You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్ త్వరలోనే అగ్రరాజ్యంగా అవతరిస్తుందా?
- రచయిత, ఫెర్నాండో డువార్ట్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
భారత్ మరికొన్నేళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అధికార పార్టీ నేతలతో పాటు పలువురు ఆర్థిక నిపుణులూ చెబుతున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఆరు వారాల పాటు జరిగే ఈ ఎన్నికల్లో 96.9 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
అణ్వాయుధాలను కలిగి ఉండి, చంద్రునిపై అంతరిక్ష నౌక (స్పేస్ క్రాఫ్ట్) దింపిన దేశంగా భారతదేశం ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. అంతేకాదు, యూకే ఆర్థిక వ్యవస్థను అధిగమించి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
ఇక ప్రపంచంలో తదుపరి అగ్రరాజ్యంగా భారత్ అవతరిస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.
భారత జనాభా ఈ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి ఎలా ఉపయోగపడనుంది? ఇపుడున్న సవాళ్లేంటి?
ఆర్థిక రంగంలో ప్రగతి
గత ఆగస్టులో దక్షిణాఫ్రికా పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘ భారత్ ప్రపంచానికి వృద్ధి ఇంజన్‌గా నిలుస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
అయితే, గత మూడు నెలల్లో 8.4 శాతం పెరిగిన ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా 2023 చివరలో భారత్ నిలిచింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను జీడీపీ ద్వారా లెక్కిస్తారు, ఇది ఒక దేశంలోని కంపెనీలు, ప్రభుత్వాలు, వ్యక్తుల ఆర్థిక కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుంటుంది.
భారత్ 2027 నాటికి జర్మనీ, జపాన్‌లను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీతో సహా అనేక ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి.
1947లో స్వాతంత్ర్యం పొందినప్పుడు భారత్ ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటి. దశాబ్దాల బ్రిటీష్ పాలనలో మౌలిక సదుపాయాల కొరత, వ్యవసాయం పెరుగుతున్న జనాభా ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించలేకపోయాయి.
ఆ సమయంలో భారతదేశంలో తలసరి ఆయుర్దాయం 35 సంవత్సరాలు. కానీ నేడు రెండింతలు పెరిగి 67 ఏళ్లకు చేరుకుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
అదే సమయంలో ప్రపంచ సగటు 71 సంవత్సరాలుగా ఉంది. ప్రపంచ బ్యాంకు ప్రకారం భారత్ ప్రపంచంలో 10వ అతిపెద్ద ఎగుమతి దేశం.
ఇందులో ప్రధానంగా శుద్ధి చేసిన నూనె, వజ్రాలు, ప్యాక్ చేసిన మందులు ఉంటాయి.
సేవల రంగం, టెలికాం, సాఫ్ట్‌వేర్ రంగాల అభివృద్ధి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో తోడ్పడ్డాయి. అయితే, అదే వేగంతో కొత్త ఉద్యోగాల సృష్టి జరగలేదని ఆర్థికవేత్తల అభిప్రాయం.
వచ్చే దశాబ్దంలో భారత జనాభా పెరుగుతున్నందున, 7 కోట్ల ఉద్యోగాల సృష్టి జరగాలనేది హెచ్ఎస్‌బీసీ అంచనా వేసింది.
జనాభా పెరిగినా..
భారత జనాభా సగటు వయస్సు అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే తక్కువగా ఉంది. ఐక్యరాజ్యసమితి ప్రకారం, 2022లో చైనా సగటు వయస్సు 38.4, జపాన్ 48.6తో పోలిస్తే భారతదేశ జనాభా సగటు వయస్సు 28.7 ఉంటుంది.
ప్రస్తుతం భారత జనాభా దాదాపు 140 కోట్లు. 2030 నాటికి భారతదేశంలో పని చేసే వయసులో ఉండే వారి సంఖ్య 100 కోట్లు దాటుతుందని భారత ఆర్థికవేత్తలు బషర్ చక్రవర్తి, గౌరవ్ దాల్మియాలు అంచనా వేస్తున్నారు.
జపాన్, చైనాతో సహా ఇతర ఆసియా దేశాలు సాధించిన ఆర్థిక పురోగతి అనేవి ఈ "పని చేసే వయసులో ఉండే జనాభా"పై ఆధారపడి ఉందని హార్వర్డ్ బిజినెస్ రివ్యూతో వారు చెప్పారు. అయితే వారంతా ఏళ్లపాటు పనిచేయలేరు.
