You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం.. ఎవరేమన్నారంటే
దేశంలో కులగణన చేపట్టాలని బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన పొలిటికల్ అఫైర్స్ కేబినెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన సమాచారం ఇస్తూ, తదుపరి జనగణన సందర్భంగా కులగణన కూడా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ఈ కేబినెట్ కమిటీలో మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఉన్నారు.
కాంగ్రెస్ ఎప్పుడూ కులగణనను వ్యతిరేకిస్తుందని వైష్ణవ్ అన్నారు. 2010లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కులగణన హామీ ఇచ్చారని, కానీ ఆ తర్వాత జరిగిందేమీ లేదని ఆయన అన్నారు.
స్వాగతిస్తున్నాం: రాహుల్ గాంధీ
కేబినెట్ నిర్ణయాన్ని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వాగతించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
''మేం కొంతకాలంగా కులగణన గురించి చెబుతూనే ఉన్నాం. మోదీ ప్రభుత్వం గతంలో దీనిని వ్యతిరేకించింది, ఏవేవో కారణాలు చూపింది. ఇప్పుడు, వాళ్లు అకస్మాత్తుగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఈ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. కానీ, దీని అమలుకి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను డిమాండ్ చేస్తున్నాం'' అని అందులో రాశారు.
కులగణనకు తెలంగాణ రాష్ట్రం ఒక నమూనాగా నిలుస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.
చారిత్రక నిర్ణయం: కిషన్ రెడ్డి
ఈసారి జరగనున్న జనగణన సందర్భంగా కులగణన కూడా చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ చారిత్రక నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
''జనగణనతో పాటే కులగణన చేపట్టడం మరింత పారదర్శకతను తీసుకొస్తుంది. రాజకీయ అవకతవకలకు అవకాశం లేకుండా చేస్తుంది'' అని ఆయన ఎక్స్‌లో రాశారు.
రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కులగణన నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్‌లో స్పందించారు.
''నేడు, తెలంగాణ ఏం చేస్తుందో, దేశం దానిని రేపు అనుసరిస్తుందని నిరూపించాం'' అని ఆయన రాశారు.
''రాహుల్ గాంధీ దిశానిర్దేశంలో, భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని డిమాండ్ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. దానికి అనుగుణంగానే రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే నిర్వహించాం. రాష్ట్ర జనాభాలో 56.32 శాతం మంది వెనకబడిన కులాలకు చెందిన వారని తేలింది.
తెలంగాణ శాసనసభలో సమర్పించిన నివేదిక ఆధారంగా విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని తీర్మానించి, ప్రతిపాదనలు కూడా చేశాం.''
కులగణన చేపట్టాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో స్పందించారు.
అహ్మదాబాద్‌లో ఏప్రిల్ 9న జరిగిన ఏఐసీసీ సమావేశంలో చేసిన తీర్మానం కాపీని జైరాం రమేశ్ పోస్ట్ చేస్తూ, ''అహ్మదాబాద్‌లో ఏప్రిల్ 9 నాటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంపై తీర్మానం చేసి, ఆమోదించింది. అసలు జరగకపోవడం కంటే, ఆలస్యంగానైనా జరగడం మంచిదే'' అని ఆయన రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)