You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ట్రాన్స్‌జెండర్ కూతురి పెళ్లి కోసం కన్నతల్లి పోరాటం
- రచయిత, మేఘా మోహన్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
2019లో, చరిత్రాత్మక కోర్టు తీర్పు తర్వాత, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో చట్టబద్ధంగా వివాహం చేసుకున్న మొదటి ట్రాన్స్‌జెండర్ మహిళగా నిలిచారు శ్రీజ.
ఇప్పుడు, శ్రీజ జీవితం ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీ 'అమ్మాస్ ప్రైడ్' తన వివాహానికి చట్టబద్దత కోసం శ్రీజ చేసిన పోరాటాన్ని, అందులో ఆమె తల్లి వల్లి మద్దతును వివరిస్తుంది.
45 ఏళ్ల వల్లి తన కుమార్తె గురించి బీబీసీతో మాట్లాడుతూ, "శ్రీజ ఒక గిఫ్ట్" అన్నారు.
"నాకున్న అవకాశం, మద్దతు ట్రాన్స్‌జెండర్లకీ ఉండకపోవచ్చు, అది నాకు తెలుసు."
"నా చదువు, ఉద్యోగం, వివాహం - అన్నీ మా అమ్మ వల్లే సాధ్యమయ్యాయి" అని తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన 25 ఏళ్ల శ్రీజ అన్నారు.
దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో చట్టబద్ధంగా వివాహం చేసుకున్న మొదటి ట్రాన్స్ మహిళగా శ్రీజ, ఆమె తల్లిగా వల్లి తమ ప్రత్యేకమైన అనుభవాలను అమ్మాస్ ప్రైడ్ ద్వారా పంచుకుంటున్నారు.
తమిళనాడుకి చెందిన ఒక ట్రాన్స్ మహిళకు, పురుషుడి(ట్రాన్స్‌జెండర్ కాని వ్యక్తి)తో జరిగిన వివాహం, చట్టబద్ధంగా నమోదైన తొలి వివాహంగా నిలిచింది. ఈ వివాహం ఇతివృత్తంగా 'అమ్మాస్ ప్రైడ్' డాక్యుమెంటరీ రూపొందింది.
వివాహ నమోదుకు తిరస్కరణ
శ్రీజ తనకు కాబోయే భర్త అరుణ్‌ను 2017లో ఒక గుడిలో కలిశారు. ఇద్దిరికీ ఉమ్మడి స్నేహితులు ఉన్నారని తెలిసిన తర్వాత, ఇద్దరూ తరచూ మెసేజ్‌లు చేసుకునేవారు. ఆమె అప్పటికే ట్రాన్స్‌జెండర్‌గా మారారు.
"మేం చాలా మాట్లాడుకున్నాం. ఆమె ఒక ట్రాన్స్ ఉమెన్‌గా తన అనుభవాల గురించి నాతో చెప్పింది" అని 29 ఏళ్ల అరుణ్ బీబీసీకి చెప్పారు.
కొన్ని నెలల్లోనే, వారు ప్రేమలో పడ్డారు. జీవితాంతం కలిసి గడపాలని నిర్ణయించుకున్నారు.
అయితే, 2018లో వారి వివాహాన్ని నమోదు చేసుకునే ప్రయత్నం చేయగా తిరస్కరించారు. 1955 హిందూ వివాహ చట్టం వివాహాన్ని "వధువు", "వరుడు" మధ్య కలయికగా నిర్వచించిందని, అందులో ట్రాన్స్ మహిళల గురించి లేదని రిజిస్ట్రార్ వాదించారు.
కానీ, ఎల్జీబీటీ యాక్టివిస్టుల సూచనతో ఈ జంట వెనక్కితగ్గింది. కానీ, వారు చేసిన ప్రయత్నం నిలిచిపోయింది.
