ఎమ్మెల్యే కాకముందే మంత్రిని చేస్తే ఎన్నికల్లో ఓడిపోయారు

    • రచయిత, త్రిభువన్
    • హోదా, బీబీసీ కోసం

రాజస్థాన్‌లో అధికార బీజేపీ ప్రభుత్వానికి ఓ ఉపఎన్నికలో చేదుఫలితం ఎదురైంది. రాజస్థాన్‌లో 2023 డిసెంబరు 15న కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం పట్టుమని నెలతిరగకుండానే ఉప ఎన్నికలో ఓ సీటును పోగొట్టుకుంది.

కిందటి ఏడాది నవంబర్‌ 25న రాజస్థాన్ ఎన్నికలు జరిగాయి. ఇందులో భాగంగా గంగానగర్ జిల్లా శ్రీకరన్‌పుర నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా గుర్మీత్ సింగ్ కూనర్‌ నిలబడ్డారు. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించడంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక వాయిదా పడింది.

రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అనంతరం.. అభ్యర్థి మరణంతో నిలిచిపోయిన శ్రీకరన్‌పుర అసెంబ్లీ ఎన్నిక జనవరి 5న జరిగింది.

కాంగ్రెస్ అభ్యర్థిగా గుర్మీత్ సింగ్ కూనర్ కుమారుడు రూపీందర్ సింగ్, బీజేపీ అభ్యర్థిగా వ్యవసాయశాఖ సహాయ మంత్రి సురేంద్రపాల్ సింగ్ టీటీ నిలబడ్డారు.

వీరితోపాటు ఆమ్ అద్మీ పార్టీ అభ్యర్థిగా పృథ్వీపాల్ సింగ్ కూడా బరిలో నిలిచారు.

మంత్రిని రంగంలోకి దింపిన బీజేపీ

డిసెంబర్ 15న రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది.

కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గంలోకి సురేంద్రపాల్ సింగ్ టీటీని తీసుకున్నారు. ఆయన అప్పటికీ ఎమ్మెల్యే కాదు. కానీ సహాయమంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చారు.

మంత్రి పదవిని కేటాయించినప్పటికీ ఆయన ఎటువంటి శాఖలు కేటాయించలేదు.

కానీ సరిగ్గా జనవరి 5న శ్రీకరన్‌పురా అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న రోజే సురేంద్రపాల్ సింగ్ టీటీకి వ్యవసాయ మార్కెటింగ్, నీటిపారుదల, ఇందిరాగాంధీ కెనాల్ డెవలప్‌మెంట్, మైనార్టీ వ్యవహారాలు, వక్ఫ్ వ్యవహారాల శాఖను కేటాయించారు.

అంటే ఈ నియోజకవర్గంలో సురేంద్రపాల్ సింగ్ గెలుపు ఖాయమని బీజేపీ గట్టిగా భావించింది.

కానీ బీజేపీ ఒకటి తలిస్తే, ఓటర్లు మరొకటి తలిచినట్టు శ్రీకరన్‌పుర సీటులో కాంగ్రెస్ అభ్యర్థి రూపిందర్ సింగ్ గెలిచారు.

రూపిందర్ సింగ్ కు 94,950 ఓట్లు రాగా, సురేంద్రపాల్ సింగ్ టీటీకి 83,667 ఓట్లు వచ్చాయి. అమ్ అద్మీ పార్టీ అభ్యర్థి పృధ్వీపాల్ సింగ్ సంధుకు 11,940 ఓట్లు వచ్చాయి.

పాకిస్తాన్‌ సరిహద్దుగా గల ఈ అసెంబ్లీ నియోజవర్గంలో ఓటమి బీజేపీని ఇబ్బంది పెడుతోంది.

శ్రీకరన్‌పురాలో ప్రచారానికి వచ్చిన బీజేపీ నాయకులకు తొలినుంచే పరిస్థితులు అనుకూలంగా లేవనే విషయం అర్థమైంది.

అందుకే ఎన్నికవ్వకముందే సురేంద్రపాల్ సింగ్ టీటీకి మంత్రి పదవిని ఇవ్వడంతోపాటు శాఖలను కూడా కేటాయించేశారు.

భైరాన్ సింగ్ షెకావత్‌కూ తప్పలేదు

రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లా ప్రజలు భిన్నమైన తీర్పులు ఇస్తారనే పేరు ఉంది.

1993లో సీనియర్ బీజేపీ నాయకుడు భైరాన్ సింగ్ షెకావత్ గంగానగర్ నుంచి బరిలోకి దిగారు. ముఖ్యమంత్రి కాబోయే నాయకుడు ఇక్కడి నుంచి పోటీ చేయడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

బైరాన్ సింగ్ షెకావత్ ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని, అభివృద్ధి జరుగుతుందంటూ భూస్వాములు, వ్యాపారవర్గాలు ఆయనకు భారీగా మద్దతు పలికాయి. కానీ గంగానగర్ జిల్లా ప్రజలు షెకావత్‌ను ఓడించారు. ఆయన మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పాలి జిల్లాలోని బాలీ నుంచి కూడా ఆయన పోటీ చేయకుండా ఉండి ఉంటే ముఖ్యమంత్రి పదవికి దూరమై ఉండేవారు.

ఇప్పుడు కాంగ్రెస్ ఎలా గెలిచింది?

‘‘శ్రీకరన్‌పుర ప్రజలు బీజేపీ అహంకారాన్ని ఓడించారు. ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్పారు. ఎన్నికల వేళ తన అభ్యర్థిని మంత్రిగా చేసి, అన్ని నియమాలను ఉల్లంఘించినందుకు ప్రజలు సరైన తీర్పు చెప్పారు’’ అని మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ చెప్పారు.

నెల రోజుల్లోనే బీజేపీ ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందని రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోత్సారా చెప్పారు.

ఓటమిని విశ్లేషించుకున్నాకే ఇలా ఎందుకు జరిగిందో చెప్పగలమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి చెప్పారు.

తాజా ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రూపేందర్ సింగ్ కున్నార్ కాంగ్రెస్‌లో సచిన్ పైలట్ వర్గానికి చెందినవారు.

అయితే మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, పీసీసీ ప్రెసిడెంట్ దోత్సారా కూడా ఈయన గెలుపు కోసం ప్రచారం చేశారు.

ఇలా కాంగ్రెస్‌లోని అన్నివర్గాలు కలిసికట్టుగా పనిచేయడం వల్ల అధికార బీజేపీని ఓడించగలిగారు.

నిజానికి బీజేపీకి ఈ ప్రాంతంలో ఓట్లు బాగా పెరిగాయి. కిందటిసారి ఎన్నికల్లో సురేంద్రపాల్ సింగ్ టీటీకి 44,099 ఓట్లు రాగా, తాజా ఎన్నికల్లో 83,667 ఓట్లు వచ్చాయి. అంటే 2018 ఎన్నికలకంటే ఆ పార్టీకి 39,568 ఓట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్‌తో పోల్చుకుంటే బీజేపీ తన సంస్థాగత బలాన్ని బాగా చూపిందని అర్థమవుతోంది.

మొత్తానికి ఈ ఓటమితో సురేంద్రపాల్ సింగ్ టీటీ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)