You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జస్టిస్ గవాయ్: ‘‘పిటిషనర్ విష్ణువుకు గొప్ప భక్తుడైతే, ఆయన దేవుణ్ని ప్రార్థించాలి’’ అని అన్నట్లు చెబుతున్న కేసు ఏంటి?
సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ పై దాడికి ప్రయత్నం జరిగింది. ఈ సంఘటన గురించి తాను సీజేఐతో మాట్లాడినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో నరేంద్ర మోదీ ఇలా రాశారు
"నేను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్‌తో మాట్లాడాను. ఈ ఉదయం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆయనపై జరిగిన దాడి పట్ల ప్రతి భారతీయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మన సమాజంలో ఇలాంటి దూషణకరమైన చర్యలకు చోటు లేదు. ఇది పూర్తిగా ఖండించదగినది’’ అని అన్నారు.
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ తాత్కాలిక కార్యదర్శి రోహిత్ పాండే ఈ ఘటనపై స్పందించారు.
‘‘ఇది చాలా విచారకరమైన సంఘటన. దాడి చేసిన న్యాయవాది 2011 నుండి సుప్రీంకోర్టు బార్ సభ్యుడు. విష్ణువుపై గతంలో చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలకు మనస్తాపం చెంది ఈ ఘటనకు పాల్పడినట్లు చెబుతున్నారు" అని ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు రోహిత్ పాండే.
విష్ణువుపై వ్యాఖ్యల వివాదమేంటి?
మధ్యప్రదేశ్ ఖజురహోలోని ఒక ఆలయంలో విరిగిన విష్ణువు విగ్రహం మరమ్మత్తు, నిర్వహణ కోసం ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 16న కొట్టివేసింది.
ఈ విషయం కోర్టు పరిధిలోనిది కాదని, భారత పురావస్తు సర్వే శాఖ పరిధిలోకి వస్తుందని ధర్మాసనం పేర్కొంది.
‘‘పబ్లిసిటీ కోసం దాఖలు చేసిన పిటిషన్’’ అని ఈ పిటిషన్‌ను వ్యాఖ్యానించింది సుప్రీం ధర్మాసనం.
అలాగే ‘‘ పిటిషనర్ విష్ణువుకి గొప్ప భక్తుడైతే ఆయనే దేవుడిని ప్రార్థించాలి. కొంచెం ధ్యానం చేయాలి’’ అని ఈ సందర్భంగా గవాయ్ అన్నారు.
జస్టిస్ గవాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆయన సంయమనంతో మాట్లాడాలని విశ్వ హిందూ పరిషత్ కూడా సూచించింది.
ఆ తరువాత, విష్ణువు విగ్రహాన్ని మరమ్మతు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన జస్టిస్ గవాయ్..‘‘ నా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వచ్చాయని తర్వాత నాకు ఎవరో చెప్పారు. నేను అన్ని మతాలను నమ్ముతాను, అన్ని మతాలను గౌరవిస్తాను" అని ఆయన చెప్పారు.
ఆలయం ఏఎస్ఐ అధికార పరిధిలోకి వస్తుందనే సందర్భంలో మాత్రమే తాను వ్యాఖ్యలు చేశానని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.
దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, " బీఆర్ గవాయ్ నాకు గత 10 ఏళ్ల నుంచి తెలుసు. ఆయన అన్ని మతాల దేవాలయాలు, మతపరమైన ప్రదేశాలను పూర్తి భక్తితో సందర్శిస్తారు" అని అన్నారు.
దాడిని ఖండిస్తున్నాం
‘‘ ఒక అడ్వొకేట్ చేసిన అనుచిత, అసహనకరమైన ప్రవర్తనపై మేం విచారాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం. తన ప్రవర్తన ద్వారా ఆయన భారత ప్రధాన న్యాయమూర్తి, ఆయన సహచర న్యాయమూర్తుల స్థానాలను, అధికారాన్ని అగౌరవపరిచే ప్రయత్నం చేశారు" అని సుప్రీంకోర్టు అడ్వకేట్స్ -ఆన్-రికార్డ్ అసోసియేషన్ (ఎస్‌సీఓఆర్ఏ) తన ప్రకటనలో పేర్కొంది.
"ఇటువంటి ప్రవర్తన బార్ సభ్యునికి తగనిది. ఇది న్యాయవ్యవస్థ, న్యాయవాద వృత్తి మధ్య పరస్పర గౌరవాన్ని దెబ్బతీస్తుంది" అని పేర్కొంది.
సుప్రీంకోర్టు గౌరవాన్ని దెబ్బతీసేందుకు, ప్రజల దృష్టిలో దాని ప్రతిష్టను తగ్గించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం కాబట్టి, భారత సుప్రీంకోర్టు దీన్ని స్వయంగా విచారించి కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించాలని ఎస్‌సీఓఆర్ఏ అభిప్రాయపడింది.
న్యాయస్థానంలో ఇలాంటి సంఘటన జరగడం సిగ్గుచేటని కాంగ్రెస్ అంటోంది.
"ప్రజలు సుప్రీంకోర్టును న్యాయ దేవాలయంగా భావిస్తారు. అక్కడ అలాంటి సంఘటన జరగడం సిగ్గుచేటు. కొన్ని రోజుల కిందట ప్రధాన న్యాయమూర్తి ఈ దేశం బుల్డోజర్లతో కాదు, చట్టాలతో నడుస్తుందని అన్నారు. కాబట్టి, ఇది మొత్తం న్యాయవ్యవస్థకే అవమానం అని నేను నమ్ముతున్నాను" అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఏఎన్‌ఐతో చెప్పారు.
దీనిని న్యాయ వ్యవస్థపై దాడిగా భావిస్తూ, ఈ విషయంపై దర్యాప్తు జరపాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ డిమాండ్ చేస్తున్నారు.
అయితే తాను చేసిన పనికి పశ్చాత్తాపం చెందడం లేదని నిందితుడు రాకేశ్ కుమార్ వెల్లడించినట్లు ఏన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)