You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శృంగారానికి షెడ్యూల్.. తీరికలేని జీవితం గడిపే జంటల రిలేషన్‌షిప్ దెబ్బతినకుండా సైకాలిజిస్ట్‌లు, సైకోథెరపిస్ట్‌లు ఏం చెప్తున్నారంటే
- రచయిత, యాస్మిన్ రుఫో
- హోదా, బీబీసీ ప్రతినిధి
డెడ్‌లైన్లు, ఉరుకులు పరుగులు.. డిన్నర్ ఏంటి? వంటి రోజువారీ మాటలు, ఇతరత్రా పనుల మధ్య ఎంత గొప్ప సంబంధాల్లోనైనా తెలియకుండానే ఓ యాంత్రికత మొదలవుతుంది.
దానర్థం సంబంధాల్లో ఆకర్షణ పోతోందనో, మీ భాగస్వామిని మీరు ప్రేమించడం మానేశారనో కాదు.. జీవితం అలా యాంత్రికంగా గడిచిపోతోందని.
రచయిత్రి నెల్ ఫ్రిజెల్‌కు ఇది చాలా బాగా తెలుసు. భాగస్వామితో పదేళ్ల అనుబంధం, ఇద్దరు పిల్లల తర్వాత ఒకప్పటిలా తన భర్త కోసం సమయం, శక్తి కేటాయించడం లేదని ఆమె అంగీకరించారు.
''మేం క్వాలిటీ టైం కలిసి గడపాలని మాకు తెలుసు. శారీరక స్పర్శ, కళ్లలోకి కళ్లుపెట్టి చూసుకోవడంవంటివి ఉండాలనీ తెలుసు. కానీ నా పరిస్థితి ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు నా భర్తపై అరుస్తుంటా'' అని ఆమె చెప్పారు.
తన జీవితంలో చాలా ఒత్తిడి దశలో ఉన్నానని ఫ్రిజెల్ చెప్పారు.
సమయాన్ని, శక్తిని, దృష్టినీ అన్నింటికీ కేటాయించాల్సివస్తోందని ఆమె చెప్తున్నారు. ఆమె పిల్లలను పెంచుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటున్నారు. ఇంటి నిర్వహణ చూసుకుంటున్నారు. ఇవన్నీ ఒకే సమయంలో చేస్తున్నారు.
''ఈ పనులన్నింటిమధ్య ఒకరి కళ్లలోకళ్లు పెట్టి చూసి, నువ్వు అద్భుతమైన వ్యక్తివి అని చెప్పేంత సమయం ఎక్కడుంటుంది?'' అని ఆమె ప్రశ్నించారు.
స్నేహితులతో కలిసి...
సంబంధాలను మెరుగ్గా ఉంచుకోవడానికి ఉపయోగపడే ఓ విషయాన్ని ఫ్రిజెల్ గుర్తించారు. దాన్ని ఆమె ''థర్డ్ ఎనర్జీ'' అని పిలుస్తున్నారు.
ఇది బెడ్ రూమ్ విషయం కాదు. డిన్నర్ టేబుల్ అని ఆమె నవ్వుతూ చెబుతున్నారు.
''మనం బయటకు వెళ్లినప్పుడు మరో కుటుంబంతో కలిసి వెళ్లాలి. డిన్నర్‌కు వెళ్లినప్పుడు ఫ్రెండ్స్‌ను వెంట తీసుకెళ్లాలి''అని ఆమె వివరించారు.
ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. కానీ మరో జంట, స్నేహితులు, కుటుంబంతో కలిసి డిన్నర్ చేయడం చాలా బాగుంటుంది. వాతావరణం సహజంగానే మారిపోతుంది.
మనం కలిసి జీవించే వ్యక్తితో డేట్ నైట్‌లో కూర్చుని కొత్త విషయాలు మాట్లాడడానికి ప్రయత్నించడం కాస్త కష్టంగా ఉంటుంది. ఆ సమయంలో మరో వ్యక్తి ఉంటే కొత్త సంభాషణ మొదలవ్వడానికి, మరో కోణంలో చూడడానికి వీలుకలుగుతుంది.
''కొత్తవాళ్లతో కలిసి ఉన్నప్పుడు నా భాగస్వామి మరింత ఆకర్షణగా అనిపిస్తారు. వాళ్లు ఆయన్నేవో ప్రశ్నలడుగుతుంటారు. ఏవో కబుర్లు చెబుతుంటారు. నేను ఆయన్ను అలాంటివి అడగాలని, చెప్పాలని ఎప్పుడూ అనుకోను'' అని ఫ్రిజెల్ చెప్పారు.
