You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హిందూ మహాసముద్రం: చైనాను ఎదుర్కోవడానికి భారత్ ఇక్కడ బలాన్ని పెంచుకుంటోందా?
- రచయిత, సందీప్ రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్, యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి పీ17ఏతో సహా మూడు యుద్ధనౌకలను భారత్ ఇటీవల ప్రారంభించింది. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా ఉనికికి ఇది కౌంటర్‌గా భావిస్తున్నారు.
భారత సముద్ర వాణిజ్యంలో 95 శాతం హిందూ మహాసముద్రం గుండానే వెళుతోంది. అయితే, ఈ సముద్రంలో పెరుగుతున్న చైనా నౌకాదళ ఉనికి భారత్‌కు సవాళ్లను పెంచింది.
ఒకప్పుడు అట్లాంటిక్ మహాసముద్రానికున్న ప్రాధాన్యం ఇపుడు హిందూ మహాసముద్రం వైపు మళ్లిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ సముద్రం అగ్రదేశాల మధ్య పోటీకి కేంద్రంగా మారుతోందన్నారు.
"భారత్ తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి తన నౌకాదళాన్ని బలోపేతం చేయడంపై శ్రద్ధ చూపుతోంది" అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ఇటీవల ముంబయిలో ప్రభుత్వ ఆధీనంలో గల మజగావ్ డాక్‌యార్డ్ నుంచి మూడు యుద్ధ నౌకలను కమీషన్ చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ "రక్షణ రంగంలో తయారీ, సముద్ర భద్రతలో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలనే భారత ఆకాంక్షను సాకారం చేయడంలో మూడు ప్రధాన యుద్ధనౌకలను ప్రారంభించడం ఒక ముఖ్యమైన ముందడుగు" అని అన్నారు.
అయితే హిందూ మహాసముద్రంలో చైనా నౌకా దళానికి సరితూగగల బలాన్ని సమకూర్చుకోవడంలో భారత్ ఎంతవరకు విజయం సాధిస్తుందనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది.
సముద్ర భద్రతలో పెరిగిన భారత్ బలం
కన్వెన్షనల్ సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ వాగ్షీర్ ప్రారంభంతో భారత్ వద్ద ఉన్న జలాంతర్గాముల సంఖ్య 16కి చేరింది. దీంతో హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతం వరకు సముద్ర భద్రతలో భారత సామర్థ్యం పెరిగినట్లైంది.
అయితే భారత్‌కు ప్రధాన ప్రత్యర్థి అయిన చైనా నౌకాదళం శరవేగంగా బలపడుతుండటంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో పరిస్థితులు సవాళ్లు విసురుతున్నాయని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.
రక్షణ రంగ విశ్లేషకుడు రాహుల్ బేడీ బీబీసీతో మాట్లాడుతూ "భారత పాత నౌకాదళ వ్యవస్థను ఆధునీకరించడం, ప్రస్తుత సామర్థ్య అంతరాన్ని తగ్గించడం కొత్త కమీషనింగ్ లక్ష్యం" అని అన్నారు.
"పీ75 స్కార్పియన్ సబ్‌మెరైన్ ప్రాజెక్ట్‌ను నేవల్ గ్రూప్ ఆఫ్ ఫ్రాన్స్ సహకారంతో నిర్మిస్తున్నారు. ఇది జలాంతర్గామి నిర్మాణ రంగంలో పెరుగుతున్న భారత్ నైపుణ్యాన్ని చాటుతోంది" అని రాహుల్ అభిప్రాయపడుతున్నారు.
ఐఎన్‌ఎస్ వాగ్షీర్ సబ్‌మెరైన్ అనేది కల్వరి (స్కార్పియన్) తరగతికి చెందిన ఆరవ కన్వెన్షనల్ డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్ అని, దీనిని ఫ్రాన్స్ లైసెన్స్‌తో నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పారిస్‌లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రస్తుతం నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో ఉన్నారు. ఈ సమయంలో మరో మూడు స్కార్పియన్ జలాంతర్గాముల కోసం ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.
హిందూ మహాసముద్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా నేవీ బలాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం 2022లో దేశీయంగా నిర్మించిన మొట్టమొదటి విమాన వాహక నౌకను ప్రారంభించింది.
ప్రస్తుతం భారత్‌లో సేవలు అందిస్తున్న రెండవ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. మొదటిది సోవియట్ కాలం నాటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య. దీనిని హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో రక్షణ కోసం 2004లో రష్యా నుంచి కొనుగోలు చేశారు.
జలాంతర్గామి సామర్థ్యాలు
ఇప్పుడు దేశంలో మొత్తం 16 జలాంతర్గాములు ఉన్నాయి. వాటిలో ఆరు ఆధునికమైనవి, 10 జలాంతర్గాములు 29 నుంచి 34 సంవత్సరాల వయస్సు గలవి. వీటిలో రెండు లేదా మూడు రిటైర్‌మెంట్ చేరువగా ఉన్నాయి.
