You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చైనా: బీబీసీ జర్నలిస్టులను కొట్టిన పోలీసులు, ప్రజాందోళనలను ప్రభుత్వం అదుపు చేయలేకపోతోందా?
చైనా పోలీసులు బీబీసీ జర్నలిస్టును కస్టడీలో కొట్టారు.
చైనాలో కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలను కవర్ చేస్తున్న సమయంలో ఎడ్ లారెన్స్ అనే బీబీసీ జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు.
కస్టడీలో ఉన్న సమయంలో లారెన్స్‌ను కొట్టినట్లు బీబీసీ న్యూస్ ప్రెస్ టీం తెలిపింది.
‘ఎడ్ లారెన్స్‌ను విడుదల చేసే ముందు పోలీసులు కొట్టడంతోపాటు తన్నారు. షాంఘైలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలను కవర్ చేస్తున్న సమయంలో లారెన్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు’ అని బీబీసీ ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు చైనాలో కరోనా ఆంక్షలకు వ్యతిరేకంగా చెలరేగుతున్న నిరసనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇతర కీలక పట్టణాలు, నగరాల నుంచి రాజధాని బీజింగ్‌కు కూడా పాకాయి.
ఇప్పటికే షాంఘైలో భారీ ఎత్తున్న నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. చెంగ్డూ, షియాన్, వూహాన్ వంటి నగరాల్లోనూ నిరసనకారులు వీధుల్లోకి వస్తున్నారు.
‘గత 15ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలను తాను ఎన్నడూ చూడలేదు’ అని షాంఘైకు చెందిన ఫ్రాంక్ సాయ్, బీబీసీకి తెలిపారు.
చైనా అమలు చేస్తున్న ‘జీరో కోవిడ్’ విధానం వల్ల... యువత, కార్మికులు, మధ్యతరగతి, సంపన్నులు సహనం కోల్పోయారని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో సోషియాలజిస్ట్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ హో ఫుంగ్ అన్నారు.
దాని ఫలితమే ఇటీవల ప్రపంచంలోనే అతి పెద్ద ఐఫోన్ల తయారీ ఫ్యాక్టరీ అయిన ఫాక్స్‌కాన్‌లో కార్మికులు నిరసనకు దిగారని ఆయన తెలిపారు.
తాజాగా యురుంకిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి కొందరి ప్రాణాలు పోవడంతో ప్రజల్లోని అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
చైనాలో పాలకుల మీద అసంతృప్తి వ్యక్తం చేయడమనేది కొత్త కాదు.
గాలి కాలుష్యం నుంచి భూముల కబ్జా వరకు అనేక అంశాల మీద గతంలో ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు.
కానీ ఈ సారి మాత్రం భిన్నం.
‘జీరో కోవిడ్’ పేరుతో చైనా నాయకత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలను ఆ దేశ ప్రజలు నేడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది ప్రజలు వాటితో విసిగి పోయారు. సోషల్ డిస్టెన్స్ పాటించేలా ఏర్పాటు చేసిన బారికేడ్లను ప్రజలు ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు వారి ఆగ్రహం ఏకంగా వీధుల్లోకి వచ్చేసింది.
చైనాలోని పెద్దపెద్ద నగరాలు, యూనివర్సిటీలలో నిరసనలు చెలరేగుతున్నాయి.
షాంఘైలో నిరసనకు దిగిన కొందరు, ‘దిగిపో షీ జిన్‌పింగ్...’ అంటూ నినాదాలు చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే.
చైనాలో దేశాధినేతను బహిరంగంగా విమర్శించడం చాలా ప్రమాదకరం. జైలులో పడే అవకాశం కూడా ఉంటుంది.
షిన్‌జియాంగ్‌లో అగ్నిప్రమాదం వల్ల 10 మంది చనిపోయారు. ‘జీరో కోవిడ్’ పాలసీ వల్ల సహాయక చర్యలు ఆలస్యం కావడమే ఇందుకు కారణం అని ప్రజలు చెబుతున్నారు.
నిరసనకారుల్లో ఒకరు... ‘షీ జిన్‌పింగ్’ అంటూ అరిస్తే...
అందుకు బదులుగా మిగతా వాళ్లు... ‘దిగిపో’ అని నినదించారు.
‘కమ్యూనిస్ట్ పార్టీ... దిగిపో’ అనే నినాదాలు కూడా మారు మోగాయి.
అధికారంలో ఉండటమే ఏకైక ప్రధాన లక్ష్యంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు ఈ నిరసనలు ఒక పెద్ద సవాలుగా మారుతున్నాయి.
‘జీరో కోవిడ్’తో పేరుతో అమలు చేస్తున్న కఠిన ఆంక్షల మీద ప్రజల్లో చెలరేగుతున్న అసంతృప్తి జ్వాలలను చైనా నాయకత్వం ముందుగానే పసిగట్టలేక పోయినట్లుగా కనిపిస్తోంది. ఆ ఆంక్షలను సడలించేది లేదని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇటీవలే ప్రకటించి ఉన్నారు.
కరోనా సంక్షోభం మొదలైన మూడేళ్ల కాలంలో చైనా మరిన్ని ఆసుపత్రులు కట్టి ఉండాల్సింది. వాటిలో మరిన్ని ఐసీయూ విభాగాలు ఏర్పాటు చేసి ఉండాల్సింది. వ్యాక్సినేషన్ మీద అవగాహన పెంచి ఉంటే బాగుండేది.
కానీ వాటికి బదులుగా భారీ స్థాయిలో కరోనా టెస్టులు చేయడం మీదనే చైనా నాయకత్వం దృష్టి పెట్టింది.
కరోనావైరస్‌ను అంతమొందించేందుకు లాక్‌డౌన్, ఐసోలేషన్, క్వారంటైన్ వంటి అస్త్రాలను మాత్రమే నమ్ముకుంది.
ఎన్నటికీ వీడి వెళ్లని ఒక వైరస్ మీద యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో గెలవాలని చైనా భావిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ఆర్మీని ‘అవమానించి’ సారీ చెప్పిన రిచా చద్దా... ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, నిఖిల్ ఏమన్నారు
- హెచ్ఐవీ/ఎయిడ్స్ గురించి అందరూ మాట్లాడటం మానేశారా? తెలుగు రాష్ట్రాలలో ఎన్ని కేసులున్నాయి?
- శ్రద్ధా వాల్కర్ కేసు: నార్కో, పాలిగ్రాఫ్ టెస్టులలో నిందితుడు నిజాలు చెబుతాడా, వీటిని ఎలా నిర్వహిస్తారు?
- ఆంధ్రప్రదేశ్: సీఎం పర్యటనలకు ఇంత హడావుడి ఎందుకు, నల్లదుస్తులు కూడా ధరించనివ్వనంత కట్టడి ఏంటి?
- ‘పీల్చడానికి మీకు ఆక్సిజన్ వద్దా?’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)