ఆకృతి చౌధురి: ఎన్‌ఎస్ఏ కింద నిర్బంధంలో ఉన్న ఈ యువతిని విడుదల చేయమంటూ కోర్టు ఏం చెప్పింది, అసలెవరీ ఆకృతి చౌధురి?

ఫొటో సోర్స్, Akriti Chaudhary
జాతీయ భద్రతాచట్టం (ఎన్‌ఎస్ఏ) కింద ఆకృతి చౌధురి (25) నిర్బంధాన్ని అలహాబాద్ హైకోర్టు సెప్టెంబరు 2న కొట్టివేసింది.
దిల్లీ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో పట్టభద్రురాలైన ఆకృతి.. ఈ ఏడాది ఏప్రిల్‌లో నోయిడాలో జరిగిన కార్మిక నిరసనలతో సంబంధం ఉందనే అభియోగాలపై దాదాపు 5 నెలలుగా నిర్బంధంలో ఉన్నారు.
ఆమె నిర్బంధాన్ని సవాలు చేస్తూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌ని హైకోర్టు అనుమతించింది.
'కట్టుకథల ఆధారంగా' ప్రభుత్వం ఆమెను అక్రమంగా నిర్బంధించిందని జస్టిస్ అతుల్ శ్రీధర్, అచల్ సచ్‌దేవా ధర్మాసనం గుర్తించింది.
దీంతో ఇతర కేసుల్లో అరెస్ట్ అవసరం అయితే తప్ప ఆమెను తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.


ఫొటో సోర్స్, Getty Images
‘రూ.5లక్షలు నష్టపరిహారం చెల్లించండి’
ఆకృతి చౌధురి అరెస్టు ప్రక్రియను భారత జాతీయ భద్రత కోడ్ (బీఎన్‌ఎస్ఎస్) కింద ఆమెకు జారీ చేసిన నోటీసులను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట.. ఈ ప్రక్రియలో అనేక లొసుగులు ఉన్నట్టు ధర్మాసనం గుర్తించింది.
డిటెన్షన్ ఆర్డర్‌ని హైకోర్టు రద్దు చేసినట్టు ఆకృతి తరపు న్యాయవాది చార్లీ ప్రకాశ్, సీనియర్ అడ్వకేట్ కోలిన్ గాన్సాల్వెస్ ది హిందూతో మాట్లాడుతూ నిర్ధరించారు.
"ఆకృతి అరెస్టు, నిర్బంధానికి సంబంధించి ప్రభుత్వం సమర్పించిన పత్రాల్లో తీవ్రమైన లోపాలను కోర్టు గుర్తించింది. ఆమెకు ఐదు లక్షలరూపాయల నష్టపరిహారం చెల్లించాలని కూడా నోయిడా జిల్లా మెజిస్ట్రేట్‌ని ఆదేశించింది" అని చార్లీ ప్రకాశ్ తెలిపారు.
ఈ వ్యవహారానికి సంబంధించి, పూర్తి కోర్టు ఆదేశాలుఇంకా రావాల్సి ఉంది.
అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్వాగతించారు.
"ఆకృతి నిర్బంధాన్ని రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రశంసనీయం. నోయిడా కార్మిక నిరసనలకు సంబంధించి పూర్తి దురుద్దేశపూరిత అభియోగాలతో యూపీ పోలీసులు ఆమెను నిర్బంధంలోకి తీసుకున్నారు" అని ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Akriti Chaudhary
ఎందుకు అరెస్ట్ చేశారు?
నోయిడా కార్మిక నిరసనలకు సంబంధించి అరెస్టయిన అనేక మంది కార్యకర్తల్లో ఆకృతి చౌధురి ఒకరు. పొరుగున ఉన్న హరియాణాతో సమానంగా తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 10వ తేదీ నుంచి 18వ తేదీ మధ్య పారిశ్రామిక, కాంట్రాక్ట్ కూలీలు నిరసనకు దిగారు. ఏప్రిల్ 13న నిరసనలు హింసాత్మకంగా మారాయి. రోడ్లను నిర్బంధించారు.
ఒక నెల రోజుల తరువాత నిరసనకారులు రాళ్లు విసరడం, దహనకాండకు పాల్పడేలా ప్రేరేపించారని ఆరోపిస్తూ జాతీయ భద్రతా చట్టం కింద ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఆకృతిపై కేసు నమోదు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా తమ వద్ద బలమైన ఎలక్ట్రానిక్, వీడియో ఆధారాలు ఉన్నాయని ఓ మీడియా సమావేశంలో పోలీసులు పేర్కొన్నారు.
కానీ, ఏప్రిల్ 13న హింస చెలరేగడానికి ముందే తనను అదుపులోకి తీసుకున్నట్టు ఆకృతి తన పిటిషన్‌లో వాదించారని లైవ్ లా వెబ్‌సైట్ తెలిపింది. తనను నిర్బంధంలోకి తీసుకోవడానికి తగిన నిజమైన ఆధారాలు లేవని, తన ముందస్తు నిర్బంధ ప్రక్రియ చట్టవిరుద్ధమని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నోటీసు ఇవ్వలేదని పోలీసుల అంగీకారం
ఆకృతిని ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10:56 గంటలకు అరెస్టు చేసి, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 130 కింద వార్నింగ్ (హెచ్చరిక) నోటీసు జారీచేసినట్టు యూపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే హెచ్చరిక జారీ చేయడానికి ముందే ఆమెకు షోకాజ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదని జస్టిస్ శ్రీధరన్ ప్రశ్నించారు.