గత కొన్నేళ్లుగా మరో ఆరు జలాంతర్గాముల కోసం చర్చలు జరుగుతున్నాయి. మూడు కన్వెన్షనల్ సబ్‌మెరైన్‌ల కోసం రెండు మూడు నెలల్లో ఒప్పందం కుదరవచ్చు.
"కొత్తగా ప్రారంభించిన వాగ్షీర్ జలాంతర్గామికి స్వతంత్ర చోదక వ్యవస్థ లేదు. అందుకే అది రెండు మూడు రోజులకు ఒకసారి ఉపరితలంపైకి వస్తుంది" అని రాహుల్ బేడీ చెప్పారు.
" చోదక వ్యవస్థ కారణంగా ఒక కన్వెన్షనల్ సబ్‌మెరైన్ 15 నుంచి 20 రోజుల పాటు నీటి అడుగున పనిచేయగలదు. భారతదేశానికి చెందిన ఆరు జలాంతర్గాములకు ఈ వ్యవస్థ లేదు. దీని కారణంగా అవి సాధారణంగా ప్రతి రెండు మూడు రోజులకోసారి నీటి నుంచి పైకి రావాలి" అని అన్నారు.
"ఐఎన్ఎస్ వాగ్షీర్‌లో టార్పెడోల వంటి ఆయుధాలు ఇంకా అమర్చలేదు. 2017-18లో టార్పెడోల ఒప్పందం రద్దయింది. వాస్తవానికి, వీఐపీ హెలికాప్టర్‌లను తయారు చేసే వెస్ట్‌ల్యాండ్ కంపెనీ టార్పెడోలను తయారు చేసేది. సబ్‌మెరైన్‌ను తదనుగుణంగా రూపొందించాల్సి ఉంది. కానీ వెస్ట్‌ల్యాండ్ స్కామ్ తర్వాత ఒప్పందం రద్దు కావడంతో ఈ ఒప్పందం మరుగునపడింది. ఇప్పుడు జలాంతర్గామిని కమీషన్ చేశారు. కానీ టార్పెడోలైతే లేవు" అని రాహుల్ అన్నారు.
రక్షణ రంగానికి సంబంధించిన నిర్ణయాల్లో జాప్యం భారత నౌకాదళ అభివృద్ధికి అతిపెద్ద అవరోధమని రాహుల్ బేడీ అభిప్రాయపడ్డారు.
భారత నేవీకి అడ్డంకులు
సాధారణంగా పాకిస్తాన్, చైనా వంటి ప్రత్యర్థి దేశాలతో సుదీర్ఘ సరిహద్దు ఉండటం వల్ల భారత్ తన భూ సరిహద్దులపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తోంది.
రాహుల్ బేడీ మాట్లాడుతూ "లద్దాఖ్ వంటి భూ సరిహద్దులు లేదా పాకిస్తాన్‌తో ఉన్న నియంత్రణ రేఖపై ఎక్కువ దృష్టి ఉంది. సముద్ర సరిహద్దుపై అదే శ్రద్ధ చూపలేదు. ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టలేదు. . ఎక్కువ నిధులు ఇవ్వలేదు" అని అన్నారు.
ఇది కాకుండా, రక్షణ సంబంధిత పరికరాల తయారీలో భారత్ ఇప్పటికీ చైనా కంటే చాలా వెనుకబడి ఉంది.
"ఇటీవల ఇండియా ప్రారంభించిన జలాంతర్గాములు, యుద్ధనౌకలు, డిస్ట్రాయర్లను తయారుచేయడానికి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పట్టింది. చైనాలో ఉత్పత్తి చాలా వేగంగా ఉంది. ఒక ఫ్రిగేట్ లేదా డిస్ట్రాయర్‌ను నిర్మించడానికి చైనా గరిష్టంగా 10 నెలలు లేదా 12 నెలలు తీసుకుంటోంది. అణు జలాంతర్గామిని సంవత్సరంలోపు నిర్మించగల సామర్థ్యం వారికి ఉంది" అని రాహుల్ చెప్పారు.
ఉత్పత్తిలో జాప్యంపై న్యూక్లియర్ సబ్‌మెరైన్‌లను ఉదహరిస్తూ "భారత నేవీ రెండు అణు జలాంతర్గాములను మెయింటెయిన్ చేస్తోంది. దేశ అణు కార్యక్రమం 1974లో ప్రారంభమైంది. అయితే, మొదటి న్యూక్లియర్ సబ్‌మెరైన్ నౌకాదళంలో చేరడానికి 2016 వరకు పట్టింది." అని వివరించారు.
ఇక, రెండో అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్‌ను 2024 ఆగస్టులో ప్రారంభించారు.
మరి చైనా నౌకాదళం?
చైనా, భారత్ నేవీల మధ్య 'భారీ వ్యత్యాసం' ఉందని రాహుల్ బేడీ అంటున్నారు.
