You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడాలంటే హడల్, 17 ఏళ్లుగా విదేశీ జట్లు ఎందుకు భయపడ్డాయి?
- రచయిత, విధాన్షు కుమార్
- హోదా, బీబీసీ కోసం
అంతర్జాతీయ క్రీడా మైదానాల్లో తీవ్రవాద దాడులు జరిగిన సందర్భాలు చాలా తక్కువ.
1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో తొలిసారి ఇలాంటి ఘటన జరిగింది. బహుశా ఇప్పటివరకు జరిగిన వాటిలో ఇదే అతి పెద్దది కూడా.
నాటి ఘటనలో తీవ్రవాదులు 11 మంది అథ్లెట్లను హతమార్చారు. ఇది యావత్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది.
దీని తర్వాత, క్రీడా ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో భద్రతను పెంచారు. స్టేడియాల్లో, ఆటగాళ్లు బస చేసే ప్రదేశాల్లో కాపలాను కట్టుదిట్టంగా మార్చారు. ఆటగాళ్ల వద్దకు సాధారణ ప్రజలు నేరుగా చొచ్చుకొని రాకుండా నిషేధం విధించారు.
బహుశా ఈ చర్యల వల్లే ఆ తర్వాత క్రీడా మైదానాల్లో తీవ్రవాద దాడులు ఆగిపోయాయి. కానీ, 2009లో దీనికి బ్రేక్ పడింది. మరోసారి అంతర్జాతీయ క్రీడాకారులే లక్ష్యంగా పాకిస్తాన్‌లో తీవ్రవాద దాడి జరిగింది.
లాహోర్‌లోని గఢాఫీ స్టేడియానికి కొద్ది దూరంలో దాదాపు 7 నిమిషాల పాటు జరిగిన ఈ తీవ్రవాద దాడి, దశాబ్దాల పాటు విదేశీ క్రికెట్ జట్లు పాకిస్తాన్‌కు దూరంగా ఉండేలా చేసింది.
ఇలా పాకిస్తాన్‌తో సంబంధాలు తెంచుకున్న జట్లలో ఇంగ్లండ్ కూడా ఒకటి. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు ఇటీవలే ఇంగ్లండ్, పాకిస్తాన్‌లో పర్యటించింది.
కానీ, ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్, పాకిస్తాన్ పర్యటనకు రానుంది.
చివరిసారిగా 2005లో పాకిస్తాన్ గడ్డ మీద ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ ఆడింది.
2-0తో మైకేల్ వాన్ నేతృత్వంలోని ఇంగ్లండ్‌పై గెలుపొందింది.
ఆ తర్వాత నుంచి ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించేందుకు ధైర్యం చేయలేదు. ఎందుకంటే, క్రికెట్ ఆడటానికి పాకిస్తాన్ దేశం సురక్షితం కాదని వారు భావించారు.
భద్రతా కారణాల రీత్యా ఇంగ్లండ్ మాత్రమే కాదు దశాబ్దానికి పైగా ప్రపంచంలోని ఏ క్రికెట్ టీమ్ కూడా పాకిస్తాన్‌లో ఆడేందుకు ఇష్టపడలేదు.
అంతకుముందు కూడా చాలాసార్లు విదేశీ క్రికెట్ జట్లు పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకున్నాయి. పాకిస్తాన్ క్రికెట్‌ను చీకట్లోకి నెట్టిన కారణాలేంటో చూద్దాం.
శ్రీలంక జట్టుపై భయానక దాడి
2009 మార్చి 3వ తేదీన శ్రీలంక జట్టు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో రెండో టెస్టు మ్యాచ్ ఆడటం కోసం తాము బస చేసిన హోటల్ నుంచి బయలుదేరింది.
స్టేడియానికి ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది ఒక ప్రైవేట్ బస్సులో ప్రయాణం అయ్యారు.
వారి వెనుకే మినీ వ్యాన్‌లో మ్యాచ్ అంపైర్లు స్టేడియానికి వెళుతున్నారు. ఆతిథ్య పాకిస్తాన్ జట్టు వీరికంటే 5 నిమిషాలు ఆలస్యంగా స్టేడియానికి బయల్దేరింది.
ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రయాణిస్తోన్న బస్సు, లాహోర్‌లోని లిబర్టీ చౌక్ దాటగానే అక్కడే దాక్కొని ఉన్న దాదాపు 12 మంది తీవ్రవాదులు బస్సుపై దాడి చేయడం మొదలు పెట్టారు.
అప్పుడు తీవ్రవాదుల వద్ద ఏకే-47, ఆర్పీజీ, గ్రెనెడ్లు వంటి ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నాయి.
తొలుత బస్సు టైర్లలోకి బుల్లెట్లు కాల్చారని, ఆ తర్వాత బస్సులోని ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని పోలీసు నివేదికలు తెలిపాయి.