ఐక్యరాజ్యసమితి ప్రకారం దాదాపు 1.8 కోట్ల మంది భారత పౌరులు విదేశాలలో నివసిస్తున్నారు. ఏటా దాదాపు 25 లక్షల మంది విదేశాలకు వెళుతున్నారు. ఇందులో ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఉన్నారు.
విదేశీ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం, విదేశాలకు వెళ్లిన భారతీయులు ఎక్కువగా అక్కడ ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. అక్కడి పౌరసత్వం పొంది, భారత్‌లో రద్దు చేసుకుంటున్నారు.
ఎందుకంటే భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వం అనుమతించరు. 2022 నాటికి 2,25,000 మందికి పైగా భారతీయుల పౌరసత్వం రద్దు చేశారు. గత దశాబ్ద కాలంలో ఇదే అత్యధిక సంఖ్య.
స్థానికంగా ఉపాధి పొందడం చాలా మందికి సవాలు. ఆయా ప్రభుత్వాల గణాంకాల ప్రకారం భారతదేశ నిరుద్యోగిత రేటు 8 శాతం. అమెరికాలో ఇది 3.8 శాతం.
భారతదేశంలోని నిరుద్యోగుల్లో 83 శాతం మంది 15-29 సంవత్సరాల మధ్య వయస్సులోని వారని, అందులో ఎక్కువగా సెకండరీ ఎడ్యుకేషన్ చదివినవారే ఉన్నారని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మార్చిలో తెలిపింది.
"నేను భారతదేశం అంతటా పర్యటిస్తూ యువతతో మాట్లాడుతుంటాను. వారికి భారత్ ఏం సాధిస్తుందో కూడా పూర్తిగా తెలియదు, నిరాశలోనే ఉన్నారు" అని జర్నలిస్ట్, రచయిత సిద్ధార్థ దేబ్ అన్నారు.
"ఆర్థిక వృద్ధి దేశంలో హైవేలు, విమానాశ్రయాల వంటి కొత్త మౌలిక సదుపాయాలను తీసుకువచ్చింది, లక్షాధికారుల సంఖ్య పెరిగింది. కానీ దేశంలోని ప్రజలు కష్టపడుతూనే ఉన్నారు” అని సిద్ధార్థ చెప్పారు.
జాబ్ చేసే మహిళలు ఎందుకు తగ్గుతున్నారు?
ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత్‌లో పనిచేస్తున్న మహిళలు 33 శాతం. ప్రపంచ సగటు 49 శాతంతో పోలిస్తే భారతదేశంలో తక్కువగా ఉంది.
ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం అమెరికాలో పనిచేస్తున్న మహిళలు 56.5 శాతం, చైనాలో 60.5 శాతంగా ఉంది. భారత మహిళలు గతం కంటే ఎక్కువ మంది చదువులో ముందున్నప్పటికీ, వివాహం తర్వాత వారు చాలావరకు ఇంటికే పరిమితమవుతున్నారు.
చాలామంది వర్కింగ్ వుమెన్ స్వయం ఉపాధిలోనే ఉన్నారని బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీకి చెందిన ఆర్థికవేత్త ప్రొఫెసర్ అశ్విని దేశ్‌పాండే అన్నారు.
"ఎంప్లాయిమెంట్ కాంట్రాక్టులు, సెక్యురిటీ బెనిఫిట్స్‌తో రెగ్యులర్ పెయిడ్ ఉద్యోగాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం తక్షణ అవసరం" అని అశ్విని అభిప్రాయపడ్డారు.
అలా అనుకోవడం మూర్ఖత్వమే
ప్రపంచంలోని అత్యంత అసమాన దేశాల్లో భారతదేశం ఒకటి.
ఫోర్బ్స్ ప్రకారం, భారత జనాభాలో దాదాపు సగం మంది ప్రపంచ బ్యాంకు మధ్యస్థ దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. అయితే భారత బిలియనీర్ల సంఖ్య 1991లో ఒకటి ఉండగా, 2022 నాటికి 162కి పెరిగింది.
భారతదేశంలో అసమానతలు ఉన్నాయని యుఎస్‌లోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ ఎకనామిక్ పాలసీ ప్రొఫెసర్, డాక్టర్ అశోక మోతీ అంటున్నారు.
