You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బంగ్లాదేశ్: ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లలో 90 మంది మృతి
- రచయిత, అన్బరసన్ ఎతిరాజన్
- హోదా, బీబీసీ న్యూస్
బంగ్లాదేశ్‌లో పోలీసులు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఘర్షణలు మరింత తీవ్రమవుతున్నాయి. తాజా ఘర్షణలలో 90 మంది మరణించారు.
ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి నాయకులు నిరసనలకు పిలుపునివ్వడంతో ఆ దేశంలో అశాంతి నెలకొంది.
సిరాజ్‌గంజ్ జిల్లాలో ఒక పోలీసు స్టేషన్‌పై వేల మంది దాడి చేయడంతో 13 మంది పోలీసు అధికారులు మరణించారు.
ఆదివారం బంగ్లాదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో ప్రదర్శనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించారు. రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. ఆదివారం నాటి ఘర్షణలలో సుమారు 200 మంది గాయపడ్డారు.
జూలైలో ఈ ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 280 మందికి పైగా మరణించారు.
నిరసనలను నియంత్రణలోకి తెచ్చేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా దేశవ్యాప్తంగా రాత్రి వేళ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.
సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో కోటా రద్దు చేయాలన్న డిమాండ్‌తో గత నెలలో మొదలైన ఈ నిరసనలు క్రమంగా విస్తృత రూపందాల్చుతూ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయి.
కాగా బంగ్లాదేశ్ న్యాయ శాఖ మంత్రి అనీసుల్ హక్ ఆదివారం ‘బీబీసీ న్యూస్అవర్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అధికారులు నిగ్రహం పాటిస్తున్నారని అన్నారు.
‘మేం సంయమనం పాటించకపోతే రక్తపాతం జరిగేది. మా సహనానికీ హద్దులున్నాయి’ అన్నారు అనీసుల్ హక్.
కాగా ఘర్షణల నేపథ్యంలో ఇప్పటికే రాజధాని ఢాకాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
బంగ్లాదేశ్ టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ కమిషన్ అధికారి ‘బీబీసీ బెంగాలీ’తో మాట్లాడుతూ ఢాకా ప్రాంతంలో 4జీ ఇంటర్నెట్ సేవలు ప్రస్తుతానికి నిలిపివేశామని, బ్రాడ్‌బ్యాండ్ సేవలు కొనసాగుతాయని చెప్పారు.
బంగ్లాదేశ్‌లో 3జీ, 4జీ సేవలు అందుబాటులో లేకపోతే మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగించుకోవడం సాధ్యం కాదు. అయితే, మొబైల్ ఇంటర్నెట్ సేవలు ఎప్పటికి పునరుద్ధరిస్తానేది అధికారులు ఇంకా చెప్పలేదు.
బంగ్లాదేశ్‌లోని ఉత్తర జిల్లాలైన బోగ్రా, పబ్నా, రంగపూర్ సహా దేశవ్యాప్తంగా మరణాలు నమోదయ్యాయి. పెద్దసంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
ఢాకాలోని ప్రధాన కూడలిలో వేలాది మంది ప్రజలు గుమిగూడారు. అక్కడ హింసాత్మక ఘటనలు జరిగాయి. ఢాకాలోని ఇతర ప్రాంతాలలోనూ హింసాత్మక సంఘటనలు జరిగాయి.
కొన్ని చోట్ల పాలక అవామీ లీగ్ మద్దతుదారులు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులతో ఘర్షణకు దిగుతున్నట్లు చెప్తున్నారు.
‘నగరం మొత్తం యుద్ధభూమిగా మారింది’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీస్ అధికారి ‘ఏఎఫ్‌పీ’ వార్తాసంస్థతో చెప్పారు.
ఢాకాలోని ఓ హాస్పిటల్ బయట వేల మంది నిరసనకారులు పోగై అక్కడున్న కార్లు, మోటారు సైకిళ్లకు నిప్పు పెట్టారని ఆయన చెప్పారు.
ప్రస్తుతం జరుగుతున్న నిరసనలకు వెనుక ఉన్నారని చెప్తున్న ‘స్టూడెంట్స్ అగెనెస్ట్ డిస్క్రిమినేషన్’ అనే గ్రూప్ ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా దిగిపోవాలని పిలుపునిచ్చింది.
ఈ గ్రూప్ ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా ‘శాసనోల్లంఘన ఉద్యమం’ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలెవరూ పన్నులు, యుటిలిటీ బిల్లులు ఏవీ చెల్లించరాదంటూ పిలుపునిచ్చింది.
ప్రజారవాణా ఆపేయాలని, అన్ని ఫ్యాక్టరీలు మూసివేయాలని పిలుపునిచ్చారు.
కాగా జులై నెలలో జరిగిన హింసలో 200 మందికి పైగా మరణించారు. వారిలో పోలీసు కాల్పులలో మరణించినవారే ఎక్కువ.
గత రెండు వారాల్లో భద్రత బలగాలు సుమారు 10,000 మందిని అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టైన వారిలో విద్యార్థులు, బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు ఉన్నారు.
మరోవైపు అవామీ లీగ్ ఆదివారం కూడా దేశవ్యాప్తంగా మార్చ్ నిర్వహించింది.
రాబోయే రోజులు పాలక, విపక్ష శిబిరాలు రెండింటికీ కీలకం.
‘షేక్ హసీనా రాజీనామా చేయడమే కాదు, హత్యలు, దోపిడీలు, అవినీతిపై విచారణ జరగాలి’ అని విద్యార్థి ఉద్యమ నాయకులలో ఒకరైన నహిద్ ఇస్లాం ఢాకాలో శనివారం నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి అన్నారు.
జనవరిలో జరిగిన ఎన్నికలలో వరుసగా నాలుగోసారి ప్రధాని పదవికి ఎన్నికైన షేక్ హసీనాకు ఈ నిరసనలు సవాలుగా మారాయి. ఆ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బహిష్కరించింది.
భారత్ అప్రమత్తం
బంగ్లాదేశ్‌లో తాజా ఘర్షణల నేపథ్యంలో అక్కడున్న తన పౌరులను భారతదేశం అప్రమత్తం చేసింది. ఈ మేరకు సిలహట్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం అడ్వైజరీ విడుదల చేసింది.
అసిస్టెంట్ హైకమిషన్ పరిధిలో ఉన్న భారతీయ పౌరులు, విద్యార్థులు తమ కార్యాలయంతో టచ్‌లో ఉండాలని సూచించింది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)