సెక్షన్ 126 కింద ఆకృతికి ఎలాంటి నోటీసు ఇవ్వలేదని పోలీసులు అంగీకరించారు. ఆ తర్వాత జనరల్ డైరీ తెప్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. నోటీసుకు ముందే ఆకృతి చౌధురిని అరెస్టు చేసినట్టు డైరీ బయటపెట్టింది.
అరెస్టుకు ముందు ఆకృతిని ఏదైనా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారా? అని హైకోర్టు ప్రశ్నించింది. నిరసనకారులను రెచ్చగొట్టారని చెప్పడానికి గల ఆధారాలను కూడా సమర్పించాలని ఆదేశించింది.
ఘటనాస్థలి వద్ద ఆందోళనకారులు ఏప్రిల్ 11నే గుమిగూడినట్టు పోలీసులు తెలిపారు. అయితే పోలీసు రికార్డుల ప్రకారం ఆ రోజు ఎలాంటి హింస జరగలేదని కోర్టు గుర్తించింది.
నిరసనకారులు రాళ్లు విసిరి, వాహనాలను దహనం చేసేలా ఆకృతి చౌధురి ప్రేరేపించారనే ఆరోపణలకు సంబంధించి వీడియో ఫుటేజీని సమర్పించడంలో కూడా పోలీసులు విఫలమయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆకృతి ఏమంటున్నారు?
"ఎన్ఎస్ఏ అభియోగాలను కొట్టివేయడం భారీ ఉపశమనం. అయితే పోరాటం ఇక్కడితో ముగియలేదు. కార్మికులు, కార్యకర్తలందరినీ విడుదల చేసేంతవరకు కొనసాగుతూనే ఉంటుంది" అని గ్రేటర్ నోయిడా జైలు నుంచి ది హిందూతో ఆకృతి చెప్పారు.
"ఇనుప కంచెలకు ఆవల ఉన్న ఆకృతి మొహంలో కన్నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇతర కార్యకర్తలలాగే బంధుమిత్రులను కలుసుకునేందుకు ఆమె ఎదురుచూస్తున్నారు" అని ఆకృతితో ఇంటర్వ్యూ సందర్భంగా అక్కడి పరిస్థితిని వివరిస్తూ ది హిందూ పేర్కొంది.
"మా అమ్మాయి నేటి తరం భగత్ సింగ్. ఆమెకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఆమె తప్పు చేసిందని మేమెప్పుడూ అనుకోం. న్యాయవ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది" అని ఆకృతి తండ్రి అరుణ్ చౌధురి ది హిందూతో అన్నారు.
ఆకృతి పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నివాసి. ఆమె ప్రస్తుతం దిల్లీ యూనివర్సిటీలోని లా విభాగంలో ఎల్ఎల్‌బీ మొదటి సంవత్సరం చదువుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జైలులో ఏం చేశారు?
జైలులో తన అనుభవాన్ని వివరిస్తూ.. వంట చేయడం, గది శుభ్రం చేయడం, తోటి మహిళా ఖైదీల పిల్లలకు చదువు చెప్పడం వంటి పనులు చేసినట్టు ది హిందూతో ఆకృతి చౌధరీ తెలిపారు. నిరసనలకు సంబంధించి మనీషా చౌహాన్, శృష్టిలతో పాటు తనను కూడా యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. జైలులో మూతబడిన లైబ్రరీని తిరిగి తెరిపించి, ఇతరులను పుస్తకాలు చదివేలా ప్రోత్సాహించినట్టు ఆకృతి తెలిపారు.
"మేము పని చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మనం ఉండే ప్రదేశాన్ని పదిలంగా ఉంచుకోవడంలో తప్పు లేదు" అని ఆకృతి అన్నారు.
కుట్టుపని,సౌందర్యసాధనాల తయారీ సహా అనేక శిక్షణ తరగతులకు తాము ముగ్గురం హాజరైనట్టు ఆకృతి తెలిపారు.
"మా రోజూవారీ దినచర్యలో పని కూడా భాగం. దాంతో పాటు పిల్లలకు బోధిస్తాం. ఇప్పటివరకు పోస్టర్లు చేశాం. కవితలు రాశాం. గ్రంథాలయాన్ని, మా గదిని అలంకరించాం. చదవడం, చర్చించడం వంటి సంస్కృతిని కూడా మొదలుపెట్టాం. ఇవన్నీ కుటుంబాల నుంచి దూరంగా ఉన్నామనే బాధను తప్పించి, సాంత్వన కలిగించేందుకు ఉపయోగపడుతున్నాయి" అని ఆకృతి చెప్పారు.
నాటక రంగంలోనూ ఆకృతికి ప్రవేశం ఉంది. దిశ స్టూడెంట్స్ ఆర్గనేషన్‌తో అనుబంధం ఉంది. దిల్లీ యూనివర్సిటీలోని దౌలత్ రామ్ కాలేజ్‌లో ఆమె హిస్టరీ చదివారు.
హింస చెలరేగడానికి రెండు రోజుల ముందు ఏప్రిల్ 11న బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ దగ్గర మరో ముగ్గురితో కలిపి ఆకృతిచౌధురిని పోలీసులు అరెస్టు చేశారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























