You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నితిన్ గడ్కరీ ప్రకటనతో ప్రధాని పదవిపై మొదలైన చర్చ
బీజేపీ నాయకులు రావ్ ఇంద్రజిత్, అనిల్ విజ్, నితిన్ గడ్కరీ.. ఈ ముగ్గురు నాయకుల మాటలు పతాక శీర్షికల్లో నిలుస్తున్నాయి.
హరియాణా ముఖ్యమంత్రి పదవిపై రావ్ ఇంద్రజిత్, అనిల్ విజ్ బహిరంగంగానే తమ అభిప్రాయం చెబుతున్నారు.
అదే సమయంలో నితిన్ గడ్కరీ అన్న ఓ మాటను కూడా కొందరు ప్రతిపక్ష నాయకులు అదే తరహాలో చూస్తున్నారు.
‘మీరు ప్రధాని అయితే మేం మద్దతిస్తాం’ అని ఒక నేత తనతో అన్నట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతవారం ఒక సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు.
నితిన్ గడ్కరీకి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో సత్సంబంధాలు లేవని ప్రతిపక్ష నేతలు తరచూ అంటుంటారు.
గడ్కరీ చేసే కొన్ని వ్యాఖ్యలు అలాంటి ఊహాగానాలకు ఆజ్యం పోస్తుంటాయి. ఈ ప్రకటనలను ఒక రకమైన సంకేతంగా నిపుణులు భావిస్తారు. గడ్కరీ తాజా ప్రకటన కూడా ఆ పరంపరలోనిదే.
గడ్కరీ ఏమన్నారు?
2024 సెప్టెంబర్ 14న నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి నితిన్ గడ్కరీ హాజరయ్యారు.
‘‘నేను వాళ్ల పేరును వెల్లడించాలనుకోవడం లేదు. కానీ, ‘మీరు ప్రధానమంత్రి అవుతామంటే మేం మద్దతిస్తాం’ అని ఒక నేత నాతో అన్నారు’’ అని ఆ కార్యక్రమంలో గడ్కరీ చెప్పారు.
‘‘నేను వాళ్లను, ‘మీరు నాకు ఎందుకు మద్దతు ఇస్తారు? మీ మద్దతు నేను ఎందుకు తీసుకోవాలి?’ అని ప్రశ్నించాను. ప్రధాని కావడం నా జీవిత లక్ష్యం కాదు. నేను నా సంస్థ పట్ల నిజాయితీగా, నిబద్ధతతో ఉన్నాను. నేను ఏ పదవి కోసం రాజీపడను. పట్టుదలతో ఉండడం నాకు ప్రధానం’’ అని గడ్కరీ అన్నారు.
గడ్కరీకి ప్రతిపక్ష పార్టీల నేతలతోనూ మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతుంటారు.
తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక నిర్వహించిన 'ఐడియా ఎక్స్ఛేంజ్' కార్యక్రమంలో గడ్కరీని ఈ ప్రశ్నే అడిగారు.
‘‘ప్రతిపక్షాలను శత్రువుగానో, దేశ వ్యతిరేకిగానో భావించని అతికొద్ది మంది బీజేపీ నేతలలో మీరు ఒకరు. ఈ కోణంలో, బలమైన ప్రతిపక్షం రాజకీయాలకు మంచిదా లేక బీజేపీ మెజారిటీలో ఉండడం మంచిదా?’’ అని ప్రశ్నించారు.
“మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. మన దేశాన్ని మదర్ ఆఫ్ డెమొక్రసీ అని ప్రధాని అంటుంటారు. ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ ఉంటాయి. కారు లేదా రైలు చక్రాలలాగా వాటి మధ్య బ్యాలెన్స్ అవసరం. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండడం మా అదృష్టం. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్. ఇదే మన లక్ష్యం కావాలి’’ అని ఆయన బదులిచ్చారు.
గడ్కరీ ప్రకటనపై స్పందన
నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపై అనేక మంది విపక్ష నేతలు స్పందించారు.
‘‘అత్యున్నత పదవిపై తన మనసులోని కోరికను నితిన్ గడ్కరీ వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం ప్రతిపక్ష పార్టీల పేరుతో మోదీకి సందేశాలు పంపుతున్నారు. ‘ఇండియా’ కూటమిలో దేశాన్ని నడిపించగల సమర్థులైన నాయకులు ఎందరో ఉన్నారు. బీజేపీ నుంచి నాయకులను అరువు తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు’’ అని శివసేన (యూటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
“ప్రధాని పదవి కోసం బీజేపీలో పోరు మొదలైంది. మీరు రాబోయే నెలల్లో దాని ఫలితాలను చూడవచ్చు. బీజేపీ ఈసారి నరేంద్ర మోదీని ప్రధానిగా ఎంపిక చేసిందా? టైమ్‌లైన్ చెక్ చేయండి. ఎన్డీయే ఎంపిక చేసింది’’ అని ఆర్‌జేడీ నేత మనోజ్ కుమార్ ఝా చెప్పినట్టు హిందుస్థాన్ టైమ్స్ తెలిపింది.
