మెదడు తినేసే ఏకకణ జీవి కారణంగా ఫ్లోరిడావాసి మృతి, ఏం జరిగింది?

    • రచయిత, మాక్స్ మాజ్జా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మనిషి మెదడును తినేసే అమీబా కారణంగా అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఒకరు మరణించారు.

నైరుతి ఫ్లోరిడాలోని షార్లోట్ కౌంటీకి చెందిన ఆ వ్యక్తికి కొళాయి నీటి వల్ల ముక్కు ద్వారా ఈ అమీబా మెదడుకు చేరి ఇన్ఫెక్షన్ సోకి ఉండొంచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు.

చనిపోయిన వ్యక్తి ఎవరనేది అధికారులు బయటపెట్టలేదు.

నెగ్లేరియా ఫాలెరీ అనే ఈ అమీబా ముక్కు ద్వారా మెదడుకు చేరుతుంది. నీట్లో ఈ అమీబా ఉన్నప్పుడు ఆ నీటిని తాగడం వల్ల ఏమీ కాదని.. కానీ, ఈ నెగ్లేరియా ఫాలెరీ ఉన్న నీటితో ముక్కు రంథ్రాలను శుభ్రం చేయడం ప్రమాదమని నిపుణులు చెప్తున్నారు.

ఇన్ఫెక్షన్లు ఎప్పుడూ ప్రాణాంతకమేనని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) చెప్తోంది.

ఫిబ్రవరి 23న నెగ్లేరియా ఫాలెరి ఇన్ఫెక్షన్‌తో ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేరినట్లు ఫ్లోరిడా ఆరోగ్య విభాగం చెప్పింది. అనంతరం మార్చి 2న ఆ వ్యక్తి చనిపోయినట్లు ప్రకటించారు.

వివిధ ప్రభుత్వ సంస్థలకు చెందిన అధికారులు ఈ మృతిపై దర్యాప్తు చేస్తున్నారని.. ఈ ఇన్ఫెక్షన్ ఎలా సోకిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ ప్రతినిధి జే విలియమ్స్ చెప్పారు.

కొళాయి నీటి ద్వారా ఇన్ఫెక్షన్ సోకినట్లు ప్రాథమికంగా అనుమానిస్తుండడంతో స్థానికంగా ఉండే నీటి వనరులను పరిశీలిస్తున్నారు.

సాధారణంగా ఈ అమీబా స్విమింగ్ పూల్స్, సరస్సులు, చెరువులు వంటి వాటిలోని వెచ్చని నీటిలో ఉంటుంది.

ఈ అమీబా కనుక మెదడుకు చేరితే తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఈ అమీబా ఉన్న నీటిని నోటి ద్వారా తాగితే ప్రమాదం ఉండదు. కడుపులోని ఆమ్లాలు ఈ ఏకకణజీవిని చంపేస్తాయి.

ఈ అమీబా వల్ల ఇన్ఫెక్షన్ సోకినవారికి ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్సెఫలైటిస్ అనే వ్యాధి సోకుతుంది.

తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, గతి తప్పడం, మెడ పట్టేయడం, తూలిపోతుండడం, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు అనిపిస్తుండడం వంటి లక్షణాలు కలుగుతాయి.

అమెరికాలో ఏటా సగటున ముగ్గురు ఈ వ్యాధి బారిన పడుతుంటారని, వారంతా ప్రాణాంతక పరిస్థితులను ఎదుర్కొంటుంటారని సీడీసీ గణాంకాలు చెప్తున్నాయి.

1962 నుంచి 2021 మధ్య అమెరికాలో 154 మందికి ఇది సోకగా వారిలో కేవలం నలుగురు మాత్రమే బతికారు. చలికాలంలో ఈ ఇన్ఫెక్షన్ సోకడం చాలా అరుదని సీడీసీ గణాంకాలు చెప్తున్నాయి.

సురక్షితం కాని నీటితో ముక్కు రంథ్రాలు శుభ్రం చేయరాదని, మరిగించిన నీరు వాడాలని అధికారులు సూచిస్తున్నారు.

స్విమింగ్ పూల్స్‌లో దిగేటప్పుడు ఆ నీరు ముక్కులోకి వెళ్లకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)