You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణ
భారత్ - పాకిస్తాన్ కాల్పుల విరమణను ప్రకటించాయి. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదిరినట్లు భారత్-పాక్ స్పష్టం చేశాయి.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ శనివారం సాయంత్రం ట్రూత్ సోషల్, ఎక్స్‌లో చేసిన పోస్టుల తర్వాత, వరుస పరిణామాలు జరిగాయి.
భారత్, పాకిస్తాన్‌లు పూర్తి స్థాయి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో తెలిపారు.
ఆ పోస్టులో.. "అమెరికా మధ్యవర్తిత్వంలో, రాత్రంతా సుదీర్ఝ చర్చల తర్వాత భారత్, పాకిస్తాన్ పూర్తిస్థాయి, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించడానికి సంతోషిస్తున్నా. కామన్‌సెన్స్, గ్రేట్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించినందుకు రెండు దేశాలకు అభినందనలు. ఈ విషయంపై దృష్టి పెట్టినందుకు ధన్యవాదాలు!" అని తెలిపారు.
అంగీకారం కుదిరింది: భారత్
దీనిపై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటన చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ పాటించేందుకు అంగీకారం కుదిరిందని ఆయన తెలిపారు.
''పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఈరోజు మధ్యాహ్నం 3.35 గంటలకు భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌తో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది.
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్.. అన్ని రకాల సైనిక చర్యలను నిలిపివేసేందుకు అంగీకారం కుదిరింది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ పాటించేందుకు అంగీకారం కుదిరింది. దీనికి సంబంధించి ఇరువైపులా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఇరుదేశాల డీజీఎంవోలు మే 12న 12 గంటలకు మరోసారి చర్చలు జరుపుతారు'' అని మిస్రీ చెప్పారు.
ఇరుదేశాలు అంగీకరించాయి: పాకిస్తాన్
పాకిస్తాన్, భారత్‌లు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అన్నారు.
"పాకిస్తాన్ తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై రాజీ పడకుండా, దేశంలో శాంతి, భద్రత కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుంది" అని ఆయన తెలిపారు.
విస్తృత చర్చలు ప్రారంభించడానికి భారత్, పాకిస్తాన్ అంగీకరించాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు.
ఉగ్రవాదంపై రాజీ ఉండదు: జైశంకర్
భారత్, పాకిస్తాన్ కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయడానికి అంగీకరించాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ శనివారం ఎక్స్‌లో తెలిపారు.
''ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అన్నిరకాలుగా స్థిరంగా దృఢమైన, రాజీలేని వైఖరిని అవలంబించింది. ఇదే వైఖరి కొనసాగుతుంది'' అని తెలిపారు.
స్వాగతిస్తున్నాం : డేవిడ్ లామీ
భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణపై యూకే విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ స్పందించారు.
కాల్పుల విరమణను ''సాదరంగా స్వాగతిస్తున్నాం'' అని యూకే విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ సోషల్ మీడియా వేదికగా పోప్ట్ చేశారు.
''దీనిని కొనసాగించాలని ఇరువర్గాలను కోరుతున్నా. ఉద్రిక్తతల తగ్గింపు అందరి ప్రయోజనాల కోసం'' అని ఆయన రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)