You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బాణసంచా ప్రమాదాలు: గోదావరి జిల్లాల్లోనే ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి?
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం కొమరపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఇటీవల జరిగిన పేలుడులో ఏడుగురు చనిపోయారు.
శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ కర్మాగారంలో బుధవారం(అక్టోబరు 8) మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే సజీవదహనం కాగా, మరొకరు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సెప్టెంబరులో ఇదే కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలసలో బాణసంచా నిల్వలను తీస్తుండగా అది ప్రమాదశాత్తూ పేలింది. ఈ ప్రమాదంలో కంచర్ల శ్రీనివాస్, సీతామహలక్ష్మి దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.
మూడేళ్ల కిందట పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రంలో సగానికిపైగా ఫ్యాక్టరీలు ఈ జిల్లాల్లోనే
బాణసంచా పేలుడు ప్రమాదాలు పూర్వ ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయనేది తాజాగా, గతంలో జరిగిన ఘటనలను బట్టి అర్ధమవుతోంది.
దీనికి కారణం ఈ జిల్లాల్లోనే ఎక్కువ బాణసంచా తయారీ కేంద్రాలు ఉండటమని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయిన బాణసంచా తయారీ కేంద్రాలు మొత్తం 115 ఉండగా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోనే 66 తయారీ కేంద్రాలు ఉన్నాయని ఏపీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పి.వెంకటరణ బీబీసీకి చెప్పారు.
రాష్ట్రం మొత్తం సంఖ్యతో పోలిస్తే సగానికి పైగా పూర్వ ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయని ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని జోన్2లో ఏడు జిల్లాల్లో 70 కేంద్రాలు ఉంటే, పాత ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలోనే 66 కేంద్రాలు ఉన్నాయని చెప్పారు.
90ఏళ్లుగా బాణసంచా తయారీ
దేశంలో బాణసంచా తయారీ కేంద్రాలు అంటే గుర్తుకు వచ్చేది తమిళనాడులోని శివకాశీ. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బాణసంచా తయారీ అంటే పూర్వ ఉమ్మడి గోదావరి జిల్లాలే గుర్తుకువస్తాయి.
ఇక్కడ ఏడాది పొడవునా పండుగలు, వివిధ సంబరాలు, రాజకీయ పార్టీల విజయోత్సవాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఆర్డర్లపైనా, ఏటా దీపావళికీ పెద్ద ఎత్తున బాణసంచా తయారుచేస్తారని తయారీదారులు చెబుతున్నారు.
ప్రధానంగా గోదావరి జిల్లాల్లోని కొమరిపాలెం, బిక్కవోలు, జి.మేడపాడు పరిసర ప్రాంతాల్లో బాణసంచా తయారీ...కొన్ని కుటుంబాలకు దశాబ్దాల నుంచి జీవనోపాధిగా ఉంటూ వస్తోంది.
బాణసంచా ఇక్కడి నుంచి ఏపీతో పాటు హైదరాబాద్ సహా తెలంగాణకు కూడా ఎగుమతి అవుతుంటుందని చెబుతున్నారు.
బుధవారం కొమరపాలెంలో ప్రమాదం జరిగిన శ్రీ గణపతి బాణసంచా గ్రాండ్ ఫైర్‌వర్క్స్ సంస్థ దాదాపు 90 ఏళ్ల నుంచి బాణసంచా తయారీలో ఉందని స్థానిక రోజీ గ్రాండ్ ఫైర్ వర్క్స్‌కి చెందిన శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.
బుధవారం నాటి పేలుడు ఘటనలో మృతి చెందిన ఆ సంస్థ యజమాని వెలుగబంట్ల సత్యనారాయణ మూర్తి అలియాస్ సత్తిబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల బాణసంచా తయారీ కేంద్రాల గౌరవాధ్యక్షుడు.