"భారీ నిర్మాణాత్మక మార్పులు లేకుండా భారత్ సూపర్ పవర్ అవుతుందనడం మూర్ఖత్వం" అని అశోక అన్నారు.
ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంతో సహా ఈ అసమానతను పరిష్కరించే సామాజిక సంస్కరణలు అవసరమని ఆయన సూచించారు.
అయితే, "కోట్లాది మందికి పని దొరకడం కష్టం. విద్య, ఆరోగ్యం చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి" అని అశోక మోతీ ఆరోపించారు.
మత ఘర్షణలు
భారత్‌లో రాజకీయ విభేదాలు కొత్తేమీ కాదు. 1800ల నుంచి భారతదేశం లౌకిక దేశంగా ఉండాలా లేక హిందూ దేశంగా ఉండాలా అనే చర్చ జరుగుతోంది.
భారతదేశంలో దాదాపు 80 శాతం మంది హిందువులున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత ఈ చర్చ ఎక్కువైంది. ముస్లింలపై విద్వేషపూరిత నేరాలు పెరుగుతున్నాయి.
ఇక భారత్‌లో సీఏఏ అమలుపై ఐక్యరాజ్యసమితి, అమెరికాలు సైతం తమ ఆందోళనలను వినిపించాయి.
2014 ఎన్నికల తర్వాత భారతదేశం ఎలా ఉందనే దానిపై నవల రచయిత్రి దేవికా రేజ క్వార్టర్‌లైఫ్ అనే వివాదాస్పద నవల రాశారు. దేశం మత సంఘర్షణను ఎదుర్కొంటోందని ఆమె అభిప్రాయపడ్డారు.
"2014 ఎన్నికలు ప్రజలను స్నేహితులు, కుటుంబ సభ్యుల స్థాయి నుంచి వేర్వేరు దిశల్లోకి లాక్కెళ్లాయి." అని దేవికా ఆరోపించారు.
భారత ఎకనామీలో వృద్ధి లేదని చెప్పలేమని, కానీ, అదే సమయంలో పౌర హక్కులపై రాజీ పడ్డారని ఆమె అభిప్రాయపడ్డారు.
"పాశ్చాత్య దేశాల కీలుబొమ్మ కాదు"
ఆసియాలో చైనా ఆధిపత్యానికి భారత్ ధీటైన శక్తిగా మారుతుందని పశ్చిమ దేశాలు ఆశించాయి.
అణ్వాయుధాలతో పాటు, 14.5 లక్షల మంది క్రియాశీల సిబ్బందితో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైన్యం ఉంది. కానీ భారత్ పశ్చిమ దేశాల కోరికను అనుసరించడానికి ఇష్టపడటం లేదు.
రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో ఇండియా తటస్థ వైఖరి అనుసరించింది. మాస్కోపై పాశ్చాత్య దేశాల ఆంక్షలను ధిక్కరిస్తూ రష్యా చమురును రాయితీ ధరకు కొనుగోలు చేసింది, దీంతో గత రెండేళ్లుగా విమర్శలు ఎదుర్కొంది.
సంప్రదింపులకు చైనా కంటే భారత్ సులువని పశ్చిమ దేశాలు ఆశించవచ్చని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో అంతర్జాతీయ సంబంధాల నిపుణురాలు సానియా కులకర్ణి అన్నారు.
కానీ తనకు సొంత లక్ష్యాలూ ఉన్నాయని భారత్ గుర్తుచేస్తుంటుందని తెలిపారు.
"భారత్ పాశ్చాత్య దేశాలకు రాయబారిగా వ్యవహరిస్తుందని ఆశించడం తప్పు" అని సానియా కులకర్ణి అన్నారు.
భారతదేశం తనను తాను పాశ్చాత్యేతర వ్యక్తిగా చెప్పుకోవడానికి ఇష్టపడుతుంది, వెస్టర్న్ ప్రాధాన్యాలు, విధానాలకు భిన్నంగా ఉంటుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బీజేపీ మేనిఫెస్టో: ఉమ్మడి పౌర స్మృతి నుంచి ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ వరకు ఏయే అంశాలు ఉన్నాయంటే?
- ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తత: యుద్ధభయం ఉన్నా ఇజ్రాయెల్ వెళ్లడానికి ఈ యూపీ యువకులు ఎందుకు సిద్ధమవుతున్నారు?
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- పాకిస్తాన్ క్రికెట్లో కొత్త డ్రామా, అమీర్ రీఎంట్రీకి కారణాలేంటి?
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)