బస్సుపైకి ఒక రాకెట్‌ను కూడా ప్రయోగించారు. కానీ, అది గురి తప్పి సమీపంలోని ఒక స్తంభాన్ని ఢీకొట్టింది. బస్సు వెళ్లే ప్రాంతంలో గ్రెనెడ్ బాంబును కూడా అమర్చారు. అయితే, బస్సు దాన్ని దాటేసి వెళ్లిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
శ్రీలంక కెప్టెన్ మహేల జయవర్ధనే మాట్లాడుతూ... ‘‘వారు మొదట బస్సు టైర్లపై, ఆ తర్వాత బస్సు లోపలికి కాల్పులు జరిపారు. వెంటనే బుల్లెట్ల నుంచి తప్పించుకోవడానికి మేమంతా బస్సు ఫ్లోర్‌పై పడుకున్నాం. అయిదుగురికి పైగా ఆటగాళ్లు, మా సహాయక కోచ్ గాయపడ్డారు’’ అని చెప్పారు.
‘‘అజంతా మెండిస్ మెడ, తలపై గాయాలు అయ్యాయి. కానీ, మేం బాగానే ఉన్నాం’’ అని ఆటగాళ్లకు తగిలిన బుల్లెట్ల గురించి కుమార సంగక్కర చెప్పారు.
థిలన్ సమరవీర కాలికి బుల్లెట్ తగలగా, తరంగ పరణవితన ఛాతీలో బుల్లెట్ తగిలింది.
వెనుక వ్యాన్‌లో వస్తోన్న అంపైర్ల బృందంలో టీవీ అంపైర్ ఎహ్‌సాన్ రజా కూడా గాయపడ్డారు.
ఇంత జరుగుతున్నా డ్రైవర్ బస్సును ఆపకపోవడం విశేషం. అయితే, గడాఫీ స్టేడియం చేరుకున్న తర్వాత ఆయన చనిపోయారు.
హెలికాప్టర్‌లో జట్టు తరలింపు
సమరవీర, పరణవితన తీవ్రంగా గాయపడ్డారు. వారికి తక్షణమే చికిత్స అందించాల్సి ఉంది.
పరిస్థితి అంతా గందరగోళంగా తయారైంది. ఎయిర్‌పోర్ట్‌కు రోడ్డు మార్గాన వెళ్లడం సురక్షితం కాదని పాకిస్తానీ అధికారులు భావించారు. పాకిస్తాన్ ఆర్మీ హెలికాప్టర్‌లో ఆటగాళ్లను విమానాశ్రయానికి తరలించారు.
తర్వాతి విమానంలో శ్రీలంక ఆటగాళ్లు కొలంబో వెళ్లారు. అక్కడ గాయపడిన ఆటగాళ్లను ఆసుపత్రిలో చేర్చారు.
ఆటగాళ్ల బస్సుపై దాడి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. తర్వాత ఈ దృశ్యాలను ప్రపంచమంతా టీవీల్లో చూసింది.
ఈ దాడిలో ఆరుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. రెండో టెస్టు మ్యాచ్‌ను రద్దు చేశారు.
సెప్టెంబర్ 11 ఘటనతో కివీస్ జట్టు కూడా
అమెరికాలో సెప్టెంబర్ 2001 దాడులకు పాల్పడిన వారికి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తేలింది.
ఈ దాడుల తర్వాత మొదటగా న్యూజీలాండ్ జట్టు పాక్ పర్యటనకు వెళ్లడానికి నిరాకరించింది.
తర్వాత వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లు కూడా పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడటానికి తిరస్కరించాయి.
దీంతో పాకిస్తాన్‌లో కాకుండా తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు జరపాలనే కొత్త మార్గాన్ని కనుగొన్నారు.
కొలంబో, షార్జా స్టేడియాలను తమ సొంత మైదానాలుగా పాకిస్తాన్ పరిగణించి మ్యాచ్‌లు ఆడటం ప్రారంభించింది.
టీమ్ హోటల్ బయట బాంబు పేలుడు
వాయిదా పడిన సిరీస్ కోసం ఏడాది తర్వాత న్యూజీలాండ్ జట్టు పాకిస్తాన్‌కు వెళ్లింది.
2002 మే నెలలో కరాచీలోని హోటల్ షెరటాన్‌లో న్యూజీలాండ్ బస చేసింది.
అయితే, హోటల్‌కు బయట జరిగిన భారీ బాంబు పేలుడుతో కివీస్ జట్టు అదిరిపడింది.
అప్పుడు పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చిన న్యూజీలాండ్ జట్టు తర్వాత చాలా కాలం వరకు తిరిగి పాకిస్తాన్‌కు వెళ్లలేదు.
