You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'రూ.3 కోట్లతో పెళ్లి, కట్నంగా 300 సవర్ల బంగారం, 70 లక్షల వోల్వో కారు'.. కానీ, 2 నెలలకే నవ వధువు ఆత్మహత్య
- రచయిత, సెల్వకుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
(హెచ్చరిక: ఈ కథనంలో ఆత్మహత్య గురించిన సమాచారం ఉంది)
"పోలీసులు, కానీ ఇంకెవరైనా వచ్చి నా గురించి అడిగితే తల దించుకోకండి. వాళ్లకిది చూపించండి. నా ఈ నిర్ణయానికి నా వైవాహిక జీవితమే కారణం. నేను శారీరక హింస అనుభవించా, మానసిక హింసను కూడా. నా వైవాహిక జీవితం నాశనమైంది, దయచేసి నన్ను క్షమించండి!"
తమిళనాడులోని తిరుప్పూర్‌కు చెందిన 27 ఏళ్ల రితన్య, వాట్సాప్ ద్వారా తన తండ్రికి పంపిన ఆడియో రికార్డింగ్‌లోని మాటలివి.
రితన్య ఆడియో స్టేట్‌మెంట్‌ను సాక్ష్యంగా పరిగణిస్తూ ఆమె భర్త, మామను పోలీసులు అరెస్టు చేశారు.
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా కైకట్టిపుదూర్‌కు చెందిన అన్నాదురై ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన కూతురు రితన్య.
ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన రితన్యకు, అవినాశి పాలంకరైకి చెందిన ఈశ్వరమూర్తి కుమారుడు కవిన్‌కుమార్‌తో 2025 ఏప్రిల్ 11న వివాహం జరిగింది.
వివాహం జరిగిన 77 రోజుల తర్వాత అంటే జూన్ 28న రితన్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుటుంబం తెలిపింది.
'పెళ్లైన రెండు వారాలకే పుట్టింటికి'
రితన్య తండ్రి అన్నాదురై ఫిర్యాదు మేరకు అవినాశి డివిజన్‌లోని చెయూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలైంది.
అందులో పేర్కొన్న వివరాల ప్రకారం, పెళ్లైన రెండు వారాలకే రితన్య, కవిన్ కుమార్ మధ్య గొడవలు మొదలయ్యాయి. రితన్య పుట్టింటికి వచ్చేశారు, 20 రోజులు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో కవిన్ అప్పుడప్పుడు ఆమెను చూడటానికి వచ్చారు.
తల్లిదండ్రులు రితన్యకు నచ్చజెప్పి, అత్తారింటికి పంపారు. ఆ తర్వాత రితన్య, కవిన్ తిరుపతి ఆలయానికి, మరికొన్ని ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. రెండు వారాలు గడిచాక, జూన్ 22న రితన్యను మళ్లీ పుట్టింట్లో వదిలి వెళ్లారు కవిన్. ఆ సమయంలో రితన్య చాలా విచారంగా కనిపించారు.
రితన్య తనను ఏమీ అడగవద్దని తండ్రికి చెప్పగా, ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యా లేదని, వారం పాటు ఇంట్లో ఉంటానంటే తీసుకువచ్చానని అన్నాదురైతో కవిన్ చెప్పారు.
గుడికి వెళుతున్నానని చెప్పి..
రితన్యను పుట్టింట్లో వదిలిన తర్వాత, కవిన్ జూన్ 23, 27 తేదీలలో ఆమెను చూడటానికి వచ్చారు. మరుసటి రోజు, జూన్ 28న మొండిపాళయంలోని పెరుమాళ్ ఆలయానికి వెళ్తున్నానని చెప్పి రితన్య ఒంటరిగా కారు తీసుకెళ్లారు. రితన్య సాధారణంగా వారానికోసారైనా ఆ గుడికి వెళ్లేది కాబట్టి, కుటుంబీకులు ఆమెను ఒంటరిగానే పంపించారు.
ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు, తల్లి జయసుధకు రితన్య మొబైల్ నుంచి ఒక కాల్ వచ్చింది. చెట్టిపుత్తూర్ అనే ప్రదేశంలో పార్క్ చేసిన కారులో ఈ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉన్నారని జయసుధకు రితన్య ఫోన్ నుంచి ఒకరు సమాచారం అందించారు. ఆ తర్వాత, రితన్యను ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మరణించారు.
మొదట్లో, రితన్య ఆత్మహత్యకు సంబంధించి ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
కానీ, జూన్ 28న ఆత్మహత్యకు ముందు, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రితన్య ఆడియో సందేశాన్ని రికార్డ్ చేసి, తండ్రికి పంపారు. ఆ సమయంలో రితన్య తండ్రి మొబైల్‌లో 'ఇంటర్‌నెట్' ఆపివేసి ఉంది కాబట్టి, వాట్సాప్ మెసేజ్ రాలేదు.
అదే రోజు రాత్రి, అన్నాదురై బంధువులలో ఒకరు రాత్రి 11 గంటల ప్రాంతంలో అన్నాదురై మొబైల్ తీసుకొని, 'ఇంటర్ నెట్' ఆన్ చేశారు. దీంతో రితన్య మొబైల్ నంబర్ నుంచి 10 ఆడియో రికార్డింగ్‌లు అన్నాదురై వాట్సాప్‌కు వచ్చాయి.
రితన్య చనిపోయే ముందు వాట్సాప్ ద్వారా ఆడియోలను పంపిందని ఆమె బంధువులకు అర్థమైంది. తన ఆత్మహత్యకు కవిన్, అతని తండ్రి, తల్లి కారణమని రితన్య అందులో చెప్పడం విన్నారు.
'300 సవర్ల నగలు, కారు, పెళ్లి ఖర్చులు రూ. 3 కోట్లు'
ఆడియో విన్న అన్నాదురై, రితన్య అత్తింటివారిపై చెయూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో, రితన్య భర్త కవిన్ కుమార్, ఆయన తండ్రి ఈశ్వరమూర్తి, తల్లి చిత్రా దేవిపై ఆత్మహత్యకు ప్రేరేపించడం, తదితర అభియోగాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కవిన్ కుమార్, ఈశ్వరమూర్తిని అరెస్టు చేసిన పోలీసులు, చిత్రా దేవి ఆరోగ్య సమస్యల దృష్ట్యా అదుపులోకి తీసుకోలేదని చెప్పారు.
రితన్య తండ్రి అన్నాదురై బీబీసీతో మాట్లాడుతూ "మేం 70 లక్షల రూపాయల వోల్వో కారు కొనిచ్చాం. 300 సవర్ల నగలు ఇస్తామన్నాం, అందులో 150 సవర్లు ఇచ్చాం. మిగిలినవి మా దగ్గర ఉన్నాయి. కానీ, వారు ఇంకా ఎక్కువ అడిగారు, నా కూతురును హింసించారు. ఆమెను రెండు వారాల్లోనే ఇంటికి తిరిగి పంపించారు. అంతా సర్దుకుంటుందని రితన్యను ఒప్పించి, తిరిగి అత్తారింటికి పంపించాను. కానీ, నా కూతురు బయటికి చెప్పలేనంతగా శారీరక హింసను ఎదుర్కొంది" అని అన్నారు.
"రితన్య నాతో గానీ, నా భార్యతో గానీ అంతా చెప్పలేదు. మా ఇంట్లో తన అత్తగారితో గంటన్నరసేపు ఏకాంతంగా మాట్లాడింది. ఆ తర్వాత, ఆమె అత్తగారు మా దగ్గరకు వచ్చి, 'మా అబ్బాయి ఇలా చేస్తాడని అనుకోలేదు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం' అని చెప్పి రితన్యను తీసుకెళ్లారు'' అని ఆయన అన్నారు.
