You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎలక్టోరల్ బాండ్ల గురించి ప్రధాని మోదీ ఏం చెప్పారు? రాహుల్ గాంధీ ఏమన్నారు?
దేశంలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఎక్కడ చూసినా ర్యాలీలు, బహిరంగ సభలు, రాజకీయ నేతల ఇంటర్వ్యూలతో హోరెత్తుతోంది. పత్రికల పతాక శీర్షికలన్నీ వీటితోనే నిండిపోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూను దేశంలోని అన్ని ప్రధాన టీవీ ఛానళ్ళు సోమవారం సాయంత్రం ప్రసారం చేశాయి.
ఈ ఇంటర్వ్యూలో రామమందిరం, సనాతన ధర్మం, రాజకీయాలు, దక్షిణాది విషయాలు, విదేశాంగ విధానం తదితర విషయాల గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఇటీవల దేశంలో పెనుదుమారం రేపిన ఎలక్టోరల్ బాండ్స్‌పై కూడా ఆయన చాలాసేపు మాట్లాడారు.
తమ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్స్ తీసుకురాకపోయి ఉంటే నల్లధనం జాడ తెలిసేది కాదన్నారు.
దేశంలో ఎలక్టోరల్ బాండ్ల అంశం ఈ సార్వత్రిక ఎన్నికల ముందు కీలకంగా మారింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి, ఎలక్టోరల్ బాండ్స్ ఎవరు కొనోగులు చేశారు? వాటిని ఏ పార్టీ స్వీకరించింది? అన్న సమాచారాన్ని బయటపెట్టాల్సిందిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ను ఆదేశించిన సంగతి తెలిసిందే. దాంతో, ఈ సమాచారాన్ని ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో పెట్టింది.
ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఒక్క బీజేపీకే రూ.6,060.51 కోట్ల విరాళాలు వచ్చాయని, రూ. 1,609 కోట్ల విరాళాలతో తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెండో స్థానంలో నిలిచినట్టు ఆ డేటా చెబుతోంది.
వారందరూ చింతిస్తారు: ప్రధాని మోదీ
ప్రతిపక్షాలతో పాటు, పారదర్శకత కోరుకునేవారందరూ ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని ఓ పెద్ద కుంభకోణంగా ఆరోపిస్తున్నారు.
ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ఎలక్టోరల్ బాండ్స్ గురించి ప్రధాని మోదీని అడిగినప్పుడు ‘‘ఎన్నికలలో నల్లడబ్బు ఖర్చు చేస్తున్నారు. దీనిని అరికట్టే మార్గం కోసం మేం ఎదురు చూస్తున్నాం. 1,000, 2,000 రూపాయల నోట్లను ఎన్నికల వేళ పెద్ద ఎత్తున తేలికగా తీసుకువెళ్ళేవారు. మేం దానిని ఆపడానికి ప్రయత్నించాం. మొదట్లో రాజకీయ పార్టీలు 20,000 రూపాయల వరకు నగదు రూపంలో విరాళాలు తీసుకోవడానికి అనుమతి ఉండేది.
20 వేల రూపాయల వరకు విరాళాలు నగదు రూపంలో తీసుకోవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. ఓ వ్యాపార వేత్త చెక్కు రూపంలో విరాళాలు ఇవ్వలేమని చెప్పడం నాకు గుర్తుంది. అలా చేస్తే అధికార పార్టీకి ఆ విషయం తెలిసిపోతుంది. 90లలో మా దగ్గర డబ్బు లేక ఎన్నికలలో పోటీ చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నాం’’ అని మోదీ చెప్పారు.
‘‘ఈ స్కీమ్ గురించి పార్లమెంట్‌లో చర్చించాం. పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదించింది. కానీ కొంతమంది అప్పుడు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చినవారే ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు’’
‘‘ఇది ఎలక్టోరల్ బాండ్. అందుకే డబ్బు జాడ తెలిసింది. ఏ కంపెనీ ఇచ్చింది? ఎలా ఇవ్వగలిగింది? ఎక్కడ ఇచ్చింది? లాంటి వివరాలన్నీ తెలిశాయి.’’
‘‘ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్ల గురించి మాట్లాడేవారందరూ నిజాయితీగా ఆలోచిస్తే వారు కచ్చితంగా చింతిస్తారు. ఈ స్కీమ్ కింద 3 వేల కంపెనీలు విరాళాలు ఇచ్చాయి. వాటిల్లో 26 కంపెనీలపై ఈడీ విచారణ జరుగుతోంది. ఈ 26 కంపెనీల్లో 16 కంపెనీలు ఈడీ దాడుల తరువాత విరాళాలు ఇచ్చాయి. కేవలం 37 శాతం మాత్రమే బీజేపీకి విరాళాలుగా అందాయి. మిగిలిన 67 శాతం ప్రతిపక్షాలకే అందాయి’’ అని మోదీ చెప్పారు.
