You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లాస్‌ఏంజలెస్: శివారుప్రాంతాలలో కార్చిచ్చు, కార్లు, ఇళ్లను వదిలేసి తరలిపోతున్న ప్రజలు
అమెరికాలోని లాస్‌ఏంజలెస్ శివారు ప్రాంతాలు కార్చిచ్చులో చిక్కుకున్నాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు వ్యాపిస్తుండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వేగంగా వీస్తున్న గాలులు ప్రమాద తీవ్రతను మరింత పెరిగేలా చేస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
తొలుత 10 ఎకరాలలో చెలరేగిన కార్చిచ్చు కేవలం కొన్ని గంటల్లోనే నుంచి 2,900 ఎకరాలకు పైగా వ్యాపించింది.
లాస్ ఏంజలెస్ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
పసిఫిక్ పాలిసేడ్స్ పరిసరాలతోపాటు అనేక మంది ప్రముఖులు నివసించే కాలాబాసాస్, టోపాంగా కాన్యన్‌లో కూడా ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకుంటున్నారు.
గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులు వల్ల పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.
పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలోని ఇళ్ళు మంటల్లో చిక్కుకున్నాయి.
నివాసితులు తమ ఇళ్లు, కార్లను వదిలేసి వెళ్లిపోతున్నారు.
30,000 మందికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.
13,000 భవనాలు ముప్పులో ఉన్నాయని ఫైర్ చీఫ్ క్రిస్టిన్ క్రౌలీ చెప్పారు.
పాలిసాడ్స్ నుండి 40 కిమీ దూరంలో ఉన్న ఈటన్ కాన్యన్ సమీపంలో మంగళవారం సాయంత్రం మంటలు చెలరేగాయి.
దాదాపు 250 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. లాస్ ఏంజలెస్ అగ్నిమాపక విభాగం ఆఫ్ డ్యూటీ అగ్నిమాపక సిబ్బంది నుంచి మరింత సహాయం కోరింది. ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని ఎక్స్ లో పోస్ట్ చేసింది.
పాలిసేడ్స్ నుండి బయటపడటానికి ఒక్క రోడ్డు మార్గమే ఉంది. వందల సంఖ్యలో నివాసితులు కార్లల్లో తరలిపోయేందుకు ప్రయత్నించడంతో ట్రాఫిక్ స్తంభించింది. కార్లు మంటల్లో చిక్కుకునే ప్రమాదం ఉండటంతో ప్రజలు భయాందోళనతో ఎక్కడి కార్లు అక్కడే విడిచి వెళ్లారు. ట్రాఫిక్ స్తంభన తరలింపు చర్యలకు సమస్యగా మారింది. అధికారులు రోడ్డుపై అడ్డుగా ఉన్న 200 పైగా కార్లను బుల్డోజర్ సహాయంతో తొలగించారు.
పవర్ అవుటేజస్ యూఎస్ తెలిపిన ప్రకారం, లాస్ ఏంజిల్స్ కౌంటీలో రెండు లక్షల మందికి విద్యుత్ అంతరాయంతో ఇబ్బంది కలిగింది. రాత్రిపూట ఈదురు గాలులు పెరగడంతో , చెట్లు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపోయి రోడ్డుపై పడే అవకాశం ఉందని అధికారులు ముందుగానే హెచ్చరించారు.
ఈదురు గాలుల కారణంగా పక్కనే ఉన్న సాన్ బెర్నార్డియో కౌంటీలో మరో 13,600 మంది కూడా విద్యుత్ సమస్య ఎదుర్కొంటున్నారు.
అధ్యక్షుడు జోబైడెన్ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రభావిత ప్రాంతాల్లోని నివాసితులను అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల హెచ్చరికలను పాటించాలని చెప్పారు. మంగళవారం రాత్రి, తక్షణ సహాయ చర్యల కోసం ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ నిధులు మంజూరు చేసింది.
లాస్ ఏంజలెస్‌లో మూడోసారి మంటలు చెలరేగాయి. శాన్ ఫెర్నాండో వ్యాలీ సబర్బన్ పరిసరాల్లో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో కొత్తగా 100 ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. అక్కడ కూడా తప్పనిసరిగా నివాసితులను తరలించాలని అధికారులు ఆదేశించారు. మూడు వైపులా మంటలతో లాస్ ఏంజిల్స్ నగరం అంగారక గ్రహంలా ఎర్రగా ఉందని స్థానికులు బీబీసీతో అన్నారు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)