"చైనాకు నీటి పైన, దిగువన 600 యుద్ధనౌకలున్నాయి. వారికి మూడు విమాన వాహక నౌకలు, 50 జలాంతర్గాములు ఉన్నాయి. ఇందులో అణు జలాంతర్గాములు 15 . అదే సమయంలో భారత నేవీ వద్ద దాదాపు 145 యుద్ధనౌకలున్నాయి. గత ఐదేళ్లలో చైనా నేవీ గణనీయంగా విస్తరించింది. గల్ఫ్ ప్రాంతంలో పాకిస్తాన్‌లోని గ్వాదర్ నౌకాశ్రయం నుంచి హిందూ మహాసముద్రంలో శ్రీలంకలోని హంబన్‌తోట నౌకాశ్రయం నుంచి అది పని చేస్తుంది. మియన్మార్‌లో కూడా వారికి ఉనికి ఉంది. ఇది కాకుండా మాల్దీవులు, బంగ్లాదేశ్‌లోనూ వారి ప్రభావం ఉంది" అని రాహుల్ గుర్తుచేస్తున్నారు.
ఒక విధంగా భారత నేవీని అన్ని వైపుల నుంచి చైనా నేవీ చుట్టుముట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత నేవీ కూడా చైనా ఉనికి, దాని నుంచి ముప్పు పెరుగుతోందని నమ్ముతోంది.
చైనా తన పాత సామ్రాజ్య కాలంలో నియంత్రించిన ప్రాంతాలపై మళ్లీ ఆధిపత్యం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉందని రాహుల్ అభిప్రాయపడ్డారు.
"చైనా త్రివిధ దళాలలో నౌకాదళం పురాతన రక్షణ వ్యవస్థ అని గుర్తుంచుకోవాలి. ఇతర రెండు సైన్యాల కంటే దాని ప్రాముఖ్యత ఎక్కువ. రక్షణ బడ్జెట్‌లో దానికే చాలా ఎక్కువ వాటా ఉంది. అదే సమయంలో భారత బడ్జెట్‌లో నౌకాదళం వాటా మిగిలిన రెండు సైన్యాలతో పోలిస్తే చాలా తక్కువ'' అని ఆయన గుర్తుచేశారు.
హిందూ మహాసముద్రం ఎందుకంత ముఖ్యం?
వార్తాసంస్థ ఏపీ ప్రకారం.. భారత సముద్ర వాణిజ్యంలో 95 శాతం హిందూ మహాసముద్రం ద్వారానే జరుగుతుంది. ప్రపంచంలోని సముద్ర వాణిజ్యంలో 70 శాతం తూర్పు నుంచి పడమరకు, అక్కడి నుంచి తూర్పుకు కూడా ఈ ప్రాంతం గుండానే సాగుతుంది.
అందుకే హిందూ మహాసముద్ర ప్రాంతానికి చాలా వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉందని, రాబోయే కాలంలో దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని రాహుల్ బేడీ అంటున్నారు.
ఈ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యం చెలాయించడం చైనాకు ఇష్టం లేదు. ప్రస్తుతం అమెరికా నేవీకి 12 విమాన వాహక నౌకలున్నాయి. ఇవి సముద్ర శక్తి పరంగా చాలా ముఖ్యమైనవి.
ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు చైనా క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసిందని, దీనిని ఏడీ (ఏరియా డినైయల్ మిసైల్ ) టెక్నాలజీ అంటారని రాహుల్ తెలిపారు.
"ఈ వ్యవస్థను భూమిపై అమర్చారు, దాని పరిధి 300 నుంచి 500 కిలోమీటర్లుంటుంది. ఇది యూఎస్ విమాన వాహక నౌకలను భయపెడుతుంది. ఎందుకంటే అవి తగిలితే వాహక నౌకలు నాశనమవుతాయి. చైనా కూడా ఈ వ్యవస్థను పాకిస్తాన్‌కు ఇస్తోంది. ఇది భారతదేశానికి కూడా సమస్యలు తెచ్చిపెడుతోంది" అని తెలిపారు.
" పాకిస్తాన్‌కు చైనా జలాంతర్గాములను కూడా ఇస్తోంది. దీని కారణంగా పాకిస్తాన్ నౌకాదళ సామర్థ్యం పెరిగింది. ఇది పాకిస్తాన్ నేవీలో మొదటి చైనా-మేడ్ సబ్‌మెరైన్. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ కారణంగా భారత కన్వెన్షనల్ సబ్‌మెరైన్‌తో పోలిస్తే పాకిస్తాన్ నేవీ సామర్థ్యం కొద్దిగా పెరిగినట్లయింది. గత 18 సంవత్సరాలుగా ఇండియన్ నేవీ ఈ వ్యవస్థను ఇన్‌స్టాల్ చేయడంపై చర్చిస్తోంది. ఇంకా నిర్ణయం తీసుకోలేదు" అని అన్నారు.
"భారత రక్షణ మంత్రిత్వ శాఖ కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి సుదీర్ఘ ప్రక్రియ పాటిస్తోంది. ఇది నౌకాదళ అభివృద్ధిని బాగా ప్రభావితం చేస్తోంది. దేశం నిర్ణయాత్మక ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంటుంది" అని రక్షణ రంగ నిపుణులు రాహుల్ బేడీ సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)