మహిళలూ.. ఆస్తులు, అప్పుల్లో మీ వాటా ఎంత? ఈ విషయాల్లో అసలు రాజీపడొద్దు..

    • రచయిత, నాగేంద్ర సాయి కుందవరం
    • హోదా, బిజినెస్ అనలిస్ట్, బీబీసీ కోసం

వాస్తవానికి ఇళ్లలో ఉండే హోం మినిస్టర్స్‌ అంతా ఒకరకంగా ఫైనాన్స్‌ మినిస్టర్స్ కూడా. ఎందుకంటే, ఇంటి బాధ్యతతో పాటు ఆర్థికపరమైన అంశాల్లోనూ మహిళలది కీలకపాత్ర.

భర్త నెలనెలా ఇచ్చే డబ్బులో ఇంటి అవసరాలు తీరుస్తూ, రేపటి కోసం ఎంతోకొంత దాచిపెడుతుంటారు చాలామంది. ఒక వేళ ఇంట్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే మరింత ఆర్థిక స్వావలంబన ఉంటుంది.

అయితే, ఫైనాన్షియల్‌ రెస్పాన్సిబులిటీస్‌ షేరింగ్‌(ఆర్థికపరమైన బాధ్యతలను పంచుకోవడం)లో కూడా ఇద్దరూ అంతే పారదర్శకంగా ఉన్నారా? లేదా? అనేది చాలా ముఖ్యం.

ప్రో రేటా పద్ధతిలో ఇద్దరూ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను, లోన్స్‌ను సమానంగా పంచుకుంటున్నారా? రేపటి కోసం చేసుకునే ప్లానింగ్‌ విషయంలో ఇద్దరూ ఒకే ఆలోచనతో ఉన్నారా లేదా? ఒకరు చేసే అప్పుల గురించి మరొకరికి తెలుసా?

ఇలా, ఫైనాన్షియల్‌ ప్లానింగ్ అనగానే చాలా అంశాలు తెరపైకి వస్తాయి. అందుకే, ఈ ఉమెన్స్‌ డే సందర్భంగా కొన్ని సలహాలు, సూచనలు.

హోం మినిస్టర్‌ - ఫైనాన్స్‌ మినిస్టర్‌గా మారాలి..

ఇంట్లో ప్రతీ మహిళా హోం మినిస్టరే. భర్త సహా పిల్లలు, అత్తమామలు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్లందరి గురించి ఆలోచించే మహిళలు నిస్వార్థంగా తమ సేవలు అందిస్తూ ఉంటారు.

భర్త నెలనెలా ఇంటికి కొంత మొత్తాన్ని ఇస్తే, దాన్ని సమర్థంగా నిర్వహిస్తూ లోటుపాట్లు లేకుండా చూసుకుంటారు గృహిణులు. అలాంటి వారు ఆర్థిక పరమైన అంశాలపై కూడా అవగాహన(ఫైనాన్స్ నాలెడ్జ్) పెంచుకుంటే ఇంటిని ఇంకా సమర్థంగా నడిపించవచ్చు.

ఒకవేళ మీరు కూడా ఉద్యోగం చేస్తూ ఉంటే, మీకు ఈ నాలెడ్జ్ మరింతగా అవసరం. అందుకే ఫైనాన్స్ మినిస్టర్‌ బాధ్యతను కూడా చేపట్టాలి.

డబ్బు సంపాదించామా.. ఎంతోకొంత మన కోసం దాచుకుని భర్త చేతిలో పెట్టామా.. అనేలా ఉండకూడదు. భర్త ఆలోచనాశైలి ఏ విధంగా ఉంది, ఎంతవరకూ రిస్క్ తీసుకుంటున్నారు, సేఫ్‌ ఇన్వెస్ట్మెంట్‌ చేస్తున్నారా లేదా, ఎక్కడ పెట్టుబడి పెడ్తున్నారు అనే అంశాలపై మీకు కచ్చితమైన అవగాహన ఉండాలి.

