You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్- గుంటూరు: చంద్రబాబు సభలో మళ్ళీ తొక్కిసలాట, ముగ్గురు మహిళలు మృతి... అసలేం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన బహిరంగ సభలో మరోసారి విషాదం చోటు చేసుకుంది.
ఆదివారం సాయంత్రం గుంటూరులో జరిగిన 'చంద్రన్న సంక్రాంతి కానుక' వస్త్రాల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు.
గోపిదేశి రమాదేవి, షేక్ మస్తాన్ బీ, సయ్యద్ ఆసీయా అనే ముగ్గురు మహిళలు తొక్కిసలాటలో మరణించారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు సభ అనంతరం సంక్రాంతి కానుకల కోసం జనం తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది.
అయిదు రోజుల కిందట డిసెంబర్ 28న నెల్లూరు జిల్లాలోని కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు.
తొక్కిసలాటలో గాయపడిన వారిని చికిత్స కోసం గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేర్పించారు. అయితే, ముగ్గురు మహిళలు ఆస్పత్రికి తీసుకు రావడానికి ముందే మరణించారని హాస్పిటల్ సూపరింటెండెంట్ తెలిపారని ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. కాళ్లకు, ఛాతీకి గాయాలతో ఆస్పత్రిలో చేరిన 13 మందికి ఐసీయూలో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై చంద్రబాబు స్పందిస్తూ, "ముగ్గురు చనిపోయారని తెలిసి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది చాలా బాధాకరం" అని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఆయన ప్రకటించారు.
గుంటూరు వికాస్ నగర్‌లో ఉయ్యూరు ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొక్కిసలాట సంఘటన పై జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి వెంటనే స్పందించి జిల్లా ఎస్పీ ఆరీఫ్ హపీజ్‌తో వికాస్ నగర్ గ్రౌండ్స్ వద్ద పరిస్థితిని సమీక్షించారు. సహాయకచర్యలను పర్యవేక్షించి, గాయపడిన వారిని చికిత్స కోసం వెంటనే ఆసుపత్రులకు తరలించేలా అదేశాలు జారీ చేశారు.
నూతన సంవత్సరం సందర్భంగా పేదలకు సాయం చేయాలనే సదుద్దేశంతో జనతా వస్త్రాలు, నిత్యావసరాల పంపిణీ చేయాలని భావించామని ఉయ్యూరు ఫౌండేషన్ సిబ్బంది తెలిపారు. తమ సంస్థ ఆహ్వానాన్ని మన్నించి చంద్రబాబునాయుడు వచ్చి పేదలకు శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోయారని. ఆయన వెళ్ళిపోయిన తరువాత జనతా వస్త్రాలు, నిత్యావసరాల పంపిణీ ప్రారంభించామని వారు చెప్పారు.
అయితే, ముందుగా టోకెన్లు జారీ చేసిన వారికంటే అదనంగా ప్రజలు ఒక్కసారిగా లోపలకు రావటంతో ఈ అపశ్రుతి చోటుచేసుకుందని, ఈ దుర్ఘటనకు తాము పూర్తి నైతిక బాధ్యత వహించి బాధితులను ఆదుకుంటామని ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.
ఈ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులకు సూచించారు.
మృతుల కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని, అలాగే గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 సహాయం అందిస్తామని సీఎం ప్రకటించారు.
గుంటూరు ఘటన తెలుగుదేశం పార్టీ నేతలను ఎంతో బాధకు గురి చేసిందని, బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని ఆ పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఏఎన్ఐతో అన్నారు.
ఈ కార్యక్రమానికి తాము ముందుగా అనుమతి తీసుకునే నిర్వహించామని, పోలీసులు, అధికార యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. "బాధితులకు తగిన వైద్య సేవలు, ఆర్థిక సహాయం అందించడానికి బదులు మా నాయకుడు చంద్రబాబుపై ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు ఆరోపణలు చేయడమేంటి? వారి బాధ్యతా రాహిత్యాన్ని మేం ఖండిస్తున్నాం" అని నరేంద్ర అన్నారు.
ఇందులో చంద్రబాబునాయుడు చేసిన తప్పేంటని ప్రశ్నిస్తూ, ఆయన పేదలకు సహాయం అందించడానికి వచ్చారని కూడా నరేంద్ర చెప్పారు.
ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తొక్కిసలాటలో పలువురు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరాారు.
ఏపీ రాజ్‌భవన్ కూడా ఈ ఘటనపై ఒక ప్రకటన విడుదల చేసింది. తొక్కిసలాటలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
శంకర్ వడిశెట్టి
గుంటూరు నుంచి బీబీసీ కోసం
____________________________
‘‘గుంటూరు నగరంలోని వికాస్ నగరంలో ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఉయ్యూరు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అన్నగారి జనతా వస్త్రాలు పేరుతో చంద్రన్న సంక్రాంతి కానుక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన చంద్రబాబు, కొంతమంది మహిళలకు తన చేతుల మీదుగా వస్త్రాలు, సంక్రాంతి కానుక పేరుతో కొన్ని రకాల వస్తువులను ఒక సంచిలో పెట్టి అందించారు.
వీటిని తీసుకునేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు.
మహిళలకు ముందుగా నిర్వాహకులు కూపన్లను అందజేశారు. 20 వేల మందికి కూపన్లు పంపిణీ చేసినట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు.
మధ్యాహ్నం 1:00 గంటలకే మహిళలు ప్రాంగణానికి చేరుకున్నారు.
భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలకు తగినట్లు ఏర్పాట్లు లేకపోవడంతో సుమారు 5 గంటల పాటు వారు ఎండలోనే ఎదురు చూడాల్సి వచ్చింది.
చంద్రబాబు ప్రసంగం తర్వాత సాయంత్రం 7 గంటలకు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఆయన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి వెళ్లిపోయిన తర్వాత వస్త్రాలు తీసుకునేందుకు ఒక్కసారిగా ప్రజలంతా ముందుకు వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది.