You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు
భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు.
అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ అయిన సీపీ రాధాకృష్ణన్ ఇండియా కూటమి అభ్యర్థి బి. సుదర్శనరెడ్డిపై విజయం సాధించారు.
సీపీ రాధాకృష్ణన్‌కు 452 ప్రథమ ప్రాధాన్య ఓట్లు లభించాయని, ఏఎన్ఐ, పీటీఐ వార్తా సంస్థలు తెలిపాయి.
ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చినట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారని పీటీఐ పేర్కొంది.
ఈ ఎన్నికల్లో మొత్తం 767మంది ఎంపీలు ఓటేశారని, అందులో 752 ఓట్లు చెల్లుబాటయ్యాయని ఉపరాష్ట్రపతి ఎన్నికల అధికారి పీసీ మోదీ వెల్లడించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు మొత్తం 98.2 శాతం ఓటింగ్ జరిగిందని పీసీ మోదీ వెల్లడించారు.
ఎవరీ రాధాకృష్ణన్?
చంద్రాపురం పోన్నుస్వామి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుప్పూర్‌లో 1957 అక్టోబర్ 20న జన్మించారు. ఆయన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఆరెస్సెస్ స్వయంసేవకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడయ్యారు.
భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎదుగుదలలో రాధాకృష్ణన్ కీలక పాత్ర పోషించారు.
ఆయన తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 1998, 1999లో ఇక్కడ విజయం సాధించారు.
ఆ తర్వాత 2004, 2014, 2019లో వరుసగా మూడుసార్లు ఓడిపోయారు.
2023 ఫిబ్రవరిలో ఝార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2024 జూలైలో మహారాష్ట్ర గవర్నర్‌గానూ బాధ్యతలు చేపట్టారు.
రాధాకృష్ణన్ తన రాజకీయ జీవితాన్ని విద్యార్థి ఉద్యమంతో ప్రారంభించారు. 2007లో తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 93 రోజుల్లో రాష్ట్రంలో 19 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
ఈ ప్రయాణంలో ప్రధానంగా నదుల అనుసంధానం, ఉగ్రవాదం, ఉమ్మడి పౌరస్మృతి, అంటరానితనం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు వంటి అంశాలపై దృష్టి సారించారు.
ఆ తర్వాత కూడా ఆనకట్టలు, నదుల సమస్యపై 280 కిలోమీటర్లు, 230 కిలోమీటర్ల చొప్పున రెండుసార్లు పాదయాత్రలు చేశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన సీపీ రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినవారు కాగా,
ఇండియా కూటమి తరఫున పోటీచేసి ఓటమి పాలైన బి. సుదర్శనరెడ్డి తెలంగాణకు చెందినవారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు దగ్గరలోని ఆకులమైలారం గ్రామానికి చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రం చదివారు.
1971లో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. 1995 మే లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు.
2005 డిసెంబరులో గువాహటీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2007లో జనవరిలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011 జూలైలో ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ చేశారు.
గత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఘనవిజయం సాధించారు. మొత్తం పోలయిన ఓట్లలో 73శాతం పొందారు. ఈ జూలైలో ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)