మార్కెట్లో ఉన్న అన్ని ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్‌పై అవగాహన లేకపోయినప్పటికీ, విస్తృత ఆలోచనా విధానం అవసరం.

చిట్స్‌ జోలికి వెళ్లొద్దు..

వేడినీళ్లకు చన్నీళ్లు అనే మాట వాడుతూ, భర్తకు ఎంతో కొంత సాయపడాలనే ఆత్రుతలో చాలామంది చుట్టుపక్కల వాళ్లను నమ్ముతూ ఉంటారు. అందుకే, మిగిలిన మొత్తాన్ని తెలిసిన వాళ్ల దగ్గర చిట్స్‌ వేసేస్తారు. అది, సక్రమంగా సాగినంత వరకూ ఓకే.

ఈ మధ్య చాలా మంది చిట్టీల పేరుతో మోసపోయిన ఉదంతాలు ఎన్నోఉన్నాయి. అందుకే ఎంత తెలిసినా, చిట్స్‌ జోలికి వెళ్లి అసలుకే ఎసరు తెచ్చుకోవద్దు.

గరిష్ఠంగా వీటిల్లో 12 శాతం వరకూ మాత్రమే రిటర్న్స్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రెండు - మూడు శాతం తక్కువ వచ్చినా ఇతర పెట్టుబడి సాధనాల గురించి ఆలోచించండం మంచిది.

మీకంటూ ప్రత్యేక బడ్జెట్..

భర్త సంపాదించి ఇంటికి కొంతమొత్తాన్ని ఇచ్చినా, లేదా మీరూ ఉద్యోగం చేస్తున్నా సరే బడ్జెట్‌ అనేది తప్పనిసరి.

డబ్బు ఎంత వస్తోంది? ఎంత పోతోంది? అనే లెక్కాపత్రం ఉండాలి. ముఖ్యంగా పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్లి కోసం బంగారం, కొత్తగా తీసుకునే ఇంటికి డౌన్‌పేమెంట్‌ వంటి వాటి విషయంలో ముందస్తు ప్రణాళిక‌ చాలా అవసరం.

అందుకే భార్యాభర్తలు ఇద్దరూ వీటి గురించి మాట్లాడుకోవాలి. ఎక్కడ సేవ్‌ చేయాలి, ఎప్పటి వరకూ చేయాలి అనే అంశాలను పంచుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి.

సాధారణంగా ఇంటి ఖర్చులు పోగా మిగిలిన మొత్తాన్ని సేవ్‌ చేస్తాం. మీరు డ్యూయల్‌ ఇన్‌కం గ్రూపు(ఇద్దరూ సంపాదిస్తే)లో ఉంటే, ఒకరి శాలరీలో గరిష్ఠ మొత్తాన్ని సేవ్‌ చేయడానికి ప్రయత్నించాలి. లేదా ఇద్దరి సంపాదనలో కనీసం 30 శాతం వరకూ అయినా సేవ్‌ చేసేలా చూసుకోవాలి.

ఇంపల్సివ్‌ బయింగ్ నేచర్‌ (అవసరం ఉన్నా లేకపోయినా చేసే కొనుగోళ్లు) తగ్గించుకోవాలి. ఏవి అవసరమో, ఏవి దుబారానో గుర్తించాలి. అనవసర ఆడంబరాలకు పోయి మొత్తం కుటుంబం ఇబ్బందుల్లో పడకూడదు.

జాయింట్‌ బ్యాంక్‌ అకౌంట్‌ ఉందా?

ఇద్దరూ ఉద్యోగులై, ఇద్దరూ సంపాదిస్తున్నప్పుడు ఒక జాయింట్‌ అకౌంట్ ఉండడం ముఖ్యం. ఇద్దరి సంపాదనలో మెజార్టీ మొత్తాన్ని ఈ బ్యాంక్‌ ఖాతాకు బదలాయించడం మంచిది.

ఈ ఖాతా నుంచి ఈఎంఐలు, ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్‌ ఫీజులు వంటివి చేసుకోవడం బెటర్. పెట్టుబడులు కూడా ఈ ఖాతా నుంచే చేయడం ఉత్తమం. అలాగే, మీ వ్యక్తిగత అవసరాల కోసం కూడా కొంత మొత్తాన్ని కచ్చితంగా ఉంచుకోవాలి.

ఒకవేళ మీ భర్తకు విపరీతమైన ఖర్చు చేసే అలవాటు ఉందనుకుందాం. మీరు దానికి వ్యతిరేకంగా ఉండే ప్రయత్నం చేయాలి. మీ పార్టనర్ అతి ఖర్చు, అతి పొదుపు చేస్తున్నప్పుడు మీ ఈ వైఖరి ఆర్థిక విషయాలను బ్యాలెన్స్ చేస్తుంది.

క్రెడిట్‌ కార్డ్స్‌తో జాగ్రత్ర..

ఉద్యోగులైతే కంపెనీలు క్రెడిట్‌ కార్డ్స్‌ కూడా ఇస్తాయి. బ్యాంకులు ఇచ్చే 40-50 రోజుల క్రెడిట్‌ లిమిట్‌ను సద్వినియోగం చేసుకుంటే సరి. లేకపోతే 36-48 శాతం వరకూ వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని గుర్తించండి. ఇది మోయలేని భారం.

అందుకే, ఎప్పుడైనా తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తే, సాధ్యమైనంత త్వరగా తీర్చేయండి. ఇతర పెట్టుబడులను పక్కనపడేసి మరీ ఈ లోన్స్‌ ఫస్ట్‌ క్లియర్‌ చేయండి.

ఆభరణాలు పెట్టుబడి కాదు..

మెజార్టీ మహిళలకు బంగారం అనేది పెట్టుబడికి మొదటి ఆప్షన్‌. ఆభరణాలు వాడుకోవడంతో పాటు ఏదైనా అవసరానికి పనికొస్తుందనే ఉద్దేశంతో ఆభరణాల వైపు మొగ్గుచూపుతారు.

కానీ, బంగారు ఆర్నమెంట్స్‌ కొనుగోలు చేసినప్పుడు మేకింగ్‌ - వేస్టేజ్‌ పేరుతో 15-30 శాతం వరకూ చార్జ్‌ చేస్తారు. ఇది మన రిటర్న్స్‌పై ప్రభావం చూపిస్తుంది. అందుకే బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈటీఎఫ్స్‌, గోల్డ్‌ బాండ్స్‌, డిజిటల్ గోల్డ్‌ వంటివి ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

ఈక్విటీ మార్కెట్..

పెట్టుబడి అంటే బంగారం, రియల్‌ ఎస్టేట్, చిట్స్ వంటివి కాకుండా ఇతర అంశాలపై కూడా అవగాహన తెచ్చుకోవడం అవసరం. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్స్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటివి ఉత్తమం.

వాటిపై అంతగా అవగాహన లేకపోతే నిఫ్టీ బీస్‌, ఫైవ్‌ స్టార్‌ రేటెడ్‌ లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌ వంటి వాటిల్లో సుదీర్ఘకాలం పెట్టుబడులు పెట్టొచ్చు. మీ పిల్లల పైచదువులు, పెళ్లిళ్లు, రిటైర్మెంట్‌ వంటివాటి కోసం లక్ష్యాన్ని పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్‌ చేయొచ్చు.

ప్లానింగ్‌లో భాగస్వామ్యం

మీ భర్త తీసుకునే ఆర్థికపరమైన నిర్ణయాల్లో మీరూ భాగస్వాములు అవుతున్నారా? లేదా ? అనేది కీలకం. ఎందుకంటే, అది లాభమైనా, నష్టమైనా మీరిద్దరూ భరించాలి. కుటుంబం మొత్తంపైనా ఆ ప్రభావం ఉంటుంది.

అందుకే, పెద్ద నిర్ణయాలు ఏవి తీసుకున్నా, ఇద్దరూ కలిసి కూర్చుని మట్లాడుకోవాలి. అవసరమైన నిపుణుల సలహాలు తీసుకోవచ్చు.

