You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పీలే: ఫుట్‌బాల్ దిగ్గజం కన్నుమూత
ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు పీలే కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న 82 ఏళ్ల ఈ బ్రెజిల్ ఆటగాడు ఆ దేశంలోని సావోపాలోలో ఉన్న ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
21 ఏళ్ల తన సుదీర్ఘ ఫుట్‌బాల్ కెరీర్‌లో పీలే 1,363 మ్యాచ్‌లు ఆడి 1,281 గోల్స్ సాధించాడు. ప్రపంచంలో ఇంకే ఆటగాడూ ఇన్ని గోల్స్ సాధించలేదు.
ఇందులో 77 గోల్స్ తన దేశం బ్రెజిల్ తరఫున ఆడుతూ ఆయన సాధించారు. బ్రెజిల్ తరఫున ఆయన 92 మ్యాచ్‌లు ఆడారు.
అంతేకాదు.. ఫుట్‌బాల్ ప్రపంచకప్ మూడు సార్లు గెలిచిన జట్టులో ఉన్న ఏకైక ఆటగాడు కూడా పీలేనే.
1958, 1962, 1970లలో పీలే ప్రపంచకప్ సాధించిన జట్టులో ఉన్నారు.
2000 సంవత్సరంలో ఫిఫా.. పీలేను ఆ శతాబ్దపు అత్యుత్తమ ఆటగాడిగా ప్రకటించింది.
కిడ్నీ, ప్రొస్టేట్ సమస్యలు, క్యాన్సర్
పీలే గత కొంతకాలంగా కిడ్నీ, ప్రొస్టేట్ సమస్యలతో బాధపడుతున్నారు.
2021 సెప్టెంబర్‌లో పీలేకు సావో పాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది.
ఆయనకు పెద్దపేగు నుంచి కణితిని తొలగించారు.
అనంతరం నవంబర్ 2022 చివరిలో తిరిగి ఆసుపత్రిలో చేరారు పీలే.
ఆయన కుమార్తె కెలీ నాస్సిమెంటో ఆసుపత్రి నుంచి రెగ్యులర్ సోషల్ మీడియా అప్‌డేట్‌లతో తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు అప్‌డేట్ ఇస్తూ వస్తున్నారు.
గురువారం ఆసుపత్రిలో పీలే శరీరంపై ఆయన కుటుంబీకుల చేతులు ఉన్నట్లు కనిపించే చిత్రాన్ని ఆమె పోస్ట్ చేశారు.
- "మా దగ్గర ఉన్నవాటికి మీకు కృతజ్ఞులం. మేం నిన్ను అనంతంగా ప్రేమిస్తున్నాము. రెస్ట్ ఇన్ పీస్." అంటూ ఆమె పోస్ట్ చేశారు. సోక్రటీస్: ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడు.. ప్రపంచ కప్ గెలవలేకపోయాడు
- డిగో మారడోనా: సాకర్ స్టార్ కెరీర్‌లో మరపురాని ఘట్టాలు
"అవయవాల పనిచేయకపోవడం, పెద్దపేగు కేన్సర్ ఎక్కువవడంతో " పీలే మరణించారని ఆసుపత్రి ధ్రువీకరించింది.
పీలే ట్విట్టర్ ఖాతాలో "ఈ రోజు శాంతియుతంగా మరణించిన కింగ్ పీలే ప్రయాణాన్ని స్ఫూర్తి, ప్రేమ గుర్తించాయి. లవ్, లవ్ అండ్ లవ్, ఫరెవర్" అంటూ ఆయన టీం పోస్ట్ చేసింది. బ్రెజిలియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ స్పందిస్తూ... "పీలే ఏ సమయంలోనైనా గొప్ప క్రీడాకారుడి కంటే ఎక్కువ. మన ఫుట్‌బాల్ కింగ్ విజయవంతమైన బ్రెజిల్‌కు ప్రతినిధిగా ఉండేవారు. ఆయన కష్టాలకు భయపడలేదు. తన తండ్రికి ప్రపంచ కప్‌ను వాగ్దానం చేశారు.
ఆయన మాకు మూడు బహుమతులు అందించారు. కింగ్ మాకు కొత్త బ్రెజిల్‌ని అందించారు. ఆయన వారసత్వానికి మేం చాలా కృతజ్ఞులం. ధన్యవాదాలు, పీలే." అంటూ నివాళులర్పించింది.
మంగళవారం అంత్యక్రియలు
పీలే మాజీ క్లబ్ శాంటోస్ ఆయన అంత్యక్రియల వివరాలను విడుదల చేసింది.