నిజానికి 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కాకుండా, ఎన్డీయే సమావేశం జరిగింది.
2024 ఎన్నికల ఫలితాలను బీజేపీ వెబ్‌సైట్‌లో ప్రకటించిన తర్వాత, బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురించి కాకుండా, ఎన్డీయే సమావేశానికి సంబంధించిన పత్రికా ప్రకటన విడుదలైంది.
2019లో 303 సీట్లు గెలిచినప్పుడు, ఎన్నికల ఫలితాల మరుసటి రోజు మే 24న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది, ఎన్డీయే సమావేశం కాదు.
జూన్ 7న పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో నితీశ్ కుమార్ మోదీని పార్లమెంటరీ పార్టీ నాయకునిగా ప్రకటించారు.
చంద్రబాబు నాయుడు, నితీష్‌లకే బీజేపీ అవసరం ఎక్కువ
లోక్‌సభలో బీజేపీకి 240 మంది ఎంపీలున్నారు. జేడీయూ, టీడీపీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నరేంద్ర మోదీ (మూడోసారి) ప్రధానమంత్రి అయ్యారు.
బీజేపీలో నరేంద్ర మోదీ స్థానాన్ని గడ్కరీ భర్తీ చేయగలరా? అని మాజీ రాజ్యసభ ఎంపీ, రాజకీయ విశ్లేషకులు కుమార్ కేత్కర్‌ను బీబీసీ అడిగింది.
విశ్వాస తీర్మానంలో మోదీ ఓడిపోతే మరో అభ్యర్థి కోసం అన్వేషణ మొదలవుతుందని, అప్పుడు నితిన్ గడ్కరీ పేరు తెర మీదకు రావచ్చని కేత్కర్ సమాధానమిచ్చారు.
‘‘ఒక జర్నలిస్టుగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లో గడ్కరీని ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరిగాయని మీకు చెప్పగలను. మోదీ స్థానాన్ని మరెవరైనా భర్తీ చేయగలరా? ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి, సంక్షోభ పరిస్థితి ఏర్పడి, విశ్వాస పరీక్షలో మోదీ ఓడిపోవడం అవసరం’’ అని కేత్కర్ అన్నారు.
ఈసారి సాధారణ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, బిహార్‌లకు వేర్వేరుగా ప్రకటనలు చేశారు.
ఈ బడ్జెట్ మిత్రపక్షాలను సంతృప్తి పరిచి, ప్రభుత్వాన్ని నిలబెట్టేలా ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
"నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీపై ఎక్కువగా ఆధారపడ్డారు కానీ, మోదీ వాళ్లపై ఎక్కువ ఆధారపడలేదు’’ అనేది నా అభిప్రాయం. ఇద్దరు నేతల్లో ఒకరు వెళ్లినా మోదీ ప్రధానిగానే కొనసాగుతారు. ‘ఇండియా’ కూటమిలో చేరడం వల్ల నితీష్, చంద్రబాబుకు ఏమీ ప్రయోజనం లేదని మోదీకి తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం మనుగడ సాగించగలదు’’ అని ఎన్డీఏ కూటమిలో నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడుల పాత్రపై మాట్లాడుతూ కేత్కర్ అన్నారు.
ఏదైనా రాజకీయ సంక్షోభం తలెత్తితే, ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయంగా గడ్కరీ పేరును ప్రస్తావిస్తారని కేత్కర్ అన్నారు. బీజేపీ, సంఘ్ రెండూ ఆయనను ఇష్టపడతాయని తెలిపారు.
గడ్కరీ ప్రకటనలు, ఊహాగానాలు
బీజేపీ లోపల, బయట ఇలాంటి చర్చలకు దారి తీసే ప్రకటనలు చేయడం నితిన్ గడ్కరీకి ఇది మొదటిసారి కాదు.
2019 జనవరిలో, గడ్కరీ ముంబయిలో మాట్లాడుతూ.. "ప్రజలు కలలు కనే నాయకులను ఇష్టపడతారు, కానీ ఆ కలలను నెరవేర్చకపోతే, ప్రజలు వారిని కొడతారు. అందువల్ల, నెరవేర్చగల కలల గురించి మాత్రమే మాట్లాడండి. నేను కలలు కనేవాడిని కాదు. కానీ నేను ఏది చెప్పినా 100% పూర్తి చేస్తాను’’ అన్నారు.