రాహుల్ గాంధీ ఏమన్నారంటే..
ఎలక్టోరల్ బాండ్స్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘‘ఇదో రికవరీ స్కీమ్. దీని వెనుకున్న సూత్రధారి నరేంద్ర మోదీ’’ అని విమర్శించారు.
రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఎలక్టోరల్ బాండ్స్‌లో ముఖ్యమైనవి పేరు, తేదీ. ఆ రెండింటినీ మీరోసారి పరిశీలిస్తే కంపెనీలు కాంట్రాక్ట్ పొందినప్పుడో, లేదంటే వాటిపై సీబీఐ విచారణ ఉపసంహరించుకున్న వెంటనే విరాళాలు ఇచ్చినట్టుగా మీకు అర్థం అవుతుంది. ఈ విషయంలో ప్రధాని మోదీ దొరికిపోయారు. అందుకే ఆయన ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇదో ప్రపంచంలోనే అతిపెద్ద డబ్బు దోపిడీ పథకం. దీని వెనుక మాస్టర్‌మైండ్ మోదీజీ’’ అని వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షాలు పక్షపాతంతో ఉన్నాయనే మోదీ మాటలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ ‘‘సీబీఐ విచారణ మొదలుకాగానే బాండ్స్ కొనుగోలు చేయడం, ఆ వెంటనే విచారణ ఆగిపోవడం గురించి దయచేసి వివరణ ఇవ్వండి మోదీజీ’’ అని అన్నారు.
ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మాత్రమే నల్లధనాన్ని వెలికి తీయగలమని మోదీ చెప్పడం పూర్తి అబద్ధమని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది.
‘‘ఎలక్టోరల్ బాండ్స్ అమలు చేయడానికి ముందు నగదు రూపంలో కేవలం 20వేల రూపాయలు మాత్రమే విరాళంగా ఇవ్వడానికి అవకాశం ఉండేది. కానీ ఈ పథకం ద్వారా దాతలు తమ గుర్తింపును బయపెట్టాల్సిన అవసరం లేకుండా చేశారు. ఇది పథకం మొత్తాన్ని రహస్యంగా ఉంచేలా రూపొందించారు. ఇప్పటికీ 2018, 2024 మధ్య నాటి పూర్తి డేటాను వెల్లడించలేదు’’ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
ఏమిటీ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్?
ఎన్నికల విరాళాల్లో పారదర్శకత తీసుకువచ్చేందుకు ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని తీసుకువస్తున్నట్టు 2018లో మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద దాత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ పథకం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది.
2019 ఏప్రిల్ 12 నుంచి 2024 జనవరి 11 వరకు వెల్లడించిన సమాచారం మేరకు బీజేపీ 6 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన బాండ్లను నగదుగా మార్చుకుంది. ఈ విషయంలో టీఎంసీది రెండో స్థానం. ఆ పార్టీ 1600 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పొందింది.
ఎలక్టోరల్ బాండ్స్ అధికంగా కొనుగోలుచేసిన కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్. ఈ కంపెనీ మొత్తం 1368 బాండ్లను కొనుగోలుచేసింది. వీటి విలువ మొత్తం 1368 కోట్లు.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ 1421.86 కోట్ల రూపాయలు పొందింది. ఆ తరువాత భారత రాష్ట్ర సమితి రూ.1214.70 కోట్లు, బిజూ జనతాదళ్ రూ.775.5 కోట్ల విరాళాలు పొందాయి.
అయితే, వీటిల్లో చాలాభాగం ఈడీ, ఆదాయపు పన్ను శాఖ దాడుల తరువాత కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన విషయం వెలుగుచూసింది.
కొన్ని కంపెనీలైతే ఎలక్టోరల్ బాండ్స్ కొనకముందో, కొన్నాకో పెద్ద కాంట్రాక్టులు పొందాయి.
మూడు ఫార్మా కంపెనీలు, ఒక సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి కలిసి 762 కోట్ల రూపాయలను ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళంగా ఇచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్: ఇజ్రాయెల్‌పై డ్రోన్స్, మిసైల్స్‌తో దాడి చేసిన ఈ ఇరాన్ దళం పవర్ ఏంటి?
- ది రియల్ కేరళ స్టోరీ: రియాద్‌లో మరణశిక్ష పడిన రహీమ్ ప్రాణాలు కాపాడేందుకు హిందూ, ముస్లింలు ఏకమై రూ. 34 కోట్ల 'బ్లడ్ మనీ'ని ఎలా సేకరించారంటే...
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వైసీపీకి చిక్కవు, టీడీపీకి దొరకవు
- అరబ్- ఇజ్రాయెల్ యుద్ధం 1967: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)