బెనజీర్ హత్యతో ఆస్ట్రేలియా వెనక్కి
2007 డిసెంబర్‌లో రావల్పిండిలో జరిగిన తీవ్రవాద దాడిలో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో హత్యకు గురయ్యారు.
దేశ ప్రముఖ నేత మరణం కారణంగా పాకిస్తాన్ క్రికెట్ చాలా నష్టపోయింది.
2008 మార్చిలో పాకిస్తాన్‌లో ఆస్ట్రేలియా పర్యటించాల్సి ఉంది. కానీ, ఈ ఘటనతో పాక్ వెళ్లేందుకు ఆస్ట్రేలియా తిరస్కరించింది.
తర్వాత చాలా జట్లు ఇలాగే చేశాయి.
పాకిస్తాన్‌లో క్రికెట్ జరగాలంటే అక్కడి పరిస్థితులను పూర్తిగా మార్చేయాలని ఐసీసీ కూడా భావించింది.
భద్రతా కారణాలతో చాలా పర్యటనలు రద్దు
దీని తర్వాత భద్రతా కారణాలను చూపిస్తూ పాకిస్తాన్‌లో జరగాల్సిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సహా అనేక ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దు అయ్యాయి.
తొలుత 5 దేశాలు 2008 చాంపియన్స్ ట్రోఫీకి హాజరు అయ్యేందుకు నిరాకరించాయి. దీంతో టోర్నీని 2009కి వాయిదా వేశారు.
తర్వాత టోర్నీ ఆతిథ్యాన్ని పాకిస్తాన్ నుంచి మార్చేశారు.
2008లోనే వెస్టిండీస్ పురుషుల, మహిళల జట్లు కూడా పాకిస్తాన్‌లో ఆడేందుకు నిరాకరించాయి.
ముంబై దాడుల తర్వాత భారత్..
2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన తీవ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌లో ఆడేందుకు భారత్ నిరాకరించింది.
భారత్ నిరాకరించడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలాగోలా శ్రీలంక జట్టును సిరీస్ ఆడేందుకు ఒప్పించింది.
కానీ, అప్పుడు శ్రీలంక జట్టుపైనే తీవ్రవాదులు దాడికి పాల్పడిన తీరును చూసిన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ నిరాశ చెందారు.
‘‘ఇక ఎప్పటికి పాకిస్తాన్‌లో క్రికెట్ జరుగుతుందో? ఏ జట్టు ఇక్కడికి వస్తుందో కూడా తెలియదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ తీవ్రవాద ఘటనల కారణంగా దాదాపు 10 ఏళ్ల పాటు ఏ జట్టు కూడా పాకిస్తాన్‌కు వెళ్లలేదు.
11 ఏళ్ల తర్వాత శ్రీలంక జట్టు మళ్లీ అక్కడికి వెళ్లి ఆడటంతో పాకిస్తాన్ ఎదురుచూపులకు తెరపడింది.
శ్రీలంకతో పాటు జింబాబ్వే, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్లు కూడా అక్కడ వన్డే, టి20 సిరీస్‌లు ఆడటం ప్రారంభించాయి.
మళ్లీ ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ టీమ్ పాకిస్తాన్‌లో టెస్టు సిరీస్ ఆడనుండటంతో పాకిస్తాన్‌లో సంబరాలు చేసుకుంటున్నారు.
ఇటీవల ఒక పాకిస్తాన్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ... ‘‘అంతర్జాతీయ జట్లు పర్యటనలకు రాకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి దిగజారుతోంది’’ అని అన్నారు.
‘‘మా క్రికెట్ మైదానాలు, పెళ్లి మండపాలుగా మారుతున్నాయి. మైదానాల్లో మేం క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాం. స్టేడియాల్లో అభిమానులను మేం మిస్ అవుతున్నాం. ఇది పాకిస్తాన్ క్రికెట్‌కు చాలా గడ్డు కాలం’’ అని ఆఫ్రిది వ్యాఖ్యానించారు.
ఆ గడ్డు కాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్ నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించినట్లు కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- చైనా మహిళలు గుండ్రని, పెద్ద కళ్ల కోసం సర్జరీలు చేయించుకుంటున్నారా
- తన చిన్ననాటి జ్ఞాపకాలతో గ్రామం మ్యాప్ గీశాడు.. కిడ్నాప్ అయిన 30 ఏళ్ల తర్వాత కన్నతల్లిని కలిశాడు
- చైనా జనాభా ఎందుకు తగ్గిపోతోంది? ప్రభుత్వం పన్ను రాయితీలు, ప్రోత్సాహాలు ఇస్తున్నా ఎక్కువ మంది పిల్లల్ని ఎందుకు కనట్లేదు?
- చైనా: అంతరిక్షంలో నంబర్ 1 కావాలనుకుంటుందా? ప్రయోగాలకు నిధులు సమకూరుస్తున్నది ఎవరు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)