2019లో మద్రాస్ హైకోర్టు వారి వివాహ హక్కును సమర్థిస్తూ, 1955 హిందూ వివాహ చట్టంలో నిర్వచించిన విధంగా లింగమార్పిడి వ్యక్తులను "వధువు" లేదా "వరుడు"గా గుర్తించాలని చెప్పడంతో ఈ జంట ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ఈ తీర్పును, భారతదేశంలో ట్రాన్స్‌జెండర్లను అంగీకరించడంలో కీలకమైన అడుగుగా LGBT కార్యకర్తలు చూశారు. సంప్రదాయ నిబంధనలను సవాలు చేయడం ద్వారా శ్రీజ, అరుణ్‌కు స్థానికంగా గుర్తింపు వచ్చింది.
అయితే, మీడియాలో విస్తృతంగా రావడంతో కొంత వ్యతిరేకత కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
"ఈ వార్తలొచ్చిన మరుసటి రోజే, నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు" అని రవాణా రంగంలో కార్మికుడిగా పనిచేసిన అరుణ్ చెప్పారు. ట్రాన్స్‌ఫోబియా వల్లే ఇది జరిగిందని ఆయన అంటున్నారు.
మరోవైపు, ఆన్‌లైన్ ట్రోలింగ్.
"నేను ఒక ట్రాన్స్‌జెండర్ మహిళను వివాహం చేసుకున్నందుకు విమర్శిస్తూ చాలామంది మెసేజ్‌లు పెట్టారు" అని ఆయన చెప్పారు.
ఈ ఒత్తిడి వల్ల వీరు కొంతకాలం విడిగా ఉన్నారు.
శ్రీజ మొదటినుంచీ చదువులో చురుగ్గా ఉండేవారు. హైస్కూల్లో తరచుగా క్లాస్ ఫస్ట్ వచ్చేవారు.
తమిళనాడులోని ఒక విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేశారు. తన కుటుంబంలో ఉన్నత విద్యనభ్యసించిన తొలి వ్యక్తిగా నిలిచారు శ్రీజ.
14 ఏళ్ల వయసులోనే చదువు మానేసిన వల్లికి, ఇది గర్వకారణం.
'నా కూతురికి నేనెప్పుడూ అండగా ఉంటా'
తన వివాహానికి అధికారిక గుర్తింపు పోరాటానికి ముందే శ్రీజ, ఆమె కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కొంతమంది వారిని శత్రువులుగా చూసేవారు.
శ్రీజ 17 సంవత్సరాల వయసులో ట్రాన్స్‌జెండర్( మహిళ)గా మారిన తర్వాత, వారు ఉంటున్న ఇంటి నుంచి వారిని ఖాళీ చేయించారు. దీంతో శ్రీజ, ఆమె తల్లిని, తమ్ముడు చిన్నా ఇంటి నుంచి బయటికి వెళ్లిపోవాల్సి వచ్చింది.
చాలామంది బంధువులు వారితో మాట్లాడటం మానేశారు.
అయినప్పటికీ, ఆమె తల్లి, సోదరుడు శ్రీజకి అండగా నిలిచారు.
"నేనెప్పుడూ నా కూతురికి అండగా ఉంటా."
" ట్రాన్స్ వ్యక్తులందరికీ వారి కుటుంబాలు అండగా ఉండాలి" అని వల్లి అన్నారు.
శ్రీజకు ఆరేళ్ల వయసున్నప్పుడు, వల్లి తన భర్తను కోల్పోయారు. ఒక పాఠశాలలో వంటపని చేసేవారు.
ఆమె ఆదాయం తక్కువే అయినప్పటికీ, తన కుమార్తె లింగమార్పిడి చికిత్సకు ఆమె సాయం చేశారు. అందుకోసం తన నగలను అమ్మారు. అలాగే, సర్జరీ తర్వాత శ్రీజ బాగోగులు చూసుకున్నారు.
"అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది" అని శ్రీజ అన్నారు.
