You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్: విమానాల రాకపోకలను నియంత్రించే ఈ డిపార్ట్‌మెంట్ ఎలా పని చేస్తుందంటే...
- రచయిత, కొటేరు శ్రావణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
అహ్మదాబాద్ నుంచి లండన్ గాత్విక్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం కుప్పకూలింది.
ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, టేకాఫ్ అయిన తర్వాత, విమానం నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు మేడే (అత్యవసర) కాల్ వచ్చింది.
కానీ, ఆ తర్వాత ఎటువంటి కాంటాక్ట్ లేదు. విమానాశ్రయ సరిహద్దు వెలుపల విమానం కూలిపోయింది.
ఒక విమానం అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, పైలట్ మేడే కాల్ పంపుతారు. ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డిస్ట్రెస్ సిగ్నల్ (అత్యవసర సంకేతం). విమానం ఇబ్బందుల్లో ఉందని ఈ కాల్ సూచిస్తుంది.
ఈ కాల్‌ను అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి పంపించారు పైలట్. విమానాల రాకపోకలను నియంత్రించే ఏటీసీలది ఏవియేషన్ రంగంలో అత్యంత కీలకమైన పాత్ర.
మరి ఏటీసీలు ఎలా పనిచేస్తాయి? ఇందులో పని చేసేవారి బాధ్యతలేంటి, ఒత్తిళ్లెలా ఉంటాయి?
కమర్షియల్, ప్రైవేట్ విమానాలు సురక్షితంగా కార్యకలాపాలు నిర్వహించే బాధ్యత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థలో పని చేసే అధికారుల మీద ఉంటుంది.
వేల విమానాల రాకపోకలను వీరు కోఆర్డినేట్ చేస్తూ.. ఒకదానికొకటి సురక్షితమైన దూరంలో ఉండేలా చూస్తారు.
ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (ఏటీఎస్)లో భాగంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పనిచేస్తుంటుందని విమానయాన రంగంలో పనిచేసిన మాజీ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు. ఆయన తన పేరు ప్రచురించడానికి ఇష్టపడలేదు.
ఏటీఎస్‌లో అత్యంత కీలకమైన భాగం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌దేనని ఆయన తెలిపారు.
విమానం ప్రయాణ సమయంలో ఏదైనా ప్రమాదంలో ఉన్నా, లేదా ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చినా పైలట్ నేరుగా ఏటీసీకే చెబుతుంటారు.
విమానాలు సురక్షితంగా టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేలా చూడటం, ఆకాశంలో ఒకదానికొకటి ఢీకొట్టకుండా చూడటం, అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితుల సమయంలో సేఫ్‌గా ప్రయాణించేలా పైలట్లకు ఆదేశాలు ఇవ్వడం, ఇతర సపోర్టు అందివ్వడం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో పనిచేసే కంట్రోలర్లపైనే ఉంటుందని ఆయన తెలిపారు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్లు లేదా కంట్రోల్ టవర్ల వద్ద నుంచి వీరు పనిచేస్తూ ఉంటారు.
రాడార్ ద్వారా వారి ఎయిర్‌స్పేస్‌లో విమాన లొకేషన్‌ను పర్యవేక్షిస్తూ, రేడియో సిగ్నల్స్ ద్వారా పైలట్లకు కమ్యూనికేట్ చేస్తుంటారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు.
విమాన రాకపోకలు పెరుగుతోన్న భారత్ వంటి దేశాలలో ఏటీసీల ప్రాధాన్యత కీలకంగా మారుతోంది.
కేవలం పౌర విమానాలకు మాత్రమే కాక, తమ ఎయిర్‌స్పేస్‌లోని అన్ని ప్రైవేట్, మిలిటరీ, కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు సర్వీసులను అందించడం ఏటీసీల బాధ్యత.
విమానాశ్రయ పరిసరాల్లో భారీ టవర్స్
ఆ మాజీ అధికారి చెప్పిన వివరాల ప్రకారం...
