You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇజ్రాయెల్: వీధుల్లోకి లక్షల మంది ఎందుకు వస్తున్నారు... వారి ఆగ్రహానికి కారణం ఏంటి?
ఇజ్రాయెల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి.
సోమవారం ఉదయం నుంచి ఇజ్రాయెల్లో వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి.
ప్రధాన మంత్రి బెంజామిన్ నెతన్యాహు నేతృత్వంలోని రైట్ వింగ్ ప్రభుత్వం ఆ దేశంలో న్యాయ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు అధికారాలను పరిమితం చేసేలా సంస్కరణలను ప్రభుత్వం తీసుకొస్తోంది. కోర్టులోని న్యాయమూర్తులను కూడా రాజకీయ నాయకులే నిర్ణయించేలా ఆ సంస్కరణలున్నాయి.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సమతుల్యత వస్తుందని నెతన్యాహు మద్దతుదారులు అంటున్నారు. కానీ, ఈ సంస్కరణల వల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని మరికొందరు విమర్శిస్తున్నారు.
ప్రధాన మంత్రి బెంజామిన్ నెతన్యాహు అవినీతి ఆరోపణల మీద విచారణ ఎదుర్కొంటున్నారు. ఆ కేసుల నుంచి బయటపడేందుకే న్యాయవ్యవస్థలో మార్పులను ఆయన తీసుకొస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
కానీ, ఆ ఆరోపణలను నెతన్యాహూ కొట్టిపారేశారు.
ప్రస్తుతం నెలకొన్న ఈ ఆందోళనలు ఇజ్రాయెల్‌ను సంక్షోభంలోకి నెట్టివేశాయి.
ఈ నిరసనలు ప్రస్తుతం హింసాత్మకంగా మారాయి.
మార్చిలో ఒక్క రోజులోనే 5 లక్షల మంది ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చినట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టిన నిర్వాహకులు తెలిపారు.
నిర్వాహకులు చెప్పిన ఈ గణాంకాలు సరైనవి అయితే, దేశ జనాభాలో 5 శాతం మంది ఈ నిరసనల్లో పాల్గొన్నట్లు.
మాజీ ప్రధాన మంత్రులు, మిలిటరీ ప్రముఖులతోపాటు టెక్ కంపెనీలు కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి.
ఆ సంస్కరణలకు ఆమోదం లభిస్తే నెతన్యాహు చేతికి అంతులేని అధికారాలు వస్తాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇప్పటికే వివక్షకు గురవుతున్న పాలెస్తీనా మైనార్టీలు, మరింత ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని విపక్షాలు భయపడుతున్నాయి.
ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రిపై వేటు
న్యాయ విధానంలో వివాదాస్పదమైన సంస్కరణలను వ్యతిరేకిస్తూ మాట్లాడిన ఇజ్రాయిల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాలంట్‌పై వేటు పడింది.
రక్షణ శాఖ మంత్రిగా యోవ్ గాలంట్‌పై తనకు నమ్మకం లేదన్నారు నెతాన్యాహు.
నెతాన్యాహుకి ఇంటి వద్ద ఆందోళనలు చేపట్టిన నిరసనకారులపై పోలీసులు, సైనికులు వాటర్ కెనాన్లను ఉపయోగించారు.
ప్రధాన మంత్రి నెతాన్యాహూ ఇజ్రాయెల్ సెక్యూరిటీని ధ్వంసం చేస్తున్నారని, ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారని ఆందోళనల్లో పాల్గొన్న నేతలన్నారు.
రక్షణ శాఖ మంత్రిపై వేటును వెనక్కి తీసుకోవాలని పార్లమెంట్‌లో విపక్షాల నేత, మాజీ ప్రధాన మంత్రి యైర్ రాపిడ్ అన్నారు. నిజం చెప్పినందుకే ఆయనపై వేటు వేశారని విమర్శించారు.
ఇజ్రాయెల్ రక్షణ శాఖలోని సభ్యులు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై చాలా కోపంగా ఉన్నారని, ఇలాంటిది ఇంతకుమున్నుపెప్పుడూ చూడలేదని పేర్కొంటున్నారని గాలంట్ శనివారం రాత్రి ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
న్యాయవ్యవస్థలో ప్రభుత్వం తీసుకొచ్చేసంస్కరణలతో జడ్జీల నియామకంపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ ఉంటుంది. అంతేకాక, సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయాలను పార్లమెంట్ కొట్టివేసే అవకాశం ఉంది.
న్యాయ వ్యవస్థ స్వతంత్రను కోల్పోనుంది. రాజకీయ ప్రయోజనాల కోసమే దీన్ని ఉపయోగించుకోనున్నారనే వాదనలున్నాయి. న్యాయవ్యవస్థలో తీసుకొస్తోన్న ఈ సంస్కరణలను వచ్చే వారమే ప్రభుత్వం ఆమోదింప జేయాలని చూస్తోంది.
ఇవి కూడా చదవండి:
- రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు కారణమైన పూర్ణేశ్ మోదీ ఎవరు? ఆయనకు నరేంద్ర మోదీకి సంబంధం ఏమిటి?
- 90 వేల మంది ఊచకోత: 45 ఏళ్ల తరువాత శవాలను తవ్వితీసి అస్థికలు అప్పగించిన ప్రభుత్వం, తమవారివి కావంటున్న కుటుంబీకులు
- ప్రియాంక గాంధీ: ‘‘రాముడు, పాండవులవి కూడా కుటుంబ రాజకీయాలా..? నా అన్నకు తండ్రి ఎవరో తెలియదంటూ నా తల్లిని మీరు అవమానించలేదా?’’
- రాహుల్ గాంధీ: రాజకీయ చదరంగంలో పోరాడుతున్న అయిదో తరం ‘యోధుడు’
- ‘రామ్జీ నగర్ గ్యాంగ్’: లాయర్లను పెట్టుకుని మరీ దొంగతనాలు చేసే ముఠా కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)