90ఏళ్ల కిందట శివకాశీ నుంచి ఓ కుటుంబం ఈ ప్రాంతానికి రాగా, సత్తిబాబు తాత వారి నుంచి ఈ తయారీ నేర్చుకున్నారని, ఆ కుటుంబం నుంచి క్రమంగా చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించిందని శ్రీనివాస్ తెలిపారు.
బాణసంచా తయారీ ఇక్కడే ఎక్కువ ఎందుకంటే...
ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడిన ఈ ప్రాంతంలో దీపావళి పండక్కి ముందు పొలం పనులు ఉండవు. దీంతో ఖాళీగా ఉండే వ్యవసాయ కార్మికులు ఇతర పనులకు మళ్లుతుంటారు.
‘‘దీపావళి పండగ కోసం కొన్నేళ్లుగా మందుగుండు సామాను తయారీ కేంద్రాలు వెలుస్తూ వచ్చాయి. దాంతో కార్మికులు ఈ కేంద్రాల్లో చేరడంతో అవి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి. గోదావరి జిల్లాల్లో ఈ ఫైర్ వర్క్స్ పెరగడానికి ఇదే కారణం'' అని రెండు దశాబ్దాలుగా స్థానికంగా ఫైర్‌వర్క్స్ రంగంలో ఉన్న సూర్యారెడ్డి బీబీసీతో చెప్పారు.
‘‘బుధవారం పేలుడు ఘటన జరిగిన సత్తిబాబు కర్మాగారంలోనే ముప్పై ఏళ్ల కిందట అగ్నిప్రమాదం జరిగి అప్పుడు కూడా కొంతమంది చనిపోయారు. కానీ అదే రంగంలో పేరు సంపాదించుకున్న ఆయన ఆ ఫైర్‌వర్క్స్‌ను ప్రాణం పోయే వరకు విడిచి పెట్టలేదు'' అని కొమరపాలెం గ్రామస్థుడు బీబీసీతో అన్నారు.
ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీ పెట్టాలంటే..ఏమేం అనుమతులు తీసుకోవాలి?
బాణసంచా తయారీ, నిల్వ, విక్రయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా మూడు క్యాటగిరీల్లో అధికారులు అనుమతులిస్తారు.
ది ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్–1884, ఎక్స్‌ప్లోజివ్ రూల్స్–2008 నిబంధనల ప్రకారం మూడు క్యాటగిరీల్లో అనుమతులిస్తామని ప్రాంతీయ అగ్నిమాపక శాఖ అధికారి(ఆర్‌ఎఫ్‌వో) స్వామి బీబీసీకి వెల్లడించారు.
ఎల్‌ఈ1: తయారీ
ఎల్‌ఈ2: నిల్వ, అమ్మకం
ఎల్‌ఈ3: తాత్కాలిక తయారీ, విక్రయాలు(ప్రత్యేకించి దీపావళి సందర్భంగా)
ఈ మూడు కేటగిరీల్లో మాత్రమే అనుమతులిస్తారని, మరికొన్ని నిబంధనలున్నాయని స్వామి తెలిపారు.
- ఎల్‌ఈ1 తయారీ కేంద్రాల్లో బాణసంచా తయారీకి 15కేజీల రా మెటీరియల్ (ముడి సరుకు) మాత్రమే ఉపయోగించాలనే నిబంధన ఉంది.
- బాణసంచా తయారీ కేంద్రం రహదారికి, గృహాలకు, జనావాసాలకు 45 మీటర్ల దూరంలోనే ఏర్పాటు చేయాలి.
- తయారీ కేంద్రంలో వివిధ రకాల షెడ్‌లు ఏర్పాటు చేయాలి. మాన్యుఫ్యాక్చరింగ్ షెడ్‌లు, స్టోరేజీ షెడ్, డ్రయింగ్ ప్లాట్‌ఫాం, డిస్‌ప్లే యూనిట్ షెడ్.. ఇలా ప్రతి షెడ్‌కి కనీసం పది మీటర్ల దూరం ఉండాలి
- మాన్యుఫ్యాక్చరింగ్ షెడ్‌కి, స్టోరేజీ షెడ్‌కి 45 మీటర్ల దూరం ఉండాలి.