బీజేపీ తరచుగా ఇందిరా గాంధీని విమర్శిస్తుంటుంది. కానీ, 2019లో గడ్కరీ ఇందిరా గాంధీని ప్రశంసించారు.
‘'బీజేపీ సైద్ధాంతిక పార్టీ. బీజేపీ ఎప్పుడూ అటల్- ఎల్‌కే అడ్వాణీల పార్టీ లేదా ఇప్పుడు మోదీ- షాల పార్టీ కాదు’’ అని మే 2019లో గడ్కరీ అన్నారు.
‘‘నేను మంచి పని చేశానని అన్ని పార్టీల ఎంపీలు నమ్మడం నా అదృష్టం’’ అని 2019లో లోక్‌సభ సమావేశాల సమయంలో నితిన్ గడ్కరీ అన్నారు. గడ్కరీ ప్రకటనపై, సోనియా గాంధీ కూడా తన టేబుల్‌ను చేత్తో కొడుతూ అభినందించారు.
రాయ్‌బరేలీలో గడ్కరీ మంత్రిత్వ శాఖ పనితీరును ప్రశంసిస్తూ 2018లో సోనియా గాంధీ ఆయనకు ఒక లేఖ రాశారు.
“ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర చాలా ముఖ్యమైనది. కాంగ్రెస్ బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేడు కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లు పార్టీపై నిబద్ధత చూపుతూ అందులోనే కొనసాగాలి. ఓటమిని చూసి నిరాశ చెందకుండా పని కొనసాగించాలి’’ అని 2022 మార్చిలో గడ్కరీ అన్నారు.
‘‘రాజకీయాలకు అతీతంగా జీవితంలో చేయాల్సింది చాలా ఉందని నేను అనుకుంటాను. అందుకే నాకు తరచూ రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలనిపిస్తుంది’’ అని 2022 జులైలో నితిన్ గడ్కరీ అన్నారు.
రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వాళ్లు, తాము ఏ డిమాండ్ చేసినా అంగీకరించాలని భావిస్తుంటారని 2022 జులైలో గడ్కరీ వ్యాఖ్యానించారు.
ఈ ప్రకటనలు చేసిన మూడు వారాల తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరీని తొలగించారు. కేంద్ర ఎన్నికల కమిటీ నుంచి గడ్కరీని తొలగించి, దేవేంద్ర ఫడ్నవీస్ పేరును చేర్చారు.
"బీజేపీలో తనను 'అవమానిస్తున్నట్లు' నితిన్ గడ్కరీ భావిస్తే, ఆయన మా వద్దకు రావచ్చు. ఆయన 2024 ఎన్నికల్లో విజయం సాధించేలా చూస్తాం’’ అని 2024 ఎన్నికలకు ముందు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
దీనిపై స్పందించిన గడ్కరీ, ‘‘బీజేపీ నేతల గురించి ఉద్ధవ్ ఠాక్రే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ అభిమాన నాయకుడు
ఆర్‌ఎస్‌ఎస్ అభిమానించే నాయకులలో నితిన్ గడ్కరీ ఒకరని భావిస్తారు. అయితే నరేంద్ర మోదీ, అమిత్ షాలతో గడ్కరీకి ఉన్న సంబంధాల గురించి చాలా విషయాలు ప్రచారంలో ఉన్నాయి.
“నితిన్ గడ్కరీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, కోర్టు ఆదేశాలతో అమిత్ షా గుజరాత్ రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన గడ్కరీని కలవడానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు పార్టీలో మోదీ, షాల పట్టు పెరిగిపోవడంతో గడ్కరీకి రెక్కలు కట్టేసినట్లు ఉంది’’ అని సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ సింగ్ బీబీసీతో చెప్పారు.
2013 తర్వాత కూడా నితిన్ గడ్కరీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతారని భావించారు. ఇందుకోసం పార్టీ రాజ్యాంగాన్నీ సవరించారు.
అయితే, అదే సమయంలో తనపై అవినీతి ఆరోపణలు రావడంతో గడ్కరీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత గడ్కరీ అవినీతి ఆరోపణలపై చర్చ పూర్తిగా ఆగిపోయింది.
గడ్కరీ రాజీనామా తర్వాత రాజ్‌నాథ్ సింగ్ పార్టీ పగ్గాలు చేపట్టారు. రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ తమ ప్రధాని అభ్యర్థి అని చెబుతూ బీజేపీ ప్రచారం నిర్వహించింది.
అప్పుడు పార్టీ కనుక నితిన్ గడ్కరీ సారథ్యంలో ఉండి ఉంటే, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర అయ్యే అవకాశం ఉండేది కాదని అంటారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)