You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విజయవాడ: కొండచరియలు విరిగిపడటానికి ముందు ఎలాంటి సంకేతాలు ఇస్తాయి? కొండల దగ్గరికి వెళ్లినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఆగస్టు 31న విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోటు నుంచి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కసరత్తు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
వాతావరణ మార్పుల కారణంగా కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అసలు కొండచరియలు అంటే ఏంటి? అవి ఎన్ని రకాలు? ఎందుకు విరిగిపడతాయి? ఆ సమయంలో ప్రాణాలు కాపాడుకోవడానికి ఏం చేయాలి? ఇతరుల్ని ఎలా రక్షించాలి?
కొండచరియలు విరిగిపడటం అంటే ఏమిటి?
కొండలు వంటి ప్రకృతి సిద్ధమైన భౌగోళిక స్వరూపాల నుంచి రాళ్లు, మట్టి కిందకు జారిపడటాన్ని కొండచరియలు విరిగిపడటం అంటారు. సాధారణంగా ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో ఇలా జరుగుతుంది.
ఇది హఠాత్తుగా జరగొచ్చు లేదా దీర్ఘ కాలంలో క్రమంగా జరుగుతుండొచ్చు.
వాలుగా ఉండే ప్రదేశాలలోని పదార్థాన్ని(ఇక్కడ రాళ్లు, మట్టి వంటివి) పట్టి ఉంచే చుట్టూ ఉన్న పదార్థ బలం కంటే అది కిందకు జారడానికి కారణమైన బలం(గురుత్వాకర్షణ శక్తి కారణంగా) ఎక్కువగా ఉన్నప్పుడు వేగంగా కిందకు చేరుతాయని (కొండచరియలు విరిగిపడతాయని) బ్రిటిష్ జియోలాజికల్ సర్వే వెబ్‌సైట్ తెలిపింది.
కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి?
కొండచరియలు విరిగిపడటానికి అనేక కారణాలు ఉంటాయి.
‘వర్షపాతం, మంచు కరగడం, నీటిమట్టాలలో మార్పులు, ప్రవాహాల కారణంగా కోత, భూగర్భ జలాల్లో మార్పులు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, మానవ కార్యకలాపాల కారణంగా కొండచరియలు విరిగిపడతాయి’ అని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) పేర్కొంది.
నీటి అడుగున కూడా కొండచరియలు విరిగిపడతాయి. వీటిని సబ్‌మెరైన్ ల్యాండ్‌స్లైడ్స్ అంటారు.
భూంకపాలు, తుపాను ధాటికి అలల ఉధృతి పెరగడం వల్ల సముద్రగర్భంలో ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు ఇది సునామీకి దారితీసి తీరప్రాంతాలకు నష్టం కలిగిస్తుంది.
ఏ ప్రాంతాల్లో కొండచరియలు ఎక్కువగా విరిగిపడే అవకాశాలున్నాయో ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
అవి:
- నిటారుగా ఉండే కొండలు, లోయల దిగువ భాగాలు
- కార్చిచ్చులలో కాలిపోయిన భూములు
- అడవుల నిర్మూలన, నిర్మాణాలు తదితర మానవ కార్యకలాపాల వల్ల స్వరూపం మారిన ప్రాంతాలు
- నీటిలో ఎక్కువకాలం తీవ్రంగా నానిన ప్రాంతాలు
- వాగులు/నదుల ప్రవాహ మార్గాలలో..
ల్యాండ్‌స్లైడ్స్ రకాలు
రాళ్లు, మట్టి పెళ్లలు హఠాత్తుగా విరిగిపడటం నుంచి భారీ కొండచరియలు విరిగిపడటం వరకు ల్యాండ్‌స్లైడ్స్‌గా పరిగణించవచ్చు.
కొండచరియలు అనే పదం ఐదు రకాలుగా అవి కిందకు పడటాన్ని సూచిస్తుంది.
పతనం(ఫాల్స్): తక్కువ కొండ వాలు(దాదాపుగా నిటారుగా ఉండే) నుంచి రాళ్లు, మట్టి హఠాత్తుగా కిందకు పడడం.
కూలడం(టోపెల్స్): పదార్థం(రాళ్లు, మట్టి) ఉన్నచోటి నుంచి పట్టుజారి కిందకు కూలడం.
దొర్లడం(స్లైడ్స్) : రాళ్లు, మట్టి కిందకు దొర్లుకుంటూ వెళ్లడం
జారడం(స్ప్రెడ్స్): మట్టి, బురద వంటివి కింద ఆధారంగా ఉన్నప్రాంతం వదులుగా మారినప్పుడు కిందకు జారుకుంటూ వెళ్లడం. ప్రకంపనల వల్ల ఇలా జరగొచ్చు.
కొట్టుకుపోవడం(ఫ్లోస్): ద్రవం తరహా కదలిక. బురద వంటి వదులుగా ఉన్న పదార్థాలు కిందకు కొట్టుకుపోవడం.
తప్పించుకోవడం ఎలా?
కొండచరియలు విరిగిపడటం వల్ల 1998 నుంచి 2017 మధ్య సుమారు 18 వేల మంది మరణించారని, 48 లక్షల మందిపై ఆ ప్రభావం పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి.