సోమవారం ఉదయం పీలే భౌతికకాయాన్ని ఆసుపత్రి నుంచి క్లబ్ ఎస్టాడియో అర్బానో కాల్డెయిరాకు తరలిస్తారు.
అక్కడ ప్రజలు నివాళులర్పించడానికి పీలే శవపేటికను పిచ్ మధ్యలో ఉంచుతారు.
మంగళవారం పీలే కుటుంబ ప్రైవేట్ సమాధి వద్దకి సావో పాలోలోని శాంటోస్ వీధుల మీదుగా ఊరేగింపు ఉంటుంది.
పీలే అసలు పేరు ఎడ్సన్ అరంటెస్ డో నాసిమెంటో.
ఆయన 17 సంవత్సరాల వయస్సులో గ్లోబల్ స్టార్ అయ్యారు.
1958 స్వీడన్‌లో జరిగిన ప్రపంచ కప్‌ను బ్రెజిల్ గెలవడంలో పీలేది ముఖ్య పాత్ర.
ప్రారంభంలోని ఆయన ఆటతీరు నాకౌట్ లోకి ప్రవేశించడానికి సాయ పడింది. క్వార్టర్-ఫైనల్స్‌లో వేల్స్‌పై సాధించిన 1-0 విజయంలో ఆయన ఏకైక గోల్ చేశారు. సెమీ-ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై హ్యాట్రిక్ గోల్స్ సాధించారు.
ఫైనల్‌లో ఆతిథ్య స్వీడన్ జట్టుపై 5-2 తేడాతో విజయం సాధించింది బ్రెజిల్.
15 ఏళ్లకే..
పీలే 15 సంవత్సరాల వయస్సులో (రెండేళ్ల ముందుగానే) శాంటోస్ క్లబ్‌లో అరంగేట్రం చేశారు.
ఆ మ్యాచ్‌లో కొరింథియన్స్ డి శాంటో ఆండ్రీపై ఆయన జట్టు 7-1 తేడాతో విజయం సాధించింది.
ఆయన 19 సంవత్సరాలలో క్లబ్ కోసం అధికారికంగా జరిగిన మ్యాచ్‌లలో స్కోర్ చేసిన 643 గోల్స్‌లో ఇది మొదటిది.
అయితే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 1,000 కంటే ఎక్కువేనని శాంటోస్ చెబుతోంది.
1,367 మ్యాచ్‌లలో పీలే 1,283 గోల్స్ చేశారని బ్రెజిలియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్, శాంటోస్ అంటున్నాయి. ఫిఫా మాత్రం 1,366 గేమ్‌లలో 1,281 గోల్స్ చేసినట్లు పేర్కొంది.
1962 ప్రపంచ కప్‌లో మెక్సికోపై 2-0 తేడాతో బ్రెజిల్ గెలిచింది. ఆ మ్యాచ్‌లో 21 ఏళ్ల పీలే అద్భుతమైన గోల్‌ను సాధించారు.
కానీ, తర్వాతి మ్యాచ్‌లో గాయపడ్డారు పీలే. ఆయన జట్టు మాత్రం తమ టైటిల్‌ను కాపాడుకుంది.
ఆయన ప్రపంచ కప్ విజయాలలో చివరి భాగం చెప్పుకోదగ్గది. ఇంగ్లండ్‌లో జరిగిన 1966 టోర్నమెంట్‌లో ఫౌల్ అయ్యారు పీలే. ఆ ఏడాది బ్రెజిల్ జట్టు గ్రూప్ స్టేజిలోనే వెనుదిరిగింది. ఆ తర్వాత 1970లో అటాకింగ్ జట్టును లీడ్ చేస్తూ ఫైనల్‌లో ఇటలీపై 4-1 తేడాతో బ్రెజిల్‌ను గెలిపించి కప్ కైవసం చేసుకున్నారు.
ఆ మ్యాచ్‌లో జట్టు తరఫున మొదటి గోల్ చేసింది పీలేనే.
ఇవి కూడా చదవండి:
- కుంచెతో కోట్లు సంపాదిస్తున్న ‘లిటిల్ పికాసో’
- ధనిక దేశంలో పేదల కోసం సూపర్ మార్కెట్లు.. ఎలా సక్సెస్ అయ్యాయంటే
- ఇండియా-చైనా ఉద్రిక్తతలు: భారత్‌కు ఆయుధాల సరఫరాను రష్యా నిలిపివేస్తుందా
- అమ్మ ఒడి : బడికి వెళ్లే పిల్లలకు ఇచ్చే రూ.15 వేలు తీసుకోవడం ఎలా?
- కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ. 50 లక్షలు గెలిచిన 8వ తరగతి అమ్మాయి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)