విమానాలు ఒకదానికొకటి ఢీకొట్టకుండా నిరోధించేందుకు అన్ని సమయాల్లో కూడా విమానం చుట్టూ కనీస ఖాళీ స్థలం ఉండేలా సపరేషన్ రూల్స్‌ను పాటించాలని, వీటిని అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ నిర్ణయిస్తుంది.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లు విమానాశ్రయ పరిసరాల్లోనే రన్‌వేలకు ఎదురుగా ఉంటాయి. ఎత్తయిన టవర్ , విండో స్ట్రక్చర్‌లో కనిపిస్తుంటాయి.
ఎయిర్ ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు విమానాశ్రయాల వద్ద కంట్రోలర్లకు సర్వైలెన్స్ డిస్‌ప్లేలు ఉంటాయి.
ఈ డిస్‌ప్లేలలో విమానాశ్రయ మ్యాప్, విమానాల పొజిషన్, విమానాలను గుర్తించడం, వేగం, ఎత్తు, ఇతర సమాచారం ఉంటుంది.
ఏటీసీలు పైలట్లకు అన్ని రకాలుగా సాయపడుతూ ఉంటారు. పైలట్ నిత్యం సంప్రదింపులు జరిపేది వీరితోనే.
ఇంకా ఆయన ఏం చెప్పారంటే...
తొలుత విమానం ఎగిరే ప్లాన్‌ను ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్‌తో (ఎఫ్ఐఎస్‌లతో) పైలట్ షేర్ చేసుకుంటారు.
ఆ తర్వాత ఈ వివరాలను ఏటీసీలకు అందజేస్తారు. ఈ వివరాల్లో విమానం పేరు, విమాన సంఖ్య, విమానం ఏ రకానికి చెందినది, ఎక్విప్‌మెంట్ ఏంటి, విమానం రూట్ ఏంటి అన్ని తెలియజేస్తారు.
విమానం ఎగిరే ప్లాన్‌కు అనుమతి లభించిన తర్వాతనే పైలట్ టేకాఫ్ సిద్ధం కాగలుగుతారు.
ఈ సమాచారం డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)తో కూడా షేర్ చేసుకుంటారు. ఒక విమానం ఎగిరేటప్పుడు అన్ని ఏటీసీలకు సమాచారం వెళ్తుంది.
విమానాలను ట్రాక్ చేసేందుకు, సీక్వెన్స్‌లు చూసేందుకు అప్పట్లో ఎయిర్ కంట్రోలర్లు పేపర్ స్ట్రిప్స్‌ను వాడేవారు. కానీ, ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఫ్లయిట్ స్ట్రిప్స్‌ను వాడుతున్నారు.
ఏరియా కంట్రోలర్ చేతికి ఎప్పుడు వెళ్తుంది?
విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అయి కొద్దిదూరం తర్వాత టవర్ కంట్రోలర్‌తో పైలట్లకు కాంటాక్ట్ ఉండదు. ఆ తర్వాత ఏరియా కంట్రోలర్ల చేతిలోకి విమానం వెళ్తుందని ఆ మాజీ అధికారి వెల్లడించారు.
గమ్యస్థానం చేరే వరకు వీరే విమాన కదలికను చూసుకుంటారు. ఏరియా కంట్రోలర్లు ఒకే సమయంలో ఒకే పాయింట్లోకి రెండు విమానాలు రాకుండా చూసుకుంటారు.
పర్మిషన్ లేకుండా పైలట్లు ఎలాంటి కంట్రోల్ నిర్ణయాలు తీసుకునేందుకు వీలుండదు.
విమానం గాల్లోకి లేచిన తర్వాత, పైలట్ వద్ద ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్లకు పేర్లు ఉంటాయి. ఆ రూట్లు పైలట్లకు తెలుస్తాయి. ఎంత ఎత్తులో ఎగరాలి అనేది పైలట్‌కు తెలుస్తుంది.
