You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శ్రేయస్ అయ్యర్: ప్లీహం (Spleen) ఏం పని చేస్తుంది, దానికి దెబ్బ తగిలితే ఏమవుతుంది?
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు.
అయ్యర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని, అతని ప్లీహానికి గాయమైందని డాక్టర్లు చెప్పారు.
మ్యాచ్ 34వ ఓవర్‌లో ఆస్ట్రేలియన్ బ్యాటర్ అలెక్స్ కారీ కొట్టిన బంతిని అందుకునే క్రమంలో అయ్యర్ వెనక్కు తిరిగి పరుగెత్తాడు.
బంతిని అందుకుని కిందపడ్డాడు. ఆ వెంటనే నొప్పితో విలవిలలాడాడు.
తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న అయ్యర్‌కు మొదట గ్రౌండ్‌లోనే చికిత్స అందించి తర్వాత ఆసుపత్రికి తరలించారు.
"అక్టోబర్ 25, 2025న సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు శ్రేయస్ అయ్యర్‌కు ఎడమ పక్కటెముక దిగువ భాగంలో గాయమైంది. తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు" అని సోమవారంనాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో బీసీసీఐ తెలిపింది.
"స్కాన్‌లో అతని ప్లీహం గాయపడిన విషయం బయటపడింది. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం నిలకడగా ఉంది. కోలుకుంటున్నాడు'' అని కూడా బీసీసీఐ తన ప్రకటనలో వెల్లడించింది.
ఆస్ట్రేలియాతోపాటు, భారతదేశానికి చెందిన స్పెషలిస్ట్ డాక్టర్లను సంప్రదిస్తూ వైద్య బృందం అతనికి చికిత్స అందిస్తోందని బీసీసీఐ తెలిపింది.
"టీమిండియా వైద్యబృందం శ్రేయస్‌తోపాటు సిడ్నీలోనే ఉంటుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది" అని తెలిపింది బీసీసీఐ.
ప్లీహం అంటే ఏంటి?
మానవ శరీరంలో పిడికిలి పరిమాణంలో ఉండే ఒక అవయవమే ప్లీహం. పొట్టలో ఎడమవైపున ఊపిరితిత్తులకు కింద భాగంలో ఉంటుంది.
రక్తాన్ని శుభ్రపరచడం అది చేసే పని. పాత ఎర్ర రక్తకణాలను నాశనం చేయడం, ఇన్ఫెక్షన్లతో పోరాడటం ప్లీహం విధుల్లో ప్రధానమైనవి.
ఒకరకంగా ప్లీహం మనిషి శరీరంలో రక్తాన్ని వడపోసే ఫిల్టర్‌లాగా పని చేస్తుంది. బ్యాక్టీరియా, వైరస్, ఇతర విషపదార్థాలను తొలగిస్తుంది.
రక్తం ప్లీహం గుండా ప్రవహిస్తున్నప్పుడు, తెల్ల రక్తకణాలు దాడి చేసి బయటి నుంచి వచ్చిన ఏవైనా బ్యాక్టీరియాలు లేదా వైరస్‌లను తొలగిస్తాయి.
రక్తాన్ని శుభ్రపరిచి, ఇన్ఫెక్షన్ల నుంచి మనుషులను కాపాడుతుంది ప్లీహం. ఎర్ర రక్తకణాలు సుమారు 120 రోజులపాటు బతికి ఉంటాయి. ఆ తర్వాత ప్లీహం వాటిని విచ్ఛిన్నం చేస్తుంది.
మిగిలిన ఎర్ర రక్తకణాలు శరీరంలోని ఇతర ప్రాంతాలకు రవాణా అవుతాయి. అక్కడ అవి కొత్త ఎర్ర రక్తకణాలను సృష్టించడానికి రీసైకిల్ అవుతాయి.
శిశువు పుట్టకముందే పిండంలోని ప్లీహం ఎర్ర, తెల్ల రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. పుట్టడానికి కొన్ని రోజుల ముందు నుంచి ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది ప్లీహం. ఆ తర్వాత ఎముకలోని మజ్జ ఈ పనిని చేపడుతుంది.
ప్లీహం లేకపోతే ఏమవుతుంది?
బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) వెబ్‌సైట్‌లో ప్లీహం గురించి సవివరమైన సమాచారం ఉంది.
ఈ వెబ్‌సైట్ ప్రకారం, ప్లీహం లేకుండా మనిషి జీవించడం సాధ్యమే. ఎందుకంటే దాని విధులను చాలావరకు ఇతర అవయవాలు చేసిపెట్టగలవు.
కాకపోతే, ప్లీహం లేనివారు ఎక్కువగా ఇన్ఫెక్షన్లకు గురవుతారు. బలమైన దెబ్బలాంటిది తగిలినప్పుడు ప్లీహం దెబ్బతినవచ్చు. చీలిపోవచ్చు. అది వెంటనే జరగొచ్చు లేదంటే వారాల తర్వాతైనా జరగొచ్చు.
ఎన్‌హెచ్ఎస్ చెప్పినదాని ప్రకారం ప్లీహం దెబ్బతింటే ఏర్పడే పరిస్థితులు:
- ఎడమ పక్కటెముకల వెనుక తీవ్రమైన నొప్పి
- మైకం కమ్మినట్లు ఉండటం, హార్ట్ బీట్ పెరగడం
ప్లీహం దెబ్బతినడం వైద్యపరంగా ఒక అత్యవసర పరిస్థితి. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు.
గాయకావడం వల్ల ప్లీహం ఉబ్బి పెద్దగా మారవచ్చు. దాని పరిమాణం పెరుగుదలలో ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.
ప్లీహం వాచినట్లు తెలిపే లక్షణాలు చాలా తక్కువ. అయితే ఈ కింది లక్షణాలు కనిపించినప్పుడు ప్లీహానికి సమస్య ఉందని భావించవచ్చు.
- తినడం పూర్తికాక ముందే కడుపు నిండినట్లు అనిపించడం
- ఎడమ పక్కటెముకల వెనక నొప్పి లేదా అసౌకర్యం
- రక్తహీనత, అలసట
- తరచుగా ఇన్ఫెక్షన్లు
- సులభంగా రక్తస్రావం కావడం
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)