'ఈ విషయంలో అందరి ఆలోచనా విధానం మారుతుందని ఆశిస్తున్నా'
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైన భారత్‌లో దాదాపు 20 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు ఉండొచ్చని అంచనా. ఈ సంఖ్య ఇంకాస్త ఎక్కువ కూడా ఉండొచ్చని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, మూడో జెండర్‌గా గుర్తింపు వంటి అనేక అంశాలతో కూడిన ట్రాన్స్-ఇన్‌క్లూజివ్ చట్టాన్ని దేశం ఆమోదించినప్పటికీ, వారిపై పడిన ముద్ర, వివక్ష ఇంకా తొలగిపోలేదు.
దేశంలో లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులు తీవ్రస్థాయిలో వేధింపులు, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, విద్య - ఉపాధి - ఆరోగ్య సంరక్షణ వంటివి పరిమిత స్థాయిలోనే అందుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలామంది భిక్షాటన, లేదా సెక్స్ వర్క్ చేయాల్సి వస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా, భారీస్థాయిలో ట్రాన్స్‌జెండర్లు వారి కుటుంబాల నుంచి తిరస్కరణను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.
"భారత్‌తో పాటు ప్రపంచంలో కూడా చాలామంది ట్రాన్స్ జెండర్లకు వారి కుటుంబాల మద్దతు లేదు" అని అమ్మాస్ ప్రైడ్ డైరెక్టర్ శివ క్రిష్ అన్నారు.
''శ్రీజ, వల్లి కథ అందుకే ప్రత్యేకమైనది" అని చెప్పారు.
ట్రాన్స్ జెండర్ల గురించి ఆలోచించే మూస పద్ధతిని, వారి గురించి మీడియాలో తరచుగా ప్రచారం చేసే కథనాలను ఇది సవాల్ చేస్తుందని నమ్ముతున్నా. ముఖ్యంగా వేధింపులు, హింసకు గురికాకుండా మార్పుతెస్తుందని ఆశిస్తున్నానని శ్రీజ చెప్పారు.
"మేం కూడా నాయకులుగా ఉండగలమని ఈ డాక్యుమెంటరీ చూపిస్తుంది. నేను ఒక మేనేజర్‌ని, శ్రామిక శక్తిలో ఉత్పాదక సభ్యురాలిని" అని శ్రీజ చెప్పారు.
"ట్రాన్స్ వ్యక్తుల గురించి ప్రజలు కొత్త రకాల కథనాలు చూస్తే, వారి మనస్తత్వాలు కూడా మారుతాయని ఆశిస్తున్నా" అని ఆమె అభిప్రాయపడ్డారు.
'నేను అమ్మమ్మ కావాలనుకుంటున్నా'
అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రీమియర్ షో ప్రదర్శన అనంతరం, అమ్మాస్ ప్రైడ్ ఇప్పుడు భారతీయ ప్రేక్షకులను పలకరించబోతోంది.
"మా స్క్రీనింగ్ ఈవెంట్‌లు ట్రాన్స్ వ్యక్తులు, వారి కుటుంబాలు, స్థానిక సమాజాల మధ్య సంబంధాలను పెంపొందిస్తాయని మేం ఆశిస్తున్నాం" అని అమ్మాస్ ప్రైడ్ తీయడానికి కారణమైన మరో చిత్రనిర్మాత చిత్ర జయరామ్ అన్నారు.
శ్రీజ, అరుణ్ విషయానికొస్తే, వారు ఇప్పుడు ప్రైవేట్ కంపెనీల్లో మేనేజర్లుగా పనిచేస్తున్నారు. త్వరలో ఒక బిడ్డను దత్తత తీసుకోవడం ద్వారా కుటుంబాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు.
"మేం కూడా భవిష్యత్తు అందరిలాగే ఉండాలని కోరుకుంటున్నాం" అని శ్రీజ అన్నారు.
"నేను త్వరలో అమ్మమ్మని అవ్వాలనుకుంటున్నా" అని వల్లి ఆనందంగా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)