ్రిస్ ఓర్హాచే... ''ఈ అధ్యయనం మొరాకో విజ్ఞానశాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. ఇలాంటి డైనోసార్‌లను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు'' అన్నారు.

ఈ పరిశోధన నేచర్ జర్నల్‌లో ప్రచురితమైంది.

తవ్వకాలకు సంబంధించిన కథనాన్ని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో చూడొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)