‘నా బిడ్డకు చూపులేదని తెలిసి ఎన్ని కష్టాలు పడుతుందో అనుకున్నాను.. కానీ, ప్రపంచ కప్ గెలిచింది’

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

"నా కూతురు చనిపోతే బాగుండుననుకున్నా.. కానీ ఆ కూతురే ప్రపంచ కప్ గెలిచి నన్ను ఓడించింది" అని కరుణ కుమారి తండ్రి పాంగి రాంబాబు ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చెప్పారు. తన కూతురు కరుణని చూస్తే గర్వంగా ఉందన్నారు.

ఇండియా ప్రపంచ కప్ గెల్చుకున్న ‘అంధుల మహిళల టీ20 ప్రపంచకప్’ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో 42 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు పాంగి కరుణకుమారి.

ఆమె తండ్రే రాంబాబు. వీరిది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని వంట్లమామిడి గ్రామం.

పుట్టుకతోనే అంధత్వం వచ్చిన కరుణకుమారి అంధుల టీ20 వరల్డ్ కప్ వరకు ఎలా ఎదిగారు? ఆ బాలిక కుటుంబ నేపథ్యమేంటి? కరుణకుమారి విజయంపై తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు తెలుసుకునేందుకు బీబీసీ ఆమె స్వగ్రామం వంట్లమామిడికి వెళ్లింది.

మట్టి ఇంటి నుంచి..

వంట్లమామిడి గ్రామంలోని కొండమీద రెండు గదుల మట్టి ఇల్లు కరుణకుమారి కుటుంబానిది. ఆ మట్టి గదులను కూడా రెండేళ్ల క్రితమే నిర్మించుకున్నామని రాంబాబు తెలిపారు. అక్కడికి వెళ్లిన బీబీసీ బృందానికి తన కూతురు ఈ ఇంటిలోనే క్రికెట్ ఆడుతూ...ఇప్పుడు ప్రపంచకప్ దాకా వెళ్లిందని రాంబాబు ఆనందంగా చెప్పారు. రాంబాబుది వ్యవసాయ కుటుంబం.

అయితే " నా బిడ్డకు చూపు లేదని తెలిసినప్పుడు...కంటి చూపులేకపోతే ఈ భూమి మీద ఎన్ని కష్టాలు పడాలో! అంతకంటే చనిపోతే నయం కదా...ఏ బాధ ఉండదని అనుకున్నాను" అని బాధతో చెప్పారు.

"అలాంటి నా కూతురు ఇవాళ ఈ స్థాయికి చేరుకుంది" అని ఆనందం వ్యక్తం చేశారు.

"మా బిడ్డ ఏం చదువుతుందో, ఏ ఆడుతుందో మాకు పెద్దగా తెలియదు. కానీ కరుణ తాను చదువుకుంటానని, క్రికెట్ ఆడతానని చెప్పి...మమ్మల్ని అందర్ని ఒప్పించి ఇప్పుడు ఈ స్థితికి వచ్చింది. మాకు, మా ఊరికి పేరు తెచ్చింది." అని రాంబాబు బీబీసీతో చెప్పారు.

తడుముతూ పాకుతోంది...దాంతో అనుమానమొచ్చింది: తల్లి సంధ్య

తమ బిడ్డని ఇప్పుడు అంతా పొగుడుతున్నారు, మీలాంటి వాళ్లు అంతా మా ఇంటికి వస్తున్నారు, కానీ కరుణకుమారి పాకే వయసులో ఆమెకు చూపులేదనే విషయం తెలిసినప్పుడు మాకు ఏం పాలుపోలేదని కరుణకుమారి తల్లి సంధ్య బీబీసీతో చెప్పారు.

"పాప పాకుతున్నప్పుడు తడుముకుంటూ పాకేది. మాకు అనుమానమొచ్చింది. చూపులేదేమోనని. అప్పుడు ఒక్కో ఆసుపత్రి చుట్టూ తిరగడం మొదలు పెట్టాం. చివరకు డాక్టర్లందరూ చెప్పిందేంటంటే ఆమెకు చూపులేదు, వచ్చే అవకాశం కూడా లేదన్నారు. ఆపరేషన్లు చేసినా ప్రయోజనం లేదన్నారు. దాంతో ఇక ఏం చేయలేక అలాగే వదిలేశాం" అని సంధ్య తెలిపారు.

"అయితే 7వ తరగతి వరకు ఎలాగోలా చదువుని నెట్టుకొచ్చిన కరుణ, ఆ తర్వాత నేను చదవలేనని చెప్పింది. దాంతో కొన్ని రోజులు తర్వాత ఎవరో చెప్తే.. విశాఖపట్నంలోని ప్రభుత్వ అంధుల బాలికల పాఠశాలలో చేర్పించాం. అక్కడ ఆటలాడేదట...క్రికెట్ అంటే బాగా ఇష్టపడేదని...అందులో ట్రైనింగ్ ఇప్పిస్తామని అక్కడి టీచర్లు చెప్పారు. ముందు మేం చూపులేని ఆడపిల్లకు ఇవన్ని ఎందుకని వద్దన్నాం.. తర్వాత వారు చెప్పింది విని సరేనన్నాం" అని సంధ్య బీబీసీతో అన్నారు.