విమానం కొత్త ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు, అప్పటి వరకు విమానానికి ఆదేశాలు చేసిన ఒక ఏరియా కంట్రోలర్లు, తర్వాతి ఏరియా కంట్రోలర్లకు అప్పజెబుతారు.
విమానం గమ్యస్థానం చేరే వరకు పలువురు ఏరియా కంట్రోలర్లతో పైలట్ సంభాషించాల్సి ఉంటుంది. ఇలా పైలట్ కాంటాక్ట్ అవుతూనే ఉంటారు.
విమానాశ్రయానికి దగ్గరగా విమానం వచ్చినప్పుడు పైలట్ ల్యాండ్ అయ్యేందుకు అప్రోచ్ కంట్రోలర్‌ను ఆశ్రయిస్తారు. రాడార్ రేంజ్ బట్టి వారు ల్యాండింగ్‌కు సంప్రదిస్తుంటారు.
ఎయిర్‌వేస్, ఫ్లయిట్ ప్లాన్ చూసి కంట్రోలర్లు తమ ఎయిర్‌స్పేస్ గుండా వెళ్లే ప్రతి విమానాన్ని ట్రాక్ చేస్తుంటారు.
పొగమంచు, రాత్రిపూట, వర్షకాల సమావేశాల్లో.. రాడార్ స్క్రీన్లను చూసి కంట్రోలర్లు పనిచేస్తారు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు యూనివర్సల్ కోఆర్డినేటెడ్ టైమ్ (యూసీటీ)ను పాటిస్తుంటారు.
ఎందుకంటే, వివిధ ప్రాంతాల్లో టైమ్ జోన్‌లు భిన్నంగా ఉండటమే దీనికి కారణం. ఈ టైమ్ ప్రకారమే అన్ని ఏటీసీలు పనిచేయాల్సి ఉంటుందని ఏవియేషన్ మాజీ అధికారి చెప్పారు.
రన్‌వేలపై పక్షులు వస్తే ఎలా?
భారత్ లాంటి దేశాల్లో బర్డ్ వాచర్స్ ఉంటారు. వీరినే ఫ్లైట్ సేఫ్టీ ఆఫీసర్లు అంటారు. వీరికి వాచ్ టవర్స్ ఉంటాయి.
రన్‌వేపై తిరుగుతూ వీరు పక్షులు, జంతువులు లాంటివి లేకుండా చూస్తుంటారు. ఏదైనా జంతువుల, పక్షుల కదలికలు రన్‌వేలపై ఉంటే, వాటిని క్లియర్ చేయించడం కూడా ఏటీసీల బాధ్యతేనని ఆయన వెల్లడించారు.
ఎయిర్ కంట్రోలర్ ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదా?
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రోజూ వేల విమానాలను హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ఇది ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగమని వాదనలు కూడా ఉన్నాయి.
అయితే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణ తర్వాతనే వీరు ఎయిర్ కంట్రోలర్ అవుతారు.
ప్రతికూల వాతావరణం లేదా ఎమర్జెన్సీలు వంటి సమయాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడం కాస్త ఒత్తిడితో కూడుకున్నదే అయినప్పటికీ, ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కంట్రోలర్లకు కఠిన శిక్షణ ఉంటుందని ఫోర్బ్స్‌కు ఒక పైలట్ వివరించారు.
అంతేకాక, అంతా బాగుందనుకున్న సమయంలో కూడా ఏదో ఒక విపత్కర పరిస్థితులను కొన్నిసార్లు పైలట్లు ఎదుర్కొంటుంటారని ఏవియేషన్‌లో పని చేసిన మాజీ అధికారి వివరించారు. ఇదొక గేమ్‌లాగా ఉంటుందని ఆయన అన్నారు.
అయితే, కంట్రోలర్లు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు యోగా, ప్రాణాయామం వంటిని స్టేషన్ ఇంచార్జ్‌లు క్రమం తప్పకుండా అందించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) తన రిపోర్టులో పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)