మీకు ఉన్న ఆస్తులు ఏంటి, అప్పులు ఏంటి వంటి విషయాలను కచ్చితంగా జీవిత భాగస్వామికి తెలియజేయండి. అనుకోని సంఘటనలు ఏవైనా జరిగినప్పుడు ఈ సమాచారం వాళ్లకు ఉపయోగపడవచ్చు.

ఎమర్జెన్సీ ఫండ్‌..

కనీసం మీ మూడు నెలల జీతాన్ని ఎమర్జెన్సీ ఫండ్‌ కోసం పెట్టుకోండి. దీన్ని ఫిక్సెడ్‌ డిపాజిట్‌, లిక్విడ్‌ ఫండ్‌ వంటి వాటిల్లో పెట్టుకోవచ్చు.

ఏదో ఒకటి చేయాలనే గాబరా అసలొద్దు. స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ వంటివి చేయాలనుకుంటే అవగాహన తెచ్చుకుని, ట్రైనింగ్‌ తీసుకున్న తర్వాత వీటిల్లోకి దిగండి. ఇలా చేసేటప్పుడు మీ భాగస్వామికి కూడా చెప్పండి.

లాభమొచ్చినా, నష్టమొచ్చినా పర్సనల్‌గా తీసుకోవద్దు. ఏదైనా తప్పు జరిగితే రివేంజ్ ట్రేడ్‌ చేసి, మరింతగా చేతులు కాల్చుకోవద్దు.

ఆరోగ్యం చాలా ముఖ్యం

ఫ్యామిలీతో పాటు మీ ఆరోగ్యంపై కూడా మీరు ఇన్వెస్ట్‌ చేసుకోవడం చాలా అవసరం. వీలైతే కేన్సర్‌ కేర్‌ వంటి యాడ్‌ ఆన్ ఇన్సూరెన్స్ ప్యాకేజెస్‌ తీసుకోవడం ఉత్తమం.

బోన్‌ డెన్సిటీ, గర్భాశయ ముఖ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్‌ వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. కనీసం ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

మీకు నచ్చిన పుస్తకాలు, ఎంటర్‌టైన్‌మెంట్, వ్యాపకాల కోసం సమయం వెచ్చించండి.

మీ పిల్లల్లో కూడా ఫైనాన్షియల్‌ ఎడ్యుకేషన్‌పై అవగాహన పెంపొందించాలి. వాళ్లకు కిడ్డీ బ్యాంక్‌ ఏర్పాటు చేసి డబ్బులు ఇవ్వడం, దాచుకోవడం, వీలైతే బ్యాంక్ అకౌంట్‌ ఓపెన్ చేయించడం వంటివి పరిశీలించండి.

ఈ అంశాల్లో రాజీపడొద్దు..

  • భార్యాభర్తలిద్దరి మధ్య ఆర్థిక పారదర్శకత చాలా అవసరం.
  • ఇద్దరికీ ఆర్థికపరమైన అంశాల్లో నియంత్రణ ఉండాలి
  • పొదుపు అయినా, పెట్టుబడి అయినా బాధ్యత ఇద్దరిదీ ఉండాలి.
  • మీ వ్యక్తిగత ఇష్టాలను, కొనుగోళ్లను పదేపదే టార్గెట్‌ చేస్తూ ఉంటే సహించొద్దు
  • ఆర్థికంగా తీసుకునే పెద్ద నిర్ణయాలను ఇద్దరూ కలిసే తీసుకోండి.
  • బంగారంతో పాటు ఇతర పెట్టుబడి సాధనాలు ఏమున్నాయో అవగాహన తెచ్చుకోండి.
  • భర్తకు లేదా కుటుంబానికి ఏదోవిధంగా సాయం చేయాలనే ఆత్రుతలో, ట్రేడింగ్‌ వంటివి చేసి మరింత ఇబ్బందులకు గురికావొద్దు.

(గమనిక: ఇది అవగాహన కోసం మాత్రమే. నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించండి)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)