"కానీ, రితన్య మళ్లీ 20 రోజులకే తిరిగొచ్చింది. మీ నాన్న 500 సవర్ల నగలు ఇస్తానని, సగం కూడా ఇవ్వలేదంటూ ఆమెను హింసించారు" అని అన్నాదురై అన్నారు.
రితన్య బంధువు భూపతి బీబీసీతో మాట్లాడుతూ ''అబ్బాయికి ఉద్యోగం లేదు. అద్దెల ద్వారా వారికి నెలకు 10–15 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. పెళ్లికి రూ. 3 కోట్లు ఖర్చయింది'' అన్నారు.
రితన్య మరణానికి ముందు తండ్రికి పంపిన ఆడియో రికార్డింగ్‌లను కూడా ఆయన పంచుకున్నారు. ఆ రికార్డింగ్‌లలో తాను తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నానని రితన్య చెప్పారు.
భర్త కవిన్, ఆయన తండ్రి ఈశ్వరమూర్తి, తల్లి చిత్రా దేవి కారణంగానే ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నానని ఆమె చెబుతున్నట్లుగా ఆ ఆడియోల్లో ఉంది.
లోతుగా విచారణ జరగాలి: పోలీసులు
తమకు న్యాయం జరగాలని, ఇలాంటి పరిస్థితి మళ్లీ ఏ అమ్మాయికీ రాకూడదని రితన్య తండ్రి అన్నాదురై అన్నారు.
రాజకీయ పలుకుబడి ఉపయోగించి కవిన్ కుటుంబం కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని రితన్య బంధువు భూపతి బీబీసీ వద్ద ఆరోపించారు.
కవిన్ తల్లిని అరెస్టు చేయకపోవడంపై రితన్య బంధువులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో దీని గురించి చెయూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజప్రభును బీబీసీ ప్రశ్నించింది.
కవిన్ తల్లికి ఇటీవలె సర్జరీ జరిగిందని, దర్యాప్తు సమయంలో ఆమె తరచుగా మూర్ఛపోతుండటంతో, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని అరెస్టు చేయలేదని ఇన్‌స్పెక్టర్ రాజప్రభు అన్నారు. కానీ, ఆమె పేరును కూడా కేసులో చేర్చినట్లు ఆయన తెలిపారు.
కవిన్ అరెస్టుపై స్పందించడానికి ఆయన బంధువులు ఎవరూ అందుబాటులోకి రాలేదు. వారి తరఫున న్యాయవాది షణ్ముగనందన్ బీబీసీతో మాట్లాడుతూ "కవిన్ కుటుంబాన్ని అరెస్టు చేయడంతో, దీని గురించి ఎవరూ మాట్లాడే పరిస్థితిలో లేరు. వారి అనుమతి లేకుండా నేనేం చెప్పలేను" అని అన్నారు.
ఘటనపై తిరుప్పూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి మోహనసుందరం దర్యాప్తు ప్రారంభించారు.
అవినాశి డీఎస్పీ శివకుమార్ బీబీసీతో మాట్లాడుతూ "రితన్య పంపిన ఆడియో స్వాధీనం చేసుకున్నాం. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు భర్త, మామ, అత్తలపై కేసు నమోదు చేశాం.
కానీ, తనతో ఎలా ప్రవర్తించారనే దానిపై రితన్య ఆడియోలో స్పష్టంగా చెప్పలేదు. కాబట్టి, లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది. రెవెన్యూ డివిజనల్ విచారణ కూడా జరుగుతోంది. రెండు వైపులా దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమైన కారణాలు తెలుస్తాయి" అని అన్నారు.
హెల్ప్‌లైన్ నంబర్లు
మీరు లేదా మీకు తెలిసిన వారు ఒత్తిడి లేదా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటే, దిగువన ఉన్న హెల్ప్‌లైన్‌ల ద్వారా మీకు అవసరమైన సహాయం పొందవచ్చు.
- ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
- సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)