ప్రమాదం జరిగే అవకాశం ఉందనిపిస్తే వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని, వీలైనంత త్వరగా అధికారులు సహా ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వాలని అమెరికన్ రెడ్ క్రాస్ సూచిస్తోంది.
చెట్లు పడిపోతున్న శబ్దం, రాళ్లు దొర్లుతున్న శబ్దాలు వినిపిస్తే అప్రమత్తం కావాలని సూచించింది.
నీటి ప్రవాహాల సమీపంలో నివసించే వారైతే.. ‘‘నీటి మట్టం హఠాత్తుగా పెరగడం, లేదంటే తగ్గడం, అంతవరకు తేటగా ఉన్న నీరు బురదలా మారడం వంటి మార్పులు కనిపిస్తే అప్రమత్తం కావాలి. ఇవి కొండచరియలు విరిగిపడుతున్నాయని చెప్పడానికి సంకేతాలు కావచ్చు. వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయడం ఉత్తమం’’ అని అమెరికన్ రెడ్ క్రాస్ పేర్కొంది.
కొండచరియలు విరిగిపడే సందర్భాలలో ప్రజలు తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలనే విషయంపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ అధ్యయనం చేసింది.
ప్రజలు నివసించే భవనాలకు నష్టం కలిగించిన 38 ల్యాండ్‌స్లైడ్ ఘటనలను పరిశోధకులు విశ్లేషించారు.
ఇందులో ఎక్కువ అమెరికాకు చెందినవే అయినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొండచరియల ప్రమాదాల వివరాలు కూడా ఉన్నాయి.
కొండచరియలు విరిగిపడే ఘటనల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడటానికి సమర్థమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న చర్యలు ఉన్నాయని జోసెఫ్ వార్ట్‌మాన్ చెప్పారు.
ఆయన సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్.
ఉన్నచోటి నుంచి ఎగువ ప్రాంతాలకు వెళ్లడం వల్ల ప్రజలు ప్రాణాలు కాపాడుకునే అవకాశం 12 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు.
తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడం మంచిదని సూచించారు.
శిథిలాల్లో చిక్కుకుంటే కదలడం, శబ్దాలు చేయడం వంటివి చేయాలని చెప్పారు.
ఎంత ప్రమాదకరం?
‘కొండచరియలు విరిగిపడి రాళ్లు దొర్లేటప్పుడు అవి మనిషి పరుగెత్తగలిగే వేగం కంటే ఎక్కువ వేగంతో వెళ్తాయి. కొన్నిసార్లు కొండచరియలు రోజులు, వారాల తరబడి విరిగి పడుతూనే ఉంటాయి’ అని యూఎస్‌జీఎస్ తెలిపింది.
కొండచరియలు విరిగిపడే సమయంలో నీటి ప్రవాహాలు, శిథిలాలు కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఈ ఘటనలలో చనిపోవడానికి ప్రధాన కారణం చిక్కుకుపోవడం లేదంటే ఊపిరాడకపోవడమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.
కొండచరియలు విరిగిపడిన తర్వాతి పరిణామాలు కూడా ప్రమాదకరమే.
‘‘కొండచరియలు విరిగిపడటం వల్ల వైద్య వ్యవస్థ, నీరు, కరెంట్, సమాచార వ్యవస్థ లాంటి అత్యవసర సేవలపై తీవ్ర ప్రభావం పడుతుంది’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
తెగిపోయిన కరెంట్ తీగలు విద్యుదాఘాతానికి కారణమవుతాయి. నీరు, గ్యాస్, మురుగునీటి పైపులైన్లు దెబ్బతింటాయి. అపరిశుభ్ర వాతావరణం ఏర్పడి వ్యాధులకు కారణమవుతాయి.
‘‘కొండచరియలు విరిగిపడిన ఘటనలలో కుటుంబాలు, ఆస్తులు, పశుసంపద, పంటలు కోల్పోవడం వల్ల ప్రజలకు మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి’’ అని తెలిపింది.
వాతావరణ మార్పులకు సంకేతమా?
ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణ మార్పులు కొండచరియలు విరిగిపడే అవకాశాలను మరింత పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
‘వాతావరణ మార్పులు తీవ్ర వర్షపాతానికి దారితీస్తుండగా, అవి కొండచరియలు విరిగిపడటానికి కారణమవుతాయి’’ అని యూఎస్‌జీఆర్ తెలిపింది.
ఈ పరిస్థితి ప్రత్యేకించి మంచుతో కూడిన పర్వతప్రాంతాలలో ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
మంచుకరిగి రాతివాలు అస్థిరంగా మారిపోయి కొండచరియలు విరిగిపడటానికి కారణమవుతోందని డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది.
వాతావరణ మార్పుల కారణంగా కార్చిచ్చులు పెరుగుతాయని యూఎస్‌జీఆర్ తెలిపింది.
‘‘ఇటీవల కాలిపోయిన ప్రాంతాలు, అక్కడి మట్టి, వృక్షసంపదను దెబ్బతీయడం వల్ల కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని పెంచాయి’’ అని తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)