‘కనిపించకపోయినా.. క్రికెట్ వినేది’

కరుణకుమారి ఇంటికి వెళ్లినప్పుడు ఆ ఇంటి లోపల నుంచి గజ్జెల శబ్దంలా వినిపిస్తూనే ఉంది. ఇంట్లో చిన్న చిన్న ఐరన్ బాల్స్ వేసిన ప్లాస్టిక్ బంతితో ఆడుకుంటూ ఇద్దరు ఆడపిల్లలు కనిపించారు. వారు కరుణకుమారి చెల్లెల్లు. కరుణకుమారికి అన్నయ్య కూడా ఉన్నారు.

కాసేపటికి కరుణ కుమారి తండ్రి రాంబాబు కూడా ఇంట్లోని కొన్ని డబ్బాలు వెదికి అందులో ఒక ప్లాస్టిక్ బంతిని తీశారు.

"ఇదిగో సర్ మా పాప ఆడే బంతి. చూపు లేదు కాబట్టి...ఈ ప్లాస్టిక్ బంతిలో నుంచి వచ్చే సౌండ్ వింటూ బ్యాట్‌తో కొట్టేది. ఇక్కడే, ఈ ఇంట్లోనే ఆడుతూ ఉండేది" అని రాంబాబు ఆ బంతితో శబ్దం చేస్తూ చెప్పారు.

"పాపకి ఒక కన్ను కొద్దిగా మసకమసకగా కనపడతాది. క్రికెట్ వచ్చినప్పుడు టీవీ దగ్గరకెళ్లి చూసేదట. మా ఊర్లో నుంచి దిగువన టీవీ ఉన్న వారి ఇంటికి వెళ్లి క్రికెట్ చూసేది. వారు నాకు చెప్పారు. నేను ఒక రోజు మా పాప కరుణని అడిగాను సర్, అమ్మా నీకు కనపడదు కదా! ఎలాగ ఆడుతావు, ఎలా చూస్తున్నావని...'అమ్మా…బొమ్మ మసగ్గా కనపడుతుంది కానీ...శబ్దం బాగా వినిపిస్తుంది. నేను వింటున్నాను.' అని నాతో చెప్పింది." అని తల్లి సంధ్య తన కూతురు కరుణ తొలిదశలో క్రికెట్ ఎలా నేర్చుకున్నారో బీబీసీకి వివరించారు.

వద్దన్నా.. కరుణే వెళ్లింది: రాంబాబు

ఏడోతరగతి పూర్తైన తర్వాత...రెండున్నరేళ్ల క్రితం విశాఖలోని ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో కరుణకుమారి చేరారు.

"కరుణలోని ప్రతిభని గుర్తించి ఆమెకు క్రికెట్ లో శిక్షణ ఇప్పించాం" అని పాఠశాల ప్రిన్సిపాల్ విజయ బీబీసీతో చెప్పారు. ఈ క్రమంలోనే 2023 డిసెంబర్ లో జాతీయ అంధ మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైన కరుణ.. 2024లో హుబ్లీలో జరిగిన తొలి మ్యాచ్లోనే ప్రతిభ చూపించారు. అంధ మహిళల టీ-20 వరల్డ్ కప్ క్రికెట్ జట్టు ఎంపిక కోసం ఆగస్టులో బెంగళూరులో నిర్వహించిన మ్యాచ్‌లో 70 బంతుల్లో 114 పరుగులు చేసి టీంలో చోటు సంపాదించుకున్నారు కరుణకుమారి.

ప్రస్తుతం కరుణ పదో తరగతి చదువుతున్నారు.

అంధ మహిళల టీ-20 వరల్డ్ కప్ సాధనలో కీలకపాత్ర పోషించడంతో ఆమె చదువుకుంటున్న విశాఖలోని ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులతో పాటు ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు.

'మా విద్యార్థిని కరుణ కుమారి కారణంగా ఈ పాఠశాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది" అని ప్రిన్సిపల్ విజయ తన ఆనందాన్ని పంచుకున్నారు.

ప్రపంచ కప్‌కి సెలెక్టయినప్పుడు వరల్డ్ కప్ గెల్చివస్తానని తన తల్లిదండ్రులకు మాటిచ్చినట్లు కరుణకుమారి బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

మరి ఇప్పుడు కప్ గెలిచి వస్తున్నారు కదా అని కరుణకుమారి తండ్రి రాంబాబు వద్ద అంటే..."అవును కరుణ గెల్చింది...ఆమెను తప్పుగా అనుకున్న నేను ఓడిపోయాను. అదే నాకు చాలా సంతోషంగా ఉంది." అని రాంబాబు అన్నారు.

పీఎం, సీఎంల అభినందనలు...

అంధుల మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్ టీమ్‌పై విజయం సాధించి ప్రపంచకప్‌ని కైవసం చేసుకుంది భారత్ టీమ్. ఆ టీమ్‌ను దిల్లీ తీసుకుని వెళ్లారని ప్రిన్సిపల్ విజయ తెలిపారు. అక్కడ ప్రధానిని కలుస్తారని చెప్పారు.

ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు 'ఎక్స్' వేదికగా ఇండియా టీమ్ సభ్యులకు అలాగే కరుణకుమారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక అల్లూరి జిల్లాతో పాటు విశాఖలోని అధికారులు, క్రికెట్ అభిమానులు కరుణకుమారి కోసం ఆమె ఇంటికి ఫోన్లు చేస్తున్నారు. ఆమె విశాఖ వచ్చినప్పడు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)