You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విశాఖపట్నం: మహిళలకు 'సేఫెస్ట్ సిటీ'గా నిలిచిన ఏకైక దక్షిణ భారత నగరం
- రచయిత, కమలాదేవి నల్లపనేని
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశంలో భద్రత గురించి మహిళలు ఏమనుకుంటున్నారు?
పట్టణాలు, నగరాల్లో 40శాతం మహిళలు తాము అంత భద్రంగా లేమని భావిస్తున్నారని సర్వేలు చెప్తున్నాయి.
ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని ఓ నగరం మాత్రం మహిళలకు అత్యంత ఎక్కువ భద్రత ఉండే నగరాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.
అదే విశాఖపట్నం.
మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల జాబితాలో చోటు సంపాదించిన ఏకైక దక్షిణ భారతదేశ నగరం విశాఖ.
మహిళల భద్రతపై జాతీయ మహిళా కమిషన్ నేతృత్వంలో నిర్వహించిన సర్వే ఆధారంగా విడుదల చేసిన నివేదిక ‘నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్- నారి 2025’లో ఈ విషయం తేలింది.
దేశవ్యాప్తంగా 31 నగరాల్లోని 12,770 మంది మహిళలతో మాట్లాడిన తర్వాత ఈ నివేదిక రూపొందించినట్లు వార్తాసంస్థలు ఏఎన్ఐ, పీటీఐ తెలిపాయి.
‘నారి 2025’ రిపోర్ట్‌లో మహిళల భద్రతపై ఆందోళనకర గణాంకాలు వెల్లడయ్యాయి.
‘భారత్‌లో పెద్ద సంఖ్యలో మహిళలు వీధుల్లో వేధింపులకు గురవుతున్నారు.
చూపులు, అందరిలో వేధించడం, అసభ్యకరమైన వ్యాఖ్యలు, తాకడం వంటివి ఇందులో ఉన్నాయి.
ఈ వేధింపుల వల్ల చాలా మంది విద్యార్థినిలు స్కూల్ మధ్యలోనే చదువుమానేస్తున్నారు.
చాలామంది మహిళలు ఉద్యోగాలు వదిలేస్తున్నారు’ అని ఈ రిపోర్ట్ పేర్కొంది.
‘సురక్షితమనే భావన మహిళలకు కలగడం లేదు’
ఈ నివేదిక రూపకల్పనలో భాగంగా నిర్వహించిన సర్వేలో పాల్గొన్న మహిళల్లో అనేక మంది తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రస్తావించారు.
రాత్రి వేళల్లో లైటింగ్ సరిగా లేకపోవడం, భద్రత లోపించడం వంటి కారణాలతో సమస్యలు పెరుగుతున్నాయని సర్వేలో భాగమైన మహిళలు వెల్లడించారు.
సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో మహిళలు పబ్లిక్ ప్రాంతాలను సురక్షితంగా భావించడం లేదని చెప్పారు.
బాధితులనే నిందించే సంస్కృతి వల్ల కూడా మహిళలు అభద్రతకు లోనవుతున్నారని ఈ నివేదిక గుర్తించింది.
2024లో ఏడు శాతం మహిళలు వేధింపులు ఎదుర్కొన్నామని చెప్పారు.
ముఖ్యంగా 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఎక్కువ వేధింపులకు గురవుతున్నారు.
అయితే మహిళలపై జరిగే అన్ని నేరాలు నమోదు కావడం లేదు.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ)- 2022 గణాంకాల ప్రకారం మహిళలపై జరిగే నేరాల్లో 0.07శాతం మాత్రమే నమోదవుతున్నాయి.
మరిన్ని వేధింపులుంటాయని, సామాజికంగా తలవంపులు ఎదురవుతాయన్న భయంతో చాలా మంది మహిళలు తాము ఎదుర్కొంటున్నవాటిపై ఫిర్యాదులు చేయడం లేదు.
22శాతం మహిళలే తమ అనుభవాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. వాటిలో కూడా 16శాతం కేసుల్లో మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు.
తమ ఆఫీసుల్లో లైంగిక వేధింపుల నివారణ విధానం ఉందా లేదా అనేదానిపై స్పష్టత లేదని 53శాతం మహిళలు ఈ సర్వేలో చెప్పారు.
దేశంలో సురక్షిత నగరాలు ఏవి? ఎలా నిర్ణయించారు?
కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్, ఐజ్వాల్, గ్యాంగ్‌టక్, ఈటానగర్, ముంబయి నగరాలను మహిళలకు సురక్షితమైన నగరాలుగా ఈ సర్వే తేల్చింది.
ఈ జాబితాలో ఈశాన్య రాష్ట్రాల్లోని నగరాలే ఎక్కువగా ఉన్నాయి.
రాంచీ, శ్రీనగర్, కోల్‌కతా, దిల్లీ, ఫరీదాబాద్, పట్నా, జైపూర్ వంటి నగరాలు మహిళలకు అత్యంత తక్కువ భద్రత ఉన్న నగరాలుగా ఈ సర్వే తేల్చింది.
జాతీయ భద్రతస్కోరు సగటు 65 శాతంగా లెక్కించి.. స్కోర్ ఇంతకంటే ఎక్కువ ఉన్న నగరాలను సురక్షితమైనవిగా, తక్కువ ఉన్నవి మహిళలకు భద్రత లేని నగరాలుగా పేర్కొంది ఈ సర్వే.
కోహిమాతో పాటు భద్రత ఎక్కువ ఉన్న నగరాల్లో జెండర్ ఈక్వాలిటీ, పౌర భాగస్వామ్యం, మెరుగైన పోలీసింగ్, మహిళలకు మంచి మౌలిక సదుపాయాల కల్పన ఉన్నట్టు అధ్యయనం వెల్లడించింది.
వీటితో పాటు ఇలాంటి మరికొన్ని అంశాలను ప్రాతిపదికగా సర్వేలో పాల్గొన్న అక్కడి మహిళల అభిప్రాయాల ఆధారంగా నగరాల స్కోర్ నిర్ణయించారు.
విశాఖలో మహిళల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటే..
దేశంలో మహిళలకు భద్రత ఉన్న నగరాల్లో రెండోస్థానంలో విశాఖ ఉంది.
ఈశాన్య రాష్ట్రాలు కాకుండా దేశంలో విశాఖ, భువనేశ్వర్, ముంబయి నగరాలు మాత్రమే మహిళలకు సురక్షితం అని తేలింది.
విశాఖపట్నం మహిళలకు సురక్షిత నగరంగా నిలవడంపై విశాఖ పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ హర్షం వ్యక్తంచేశారు. దక్షిణ భారతదేశంలో మహిళలకు భద్రత ఉన్న ఒకే ఒక్క నగరంగా విశాఖపట్నం నిలవడానికి పోలీసులు తీసుకున్న చర్యలే కారణమని చెప్పారు.
నగరంలో మహిళలు ఎవరికి భద్రతాపరమైన సమస్యలెదురైనా నేరుగా తనకే ఫోన్ చేసే అవకాశం కల్పించానని ఆయనన్నారు.
ఎంతో మందిని ఆత్మహత్యల నుంచి కాపాడామని తెలిపారు.
నగరంలోని అన్ని సున్నిత ప్రాంతల్లో ఫోర్ వీలర్లు, టూ వీలర్లతో గస్తీ నిర్వహిస్తున్నామని విశాఖ పోలీసులు చెప్పారు.
నగరంలోని అన్ని ప్రాంతాల్లో యూఏవీ(డ్రోన్లతో)పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నగరమంతా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశామని, షీ టీమ్స్‌ను మోహరించామని, అన్ని స్కూళ్లు, కాలేజీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో మహిళాభద్రత, సైబర్ సేఫ్టీపై కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో నవ నిర్మాణ సమాజమ్ వంటి అవగాహనా శిబిరాలు ఏర్పాటుచేశామని తెలిపారు.
‘నారి’ నివేదిక ఎందుకంటే...
మహిళల భద్రత సమస్యలను అర్ధం చేసుకోవడంలో నారి 2023 ప్రారంభం ఓ ముందడుగని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ్ కిశోర్ రహత్కర్ అన్నారు.
ప్రతి మహిళ ఇంట్లో, పని ప్రాంతంలో, పబ్లిక్ ప్రదేశాల్లో, ఆన్‌లైన్‌లో సురక్షితంగా భావించేలా చేయడం తమ ప్రాధాన్యం అని తెలిపారు.
మహిళలకు సురక్షితమైన నగరాలను, ప్రాంతాలను సృష్టించడం కోసం విధాన రూపకర్తలు, ప్రభుత్వాలు, కార్పొరేషన్లు, పౌరసమాజం కృషిచేయడంలో సహాయపడడానికి నారి నివేదిక ఉపయోగపడుతుందన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)