- ఈ కేంద్రాల్లో శిక్షణ పొందిన కార్మికులనే తీసుకోవాలి. వీళ్లందరికీ కచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి.
- ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఫైర్ బకెట్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి
ఆరు విభాగాల పర్యవేక్షణతోనే అనుమతులు
పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, లేబర్ డిపార్ట్‌మెంట్, మున్సిపల్, రెవిన్యూ విభాగాల నుంచి అనుమతులు తీసుకోవాలి.
ఈ విభాగాల నుంచి అనుమతులు వచ్చిన తర్వాత ఆ జిల్లా కలెక్టర్ లేదా ఆ ప్రాంత ఆర్డీవో నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్‌వోసీ) వస్తేనే బాణసంచా తయారీ కేంద్రం ఏర్పాటుకు వీలవుతుందని స్వామి వివరించారు.
‘ఏపీలో ఉన్నవన్నీ ఎల్‌ఈ1 పరిధిలోవే’
రాష్ట్రంలో ఉన్న 115 బాణసంచా తయారీ కేంద్రాలన్నీ ఎల్‌ఈ (లైసెన్స్‌డ్)–1 కేటగిరీలోనివేననీ, అంటే 15 కేజీల ముడి పదార్ధంతో బాణసంచా తయారయ్యే కర్మాగారాలేనని ఏపీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పి.వెంకటరణ బీబీసీకి వెల్లడించారు.
ఎల్‌ఈ1 పరిధి దాటితే కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్ నుంచి అనుమతులు తీసుకోవాలని ఆయన తెలిపారు.
‘వేసవి కంటే తేమతోనే ఎక్కువ ప్రమాదం’
నిజానికి వేసవి కాలంలో కంటే కూడా తేమ శాతం పెరిగే వర్షాకాలం సీజన్‌లోనే ఈ ఫ్యాక్టరీల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్‌ఎఫ్‌వో స్వామి బీబీసీతో అన్నారు.
''ఈ ఫ్యాక్టరీల్లో డ్రై కంటే తేమతోనే ఎక్కువ ప్రమాదం. బాణసంచా తయారీలో ఉపయోగించే సల్ఫర్ (గంధకం లేదా సూరేకారం ) తేమగా ఉన్నప్పుడే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దాంతో ఒక్కసారిగా పేలుడు సంభవిస్తుంది. దీపావళి పండక్కి మనం టపాకాయలు ఇంటికి తీసుకురాగానే బాగా ఎండలోబెట్టమని పెద్దలు చెప్పేది అందుకే. తేమ ఉంటే సల్ఫర్ కెమికల్ రియాక్షన్ ఎక్కువవుతుంది'' అని స్వామి తెలిపారు.
పక్కా అనుమతులున్న ఫ్యాక్టరీలోనే ప్రమాదం
‘‘కోనసీమ జిల్లాలో 20 బాణసంచా కర్మాగారాలు ఉండగా, అన్ని నిబంధనలు పాటిస్తూ.. అన్ని అనుమతులు ఉన్నది బుధవారం ప్రమాదం జరిగిన శ్రీ గణపతి ఫైర్ వర్క్స్ ఒక్కదానికే. మిగిలిన 19 తయారీ కేంద్రాలకు మా శాఖ నుంచి కొన్ని అభ్యంతరాలున్నాయి. అన్ని అనుమతులు ఉన్న దాంట్లోనే పేలుడు సంభవించింది. ఇలా అన్ని నిబంధనలు పాటించినా బాణసంచా తయారీ ప్రమాదకరమైన పనే'' అని ఆర్‌ఎఫ్‌వో స్వామి బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)