ఓ సంబంధం బాగుండాలంటే కాస్తంత స్వేచ్ఛ, విభిన్నత కీలకమైనవని సైకోథెరపిస్ట్ సుసనా అబ్సే చెప్పారు.
''జంటలు ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతుంటారు. కానీ నిజమైన అనుబంధం కొనసాగించరు'' అని ఆమె చెప్పారు.
మీ భాగస్వామిని బాగా గమనిస్తుండడం చాలా పెద్ద మార్పు చూపిస్తుందని తెలిపారు.
ఉదయాన్నే లేచి సవాలక్ష పనుల్లో పడే ముందు మీ భాగస్వామి ఎలా ఉన్నారో గమనించండి.
భాగస్వామి ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, వారికి ఆ రోజు ఉత్సాహం కలిగించే విషయం ఏమన్నా ఉందేమో అడగాలని అబ్సే సూచిస్తున్నారు.
ఇద్దరు కలిసి మంచి సమయం గడపడం కూడా ముఖ్యమని క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ అమాని మిలిగాన్ చెప్పారు.
అదేదో భారీగా ఉండాల్సిన అవసరం లేదని, ఇద్దరూ కలిసి ఓ రోజు సెలవు తీసుకోవడం, లేదా పడుకునే ముందు ఫోన్ చూడకూదన్న నియమం పెట్టుకోవడం వంటివాటివల్ల ఇద్దరూ కలిసి గడిపే సమయం దొరకుతుందని డాక్టర్ మిలిగాన్ చెప్పారు.
ఈమెయిళ్లు, ఫోన్ నోటిఫికేషన్లు, లాండ్రీ, గిన్నెలు కడగడం వంటి అనేక రకాల ఇంటిపనులు వంటివి సంబంధాల మధ్య ఆటంకాలకు కారణమవుతాయి.
ఎలక్ట్రానిక్ పరికరాలు జంటల మధ్య దూరాన్ని పెంచుతున్నాయని అబ్సే చెప్పారు.
''మీ భాగస్వామి ఎప్పుడూ ఫోన్‌లోనే సమయాన్ని గడుపుతుంటే వద్దని సున్నితంగా చెప్పండి. మీరిద్దరికీ అంగీకారమైన నిబంధనలు రూపొందించుకోండి'' అని అబ్సే సూచించారు.
శారీరక సాన్నిహిత్యం లేకుండా ప్రేమ కొనసాగడం గురించి మాట్లాడడం దాదాపు అసాధ్యం. దాని గురించి ప్రణాళిక వేసుకోవాలని ఫ్రిజెల్ చెబుతున్నారు.
శృంగారానికి సమయం
''శృంగారానికి ఓ సమయం పెట్టుకోవడం అనేది ఏదో షెడ్యూల్‌లా అనిపించినప్పటికీ, చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి తప్పదు. ఇలా ఓ సమయాన్ని కేటాయించుకోవడం మంచి ఫలితాన్నిస్తుంది'' అని ఆమె తెలిపారు.
శృంగారం లేకపోతే వచ్చే ప్రమాదాలను కూడా గుర్తించాలి. ఇద్దరూ ఇలాంటి ఏర్పాటు చేసుకోకపోతే, శారీర అవసరాలు తీరకపోతే వివాహేతర సంబంధాలు మొదలయ్యే అవకాశముంటుంది.
మనకు సయయం లేకపోయినా, చేయాల్సిన పనులు చాలా ఉన్నా ముందుగా పక్కకుపెట్టేది శృంగారాన్నే. కానీ అలా చేయవద్దని, ఎలాగోలా సమయం తప్పనిసరిగా కేటాయించుకోవాలని అబ్సే సూచిస్తున్నారు.
''పడుకునే సమయంలో మీకు అంతగా శృంగారపరమైన ఆలోచనలు లేనప్పటికీ, మీ భాగస్వామి వల్ల మీ ఉద్దేశం మారొచ్చు'' అని తెలిపారు.
ఒకరిపై ఒకరు మరింతగా దృష్టిపెట్టడం, భాగస్వామిని కొత్త కోణంలో చూడడం తమ రిలేషన్‌షిప్‌ను మెరుగుపరిచిందని ఫ్రిజెల్ చెప్పారు.
ఒకరి నుంచి మరొకరు కొన్ని రహస్యాలను దాచి ఉంచుకోవడం ముఖ్యమని తాను చివరిగా నేర్చుకున్న విషయమని ఫ్రిజెల్ అంటున్నారు.
''బాత్‌రూమ్ తలుపు మూసుకోండి. కాస్త దూరం పాటించండి. అన్ని పనులూ కలిసి చేయండి. కానీ బాత్‌రూమ్ వంటి వ్యక్తిగత విషయాల్లో గోప్యత పాటించండి'' అని ఆమె నవ్వుతూ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)