తాగి డ్రైవ్ చేస్తే ఈ ఏఐ కెమెరాకు దొరికిపోతారు

    • రచయిత, జాన్ మెక్‌నైట్
    • హోదా, బీబీసీ న్యూస్, సౌత్ వెస్ట్

మద్యం, డ్రగ్స్ మత్తులో ఉండి వాహనాలు నడిపేవారిని గుర్తించడం కోసం రూపొందించిన ఏఐ కెమెరాను డెవాన్, కార్న్‌వాల్‌లో తొలిసారి పరీక్షించారు.

'ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి టెక్నాలజీని డెవాన్, కార్న్‌వాల్‌లో పరీక్షిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని కెమెరా డెవలపింగ్ సంస్థ 'యాక్యూసెన్సస్' యూకే జనరల్ మేనేజర్ జెఫ్ కొలిన్స్ అన్నారు.

ఈ కెమెరాను గ్రామీణ ప్రాంతాలు సహా ఏ రోడ్డు నుంచి ఏ రోడ్డుకైనా చాలా వేగంగా, సులభంగా తరలించొచ్చు. దానివల్ల మద్యం, డ్రగ్స్ మత్తులో ఉండే డ్రైవర్లు పోలీసులు తమ వాహనాన్ని ఆపేవరకు విషయం తెలుసుకోలేరు.

ప్రమాదాలు జరగడానికి ముందే టెక్నాలజీ సాయంతో గుర్తిస్తే భద్రంగా ఉంటాం అని కొలిన్స్ చెప్పారు.

యాక్యూసెన్సస్ సంస్థ డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ ఉపయోగించేవారిని, సీట్ బెల్ట్ పెట్టుకోనివారిని పట్టుకోవడంలో పోలీసులకు సహాయపడే కెమెరాలను గతంలో తయారుచేసింది.

అయితే, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వంటివాటితో పోల్చితే తాగి వాహనం నడపడం వల్ల ప్రాణాంతక ప్రమాదాలు జరిగే అవకాశం ఆరు రెట్లు అధికంగా ఉంటుందని.. ఈ కొత్త కెమెరా సాయంతో ప్రాణాలు కాపాడొచ్చని 'డెవాన్, కార్న్‌వాల్ పోలీస్ విభాగం' చెప్తోంది.

'పోలీసులు అన్నిచోట్లా ఉండలేరు' అని సూపరింటెండెంట్ సైమన్ జెన్‌కిన్సన్ అన్నారు.

రోడ్డు భద్రతకు కట్టుబడి ఉన్న తాము ప్రమాదాల నివారణకు, రోడ్డు ప్రమాదాలలో మరణాల సంఖ్య తగ్గించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సైమన్ అన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఇలాంటి అధునాతన సాంకేతికతలను వినియోగించుకోవడం చాలా అవసరం అన్నారు సైమన్.

తాగి వాహనాలు నడిపే డ్రైవర్లను గుర్తించడం కోసం చేస్తున్న ఈ ఏఐ కెమెరా ప్రయోగం డిసెంబర్ మొత్తం కొనసాగించనున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)